భారతీయ సంస్కృతిUncategorizedDay 1 Thiruppavai paasuralu meaning in telugu | Dhanurmasam | Tiruppavai in Telugu |
Day 1 Thiruppavai paasuralu meaning in telugu | Dhanurmasam | Tiruppavai in Telugu |
December 16, 2025
|
Aparna
తిరుప్పావై పాశురాలు తెలుగులో అర్ధం
గోదాదేవిగా జన్మించిన ఆండాళ్- శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలపుతో ధనుర్మాసంలో సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, ఒక్కో రోజు ఒక్కో పాశురం చొప్పున 30 రోజులు గానం చేసి, భోగిరోజున ఆండాళ్- శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ తిరుప్పావై లో 30 పాశురాలు ఉంటాయి. ఈ పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని ఆరాధించమని సూచిస్తాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని ఈ వ్రతం చేయడానికి సిద్ధం చేస్తుంది. గోదాదేవి రచించిన ఈ తిరుప్పావై- ఆళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.
ఈరోజు నుండి ధనుర్మాసం ప్రారంభం. ఈ సందర్భంగా తిరుప్పావైలోని పాశురాలను, వాటి అర్థాలను ఈరోజు నుండి తెలుసుకుందాం.
భావం: రకరకాలైన మెరిసే బంగారపు ఆభరణములను సింగారించిన యువతుల్లారా, సిరి సంపదలతో సమృద్దిగా నిండిన వ్రేపల్లెలో, ఐశ్వర్యవంతురాలైన ఆ లక్ష్మీదేవి వలె కళకళలాడే యువతుల్లారా, రండి. మనము విరహ వేదనలో కొట్టుకొని పోకుండా, ఆ కృష్ణుడిలో లీనమయ్యే వ్రతమును ఆచరించడానికి కావలసినట్లుగా, మన మనస్సు, మన శరీరము పావనము అయ్యేట్టుగా స్నానము చేద్దాము రండి. మార్గశిర మాసములో, శుక్ల పక్షములో, ఆకాశములో నిండు చంద్రుడు తన తెల్లని, చల్లని పండు వెన్నెలను వెదజల్లే శుభదినములలో, పదునైన బల్లెముతో ధేనుకాసురుడు వంటి క్రూరరాక్షసులను శిక్షించిన స్వామికి, గోప కుల రాజు అయిన నందగోపుడి ముద్దుల కొడుకుకి పూజ చేద్దాము రండి. విశాలమైన కన్నులు కలిగిన సౌందర్యవతి ఆ యశోదాదేవికి గారాల ముద్దుబిడ్డడు, గంభీరమైన సింహపు పిల్ల వంటి హుందా కలిగిన నల్లని శ్రీకృష్ణుడికి, సూర్య చంద్రుల వంటి దివ్య నేత్రములు కలిగిన స్వామికి, అన్ని లోకములలోని వారందరూ ఎన్నో రకాల ప్రయోజనాలను ఆశిస్తూ పూజించే ఆ భగవంతుడికి, ఎంతో గొప్ప పురుషార్థమైన ఆ పరమ పద మోక్షమును పొందడానికి పూజించే ఆ శ్రీమన్నారాయణుడికి, కోరిన కోరికలను తీర్చే ఆ శ్రీకృష్ణుడికి, అందరము కలిసి పూజ చేద్దాము రండి” అంటూ ఆండాళ్, గోపికలను పిలుస్తోంది.
ఈ విషయాన్ని వీడియో రూపంలో చూడాలంటే, క్రింది వీడియో చూడండి.👇👇👇👇