google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

తెలంగాణలో ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగలో అమ్మవారికి బోనం సమర్పిస్తున్న మహిళలు

బోనాల పండుగ

బోనాల పండుగ

ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సందడి ప్రారంభమవుతుంది. బోనాల పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సుమారు 16 రోజుల పాటు జరుపుకుంటారు. సికింద్రాబాద్ జంట నగరాల్లోనూ, తెలంగాణ మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నివసించే హిందువుల అతి పెద్ద పండుగ బోనాలు.

హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవం ముందుగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళి దేవాలయంలో ప్రారంభమై, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో ఉన్న అక్కన్న–మాదన్న మహంకాళి దేవాలయం, లాల్‌దర్వాజాలోని మహంకాళి అమ్మవారి దేవాలయం మొదలైన ప్రధాన దేవాలయాల్లో మంగళ, గురువారాల్లో విశేషంగా జరుపుతారు.

గోల్కొండ మహంకాళి దేవాలయం తానీషా కాలంలో అక్కన్న–మాదన్నల చేత నిర్మించబడింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం 1815లో నిర్మించబడింది.

తెలంగాణ ఆడపడుచులు పట్టు చీరలు ధరించి, పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన కొత్త కుండను తలపై మోస్తూ, డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజుల నృత్యాలతో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పిస్తారు. “బోనం” అంటే భోజనం అని అర్థం. దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం.

ఆషాఢ మాసంలో వచ్చే వరదలు, అంటువ్యాధుల నుంచి కాపాడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ వంటి గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకోవడమే బోనాల పండుగ ప్రధాన ఉద్దేశ్యం. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు రోగాల బారిన పడకుండా క్షేమంగా ఉండాలని బోనం సమర్పిస్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న బతుకమ్మతో పాటు బోనాలను కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

ఒక కథనం ప్రకారం, బ్రిటిష్ పాలన సమయంలో సురటి అప్పయ్య అనే వ్యక్తి ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలో భాగ్యనగరంలో వ్యాధులు వ్యాపించి వేలాది మంది మరణించారు. ఉజ్జయిని అమ్మవారిని ప్రార్థించి, వ్యాధి తగ్గితే ఆలయం నిర్మిస్తామని మొక్కుకున్నాడు. తరువాత వ్యాధి తగ్గడంతో 1815లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించారు.

మరో కథనం ప్రకారం, ఒకసారి మూసీ నది పొంగి నగరంలో ప్రాణనష్టం సంభవించింది. ఆ విపత్తు తగ్గాలని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవం విశేషంగా కొనసాగుతోందని చెబుతారు.

బోనాల పండుగ ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యపరమైన ప్రాముఖ్యత కూడా కలిగి ఉంది. వేపాకు ఔషధ గుణాలు కలిగి ఉండి, అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. కుంకుమ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఊరేగింపుల్లో వేయే గుగ్గిలం, సాంబ్రాణి పొగ క్రిమికీటకాలను దూరం చేస్తుంది.

బోనాల పండుగలో ఘటం, బోనం, వేపాకు సమర్పణ, ఫలహారం బండి, పోతురాజు విన్యాసం, రంగం, బలి, సాగనంపు వంటి ప్రత్యేక ఘట్టాలు ఉంటాయి.

ఘటం అంటే కలశం. దానిని అమ్మవారిలా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్తారు. చివరగా నయాపూల్ వద్ద మూసీ నదిలో ఘటాన్ని నిమజ్జనం చేస్తారు.

పోతురాజును అమ్మవారి సోదరుడిగా భావిస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి, శరీరమంతా పసుపు పూసుకుని, చేతిలో కొరడాతో నృత్యం చేస్తూ ఊరేగింపులో ముందుంటాడు.

చివరి రోజు జరిగే “రంగం” కార్యక్రమంలో ఒక స్త్రీ అమ్మవారి ఆవాహనతో భవిష్యవాణి చెబుతుందని నమ్మకం. దేశ పరిస్థితులు, వ్యవసాయం, వర్షాలు మొదలైన అంశాలపై ఆమె ద్వారా అమ్మవారు సందేశం ఇస్తారని విశ్వసిస్తారు.

బలి కార్యక్రమంలో నేడు జంతుబలి నిషేధం కారణంగా కూరగాయలను పగలగొట్టి ప్రతీకాత్మకంగా బలి ఇస్తున్నారు.

చివరగా అమ్మవారి చిత్రపటాన్ని అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లి, ఘటాన్ని మూసీ నదిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top