షోడశ సంస్కారాలు అంటే ఏమిటి?
భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలు మానవ వికాసానికై ఋషులచే నిర్దేశించబడ్డాయి. ఈ సంప్రదాయాలనే సంస్కారాలు అని చెబుతారు. వ్యక్తిని శుద్ధి చేసి, సమాజానికి మేలు చేసే వ్యక్తిగా ఒకర్ని తీర్చిదిద్దేవే సంస్కారాలు. షోడశ సంస్కారాలు అంటే ఏమిటి? హిందూ ధర్మంలో పాటించే అనేక సంప్రదాయాలు, విశ్వాసాలలో భాగంగా, ప్రాణి భూమ్మీద పడినప్పటి నుంచి మరణించి మరుభూమికి చేరుకునేవరకూ ముఖ్యమైన 16 సంస్కారాలను అనుసరిస్తారు. వీటినే ‘షోడశ సంస్కారాలు’ అంటారు. ఇందులో మొదటి మూడింటినీ జనన పూర్వ సంస్కారాలనీ, మిగతా పదమూడింటినీ జననాంతర సంస్కారాలనీ అంటారు. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ, మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందుతాడు. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా తొలగి, మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. వ్యతిరేక ప్రభావాలను తొలగించుకోవడం, అనుకూల ప్రభావాలను బలపరుచుకోవడం, ఇహపరమైన ప్రయోజనాలను సాధించుకోవడం, ఆత్మవ్యక్తీకరణ జరుపుకోవడం వంటివి సంస్కారాల వల్ల కలిగే లాభాలు.
ఈ సంస్కారాలు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఈ పదహారు రకాల సంస్కారాల గురించి, వాటిని అనుసరించాల్సిన సమయాల గురించి, వాటి విధివిధానాల గురించి, ఈ తెలుసుకుందాం.
సంస్కారాలు ఎన్ని అనే వివరణ గురించి సంఖ్యాపరంగా సరైన నిర్ధారణ లేదు. కొందరు వీటిని 16గా పేర్కొంటోంటే, మరికొందరు ఇవి 40 అంటారు. 40 సంస్కారాలు ఈ విధంగా ఉంటాయి.
- గర్భాదానం
- పుంసవనం
- సీమంతం
- జాతకర్మ
- నామకరణం
- అన్నప్రాసనం
- చౌలం
- ఉపనయనం
- ప్రజాపత్యం
- సౌమ్యం
- ఆగ్నేయం
- వైశ్వదేవం
- సమావర్తనం
- వివాహం
- దేవయజ్ఞం
- పిత్రుయజ్ఞం
- మనుష్యయజ్ఞం
- భూతయజ్ఞం
- బ్రహ్మయజ్ఞం 20.అన్వాష్టకం
- పర్వాణం
- స్థాలీపాకం 23. అగ్రహాయణి
- సర్వాణి
- చైత్రి
- ఆశ్వయుజి
- అగ్ని ఆధానం
- అగ్నిహోత్రం
- దర్శ పూర్ణమాసం 30. అగ్రాయణం
- చాతుర్మాస్యం
- నిరూడ పశుబంధం 33. శాంతరమణి
- అగ్నిష్టోమం
- అత్యాగ్నిష్టోమం
- ఉక్త్యం
- షోడశి 38. వాజపేయం
- అతిరాత్రం
- అబ్దోర్యమం
అయితే ఈ 40 సంస్కారాలలో కొన్ని రకరకాల హోమాలు, యజ్ఞాలకు సంబంధించినవి కాగా, ముఖ్యమైన సంస్కారాలు మాత్రం 16. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- గర్భాదానం
- పుంసవనం
- సీమంతం
- జాతకర్మ
- నామకరణం
- నిష్క్రమణ
- అన్నప్రాశన
- చూడాకరణ
- కర్ణవేధ
- అక్షరాభ్యాసం
- ఉపనయనం
- వేదారంభం
- కేశాంత
- సమావర్తన
- వివాహం
- అంత్యేష్టి
- మూలాలు
1. గర్భాదానం
షోడశ సంస్కారాలలో గర్భాదానం మొదటిది. వివాహమయ్యాక, భార్యాభర్తల తొలి శారీరక సమాగమంలో ఆరోగ్యవంతమైన, సత్సంతానాన్ని ఆశించి జరిపే సంస్కారం ‘గర్భాదానం’. అంటే సంతానాన్ని పొందాలనే పవిత్రమైన సంకల్పముతో, భర్త తన వీర్య శక్తిని భార్య యొక్క గర్భములో నిక్షేపించడం అని అర్ధం. సత్సంతానం, వంశాభివృద్ధి ప్రసాదించమని ఈ సమయంలో పఠించే మంత్రాల ఉద్దేశ్యం. గర్భాదాన సంస్కారం వల్ల బీజశుద్ధి, గర్భశుద్ధి, క్షేత్ర సంస్కారం జరుగుతాయని చెప్పబడింది.
నిజ జీవితములో కామభావన అనేది సహజసిద్ధమైనది. ఈ సహజ సిద్ధమైన లక్షణానికి దైవిక భావనను మిళితం చేయడం వలన మంచి సంతానం కలుగుతుంది. అందుకే భార్యాభర్తల కలయిక సమయంలో, కామోపభావము తొలగించి సాత్త్వికమైన దైవభావన కలిగేందుకే మన ఆర్షధర్మం ఈ సంస్కారాన్ని ఏర్పరచింది. వివాహమైన దంపతులు స్వచ్ఛమైన ఆలోచనలతో, శారీరక ఆరోగ్యంతో గర్భం దాల్చినప్పుడు, వారికి ఆరోగ్యకరమైన, తెలివైన సంతానం కలుగుతుంది.
2. పుంసవనం
ఇప్పటితరంలో ఆడపిల్ల, మగపిల్లాడు అంటూ ఎవరూ ఎలాంటి వ్యత్యాసం చూపించడం లేదుకానీ..అప్పట్లో మగపిల్లాడు పుట్టేవరకూ పిల్లల్ని కంటూనే ఉండేవారు. పుంసవనం అనే ఈ క్రతువు చేస్తే మగపిల్లాడు పుడతాడని విశ్వసించేవారు. తల్లిదండ్రులకు అంత్యక్రియలు, ఆబ్దికాలు పుత్రుడే నిర్వహించాలని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మరణానంతరం ఉత్తమ గతులను కల్పించేందుకే ఈ సంస్కారం ఏర్పడింది. పూర్వం వారసత్వంగా రాజ్యాధికారం లభించేది. అందుకే రాజులు వారి తరువాత వారి కుమారులు రాజ్యాన్ని పొందాలని భావించిపుత్ర సంతానం కోసం ఆరాటపడేవారు. మగవారికి సైన్యంలో చేరే అవకాశం ఉండేది. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల మాత్రమే, మగ సంతానం కోసం ఈ పుంసవన సంస్కారం ఏర్పరచబడింది. అంతే కానీ ఇది స్త్రీలను చిన్న చూపు చూడడం ఏ మాత్రం కాదు.
స్త్రీ గర్భం ధరించినట్లు నిర్ధారణ అయిన తర్వాత, ఆమెకు కొడుకు పుట్టాలని, మూడవ మాసములో మొదటి పదిరోజులలో, చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు చేసే సంస్కారమే ‘పుంసవనం’. ఆ రోజంతా గర్భిణి ఉపవాసం ఉంటుంది. రెండు మర్రి పళ్లతో కలిసి ఉన్న మర్రి చిగుళ్లను, రజస్వల కాని కన్యతో నూరించాలి. ఆ తరువాత నూరిన మర్రి గుజ్జును కొత్తదైన తెల్లని వస్త్రములో వేసుకొని, భర్త భార్య కుడిముక్కు రంధ్రంలో దాన్ని పిండాలి. ఆ రసము తన గర్భాన్ని తాకేటట్లుగా భార్య గట్టిగా పీల్చాలి.
ఈ సందర్భంగా చెప్పే మంత్రాలలో మిత్రావరణులనే ఇరువురు దేవతలూ, అశ్వినీ దేవతలు, అగ్నిదేవుడు, వాయుదేవుడు గర్భాన్ని సంరక్షిస్తూ పుత్ర సంతానాన్ని కలిగిస్తారని చెప్పబడుతుంది. దీనివలన జననేంద్రియ దోషాలు తొలగిపోయి, గర్భరక్షణ శక్తి కలిగి, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని సుశ్రుతము మొదలైన ఆయుర్వేద శాస్త్రాలలో చెప్పబడింది.
3.సీమంతం
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసే వేడుక సీమంతం. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసము ఎంతో అవసరం. గర్భిణీస్త్రీని ఆవహించుకుని వుండే దుష్టశక్తుల బారినుంచి రక్షించుకొనేందుకే ఈ సంస్కారం చేస్తారు. సీమంతం ద్వారా కడుపులో ఉన్న బిడ్డకు మంచి గుణాలు, మంచి స్వభావం అలవాడతాయని నమ్ముతారు.
ఈ సంస్కారం ఏ మాసంలో జరిపించాలనే దానిమీద భిన్న వాదనలున్నా, తొలిచూలులో నాలుగు/ ఆరు/ ఎనిమిదవ మాసంలో జరిపించాలని శాస్త్ర వచనం. ఒకవేళ తొలిచూలులో వీలుకాకపోతే రెండవ గర్భధారణ సమయంలో చేయాలని నియమం. శుభదినాన, ఉదయాన్నే, సంకల్పం చెప్పుకుని, సంతాన ప్రదాతలగు విష్ణువుకీ, త్వష్ట ప్రజాపతికీ, ఇతర దేవతలకూ హవిస్సులర్పించి, హోమగుండానికి పడమరవైపు తూర్పుముఖంగా గర్భిణీస్త్రీని కూర్చుండబెట్టి, ఏదుపంది ముల్లు, దర్భకట్ట, అత్తిపండ్ల గుత్తులు కలిపి పాపిట చెదిరిపోవునట్టుగా రాపిడి కలిగించే విధంగా గట్టిగా రాయాలి. ఈ విధంగా చేసే రాపిడి వల్ల శిరస్సులోని బ్రహ్మ రంధ్రం వద్ద కలిగే స్పందనలు, గర్భస్థ శిశువుకు చేరి, శిశువు ఉత్తేజాన్ని పొందుతుందని చెబుతారు. తరువాత సంబంధిత వేదమంత్రాలను పఠిస్తూ, మొలకెత్తిన యవధాన్యాల దండను ఆమె కొప్పునకు చుట్టాలి. గర్భిణీ స్త్రీకి భూత, ప్రేత, పిశాచాల బాధలను నివారించేందుకై, పాపిటపై కుంకుమ బొట్టును పెట్టి, తూర్పు లేక ఉత్తరదిశగా దంపతులిద్దరూ నడచి అక్కడవున్న కోడెదూడను తాకి నమస్కరించాలి.
ఒక రాగిపాత్రలో వడ్లనుగానీ, యవధాన్యాన్నిగానీ వుంచి, ఋగ్వేదమంత్రాలను పఠిస్తూ, భర్త, గర్భిణీస్త్రీకి ఏడు దోసిళ్ళతో ఆ నీరు తాగించాలి. తర్వాత కుటుంబాచారాలను ఆచరించి, అందరి ఆశీర్వచనాలను తీసుకుని అందరికీ యథాశక్తి భోజనాదులనో లేక ఫలతాంబూలాదులనో సమర్పించాలి. చివరిగా ముట్టదువుల మంగళ వాచకాల వాక్యాలతో, వారి ఆశీర్వాదాన్ని పొందాలి.
4. జాతకర్మ
పది నెలలు తల్లి గర్భంలో ఉండి, ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది. పూర్వ కాలంలో ఇంట్లోనే కాన్పులు చేసే రోజుల్లో, ఈ సంస్కారాన్ని నిర్వహించేవారు. బిడ్డ పుట్టిన తర్వాత, బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారం జాతకర్మ. దీనిలో భాగంగా బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలను ఒక సన్నని బంగారు దారంతో శిశువు నోటికందిస్తారు. దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు. తండ్రి బిడ్డ చెవిలో “త్వం…శతమానం భవతి:” అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుత్రాడు కోసి, శిశువును శుభ్రము చేసి, తల్లిపాలు పట్టిస్తారు.
5. నామకరణం
నామకరణం అంటే పేరు పెట్టడం. నామకరణానికే బారసాల అని పేరు. నామకరణాన్ని శిశువు జన్మించిన నాటి నుండి 11వ రోజు కానీ లేదా 13 వ రోజున కానీ చేయాలని మనుధర్మ శాస్త్రం చెబుతోంది. అది వీలుకానప్పుడు 21 వ రోజు లేదా 3 వ నెలలో నామకరణం చేసే సంప్రదాయం కూడా ఉంది. పరాశర గృహ్యసూత్రముల ప్రకారం మగపిల్లాడి పేరు రెండు లేదా నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర దీర్ఘము కాని విసర్గము కాని ఉండాలి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.
నామకరణం జరిపించుకొనే రోజున తల్లిదండ్రులు, శిశువు తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి గణపతి పూజ, పుణ్యాహావచనం జరిపి, సంకల్పం చెప్పుకోవాలి. తరువాత ఒక పెద్ద పళ్లేమును తీసుకుని, దానిని బియ్యముతో నింపి, బియ్యముపై బంగారు ఉంగరముతో దక్షిణము నుండి ఉత్తరానికి రెండు గీతాలను గీయాలి. దాంతో బియ్యములో మూడు గళ్ళు ఏర్పడతాయి. మొదటి గదిలో మాసనామాన్ని, రెండవ గదిలో నక్షత్రనామాన్ని, మూడవ గదిలో వ్యవహారిక నామాన్ని బంగారు ఉంగరముతో రాయాలి. శాస్త్రానుసారంగా ఈ సంస్కారాన్ని చేయడం వలన శిశువు జన్మ సమయానికి సంబంధించిన మాస దేవతలు, నక్షత్ర సంబంధ దేవతలు శిశువు జీవితాన్ని శుభప్రదం చేస్తారని భావన.
6. నిష్క్రమణ
బిడ్డ జన్మించిన తర్వాత మొదటి సారిగా ఇంటి నుంచి బయటకు తీసుకురావడాన్ని నిష్క్రమణ అంటారు. అమ్మ కడుపులోంచి భూమ్మీద పడినతర్వాత మొదటి సారిగా ఇల్లు దాటేందుకు, మంచి రోజు చూసి తీసుకెళతారు. అదికూడా మొదటిసారిగా ఆలయానికి తీసుకెళ్లడం హిందూ సంప్రదాయం. ఇంటి బయట చతురస్రాకారంలో సూర్యుడు కనిపించే ప్రదేశంలో ఆవుపేడతో అలికి, ముగ్గులు వేసి, దానిపై అక్షతలు చల్లుతారు. తండ్రి పూరించే శంఖం ధ్వని, వేద మంత్రాల నడుమ పిల్లవాడిని సూర్యుని వైపు చూసేలా చేయడంతో ఈ సంస్కారం ముగుస్తుంది.
అప్పటి వరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు, ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి భౌతికంగా, ఆధ్యాత్మికంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
7. అన్నప్రాశన
మొదటిసారిగా ఘనాహారం తినిపించడం అన్నప్రాసన. సాధారణంగా ఆరో నెలలో అన్నప్రాశన కార్యక్రమం నిర్వహిస్తారు. పెరిగే బిడ్డకు భౌతికావసరాలు తీర్చడానికి ఘనాహారం ఇవ్వడం మొదలు పెట్టే ప్రక్రియ ఇది. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డకు ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. నీటితో మాత్రమే అన్నాన్ని మెత్తగా ఉండేలా శుచిగా వండి, తల్లి ఒడిలో శిశువును కూర్చోబెట్టి, ఏదైనా బంగారపు వస్తువుతో అన్నాన్ని ముందుగా తల్లి, తరువాత తండ్రి, ఇతర బంధువులు శిశువు నోటికి అందించాలి. ఈ ఆహారమును కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు.
ఒక్కొక్క రకమైన గుణాన్ని పెంపొందించడానికి, ఒక్కొక్క రకమైన ఆహారాన్ని అందిస్తారు. ఈ సంస్కారము జరపడం వల్ల, వయసుకు తగిన ఆహారము అందడమే కాకుండా, ఆహారం పట్ల పవిత్ర భావన ఏర్పడుతుంది.
ఈ అన్నప్రాశనలోనే మరొక వేడుక కూడా నిర్వహిస్తారు. అన్నప్రాశనమయ్యాక బిడ్డకి కొద్ది దూరంలో బొమ్మల్ని, బట్టల్ని, నగలనీ, కత్తినీ, పువ్వుల్నీ, పుస్తకాలను, బంగారాన్ని, ధనాన్ని ఉంచి వాటిని తీసుకోవలసిందిగా ఉత్సాహపరచాలి. వారు అందుకున్న వస్తువులను బట్టి, అ బిడ్డ మనస్తత్వాన్ని గ్రహించే అవకాశముందని పెద్దలు చెబుతారు.
8. చూడాకరణ
చూడాకరణమునే చౌలమ్ లేదా పుట్టువెంట్రుకలు తీయడం అంటారు. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం ఇది. సుశ్రుతుడు, చరకుడు కూడా పుట్టు వెంట్రుకలు తీయడం వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. గృహ్యసూత్రాల ప్రకారం, ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడో ఏటగానీ చెయ్యాలి. ధర్మ శాస్త్రం ప్రకారం, వ్యక్తి చేసిన పాపాలు జుట్టుని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి వాటిని తొలగించాలని చెప్తారు. వెనుకటి రోజుల్లో ఈ పుట్టువెంట్రుకలను తొలగించిన తరువాత, వాటిని బిడ్డ మణికట్టుకో, పాదానికో, బాహువుకో ఒక చిన్న తాయెత్తుని కట్టేవారు. దీని వలన పిల్లలకు దృష్టి దోషం తొలగిపోయి, రక్షణ కలుగుతుంది.
9. కర్ణవేధ
దీనికే కర్ణభేద అనే పేరు కూడా వుంది. అంటే చెవులకు రంధ్రం వేయడం అని అర్థం. వాడుకలో ఈ సంస్కారాన్ని చెవులు కుట్టించడమంటారు. దీనిని శిశువులందరికీ లింగభేదం లేకుండా శిశువుకు ఐదు సంవత్సరాలు నిండేలోపే జరిపించాలని దేవలుడనే మహర్షి బోధించాడు. 6,7,8,10,12 మాసాల్లో శిశువుకి స్త్రీ, పురుష భేదం లేకుండా, బంగారు తీగతో చెవితమ్మిని పొడిచి చెవులు కుట్టించాలి. కర్ణాభరణాలు ధరించడం కేవలం అందం కోసమే కాక ఆరోగ్యదృష్ట్యా ఎంతో ప్రాధాన్యత ఉంది. తాటంకాలు అనగా చెవి తమ్మెలకు రంధ్రం వేసి, వాటిని బంగారంతో అలంకరించడం ద్వారా, మెదడుకు చైతన్యం కలిగి జ్ఞాపక శక్తి వృద్ధి చెంది, శిశువులు చురుకుగా అన్ని రంగాలలో రాణిస్తారని వైద్యశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే, జ్ఞాపకశక్తికి సంబంధించిన నాడులు చెవి తమ్మెలలో అంతమౌతాయి. వాటిని నిత్యం బంగారంతో ప్రేరేపించడం ద్వారా అవి ఉత్తేజితమై, జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.
ఒక శుభముహూర్తంలో స్నానాదులను ఆచరించి, స్వర్ణశిల్పాచార్యులను పిలిపించి, పూజామందిరం దగ్గర శిశువును కూర్చోబెట్టి ఆచార్యుల చేత చెవులు కుట్టించాలి. తర్వాత ఆ చెవులను స్వర్ణాభరణాలతో అలంకరించాలి. తరువాత ఆచార్యులకు నూతన వస్త్ర దక్షిణ తాంబూలాదులను సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దేవలుడనే స్మృతికర్త “చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది.” అని పేర్కొన్నాడు.
10. అక్షరాభ్యాసం
బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. యాజ్ఞవల్క్య స్మృతి తదితర స్మృతులలో ఈ అక్షరాభ్యాసం గురించి కనిపిస్తుంది. శిశువుకు ఈ సంస్కారాన్ని చూడాకరణం అయిన తర్వాత చేయాలని శాస్త్రం. వేదాధ్యయనం తప్ప ఇతర విద్యలన్నీ కూడా ఈ సంస్కారం అయిన తర్వాతే నేర్చుకోవడం ప్రారంభించాలని సూచించారు. ఒక్క వేదవిద్యమాత్రం, అర్హులైనవారు, ఉపనయనం అయిన తరువాతే ప్రారంభించాలి. ఈ సంస్కారాన్ని ఐదు లేదా ఏడవ సంవత్సరంలో చేయాలని శాస్త్రవచనం. ఎందుకంటే అదే సమయంలో అక్షరాభ్యాసం, ఉపనయనం జరిపించి గురుకులాలకు విద్యకోసం పంపించేవారు. శిశువు విద్యలను అభ్యసించడం ద్వారా దినదిన ప్రవర్ధమానమవుతాడని, ఉత్తరాయణంలో ఈ సంస్కారం జరిపించాలని చెబుతారు. కొందరు కార్తీక, మార్గశిర మాసాలు కూడా యోగ్యమనే చెప్పారు. పురుష నక్షత్రాలలో, శుభతిథులలో, ఆది, సోమ, బుధ, గురు, శుక్ర వారాలలో జరిపించాలని శాస్త్రం.
సంస్కార విధానం: శుభముహుర్తాన గణపతి పూజ, పుణ్యహవాచనం పూర్తిచేసిన తర్వాత గుణవంతుడు, విద్యాప్రపూర్ణుడైన ఒక ఆచార్యుని పిలిపించి ఆయనకు పాదపూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత, ఆ ఆచార్యుడు, ఒక పళ్ళెంలో నిండుగా బియ్యం పోసి, మధ్యలో, ఆ బియ్యం మూడు సమాన భాగాలుగా అయ్యేట్లు ఒక బంగారు వస్తువుతో అడ్డంగా రెండు గీతల్ని గీయాలి. మొదటి భాగంలో ‘ఓం‘ అనీ, రెండవ భాగంలో ‘నమశ్శివాయ’ అనీ, మూడవభాగంలో ‘సిద్ధం నమః‘ అనీ వ్రాయాలి. శిశువును కుడితొడమీద కూర్చోపెట్టుకుని, తండ్రి, ఆ శిశువుచేత ఆ అక్షరాలను మూడుసార్లు దిద్దించాలి.
11. ఉపనయనం
అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడంతో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ జన్మ ఎత్తినట్లవుతుంది. అందుకే వడుగు అయిన వటువును ద్విజుడు అంటారు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెండవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ, వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది.
ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనానికి తగిన వయస్సు: బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు; క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు; వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు.
ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం అంటే జింక చర్మం, దండం కూడా ఉపనయనమప్పుడు ఇచ్చేవారు. ఉపనయనంతో వ్యక్తి అతి పవిత్రము, శక్తివంతము అయిన గాయత్రీ మంత్రాన్ని తండ్రి తన కొడుకు చెవిలో ఉపదేశిస్తాడు. ఉపనయన సమయంలో వటువు సూర్యునివైపు చూస్తుండగా, ఆ బాలునికి బలం, తేజస్సు, దీర్ఘాయుష్షు, పవిత్రత కలగాలని భావిస్తూ, గురువు ఈ సంస్కారం నిర్వహస్తారు.
12. వేదారంభం
అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది. రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది, నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది అని పిలువబడతారు.
13. కేశాంత
అబ్బాయికి పదాహారేళ్ళ వయసు వచ్చాక మొదటిసారి గడ్డం తీసుకోడానికి సంబంధించిన సంస్కారాన్ని ‘కేశాంత’ అంటారు. అంటే పెద్దవాడు అవుతున్నాడు అనేందుకు సూచన. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.
14.సమావర్తనం
అప్పట్లో విద్యాభ్యాసం ముగించుకుని గురుకులాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నిర్వహించే సంస్కారాన్ని ‘సమావర్తనం’ లేదా స్నాతకము అని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తిస్తారు. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.
అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్థోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. సమావర్తనతో విద్యాభ్యాసం ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చిన యువకుని ముందర రెండు మార్గాలుంటాయి. ఉద్యోగం చేస్తూ, ధనం సంపాదించి, పెండ్లి చేసుకొని గృహస్థ జీవితం గడపడం., లేదా గడించిన జ్ఞానంతో భౌతిక, మానసిక సంబంధాలకు దూరంగా, జపతపాలతో ఆధ్యాత్మిక జీవితం గడపడం. మొదటి మార్గం అనుసరించేవారిని ఉపకుర్వనులు అని, రెండవ మార్గంలో ఉన్నవారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం అనుసరించాలన్నా గురువు అనుమతి తప్పని సరి.
15. వివాహం
హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఆఖరిక్షణం వరకూ ఆమెతోనే కలసి బతకాలన్నది శాస్త్రవచనం. ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ప్రాంతాలనుబట్టి, కులాలనుబట్టి చిన్నచిన్న మార్పులుంటాయి. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి, భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది.
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.
16. అంత్యేష్టి
ఇక మానవుని జీవితంలో ఆఖరుగా జరుపబడే సంస్కారం ‘అంత్యేష్ఠి’. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి. ఇది మానవశరీరాన్ని అగ్ని మొదలైన పంచభూతాలకు హవిస్సుగా అర్పించే పరమ పవిత్రమైన సంస్కారంగా శాస్త్రాలు పేర్కొన్నాయి.
కుమారులు, బంధువులు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం పోస్తారు. శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో పాడెను ప్రత్యేకంగా తయారుచేయిస్తారు. శవాన్ని దానిమీదికి చేర్చి శ్మశానం వరకుతీసుకువెళ్తారు. మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ ఈ అంతిమయాత్రలో పాల్గొంటారు. వేద మంత్రాల మధ్య కొడుకుతో తలకొరివి పెట్టిస్తారు. పదమూడు రోజుల కర్మకాండ అయ్యాక అన్న సంతర్పణ చేయడంతో ఈ సంస్కారం పూర్తవుతుంది. చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం అంటే నీళ్ళు సమర్పిస్తారు. ఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.
గృహస్థు పాటించాల్సిన సంస్కారాల గురించి మనకు మన ప్రాచీన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈ సంస్కారాలు పాటించడం ద్వారా మనిషి సంస్కారవంతుడు అవుతాడు. ఏవిధంగా అయితే మట్టిలో, ఇతర ఖనిజ లవణాలతో కలిసిపోయి, దాదాపుగా మట్టిలాగే దొరికిన బంగారం సంస్కరించబడి, అనుభవయోగ్యమైన సువర్ణంగా, ఆభరణాలుగా మారుతుందో, అలాగే మనిషి కూడా సంస్కారాలు పాటించడంద్వారా ఉన్నతమైన జీవన విధానాన్ని, పరిపక్వమైన మానసికస్థితిని పొందుతాడు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


