కనకధారా స్తోత్రం తెలుగులో అర్థం

kanakadhaara stotram meaning in telugu

కనకధారా స్తోత్రం తెలుగులో అర్థం

కనకధారా స్తోత్రం

వందే వందారు మందారమిందిరానందకందలమ్
అమందానందసందోహ బంధురం సింధురాననమ్

శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం

అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయా: ॥1

శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:  

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ।

మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా

సామే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥2

శ్లో॥ ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం

ఆనంద కంద మనిమేష మనంగ తంత్రం
ఆకేకర స్థిత కనీనిక పష్మనేత్రమ్

భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా:3

శ్లో॥ బాహ్వంతరే మధుజిత: శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా

కల్యాణ మావహతు మే కమలాలయాయా: ॥4

శ్లో॥ కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతు సమస్త జగతామ్ మహనీయ మూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: ॥5

శ్లో॥ ప్రాప్తమ్ పదం ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన ।
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: ॥6

శ్లో॥ విశ్వామరేంద్ర పదవిభ్రవ దానదక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోపి

ఈషన్నిషీదతుమయి క్షణమీక్షణార్థం

ఇందీవరోదరసహోదర మిందిరాయాః  7

శ్లో॥ ఇష్టా విశిష్ట మతయో౭పి యయా దయార్ద్ర

దృష్టా త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: ॥8

శ్లో॥ దద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే ।
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: ॥9

శ్లో॥ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ।
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ॥10

శ్లో॥ శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై ।
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 11

శ్లో॥ నమో౭స్తు నాళీక నిభాననాయై
నమో౭స్తు దుగ్ధోదధి జన్మభూమ్యై ।
నమో౭స్తు సోమామృత సోదరాయై
నమో౭స్తు నారాయణ వల్లభాయై ॥12

శ్లో॥ నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై ।
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై ॥13

శ్లో॥ నమోస్తు దేవ్యై భృగు నందనాయై
నమోస్తు విష్ణో రురసి స్థితాయై ।
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై ॥14

శ్లో॥ నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై ।
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై ॥15

శ్లో॥ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి ।
త్వద్ వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ॥16

శ్లో॥ యత్కటాక్ష సముపాసనా విధి:
సేవకస్య సకలార్థ సంపద: ।
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీమ్ భజే ॥17

శ్లో॥ సరసిజ నిలయే సరోజ హస్తే
ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥18

శ్లో॥ దిగ్ఘస్తిభి: కనక కుంభ ముఖావసృష్ట

స్వర్వాహినీ విమల చారు జలప్లుతాంగీం
ప్రాతర్నమామి జగతాం జననీం అశేష

లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్॥19

శ్లో॥ కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూర తరంగితై రపాంగైః

అవలోకయ మామకించనానామ్
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా: ॥20

శ్లో॥ బిల్వాటవీ మధ్య లసత్ సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।
అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్ ॥21

శ్లో॥ కమలాసన పాణినా లలాటే

లిఖితామక్షర పంక్తి మస్య జంతో: ।
పరిమార్జయ మాతరంఘ్రిణా తే

ధనిక ద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ ॥22

శ్లో॥ అంభోరుహం జన్మగృహం భవత్యా:
వక్ష:స్థలం భర్తృ గృహం మురారే: ।
కారుణ్యత: కల్పయ పద్మవాసే
లీలాగృహమ్ మే హృదయారవిందమ్ ॥23

శ్లో॥ స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమాం

గుణాధికా గురుతర భాగ్య భాజినో
భవంతి తే భువి బుధ భావితాశయా: ॥24

ఫలశ్రుతి:

శ్లో॥ సువర్ణధారాస్తోత్రం యత్శంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ ॥25


కనకధారా స్తోత్రం తెలుగులో అర్థం

జగద్గురు ఆదిశంకరాచార్యుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్ర ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు ఆదిశంకరాచార్యులు వారు ఒక ఇంటికి భిక్ష కు వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేద రాలు. భిక్ష వేయడానికి ఆమె ఇంట్లో ఏ ఆహార పదార్థాలు లేవు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికింది. ఎలాగో ఆమెకు ఒక ఉసిరికాయ దొరికింది. ధర్మపరురాలు అయిన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండి ఉసిరికాయను శంకరుడికి సమర్పించింది. ఆమె దరిద్రాన్ని గ్రహించినటువంటి ఆదిశంకరాచార్యులవారు లక్ష్మీదేవిని స్తుతిస్తూ స్తోత్రము చెప్పగా ఆ పేదరాలు ఇంటా బంగారు ఉసిరికాయలు వర్షించాయి. ఆ స్తోత్రమే కనకధారా స్తోత్రము గా ప్రసిద్ధిగాంచింది. ఈ స్తోత్రమును ఎవరైతే భక్తితో పఠిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలిగి సర్వార్థ సిద్ధి కలుగజేస్తుందని భక్తుల విశ్వాసం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం ద‌రిచేర‌దు.

వందే వందారు మందారమిందిరానందకందలమ్
అమందానందసందోహ బంధురం సింధురాననమ్

శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం

అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా

మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయా: ॥1

తాత్పర్యము : పూల మొగ్గలతో నిండిఉన్న తమాల వృక్షము (కానుగుచెట్టు)ను ఒక ఆడతుమ్మెద ఆశ్రయించుకొనియున్నట్టు, సంతోషముతో పులకరించిన శరీరము గల, విష్ణుదేవుని హృదయమును నివాసముగా చేసుకున్న, సకలైశ్వర్య సంపన్నురాలైన లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు, నాపై ప్రసరించి నాకు శుభములు చేకూర్చు గాక.

శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:  

ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ।

మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా

సామే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥2

తాత్పర్యము : నీలి కలువల మీద తుమ్మెదలు వ్రాలినట్లు, విష్ణుదేవుని మొఖము మీద శ్రీదేవి చూపులు వ్రాలుతాయి. ఆయన తనను చూస్తున్నాడని సిగ్గుపడి, ఆమై తన చూపులను వెనుకకు మరల్చింది. ఇలా శ్రీహరి ముఖము మీదకు ప్రసరిస్తున్న శ్రీలక్ష్మీదేవి చూపులు ఒక్కసారి ఈ భక్తునిపై ప్రసరించి సర్వసంపదలు ఇచ్చుగాక.

శ్లో॥ ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం

ఆనంద కంద మనిమేష మనంగ తంత్రం
ఆకేకర స్థిత కనీనిక పష్మనేత్రమ్

భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా:3

తాత్పర్యము: కోరికతో నిండిన అరమూత కన్నులతో తనను చూచుచున్న శ్రీహరిని, ప్రేమతో రెప్పవేయకుండా కంటికొనలతో చూచుచున్న ఆ ఇందిరాదేవిచూపు కొంచెము నాపై ప్రసరించి నాకు సంపదలనిచ్చుగాక.

శ్లో॥ బాహ్వంతరే మధుజిత: శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా

కల్యాణ మావహతు మే కమలాలయాయా: ॥4

తాత్పర్యము : ఏ శ్రీదేవియొక్క చూపులు కౌస్తుభమణితో వెలుగొందు శ్రీహరి హృదయమందు ప్రసరించి, ఇంద్ర నీలమణి హారాలవలె ప్రకాశించుచున్నవో, ఏ దేవి చూపులు భర్త అయిన విష్ణువు కోరిన కోరికలు కూడా తీర్చుచున్నవో, అటువంటి శ్రీలక్ష్మీదేవి చూపులు నాకు సర్వ శుభములు, సకల సంపదలు ప్రసాదించు గాక.

శ్లో॥ కాలాంబుదాళి లలితోరసి కైటభారేః

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతు సమస్త జగతామ్ మహనీయ మూర్తిః

భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: ॥5
తాత్పర్యము : మబ్బు మధ్యలో మెరిసే మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ యొక్క దివ్య స్వరూపము నాకు సమస్త శుభములు, సకల సంపదలు ప్రసాదించు గాక.

శ్లో॥ ప్రాప్తమ్ పదం ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్
మాంగల్య భాజి మధుమాథిని మన్మథేన ।
మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్
మందాలసం చ మకరాలయ కన్యకాయా: ॥6
తాత్పర్యము : దేని ప్రభావము చేత మన్మథుడు సమస్త కల్యాణ గుణాభిరాముడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా) మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక.

విశ్వామరేంద్ర పదవిభ్రవ దాన దక్షం

ఆనందహేతురధికం మురవిద్విషోపి

ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం

ఇందీవరోదర సహోదర మిందిరాయాః  7

తాత్పర్యము : ఇంద్రునికి త్రిలోక ఆధిపత్యమును ప్రసాదించగలది, నారాయణునకు ఆనందము కలిగించునది అయిన, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చల్లని చూపులో సగము ఈ భక్తునిపై ఒక క్షణ కాలము నిలిపి నన్ను అనుగ్రహించుము గాక.

శ్లో॥ ఇష్టా విశిష్ట మతయో౭పి యయా దయార్ద్ర

దృష్టా త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: ॥8

తాత్పర్యము : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన జ్ఞానులు తేలికగా స్వర్గధామమున సుఖిస్తారో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపదలు కలిగించుగాక.

శ్లో॥ దద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారామ్
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే ।
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: ॥9
తాత్పర్యము : ఎండవేడికి తపించిన పిల్ల చాతక పక్షి- మేఘముల గాలి తగిలి కురిసిన వర్షపు నీటితో తృప్తి పొందినట్లు, పాపముల భారముతో తపించుచున్న ఈ అభాగ్యునికి దయతోగూడిన లక్ష్మీదేవి చూపు సంపదలనిచ్చి తృప్తిని కలిగించుగాక.

శ్లో॥ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ।
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై ॥10

సృష్టి కాలములో బ్రహ్మ పత్నియైన సరస్వతిగా, పోషణ కాలములో నారాయణ పత్నియైన లక్ష్మీదేవిగా, ప్రళయ కాలంలో రుద్రుని పత్నియెన పార్వతిగా, భక్తులననుగ్రహించుటలో అన్నపూర్ణాదేవిగా, ఇలా అనేక రూపములతో సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్న ఆ లక్ష్మీదేవికి నమస్కారము.

శ్లో॥ శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై
రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై ।
శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 11

తాత్పర్యము : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలాన్నిచ్చే వేదమాతృ స్వరూపురాలైన లక్ష్మీదేవికి, నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు నమస్కారములు. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపిణికి నమస్కారములు. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి నమస్కారములు.

శ్లో॥ నమో౭స్తు నాళీక నిభాననాయై
నమో౭స్తు దుగ్ధోదధి జన్మభూమ్యై ।
నమో౭స్తు సోమామృత సోదరాయై
నమో౭స్తు నారాయణ వల్లభాయై ॥12

తాత్పర్యము : తామరపువ్వు వంటి చక్కటి మొఖము గల తల్లికి నమస్కారములు. పాలసముద్రము పుట్టినిల్లుగాగల లక్ష్మీదేవికి నమస్కారము. చంద్రునకు, అమృతమునకు తోబుట్టువైన చల్లని తల్లికి నమస్కారము. శ్రీమన్నారాయణునికి  ప్రియురాలైన లక్ష్మీదేవికి నమస్కారము.

శ్లో॥ నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై ।
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై ॥13

తాత్పర్యము : బంగారు తామరపువ్వునందు కూర్చున్న తల్లికి నమస్కారము. సమస్త లోకాలకు నాయకురాలైన అమ్మకు నమస్కారములు. సమస్త దేవతలను కరుణించు దయామూర్తికి నమస్కారం. శార్ఙ్గమను విల్లును ధరించిన విష్ణువుకి పత్ని అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం.

శ్లో॥ నమోస్తు దేవ్యై భృగు నందనాయై
నమోస్తు విష్ణో రురసి స్థితాయై ।
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై ॥14
భృగుమహర్షి కుమార్తేయెన భార్గవిదేవికి నమస్కారం. విష్ణువు హృదయముపై విశ్రమించు దేవికి నమస్కారం, పద్మమే నివాసముగా గల తల్లికి నమస్కారం. శ్రీమన్నారాయణునికి ఇల్లాలైన లక్ష్మీదేవికి నమస్కారం.

శ్లో॥ నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై ।
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై ॥15

తాత్పర్యము :

కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి నమస్కారము. భాగ్యరూపిణి, జగత్‌ సృష్టికి కారణ భూతురాలైన కమలాదేవికి నమస్కారము. దేవ, దానవ, మనుష్యాదులచే పూజింపబడు లోకైక శరణ్యురాలికి నమస్కారం. నందగోపుని కుమారుడైన శ్రీ కృష్ణుని దేవేరియైన రుక్మిణి స్వరూపిణి అయిన శ్రీదేవికి నమస్కారము.

శ్లో॥ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి ।
త్వద్ వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ॥16

తాత్పర్యము : పూజ్యరాలైన ఓ తల్లీ! నీకు నేను చేయు నమస్కారములు నాకు సంపదలను ప్రసాదిస్తాయి. సకల ఇంద్రియములకు ఆనందమును కలుగజేస్తాయి. సామ్రాజ్యములను ప్రసాదిస్తాయి. నేను చేసే ప్రతీ నమస్కారము నన్ను పవిత్రుణ్ణి చేయుగాక.

శ్లో॥ యత్కటాక్ష సముపాసనా విధి:
సేవకస్య సకలార్థ సంపద: ।
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీమ్ భజే ॥17
తాత్పర్యము : తల్లీ! ఎవరి కటాక్షము కోరితే మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు కలుగుతాయో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.

శ్లో॥ సరసిజ నిలయే సరోజ హస్తే
ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥18
తాత్పర్యము : తామరపూలలో నివసించు ఓ దేవి! పద్యము చేతిలో ధరించి, తెల్లని పట్టు చీరతో, గంధముతో, పూల మాలలతో శోభించు మహాలక్ష్మిదేవి! ముల్లోకాలకు ఐశ్వర్యములు ప్రసాదించు ధనలక్ష్మీ! విష్ణుపత్నివైన ఓ లక్ష్మీదేవి! నాయందు దయ చూపుము. నన్ను అనుగ్రహింపుము.

శ్లో॥ దిగ్ఘస్తిభి: కనక కుంభ ముఖావసృష్ట

స్వర్వాహినీ విమల చారు జలప్లుతాంగీం
ప్రాతర్నమామి జగతాం జననీం అశేష

లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్ ॥19
తాత్పర్యము : దిగ్జజములు సువర్ణపాత్రలతో గంగాజలము తెచ్చి అభిషేకించడంవల్ల తడిచిన దేహముగలిగిన జగజ్జననిని, అమృత సాగర పుత్రిక, సర్వలోకాధినాధుడైన శ్రీమన్నారాయణుని ఇల్లాలు అయిన శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతీ దినము ప్రాత:కాలమునే నమస్కరించెదను.

శ్లో॥ కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూర తరంగితై రపాంగైః

అవలోకయ మామకించనానామ్
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయా: ॥20

తాత్పర్యము : కమలాక్షుని రాణివైన ఓ కమలాదేవీ! దరిద్రులలో మొదటివాడను, నీ దయకు పాత్రుడను అయిన నన్ను కరుణతో, దయతో నిండిన నీ కడకంటి చూపులతో చూచి అనుగ్రహింపుము తల్లీ!

శ్లో॥ బిల్వాటవీ మధ్య లసత్ సరోజే
సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।
అష్టాపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్ ॥21
తాత్పర్యము : బిల్వ వృక్షాల వనమునందున్న కొలనులో, వేయి రేకుల తామర పద్మములో, సుఖముగా పద్మానములో కూర్చుని, బంగారు తామరలను చేతులయందు ధరించిన, బంగారు ఛాయగల శ్రీ లక్ష్మీదేవికి ప్రతీ నిత్యము నమస్కరించెదను.

శ్లో॥ కమలాసన పాణినా లలాటే

లిఖితామక్షర పంక్తి మస్య జంతో: ।
పరిమార్జయ మాతరంఘ్రిణా తే

ధనిక ద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ ॥22

తాత్పర్యము : బ్రహ్మదేవుడు ఈ జీవుని నుదుట ధనికుల ఇళ్లముందు నిలబడి, వారిచ్చు ధనముతో బ్రతకమని వ్రాశాడు. ఓతల్లి! శ్రీ మహాలక్ష్మీ దేవి! నీ భక్తుడనైన నన్ననుగ్రహించి నీ పాదముతో నా నుదుటి వ్రాతలను చెరిపివేయుము తల్లి.

శ్లో॥ అంభోరుహం జన్మగృహం భవత్యా:
వక్ష:స్థలం భర్తృ గృహం మురారే: ।
కారుణ్యత: కల్పయ పద్మవాసే
లీలాగృహమ్ మే హృదయారవిందమ్ ॥23

తాత్పర్యము : ఓ పద్మవాసినీ! నీకు పద్మమే పుట్టినిల్లు. శ్రీహరి హృదయమే మెట్టినిల్లు. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే.  కృపతో నీ భక్తుడనైన నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని నన్ను కృతార్థుణ్ణి చేయుము తల్లీ!

శ్లో॥ స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం
త్రయీమయీం త్రిభువన మాతరం రమాం

గుణాధికా గురుతర భాగ్య భాజినో
భవంతి తే భువి బుధ భావితాశయా: ॥24

తాత్పర్యము : మూడు వేదాల రాశియైన స్వరూపము కలది, ముల్లోకాలకు తల్లియగు శ్రీ లక్ష్మీదేవిని ఈ కనకధారస్తోత్రముతో స్తుతించినవారు- తమ సద్గుణములచేత ఇతరుల కంటే అధికులై, విద్వాంసుల చేత గౌరవింపబడుతూ, సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.

ఫలశ్రుతి:

శ్లో॥ సువర్ణధారాస్తోత్రం యత్ శంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ ॥25
తాత్పర్యము : జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు కూర్చిన ఈ కనకధారా స్తవమును ప్రతిరోజూ 3 సార్లు అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయం సంధ్యలలో పారాయణము చేసినవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు.

Add Your Heading Text Here

Tags: , , , , , , , , , , , , ,