హరివరాసనం తెలుగులో అర్థం
![]()
హరివరాసనం విశ్వమోహనం. శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే ఈ మధురమైన పాట వింటే భక్తుల మనసులో ఆనందం తాండవిస్తుంది. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్ని కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. శబరిమలలో ప్రతిరోజూ స్వామిని నిద్రపుచ్చడానికి, ఆలయాన్ని మూసేసే ముందు ఈ కీర్తనను ఆలపిస్తారు. హరివరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్క దీపం కొండెక్కిస్తూ, చివరికి ఒక్క దీపం మాత్రమే ఉంచుతారు. ఇది స్వామివారికి నిద్రపోయేముందు పాడే జోల పాట లాంటిది. హరివరాసనం పూర్తయిన తరువాత నమస్కారం చేయవద్దని, స్వామి శరణు అని చెప్పుకోవద్దని అంటారు. ఈ హరివరాసనం స్తోత్రానికి ఇప్పుడు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకమ్ ।
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 1 ॥

హరివరాసనం– శ్రేష్టమైన పులిని ఆసనంగా కలిగినవాడు
విశ్వమోహనం – విశ్వాన్నే మోహింపచేసేవాడు
హరిదధీశ్వరం – అన్నిదిక్కులకు అధిపతి అయినవాడు
ఆరాధ్యపాదుకమ్ – పూజనీయమైన పాదాలు కలవాడు
అరివిమర్దనం – కామ క్రోధాది శత్రువులను నాశనం చేసేవాడు
నిత్యనర్తనం – ఆత్మ స్వరూపంగా నిత్యం మనలో నర్తించేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – అటువంటి- హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 1 ॥
శరణకీర్తనం భక్తమానసం
భరణలోలుపం నర్తనాలసమ్ ।
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 2 ॥

శరణకీర్తనం- సక్తమానసం – శరణుఘోషలపై ఆసక్తి ఉన్న మనసుకలవాడు
భరణలోలుపం – తన భక్తులను భరించడంలో/పోషించడంలో మిక్కిలి ఆసక్తి కలవాడు
నర్తనాలసమ్ – నిత్యం నాట్యం చేస్తూ అలసినవాడు(జగత్తును నడిపే లీల చేసి అలసినవాడు)
అరుణభాసురం – అరుణ వర్ణంతో ప్రకాశించేవాడు
భూతనాయకం – సకలజీవులకు అధిపతి, భూతగణాలకు నాయకుడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 2 ॥
ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాంచితమ్ ।
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 3 ॥

ప్రణయసత్యకం – సత్యమైన ప్రేమకు నిలయమైనవాడు
ప్రాణనాయకం – ప్రాణాలకు అధిపతి
ప్రణతకల్పకం – శరణు కోరిన భక్తులకు కల్పవృక్షం వంటివాడు
సుప్రభాజితమ్ – గొప్ప కాంతితో ప్రకాశించేవాడు
ప్రణవమందిరం – ఓంకారమనే మందిరంలో కొలువుండేవాడు
కీర్తనప్రియం – కీర్తనలను ఇష్టపడేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 3 ॥
తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్ణితమ్ ।
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 4 ॥

తురగవాహనం – గుర్రం వాహనంగా కలవాడు
సుందరాననం – అందమైన ముఖం కలవాడు
వరగదాయుధం – శ్రేష్టమైన వరప్రదమైన గద ఆయుధంగా కలవాడు
వేదవర్ణితమ్ – వేదాలచే వర్ణించబడినవాడు
గురుకృపాకరం – గురురూపంగా కృపను ప్రసాదించేవాడు
కీర్తనప్రియం – కీర్తనలను ఇష్టపడేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 4 ॥
త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనప్రభుం దివ్యదేశికమ్ ।
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 5 ॥

త్రిభువనార్చితం – మూడు లోకాలచే పూజింపబడేవాడు
దేవతాత్మకం – దేవతా స్వరూపుడు
త్రినయనం ప్రభుం – ముక్కంటి అయిన ఈశ్వరుని స్వరూపము
దివ్యదేశికమ్ – దివ్యమైన ఉపదేశాలిచ్చే గురువు
త్రిదశపూజితం – సమస్త దేవతలచే పూజింపబడేవాడు
చింతితప్రదం – కోరిన కోరికలు తీర్చేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 5 ॥
భవభయాపహం భావుకావకం
భువనమోహనం భూతిభూషణమ్ ।
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 6 ॥

భవభయాపహం – సంసార భయాన్ని పోగొట్టేవాడు
భావుకావహం – శుభాలను కలిగించేవాడు
భువనమోహనం – సమస్త లోకాలను మోహింపజేసేవాడు
భూతిభూషణమ్ – విభూతిని అలంకారంగా ధరించినవాడు
ధవళవాహనం దివ్యవారణం – తెల్లని ఏనుగు వాహనంగా కలవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 6॥
కలమృదుస్మితం సుందరాననం
కళభకోమలం గాత్రమోహనమ్ ।
కళభకేసరీవాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 7 ॥

కలమృదుస్మితం – మృదువైన చిరునవ్వు కలవాడు
సుందరాననం – అందమైన ముఖం కలవాడు
కలభకోమలం – పసిపిల్లలవంటి కోమలమైన శరీరం కలవాడు
గాత్రమోహనమ్ – అద్భుతమైన గాత్రసౌందర్యంతో అందరినీ మోహింపజేసేవాడు
కలభకేసరీవాజివాహనం – ఏనుగు, సింహం, గుర్రం వంటి వాహనాలను కలిగినవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 7 ॥
శ్రితజనప్రియం చింతితప్రదం
శ్రుతివిభూషణం సాధుజీవనమ్ ।
శ్రుతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే ॥ 8 ॥

శ్రితజనప్రియం – ఆశ్రయించిన జనులకు ప్రియమైనవాడు
చింతితప్రదం – కోరిన కోరికలు తీర్చేవాడు
శృతివిభూషణం – వేదములలో స్తుతించబడినవాడు
సాధుజీవనమ్ – సాధువుల జీవనానికి స్ఫూర్తి అయినవాడు
శృతిమనోహరం – వేదములలో స్తుతించబడిన మనోహరమైనవాడు
గీతలాలసం – కీర్తనలను వినడానికి మిక్కిలి ఇష్టపడేవాడు
హరిహరాత్మజం దేవమాశ్రయే – హరిహరుల పుత్రుడైన అయ్యప్ప స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను॥ 8 ॥
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ।
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా ॥
ఈ స్తోత్రం,తెలుగులో అర్థం వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ వీడియొ చూడండి