ఆదిత్య హృదయం
ఆదిత్య హృదయం సూర్య భగవానుడి ఆశీస్సుల కోసం తప్పక పారాయణ చేయాల్సిన స్తోత్రం. అన్ని రాశుల జాతకులు ఈ స్తోత్రం పఠించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులతో జీవితం మెరుగుపడుతుంది. ప్రతి రోజూ ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు కలుగుతాయి. రాముడు యుద్ధంలో అలసిపోయినప్పుడు అగస్త్య మహాముని వచ్చి ఈ ఆదిత్య హృదయం చెప్పి పారాయణ చేయాల్సిందిగా సూచిస్తాడు. దీని వలన రాముడికి అపారమైన శక్తి లభిస్తుంది. ఆ తరువాత విజయం వరించింది.
ఆదిత్య హృదయాన్ని ప్రతీరోజు ఉదయాన్నే మూడుసార్లు చొప్పున పఠించేవారికి దైర్యం, జ్ఞానం లాంటి దైవగుణాలు పెరుగుతాయి! ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుని ప్రార్థిస్తే ఆయురారోగ్యాలు, తలపెట్టే కార్యక్రమాలలో విజయం సిద్ధిస్తుంది.
1.తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం,
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం!!
అర్థము:
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో ఉన్నాడు. తరువాత రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి ఎదురుగా నిలిచి ఉన్నాడు.
2.దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం,
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః!!
అర్థము:
యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలిసి అక్కడికి వచ్చిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇలా పలికాడు.
3.అగస్త్య ఉవాచ:
రామరామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం,
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి!!
అర్థము:
ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము, అత్యంత గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి వివరిస్తాను. విను. దీనిని జపిస్తే యుద్ధంలో నీవు శత్రువులపై విజయం సాధించగలవు.
4.ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం,
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం!!
అర్థము:
ఈ ఆదిత్యహృదయం అనే స్తోత్రం పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపచేసేది. నిత్యము దీనిని జపిస్తే సర్వత్ర జయము లభించడం తథ్యం. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదిస్తుంది.
5.సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం,
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం!!
అర్థము:
ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపచేస్తుంది. వ్యాధులను తొలగించి ఆయుష్షును వృద్ధిపరుస్తుంది. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించడం ఎంతో అవసరము.
6.రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం,
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం!!
అర్థము:
అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుతూ, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణామం చేస్తారు. అమితమైన తేజస్సుగలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.
7.సర్వ దేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః,
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః!!
అర్థము:
ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణముల చేత లోకానికి శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.
8.ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః,
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాం పతిః!!
9.పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః,
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః!!
అర్థము:
బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు, పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నీ ఇతనివే. ఆరు ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.
10.ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్,
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః!! (స్వర్ణరేతా)
అర్థము:
ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించడానికి ప్రేరణ ఇచ్చేవాడు. లోకోపకారం కోసం ఆకాశంలో సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి, తన కిరణములను ప్రకాశింపచేస్తాడు. బంగారు వన్నెతో తేజరిల్లుతూ అద్భుతముగా ప్రకాశించేవాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగిస్తూ పగటి సమయంలో ప్రాణులను కార్యనిమగ్నులను చేయువాడు.
11.హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్,
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్!!
అర్థము:
శ్యామవర్ణముగల రథాశ్వములు కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు కలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు తరువాత, దానిని మరల సృజించుటకై ఆవిర్భవించేవాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించేవాడు.
12.హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః,
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనః!!
అర్థము:
సూర్యుడు- బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకాలకు స్తుతిపాత్రుడు. పగటి సమయంలో అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.
13.వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్ యజుస్సామ పారగః,
ఘనా వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః!!
అర్థము:
సూర్యుడు ఆకాశానికి అధిపతి. రాహువును ఛేదించే లక్షణము కలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపములో, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపములో, సాయంసమయమున సామవేదరూపములో అలరారుచుండేవాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు. వింధ్యగిరి మార్గములో అతివేగంగా సంచరించేవాడు.
14.ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః,
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః!!
అర్థము:
వేడిని కలిగి ఉండేవాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపేవాడు. ప్రభాత సమయములో పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందు పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి ఉండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.
15.నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః,
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే!!
అర్థము:
నక్షత్రములకు, గ్రహములకు, తారలకు అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.
16.నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః,
జ్యోతిర్గణాణాం పతయే దినాధిపతయే నమః!!
అర్థము:
స్వామీ! నీవు పూర్వగిరియందు, పశ్చిమగిరి యందు విలసిల్లుచుండువాడవు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
17.జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః,
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః!!
అర్థము:
జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితిపుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
18.నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః,
నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః!!
అర్థము:
నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
19.బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే,
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః!!
అర్థము:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.
20.తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె,
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః!!
అర్థము:
తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించినవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.
21.తప్త చామీక రాభాయ హరయే విశ్వకర్మణే,
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే!!
అర్థము:
బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగే సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.
22.నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః,
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః!!
అర్థము:
రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రసాదించును.
23.ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః,
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం!!
అర్థము:
ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా ఉండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే ఉండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.
24.వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ,
యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః!!
అర్థము :
ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగే సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.
25.ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ,
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ!!
అర్థము:
రఘురామా! ఆపదలయందు, కష్టముల యందు, దుర్గమమార్గములయందు, భయస్థితులయందు ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.
26.పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం,
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి!!
అర్థము:
దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.
27.అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి,
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం!!
అర్థము:
“మహాబాహో! రామా! ఈ క్షణమునే నీవు రావణుని వధింపగలవు” అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను
28.ఏతత్ శృత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా,
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్!!
అర్థము:
మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.
29.ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్,
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్!!
అర్థము:
పిదమ ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని చూస్తూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడయ్యెను. తరువాత ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.
30.రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్,
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్!!
అర్థము:
మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు, రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధాలుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః,
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి!!
అర్థము:
పిమ్మట దేవతల మధ్యఉన్న సూర్యభగవానుడు- “రావణుడు నశించుట తథ్యము” అని తెలుసుకొని పరమ సంతోషముతో శ్రీరాముని జూచి “రామా! త్వరపడుము” అని పలికెను.
సూర్యోపాసనలో అత్యంత గుప్తనామం “హిరణ్యగర్భాయ” ఈ నామం అర్ధం సృష్టి-స్థితి-లయ కర్తలయిన బ్రహ్మ-విష్ణు-రుద్ర స్వరూపం ఇతడే అని అర్ధం, భక్తితో “భగవతే హిరణ్యగర్భాయ నమః” అని సూర్యభగవానుణ్ణి స్మరిస్తే విశేషంగా ఆ సూర్యనారాయణస్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

