
కాకభూషుండి
కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ రామచరితమానస్ అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే రచింపబడిన ఒక పురాణ కావ్యం. దీనిని తులసిదాస్ రామాయణం అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మతంలోని గొప్ప రచనలలో ఒకటిగా పరిగణిస్తారు. ఇందులో మొత్తం ఏడు కాండలు ఉంటాయి. చివరిదైన ఉత్తరకాండలో కాకభూశుండి ప్రస్తావన ఉంటుంది. శివుడు పార్వతీ దేవికి రామాయణ గాధని వివరిస్తూ తాను ఈ కథని రామభక్తి పరాయణుడైన కాకభూశుండి వద్ద విన్నానని ఈ రామాయణ గాధని కాకభూశుండి గరుత్మంతుడికి మధ్య జరిగిన సంభాషణగా వివరిస్తాడు. అప్పుడు పార్వతీ దేవి మహాశివుడితో ధర్మపరాయణులు, జ్ఞానులు, మునులు, బ్రహ్మజ్ఞానం పొందిన వారు కూడా శ్రీరామ భక్తిలో అంతగా లీనం అవ్వడం అరుదు. అలాంటిది అల్ప ప్రాణి అయిన ఒక కాకి రూపంలో ఉన్న కాకభూశుండి కి అంతటి రామ భక్తి, రామ అనుగ్రహం ఎలా కలిగింది? అంతటి రామ భక్తుడికి కాకి రూపం ఎలా వచ్చింది? శ్రీరామ చరిత్రను ఎవరి నుండి పొందాడు? దాన్ని మీరు ఎలా విన్నారు? అని అడిగింది.
అసలు గరుత్మంతుడే గొప్ప జ్ఞాని, శ్రీహరి వాహనము. ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఆయన ఋషులను, మునులను వదిలి కాకభూశుండి వద్ద ఈ కథను ఎందుకు విన్నాడు తెలపండి? అని అడిగింది. అప్పుడు మహాదేవుడు ఇలా చెప్పాడు. దక్ష యజ్ఞంలో అవమానించబడి ప్రాణత్యాగం చేసిన పార్వతిని చూసి క్రోధముతో మహాశివుడు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి విరక్తుడై అరణ్యాల వెంట పర్వతాల వెంట తిరుగుతూ నీలగిరి పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఎంతో అందమైన ఆ పర్వతం మీద కాకభూశుండి నివసిస్తూ ఉండేవాడు. ఆయన ఎంతో తన్మయత్వంతో శ్రీరామ కథని బోధిస్తూ ఉండేవాడు. ఆ కథ వినడానికి అక్కడికి రకరకాల పక్షులు గుమిగూడేవి. శివుడు కూడా హంస రూపాన్ని ధరించి శ్రీరామ కథను శ్రద్ధగా విని కైలాసానికి చేరాడు. త్రేతా యుగంలో రామ రావణ యుద్ధ సమయంలో రావణుని కుమారుడైన మేఘనాథుడు నాగపాశం విసరగా శ్రీరాముడు లక్ష్మణుడు ఆ పాశానికి కట్టుబడ్డారు.
అప్పుడు నారదుని సూచన మేరకు సర్పాలకు శత్రువైన గరుత్మంతుడు వెళ్లి వారి బంధనాలను తొలగించాడు. కానీ ఆయన మనసులో చాలా సందేహాలు ఏర్పడ్డాయి. శ్రీరామ నామాన్ని జపించడం చేతనే మనుషులు భవబంధాల నుండి విముక్తులు అవుతారు. అంతటి మహిమాన్వితమైన శ్రీరాముడు ఒక రాక్షసుడు వేసిన పాశానికి కట్టుబడడం గరుడుని ఆశ్చర్యానికి గురిచేసింది. కలత చెందిన వాడై నారద మహర్షి దగ్గరికి వెళ్లి తన మనసులోని సందేహాన్ని ఆయనతో చెప్పాడు. ఆయన బ్రహ్మ దేవుని దగ్గరికి బ్రహ్మ శివుని దగ్గరికి వెళ్ళమని చెప్తారు. శివుడు కుబేరుని దగ్గరకు బయలుదేరుతూ ఉండడం వల్ల గరుడుని నీలగిరి పర్వతం పైన నివసించే కాకభూశుండి దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. అక్కడ నీలగిరి పర్వతం మీద పక్షులన్నీ గుమిగూడి ఉండగా శ్రీరామచరితాన్ని కాకభూశుండి వివరిస్తూ ఉన్నాడు. గరుత్మంతుని రాకను చూసి ఆనందించి అతిధి సత్కారాలు చేసి రాకకు కారణం ఏమిటి అని అడిగాడు.
కాకభూశుండి దర్శనం చేతనే ఎంతో జ్ఞానాన్ని, సంతోషాన్ని పొందిన వాడైన గరుడుడు శ్రీరామచంద్రుని వృత్తాంతాన్ని వివరించమని కోరాడు. అప్పుడు ఆయన సంతోషించి గరుడునికి సంక్షిప్త రామాయణాన్ని ఉపదేశించాడు.
అది విన్న గరుడుడు యుగ ధర్మాన్ని అనుసరించి శ్రీరాముడు ప్రవర్తించిన తీరును ఆయన అవతార పరమార్థాన్ని అర్థం చేసుకున్నాడు. తర్వాత గరుడుడు కాకభూశుండితో ఇంతటి జ్ఞానవంతులు రామ భక్తులు అయిన మీరు ఈ కాకి రూపంలో ఉండడానికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన తన పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించాడు.
ఒకప్పుడు అయోధ్య నగరంలో శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి రాముడు అంటే ద్వేషం. మహాశివుడు మాత్రమే పరమ దైవం అని నమ్మేవాడు. అతని గురువు శివుడు కూడా రాముని ఆరాధిస్తాడని ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమని నీ ఆలోచనని శివుడు కూడా మెచ్చడని చెప్తాడు. కానీ అది బ్రాహ్మణునికి నచ్చేది కాదు. గురువును అగౌరవ భావంతో చూసేవాడు. ఒకరోజు శివాలయంలో కూర్చొని ఉన్నప్పుడు గురువు రాకను గమనించి కూడా లేచి నమస్కరించకుండా అమర్యాదగా ప్రవర్తించాడు. గురువుగారు శిష్య వాత్సల్యంతో క్షమించినా ఆ శివుడు మాత్రం క్షమించలేదు.
అతన్ని వెయ్యి జన్మలు నీచ ప్రాణులుగా జన్మించమని శపించాడు. అప్పుడు గురువుగారు శివునికి నమస్కరించి శాప ప్రభావాన్ని తగ్గించమని వేడుకున్నాడు. తన శిష్యునిపై ఉన్న ప్రేమకు సంతోషించిన భగవంతుడు అన్ని జన్మలలో పూర్వజన్మ స్మృతులు ఉండేలా శ్రీరామ భక్తునిగా జీవించమని అనుగ్రహించాడు. వెయ్యి పునర్జన్మలు పొందిన తర్వాత అతను భూషుండి అనే బ్రాహ్మణుడిగా జన్మించాడు.
ఒకసారి లోమశ మహర్షి ఆశ్రమానికి చేరుకొని శ్రీరాముని గురించి తెలియజేయమని కోరాడు. అప్పుడు ఆ ఋషి శ్రీరాముని సద్గుణాలను వివరించి చివరికి దేవుడు నిరాకారుడని నిరాకారుడైన నిర్గుణుడైన భగవంతుని ఆరాధించడమే ముక్తికి మార్గమని ఉపదేశించాడు. కానీ అది భూశుండికి నచ్చక రాముని గురించి మాత్రమే బోధించమని పదే పదే ఆ లోమస మహర్షితో విభేదించాడు. దాంతో ఆయనకు కోపం వచ్చి కాకి ఆకారం పొందమని శపించాడు. అప్పుడు భూషుండి కాకిలా మారిపోయాడు. ఆ తర్వాత పశ్చాత్తాప పడిన లోమశ మహర్షి భూషుండి రామ భక్తికి ఆనందించి శ్రీరామ తత్వాన్ని బోధించి ఎప్పటికీ నీవు రామ భక్తుడిలా ఉంటావని ఆశీర్వదించాడు. అప్పటి నుండి ఆయన కాకభూశుండి అయ్యాడు. కాకి రూపంలో ఉన్న సమయంలో అయోధ్యకు చేరి బాలరాముడిని కలుసుకుంటాడు.
రాముని బాల్య చేష్టలు చూస్తూ మురిసిపోతూ ఉండగా స్వామి వారి నోట్లో నక్షత్ర మండలాలను ఎన్నో కల్పాంతాలను బ్రహ్మాండాన్ని అనంత విశ్వాన్ని చూసి రాముడు ఎంతటి బ్రహ్మాండ నాయకుడో పురాణ పురుషుడో అర్థం చేసుకొని శ్రీరాముని శరణు వేడుతాడు. భగవంతుడు చిరునవ్వుతో కాకభూశుండిని ఏం కావాలో కోరుకోమన్నప్పుడు తనకి రామునిపై నిరంతరం భక్తి ఉండేలా వరం ప్రసాదించమని కోరుకున్నాడు.
అతని భక్తికి అంకిత భావానికి సంతోషించిన రాముడు కాలం అతన్ని చంపలేదని అతడు కల్పాలకు యుగాలకు అతీతంగా ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాడని ఒక యుగం నుండి వేరొక యుగంలోకి అతను తన ఇష్ట ప్రకారం ప్రయాణించవచ్చని ఆశీర్వదిస్తాడు. అందుకే ఆయన్ని పురాణ కాలంలోనే టైం ట్రావెల్ చేసిన వ్యక్తిగా వర్ణిస్తారు. యుగాలు మన్వంతరాలు మరియు కల్పాల చక్రం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి.
కాకభూషుండి లాంటి చిరంజీవులు ఈ కల్పాలకు మన్వంతరాల మార్పుకు అతీతంగా జీవిస్తారు. ఒక కల్పంలో కలియుగం ముగిసినప్పుడు ప్రకృతి యొక్క కొత్త చక్రం ప్రారంభం అవుతుంది. కాలానికి యుగాలకు అతీతంగా జీవించగల వరం చేత కల్పాంతాలలోని ప్రళయాలను కూడా తట్టుకొని కాకభూశుండి జీవించగలిగాడు. అందుకే ఆయన రామాయణాన్ని 11 సార్లు మహాభారతాన్ని 16 సార్లు వివిధ ఫలితాలతో చూడగలిగాడు. శ్రీరాముడు వివిధ కల్పాలలోని త్రేతాయుగాలలో భూమిపై అవతరించినప్పుడల్లా కాకభూశుండి ఎగిరి అయోధ్యకు చేరుతాడు. అక్కడ ఐదు సంవత్సరాలు ఉండి బాలరాముని అల్లరి చేష్టలు చూస్తూ సంతృప్తి చెందుతాడు. భగవంతుని నవ్వుతూ భగవంతుని నవ్వులతో పరమానందం పొంది ఎప్పుడూ కాకి లాగా ఆయనను దర్శించాలి అని కోరుకుంటాడు. కాకి రూపంలోనే అపారమైన శ్రీరామ భక్తిని మోక్ష మార్గాన్ని తెలుసుకున్నందున కాకభూశుండి ఎప్పుడూ కాకి రూపంలోనే ఉండాలని కోరుకుంటాడు. అతన్ని ఎప్పుడూ శాశ్వతంగా జీవించి ఉండేలా శ్రీరాముడు వరం ఇచ్చాడు. ఈ విధంగా విష్ణు వాహనమైన గరుడు సర్వోన్నత పరమాత్ముడైన శ్రీరాముని గురించి తెలుసుకొని ఎంతో భక్తితో ఆనందంతో అక్కడి నుండి వైకుంఠం చేరుతాడు. కల్పాలు యుగాల గురించి తేలికైన వివరణ ఇప్పుడు చూద్దాం. ఒక కల్పం అంటే విశ్వచక్రం 4.32 మిలియన్ సంవత్సరాలు. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మకు 12 గంటలు. ఒక కల్పంలో 14 మన్వంతర చక్రాలు ఉంటాయి. ఒక మన్వంతర చక్రంలో 71 యుగ చక్రాలు ఉంటాయి.
ఒక యుగ చక్రంలో నాలుగు యుగాలు. అంటే కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగాలు ఉంటాయి. కాకభూషుండి ఋషి వాక్కుల ప్రకారం పరమాత్మునికి శరణాగతి చేయడమే మోక్షాన్ని పొందే మార్గం. సకల గుణ సంపన్నుడైన ఆ శ్రీరాముని ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాను.
జై శ్రీరామ్.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకే ఈ క్రింది లింక్ ఓపెన్ చేయండి.