5 రోజుల్లో 100 యోజనాల రామసేతు ఎలా నిర్మించారు?
రామాయణం అంటే రాముడు నడిచిన దారి అయోధ్య నుంచి లంకానగరం వరకు సాగిన ప్రయాణమే శ్రీమద్రామాయణ మహాకావ్యం. ఆ యాత్రలో రాముడికి ఎంతోమంది తారసపడ్డారు. ఆ రూపంలో సంచరించిన అవతార పురుషుడికి సీతమ్మ జాడ తెలుసుకోవడం దగ్గర నుంచి రావణుడి చెర నుంచి ఆమెను విడిపించడం వరకు అడుగడుగునా వానరసేన రాముడికి తోడ్పడింది. సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు వంటి పాత్రలే మనకు తెలుసు. కానీ మరో ముఖ్యమైన వ్యక్తి నలుడు. ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. యుద్ధకాండ 22వ సర్గలో సేతువు నిర్మాణం సందర్భంగా నలుడు గురించి ప్రస్తావన ఉంటుంది. నలుడు ఎవరు? అంత మంది వానరులు ఉండగా ఆయన మాత్రమే ఎందుకు వారధి నిర్మించగలిగారు?
త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించాల్సిన సమయం ఆసన్నమైంది. చతుర్ముఖ బ్రహ్మ దేవతలందరిని సమావేశపరిచి ఈ విధంగా చెప్పాడు—శ్రీమహావిష్ణువు దశరథ పుత్రుడిగా అవతరించబోతున్నాడు. ఆయనకు మనం సాయపడాలి. ఒకసారి ఆయన ఆవలిస్తే జాంబవంతుడు పుట్టాడు. అప్సరసలు, గంధర్వ గానాలు, యక్ష వనితలు, నాగకన్యలు, కిన్నెర స్త్రీలు, విద్యాధర యువతులు మొదలైన వారు వానరులతో వివాహం చేసుకొని సంతంనం పొందండి.సింహపరాక్రమంలో అస్త్రశస్త్ర ప్రయోగ నిపుణులు, వాయువేగ గమనశీలులు, మహావీరులు అయిన బలవంతులైన వానరులను జన్మింపజేశారు అని చెప్పాడు.
దేవేంద్రుని వల్ల వాలి, సుగ్రీవులు; బృహస్పతి వల్ల తారుడు; విశ్వకర్మ వల్ల నలుడు; అగ్నిదేవుని వల్ల నీలుడు జన్మించారు. రాముని ఆదేశాలతో మహాబల సంపన్నుడైన నలుడి ఆధ్వర్యంలో వానరసేన సముద్రతీరానికి వచ్చి నిలబడ్డది. అక్కడి నుంచి లంకకు ఎలా చేరాలి అన్న ఆలోచన మొదలైంది. వాలి, సుగ్రీవులు వంటి శక్తివంతులైన వానరులు సముద్రాన్ని దాటగలరు. కానీ మిగతా వానరుల పరిస్థితి ఏమిటి? అని ఆలోచించి దీనికి వారధి నిర్మించడం ఒక్కటే మార్గమని పెద్దలంతా నిశ్చయించారు.
అది నిర్మించాలన్న ఆలోచన బాగానే ఉంది. కానీ ఆ పనికి సారథ్యం వహించేది ఎవరు? దానిని సాధించేది ఎలా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడు సుగ్రీవుడితో శ్రీరాముడు సముద్రాన్ని దాటేందుకు ఉపాయం చెయమన్నాడు. వానర నాయకులు రకరకాల ఆలోచనలు చెప్పారు. కానీ అవేవీ సాధ్యపడేవి కావని శ్రీరాముడు అన్నాడు. తాను ఉపవాస వ్రతంతో సముద్రాన్ని ఆరాధించి దారి ఇవ్వమని ప్రార్థిస్తానని, ఆయన అంగీకరించకపోతే సాత్విక పద్ధతిని విడనాడి రాజస పద్ధతిలో తన బాణాగ్నితో సముద్ర జలాలను ఆవిరి చేస్తానని అన్నాడు.
రాముడు, లక్ష్మణుడు నిరాహార దీక్ష పూని సముద్రాన్ని ఆరాధించారు. సముద్రుడు ప్రత్యక్షమై అందరికీ తెలిసే విధంగా దారి ఇవ్వడం సమంజసం కాదని, ఒక ఉపాయం సూచించాడు. సేనలో నలుడు అనే శిల్పకళావేత్త ఉన్నాడని, అతడు విశ్వకర్మ కుమారుడని, తండ్రి వలన వరములు పొందినందున నలుడు తన తండ్రి విశ్వకర్మతో సాటిగా నిర్మాణ పనులు చేయగలడని చెప్పాడు. అతను వేసే శిలలను తాను భరిస్తానని పలికి సముద్రుడు వెళ్లిపోయాడు.
రామాయణ గాథల్లో నలుడు, నీలుడు చిన్నతనానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. విశ్వకర్మ అంశంతో జన్మించిన నలుడు, అగ్నిదేవుని అంశంతో జన్మించిన నీలుడు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారు. మునులు తపస్సు చేస్తుంటే వారి కమండలాలు, సాలిగ్రామ శిలలు మరియు ఇతర వస్తువులను తీసుకెళ్లి నీటిలో వేయేవారు. దీంతో కోపించిన మునులు, నలుడు నీలుడు నీటిలో ఏది వేసినా అది మునగకుండా తేలుతుందని శపించారు. అదే వరంగా మారి వారు రామసేతును నిర్మించబోతున్నారు.
సముద్రుడు ఆ విధంగా వివరించగలను. వానర ప్రముఖుడు, అత్యంత బలశాలి అయిన నలుడు లేచి అంజలి ఘటించి శ్రీరామచంద్రునితో ఇలా విన్నవించాడు: సముద్రుడు చెప్పిన విషయం నిజమే. నాకు లభించిన శక్తి సామర్థ్యాల వల్ల ఈ సముద్రంపై సేతువును నిర్మించగలను. దీనికి సముద్రుడు కృతజ్ఞుడు. మీ వంశస్థుడైన సగరుడు తన పుత్రుల ద్వారా ఈ సముద్రాన్ని ఏర్పరచించాడు. ఆ కృతజ్ఞతాభావంతో కాకుండా, మీరు దండిస్తారని భయపడి దారి ఇవ్వలేనని చెప్పడం సముచితం కాదు. దండనీతిని దుర్మార్గులపై మాత్రమే ప్రయోగించడం ఉత్తమం అని పలికాడు.
ఇంకా ఇలా చెప్పాడు: మందర పర్వత ప్రాంతంలో విశ్వకర్మ మా తల్లికి తనంతటి సమర్థుడైన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. అందువలన నేను విశ్వకర్మ వరపుత్రుడను; ఆయనతో సమానమైన శిల్పనైపుణ్యం కలవాడను. సముద్రుడు చెప్పిన విషయం మీరు అడగకముందే నా గుణగణాలను నేనే చెప్పుకోవడం యుక్తం కాదని భావించి ఇప్పటివరకు తెలుపలేదు. సముద్రుడు ఈ విషయం ప్రస్తావించినందున ఇప్పుడు చెప్పాను. సముద్రంపై సేతువును నేను నిర్మించగలను. కాబట్టి వానరవీరులందరూ నేడు సేతు నిర్మాణానికి సిద్ధపడండి అని పలికాడు.
అప్పుడు శ్రీరాముడు వానర నాయకులకు వంతెన నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే కోట్లకొలది వానరాలు సంతోషంతో గంతులు వేస్తూ అరణ్యాల్లో ప్రవేశించాయి. పర్వతాకారమైన వానర ప్రముఖులు పెద్ద పెద్ద వృక్షాలు, కొండశిలలను ముక్కలు చేసి సముద్రతీరానికి తీసుకువచ్చారు. వారు ధణ వృక్షాలు, వెదురు గడ్డలు, అవిస చెట్లు, తెల్లమద్ది చెట్లు, తాళవృక్షాలు, మారేడు, పొన్న, గన్నేరు, మామిడి చెట్లు, అశోక వృక్షాలు మొదలైన వాటితో సముద్రాన్ని నింపసాగారు. కొన్ని వృక్షాలను వేళ్లతో సహా, కొన్ని వృక్షాలను వేళ్లు లేకుండా తీసుకొచ్చారు.
మహాకాయులు, మిక్కిలి బలశాలులు అయిన వానరులు మహత్తర పరిమాణంలో ఉన్న శిలలను, పర్వతాలను పగులగొట్టి యంత్రాల సహాయంతో సముద్రతీరానికి తీసుకువచ్చారు. పర్వతాలు, వృక్షాలు సముద్రంలో వేయబడగా సముద్రజలాలు ఆకాశమంత ఎగిసి అల్లకల్లోలమయ్యాయి. వానరులు నూరు యోజనాల పొడవుగల కొలతదారాలను తెచ్చారు. సముద్ర మధ్యలో సేతువు నిర్మించడానికి నలుడు సిద్ధమయ్యాడు. ఆయన సూచనల ప్రకారం వానరులు కొలతబద్దలు పట్టుకుని నలుడు నిర్మిస్తున్న సేతుపై కొండశిలలు, పెద్ద పెద్ద వృక్షాలను అమర్చారు. మహాబలశాలి వానరులు కర్రలతో, గడ్డితో వాటిని బిగించి కట్టేశారు.
పెద్ద పెద్ద కొండలను, మహాశిలలను సముద్రంలోకి విసురుతూ వానరుల సహాయంతో నలుడు మొదటి రోజున 14 యోజనాల దూరం సేతువును నిర్మించాడు. రెండవ రోజున 20 యోజనాలు, మూడవ రోజున 21 యోజనాలు, నాల్గవ రోజున 22 యోజనాలు, ఐదవ రోజున 23 యోజనాల సేతువును నిర్మించి మొత్తం ఐదు రోజులలో నూరు యోజనాల సేతువును పూర్తి చేశారు.
శిల్పకళా నిపుణుడు, మిక్కిలి బలశాలి, విశ్వకర్మ కుమారుడైన నలుడు తోటి వానరుల సహాయంతో తన తండ్రిలాగే ఎంతో నైపుణ్యంగా సముద్రంపై పది యోజనాల వెడల్పు, నూరు యోజనాల పొడవుతో సేతువును నిర్మించాడు. అది ఆకాశంలో కనబడే నక్షత్ర మార్గంలా ప్రకాశించింది. సముద్రానికి వేసిన పాపిడిలా కనిపించింది. దేవతలు, దానవులు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆకాశంలో నిలబడి దానిని తిలకించారు.
సేతువును చూసిన వానరుల సంతోషానికి అంతులేదు. కొంతమంది వానరులు ఆ సేతుపై ఎక్కి దూకుతూ ఆడుకున్నారు. ఆ సేతువు ఎంతో విశాలంగా, దృఢంగా, ఎత్తుపల్లాలు లేకుండా సమతలంగా ఉండింది. అనేక మంది వానరులు అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. సుగ్రీవుడి సూచన మేరకు శ్రీరాముడు హనుమంతుని భుజాలపై, లక్ష్మణుడు అంగదుని భుజాలపై కూర్చొని ఆకాశమార్గంలో సముద్రాన్ని దాటారు. కొంతమంది సేతుమీద నడిచి వెళ్లారు; కొంతమంది సేతు పక్కగా వెళ్లారు; మరికొందరు నీళ్లలో దూకి ఈదుతూ వెళ్లారు; ఇంకొందరు గరుత్మంతుని వలె ఆకాశంలో ఎగురుతూ సముద్రాన్ని దాటారు.
సేతుమీద నడుస్తున్నప్పుడు వానరులు చేసిన నాదం సముద్ర ఘోషను మించిపోయింది. వానరరాజు సుగ్రీవుడు వానరసేనలను సముద్రం అవతలికి దాటించి అక్కడ ఫలాలు, పుష్పాలు, తేనె, స్వచ్ఛమైన జలం లభించే ప్రదేశాల్లో విడిది చేయించాడు. శ్రీరాముడు సముద్రాన్ని దాటగానే దేవతలు, సిద్ధులు, చారణులు, మహర్షులు వారి మీద మంత్రజలాలను చల్లి ఆశీర్వదించారు.
ఈ విధంగా సేతువును నిర్మించిన వీరుడిగా రామకథలో నలుడి పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


