సహస్ర చంద్ర దర్శనం

Sahasra Chandra Darshanam celebration with 1000 full moons

సహస్ర చంద్ర దర్శనం

మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన, సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కారాలలో ఒకటి సహస్ర చంద్ర దర్శనం. దీన్నే శతాభిషేకం, సహస్ర పూర్ణ చంద్రోదయం,చంద్ర రథారోహణం అని కూడా అంటారు.

దూరమైన బంధువుల్ని, మర్చిపోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి, వారి సమక్షంలో చేసుకునే వేడుక ఇది.  సహస్ర చంద్ర దర్శనం అనేది దంపతులకు లేదా ఒక్కరికి – మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుషు కోసం నిర్వహించే ముఖ్యమైన శాంతి కార్యం. ఈ కార్యక్రమం ఒక వ్యక్తి తన జీవిత కాలంలో వెయ్యి పూర్ణ చంద్రులను చూసినప్పుడు  బంధువులందరూ కలిసి ప్రేమతో కృతజ్ఞతతో నిర్వహించే ఒక వేడుక. 29.53 రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది. ఏడాదికి 12 పౌర్ణముల చొప్పున 82 ఏళ్లకు పైగా జీవించిన వ్యక్తి తన జీవిత కాలంలో 1000 పౌర్ణములను చూస్తాడు.

ఈ వేడుకను 82 లేదా 83 వ ఏట నిర్వహిస్తారు. దంపతులు ఉంటే దంపతులకు లేక ఒకరు ఉంటే ఒక్కరితో ఈ వేడుకను జరుపుకుంటారు. ఆనాటి ఉదయం తలస్నానం చేసి, నూతన వస్త్రాలు ధరిస్తారు. తర్వాత వారిని కూర్చోబెట్టి కుమారులు కుమార్తెలు, అల్లుళ్ళు కోడళ్ళు మనవళ్లు, మునిమనవళ్ళు అందరూ వారికి పాదపూజ చేసి నమస్కరిస్తారు. పువ్వులు, పళ్ళు, బట్టలు పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అభిషేకం చేయిస్తారు. స్తోమతను బట్టి బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేసి కానుకలు పంచుతారు.

ఈ రోజున అభిషేకము, పూజలు, జపము, హోమములు నిర్వహిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. బంగారు నిచ్చెన, గొడుగు, తులసి దళాలు, పాదరక్షలు, ధనము, చెంబు, గంధపు చెక్క, ఆవుదూడ, దశ దానములు బ్రాహ్మణులకు దానం ఇస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక- దంపతులను పక్క పక్కన కూర్చోబెట్టి తల మీద జల్లెడ పెట్టి పూలు పసుపు కుంకుమ కలిపిన నీళ్లతో మంగళ స్నానాలు చేయిస్తారు. తర్వాత తులాభారం కార్యక్రమం నిర్వహిస్తారు.

పూలతో అలంకరించిన త్రాసు మీద ఒకవైపు దంపతులలోని భర్తను కూర్చోబెడతారు. ఇంకొక వైపు ఆయన బరువు ఎంతో అంత బెల్లాన్ని తూకం వేస్తారు. ముత్తైదువులు గోధుమపిండితో 81 దీపాలను తయారు చేస్తారు. ఒక పెద్ద పళ్ళెంలో ఈ 81 దీపాలను వృత్తాకారంలో ఉంచి వారి ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం ప్రార్థిస్తారు. ఈ కార్యక్రమం ముగిసాక అందరూ వేడుకగా అద్దంలో చంద్రుని దర్శిస్తారు. మనిషి జన్మించిన 50 సంవత్సరాల తర్వాత వారి ఆరోగ్యం నెమ్మదిగా బలహీన పడటం ప్రారంభిస్తుంది. దానికి తోడు గ్రహ స్థితి, గృహ స్థితి వారికి అనుకూలంగా లేకపోతే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వస్తాయి.

అందుకే పెద్దలైన వారికి బంధువులందరూ కలిసి అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుల వద్ద వారి జాతక పరిశీలన చేయించి దానికి తగ్గట్టు హోమాలు శాంతులు జపాలు చేయించాలి. చివరిగా ఒక మాట. పెద్దల జ్ఞానం వారి జీవితానుభవం పిల్లలకు వారి కష్టాలలో మార్గం నిర్దేశం చేస్తుంది. జీవితాంతం మన కోసం కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి మనల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వారి పట్ల మన ప్రేమ, ఆదరణ, కృతజ్ఞత చూపించడానికి ఈ వేడుక ఒక చక్కని అవకాశం.

మీ ఇంట్లో పెద్దవారికి ఎవరికైనా ఈ వేడుక నిర్వహించారా? నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.

 
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి చూడండి 👇👇👇👇
Sahasra Chandra Darshanam celebration with 1000 full moons
 

 
 
 
 
 
🙏 Spread the devotion - Share now
Tags: , , , , , , , ,