kalki avataram in kaliyugam

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది

కలియుగం చివర్లో ప్రపంచం ఎలా ఉంటుంది

ద్వారక నీటిలో మునిగి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత నుంచే కలియుగం ప్రారంభమైంది. సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపరయుగంలో రెండు పాదాలపై నడిచింది. కలియుగంలో ధర్మం రోజు రోజుకీ క్షీణిస్తూ చివరకు ధర్మం అనే మాటే వినిపించని స్థితి వస్తుంది. అప్పుడు శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో చక్రం పట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను సంహరిస్తాడని పురాణాల్లో పేర్కొన్నారు.

మరి కల్కి భగవానుడు ఎప్పుడు అవతరిస్తాడు? ఎవరిని సంహరిస్తాడు? కల్కి అవతారం వచ్చే ముందు భూమిపై కనిపించే లక్షణాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.కల్కి పురాణం, బ్రహ్మాండ పురాణం, పద్మ పురాణం వంటి గ్రంథాలలో కల్కి అవతారం గురించి వివరాలు ఉన్నాయి. భాగవతంలోని ద్వాదశ స్కంధం రెండవ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. దుష్టశిక్షణ కోసం మహావిష్ణువు అనేక రూపాలలో అవతరిస్తాడు. మహావిష్ణువు అంశంగా కల్కి అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

ఒక మన్వంతరంలో 71 చతుర్యుగాలు ఉంటాయి. ప్రతి చతుర్యుగంలో సత్య, త్రేతా, ద్వాపర, కలి యుగాలు ఉంటాయి. ప్రస్తుతం మనం 28వ చతుర్యుగంలోని కలియుగంలో ఉన్నాం. శ్రీకృష్ణుడు అవతారం సమాప్తి చేసిన వెంటనే కలియుగం ప్రారంభమై ఇప్పటికి సుమారు ఐదు వేల సంవత్సరాలు గడిచాయి. కలియుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది. అందువల్ల కల్కి అవతారం రావడానికి ఇంకా దాదాపు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి.

కల్కి అవతారం ముందు భూమిపై కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. దైవపూజ ఉండదు. యజ్ఞయాగాదులు జరగవు. గోవులను హింసిస్తారు. వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది. భార్యాభర్తల మధ్య గౌరవం ఉండదు. తల్లిదండ్రులను గౌరవించరు. మనుషుల ఆయుర్దాయం చాలా తగ్గిపోతుంది. వర్షాలు సరిగా కురవవు. పంటల్లో పోషక విలువలు ఉండవు. వ్యాధులు విపరీతంగా పెరుగుతాయి. చిన్న వయసులోనే స్త్రీలు గర్భం ధరిస్తారు. ప్రజలు శరీరమంతా పుండ్లతో బాధపడతారు. మహిమాన్వితమైన ఔషధాలు కూడా పనిచేయవు. అనేక మంది వ్యాధులతో మరణిస్తారు.

ధనవంతులైనవారే గౌరవింపబడతారు. అర్హత లేకపోయినా అధికారంలో ఉంటారు. రాజులు దొంగలవలె ప్రవర్తిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలు లుప్తమవుతాయి. ఆధ్యాత్మికతకు విలువ ఉండదు. ఒకరిపై ఒకరు వైరం పెంచుకుని ప్రాణాలు కోల్పోతారు. వ్యభిచారం, దొంగతనం పెరుగుతాయి. ప్రజలు అడవుల్లో దుంపలు, పండ్లు తింటూ జీవిస్తారు. కరువు, చలి, ఎండ, ఆకలి బాధలతో జీవనం సాగిస్తారు.

అటువంటి కాలంలో కల్కి భగవానుడు శంభల గ్రామంలో విష్ణుయశుడు, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో జన్మిస్తాడు. చిన్న వయసులోనే పరశురాముని వద్ద శస్త్ర విద్యలను అభ్యసిస్తాడు. మహాశివుని అనుగ్రహంతో దివ్యాయుధాలు పొందుతాడు. దేవదత్తం అనే తెల్లని గుర్రాన్ని అధిరోహిస్తాడు. నందకం ఖడ్గం, సుదర్శన చక్రం వంటి ఆయుధాలను ధరించాడని పురాణాలు చెబుతున్నాయి.

తన ముప్పై రెండవ ఏట ధర్మస్థాపన కోసం యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. దుర్మార్గులను, అధర్మ పరులను సంహరిస్తాడు. భూమిపై కొద్దిమంది ధర్మవంతులను మాత్రమే మిగుల్చుతాడు. అనంతరం గంగా–యమునా మధ్య ప్రాంతంలో నివసించి ధర్మాన్ని స్థాపిస్తాడు. సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో సంచరించే సమయంలో కృతయుగం ప్రారంభమవుతుంది.

కల్కి అవతారం సమాప్తి తర్వాత సప్తఋషులు భూమిపై ప్రత్యక్షమై ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానం బోధిస్తారు. ధర్మం మళ్లీ నాలుగు పాదాలతో స్థిరపడుతుంది. పంచాంగ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో కల్కి జయంతిని జరుపుకుంటారు. కల్కి అవతారాన్ని పూజించడం, స్మరించడం వలన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top