అంతుచిక్కని రహస్యాలు గల కైలాస దేవాలయం
భారతదేశం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో చారిత్రక నిర్మాణాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ దేశం, ప్రపంచాన్ని అబ్బురపరిచే అద్భుత కట్టడాలను సృష్టించింది. అలాంటి నిర్మాణాల్లో ఒకటి కైలాస దేవాలయం.
ఇది అతి పురాతనమైన, ఏకశిలతో నిర్మింపబడిన మూడు అంతస్తుల ఆలయ సముదాయం. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లోని 16వ గుహలో (కేవ్ నం. 16) ఉంది. రాష్ట్రకూట రాజు మొదటి కృష్ణుడు 8వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడని చరిత్రకారులు భావిస్తున్నారు.
సిమెంట్, ఇటుకలు, ఇసుక, రాళ్లు ఉపయోగించకుండా, ఒకే కొండను పై నుంచి కిందికి తొలిచి ఈ ఆలయాన్ని నిర్మించారు. పరిశోధనల ప్రకారం దాదాపు 8వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి సుమారు 100 నుండి 150 సంవత్సరాల వరకు సమయం పట్టినట్లు అంచనా.
దాదాపు 100 అడుగుల ఎత్తు కలిగిన ఈ ఆలయం ఈనాటికీ ఒక అంతుచిక్కని రహస్యంగా నిలిచింది. సుమారు నాలుగు లక్షల టన్నుల రాయిని చెక్కి తొలగించి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. అంత భారీగా తొలగించిన రాతి శిథిలాలు ఆలయ ప్రాంగణంలో కానీ, దాని పరిసర ప్రాంతాల్లో కానీ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఆ రాళ్లు ఎక్కడికి వెళ్లాయి అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా ఉంది.
ఈ విషయంపై ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పురాణాల ప్రకారం పాశుపతాస్త్రం వంటి అనేక దివ్యాస్త్రాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో ఒక అస్త్రాన్ని వినియోగించి రాళ్లను గాలిలో కలిపేశారనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం కథనాలుగానే భావించాలి.
కైలాస దేవాలయం ఎల్లోరా గుహల సముదాయంలో భాగంగా, దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఆలయ నిర్మాణ శైలి పల్లవ, చాళుక్య వాస్తు ప్రభావాన్ని సూచిస్తుంది.
సాంప్రదాయ శివాలయ నిర్మాణ ప్రకారం, ప్రవేశద్వారం ముందు నంది మండపం ఉంటుంది. ప్రాంగణంలోని ఎడమ వైపున శైవమతానికి సంబంధించిన శిల్పాలు, కుడి వైపున వైష్ణవమతానికి మరియు రామాయణానికి సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. అదే ప్రాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి.
గర్భగుడిలో ఉన్న శివలింగానికి వేల ఏళ్లుగా అభిషేకం జరుగుతున్నదని చెబుతారు. ఆ అభిషేక జలం ఎక్కడికి వెళ్తుందో స్పష్టత లేదు. అయితే ఇది శిల్ప నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటి పారుదల వ్యవస్థ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఆలయం మూడు అంతస్తుల నిర్మాణంతో, కొండను పై నుండి కిందికి తొలిచి చెక్కిన అద్భుత కట్టడం. మధ్యలో విశాల ప్రాంగణం, ప్రవేశద్వారం, దీపస్తంభం, నంది మండపం, గర్భగుడి మరియు అనేక స్తంభాలు ఉన్నాయి. గోడలపై శివుని వివిధ రూపాలు అద్భుతంగా చెక్కబడ్డాయి.
రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల్లోని ప్రధాన ఘట్టాలను శిల్పరూపంలో చిత్రించారు. స్తంభాలపై సింహాలు, ఏనుగుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. రావణుడు తన ఇరవై చేతులతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించే దృశ్యం, శివపార్వతులు, బుద్ధుడు మరియు ఇతర దేవతామూర్తుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ.
వేలాది ప్రధాన శిల్పాలు, అనేక చిన్న చిన్న శిల్పాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి.
స్థానికంగా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి రాజు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు అతని భార్య పరమేశ్వరుని ప్రార్థిస్తూ, రాజు ఆరోగ్యం కుదుటపడితే ఆలయం కట్టిస్తానని, గోపురం కనిపించే వరకు ఉపవాసం ఉంటానని మొక్కుకుందని చెబుతారు. రాజు ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత, రాణి మొక్కును తీర్చేందుకు శిల్పులు కొండను కిందనుండి కాకుండా పై నుండి కిందికి చెక్కుతూ ముందుగా గోపురాన్ని రూపొందించి, రాణి ఉపవాస దీక్ష విరమించేలా చేశారని కథనం.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి సైన్యాన్ని పంపినట్లు కొన్ని వృత్తాంతాలు చెబుతాయి. వారు సంవత్సరాల పాటు ప్రయత్నించినప్పటికీ, కొద్దిపాటి శిల్పాలను మాత్రమే దెబ్బతీయగలిగారని చెబుతారు. గర్భగుడిని పూర్తిగా ధ్వంసం చేయలేకపోయారని పేర్కొంటారు.
ఈ ఆలయం కింద భూగర్భ మార్గాలు ఉన్నాయని కూడా అంటారు. కొన్ని సొరంగ మార్గాలు చిన్న పరిమాణంలో ఉండి, సాధారణ మనుషులు వెళ్లలేనంత ఇరుకుగా ఉంటాయని చెబుతారు. అయితే ఇవి నీటి పారుదల లేదా నిర్మాణ సంబంధిత అవసరాల కోసం ఏర్పాటైన మార్గాలై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఆలయాన్ని పై నుండి చూస్తే నాలుగు సింహాలు నిలిచిన ఆకారంలో కనిపిస్తుందని అంటారు. నీటి పారుదల వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, మెట్లు వంటి నిర్మాణ అద్భుతాలు ఈ ఆలయ ప్రత్యేకతను తెలియజేస్తాయి.
ఏనుగుల విగ్రహాలు ఆలయాన్ని మోస్తున్నట్లుగా రూపొందించబడిన తీరు విశేషం. వాస్తు శాస్త్రం, శిల్పశాస్త్రం, నిర్మాణశాస్త్రం మీద లోతైన అవగాహన కలిగిన శిల్పులు ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారని స్పష్టమవుతుంది. పై నుండి కిందికి చెక్కే విధానంలో చిన్న పొరపాటు జరిగినా సరిదిద్దే అవకాశం ఉండదు. అయినప్పటికీ ఎక్కడా లోపం కనిపించదు.
ఖచ్చితమైన ప్రణాళికతో, సమాన కొలతలతో, అద్భుత శిల్పకళా సౌందర్యంతో ఈ కైలాస దేవాలయం నిర్మించబడింది. ఇది నేటికీ వాస్తుశిల్పులకు పరిశోధనాంశంగా నిలిచింది.
వేల ఏళ్ల క్రితం సాధారణ పరికరాలతో ఇంత అద్భుత నిర్మాణాన్ని ఎలా సాధించారో అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.





