అబ్బాయిలకు పెళ్లి ఆలస్యమవుతోందా? అయితే ఇలా చేసి చూడండి
భారతీయ సంస్కృతికి స్త్రీల కల్యాణ ప్రాప్తికి రుక్మిణి కల్యాణం ఉన్నట్టే మగవారికి శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణం అద్భుతమైన పరిష్కారం. దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణములు చూసిన, చదివిన, విన్న వారికి వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాక సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని అంటారు. పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.
వివాహ సమస్యలు ఉన్న మగవారు శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణం 41 రోజులు భక్తి, శ్రద్ధ, విశ్వాసములతో పారాయణం చేసి ప్రతిరోజు తమ స్వహస్తాలతో స్వామివారికి ఏదైనా నివేదన చేసి, ప్రతిరోజు శ్రీ సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేసి గోత్రనామాలతో అర్చన చేయించుకోవాలి. చెప్పే సమయంలో వివాహ దోష పరిహారార్థం అని చెప్పి స్వామిని దర్శించుకుంటే వివాహ దోషాలు పరిష్కరించబడతాయి. స్వామివారి అనుగ్రహం వలన శుభం కలుగుతుంది. నివేదనగా మీ శక్తిమేరకు పాలల్లో చక్కెర కలిపి నివేదించవచ్చు. అటుకులు, బెల్లం కలిపి నివేదించవచ్చు. పండ్ల ముక్కలు చేసి పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి కలిపి నివేదించవచ్చు. ఇవే కాదు, మీ శక్తిమేరకు ఏదైనా నివేదించవచ్చు.
మొదటగా సుబ్రహ్మణ్యం చరిత్ర, శ్రీ వల్లి కళ్యాణం మరియు శ్రీ దేవసేన కళ్యాణం పారాయణ చేయాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం, శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామాలు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం చదవడం ఎంతో శ్రేయస్కరం. భక్తి, శ్రద్ధ, విశ్వాసం మాత్రమే ధరించి ఆలోచించవద్దు. అనుమానం, ఆందోళన వద్దు. ఎవరు చేస్తే వారికి ఉత్తమ ఫలితం శీఘ్రంగా కలుగుతుంది. తప్పక శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలిగి త్వరలోనే వివాహం జరుగుతుంది.
శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర: కుమారస్వామి శివపార్వతుల తనయుడు, వినాయకుని సోదరుడు, దేవతల సైన్యాధిపతి. ఈయనకే స్కందుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈయన వాహనం నెమలి.
తారకాసురుని బారి నుండి రక్షణ పొందడానికి దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు. తారకాసురుడు అమిత బలసంపన్నుడు. అతనిని చంపడం ఎవరి తరమూ కాదు అనే పరిస్థితి ఏర్పడింది. ఈశ్వర తేజం సంభవించిన వాడివల్లే అతనికి మరణం ఉంటుందని, శివపుత్రుడే అతనిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు.
ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి వద్దకు వచ్చాడు. గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును అగ్నిదేవునికి ఇచ్చాడు. దానిని భరించలేక అగ్నిదేవుడు ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెట్టాడు. ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తున్న కృతికా దేవతల గర్భంలో ప్రవేశించింది. ఆ తేజమును వారు భరించలేక పొదలలో విసర్జించారు. అప్పుడు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్య బాలుడు ఉద్భవించాడు. ఈ విధంగా కుమార సంభవం జరిగింది.
దేవతలు ఆనందంతో పొంగిపోయారు. ఆ షణ్ముఖుని కైలాసానికి తీసుకెళ్లారు. గంగా గర్భంలో తేజరూపంలో ఉన్నందున గాంగేయుడు అని, కృతికల వద్ద పెరిగినందున కార్తికేయుడు అని, ఆరు ముఖాలు కలవాడైందున షణ్ముఖుడు అని పిలిచారు. కారణజన్ముడైన ఈ బాలునికి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామి అని నామకరణం చేసి దేవతల సైన్యాధ్యక్షునిగా నియమించారు. పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ప్రసాదించాడు.
సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనంపై ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి రాక్షసులను సంహరించడానికి సిద్ధమయ్యాడు. భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించాడు.
దేవసేన కళ్యాణం: ఇంద్రుని సంరక్షణలో పెరిగిన దేవసేనను పరాక్రమం, కారుణ్యం కలిగిన వాడికి వివాహం చేయాలని ఇంద్రుడు సంకల్పించాడు. తారకాసుర సంహారం చేసిన కుమారస్వామి పరాక్రమాన్ని చూసి దేవసేనను ఆయనకు అత్యంత వైభవంగా వివాహం చేశాడు.ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్టిగా వ్యవహరిస్తారు. వివాహం చేసిన స్థలాన్ని తిరుపురంగుండ్రం అని పిలుస్తారు.
ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతంపై స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటూ ఉన్న సుబ్రహ్మణ్యుని సన్నిధానానికి వెళ్లారు. భూమిలో తాను చూసిన విశేషాలను చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికి వచ్చారు.
సుబ్రహ్మణ్యునితో ఈ విధంగా చెప్పారు: ఒక మహర్షి తేజస్సు వలన జన్మించిన ఒక పాప అరణ్యంలో ఒక బిళ్ళ నాయకునికి దొరికింది. ఆ పాపను తీసుకువచ్చి అతడు పెంచుకుంటున్నాడు. ఆమె సౌందర్యరాశి. అటువంటి వల్లిని నీ భార్య కావాలని నా కోరిక అన్నాడు.
మాటలు విని సుబ్రహ్మణ్యుడు పిళ్ళ పురానికి వెళ్లాడు. ఆయన వెళ్లడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్లాడు. అతనికి బిళ్ళ రాజు ఎదురువచ్చాడు. పువ్వులు, తేనె, పళ్ళు తీసుకువచ్చి నారదునికి సమర్పించాడు.
నారదుడు బిళ్ళ రాజుతో, నీకు ఒక శుభవార్త చెబుతాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు నీకు కూతురుగా పంపాడు. ఆమెను పెళ్లి చేసుకోబోయే వాడు లోకంలోని ప్రతి స్త్రీ కోరుకునే పరమ సౌందర్యరాశి అయిన శంకరుని తేజస్సును పొందిన వీరుడు, మహాజ్ఞాని, దేవసేనాధిపతి. అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. మీ అదృష్టమే అదృష్టం అన్నాడు.
రాజు నారదుని మాటలు విని చాలా ఆనందపడ్డాడు.
కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లిదేవిని చూసి, బ్రహ్మ తన సృష్టిలోని సౌందర్యమంతా ఒకచోట సమకూర్చి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఇమే’ వల్లి అయి ఉంటుంది. ఈమెతో ఒకసారి మాట్లాడాలి అనుకున్నాడు.
వల్లిదేవి, మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యునితో వివాహం జరుగుతుందని నారదుడు చెప్పాడు. నేను సుబ్రహ్మణ్యునికే చెందిన దానిని. ఆయననే నా భర్తగా కోరుకున్నాను అని చెప్పింది. వెంటనే స్వామి తన నిజరూపాన్ని చూపించాడు. ఆమె ఆనందంతో పొంగిపోయింది.
ఇంటికి వెళ్లిన తర్వాత సుబ్రహ్మణ్యస్వామిని తలుచుకుంటూ ఒక ఉత్తరం రాసి చేలికత్తేతో పంపించింది. సుబ్రహ్మణ్యుడు పుష్పవనంలో ఒక సరోవర ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తెలు అది చూపించగా ఆయన చదివి వల్లిదేవి దగ్గరకు వెళ్లాలని అనుకున్నాడు.
అప్పుడు వల్లిదేవి, వద్దు, నేనే తీసుకొస్తాను అని చెప్పి దేవుని తీసుకువచ్చింది. మళ్లీ కనబడలేదని అందరూ వెతుకుతూ సరోవర ఒడ్డుకు రాగా ఇద్దరూ కనిపించారు. బిళ్ళ నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. వేటగాని వేషంలో ఉన్నాడు. కోపంతో తన పరివారంతో ఆయనపై బాణాలు ప్రయోగించాడు.
సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటన్నింటిని స్వీకరించి వల్లిదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అందరూ కిందపడి స్పృహ తప్పిపోయారు. దేవి తనవాళ్లందరూ పడిపోయారని ఏడ్చింది. అప్పుడు స్వామివారు అనుగ్రహించగానే వారికి మళ్లీ స్పృహ వచ్చి లేచారు.
వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలి వాహనంపై వల్లిదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. అందరూ నేలపై పడి సుబ్రహ్మణ్యునికి సాష్టాంగ నమస్కారం చేశారు.
నారదుడు, దేవసేనతో పాటు పార్వతీ పరమేశ్వరులు అక్కడికి వచ్చారు. వల్లిదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. సంతోషంగా పార్వతీ పరమేశ్వరులు దేవసేనతో కలిసి వివాహం జరిపించారు.
ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తణిలో వెలిశారు. పూజిస్తే మన పాపాలు దగ్ధమవుతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.
పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య స్వామివారి జననం వినడం కొందరికే సాధ్యం. ఎవరు కార్తికేయుని అనుగ్రహం పొందుతారో వారు శ్రేయోలోకాన్ని పొందుతారు. మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో, ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని మరో చేతిలో ధరించి, అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారాలు. శరణు వేడిన వారికి శక్తి, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదిస్తాడు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


