అపారమైన జ్ఞానం, సంపదనిచ్చే హయగ్రీవ స్వామి
శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయులంతా ఆ రోజు రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే విష్ణు అవతారాలలో ఒకటైన హయగ్రీవ జయంతి. జ్ఞానప్రదాత అయిన ఆరోజు హయగ్రీవుని ఆరాధించిన విద్యార్థులకు సకల విద్యలు సిద్ధిస్తాయని అంటారు. హయగ్రీవ స్వామిని జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకు, బుద్ధికి, సకల విద్యలకు దేవుడిగా భావిస్తారు. స్వామి ఎవరు? హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏంటి? ఆ రోజున ఏం చేస్తే స్వామి అనుగ్రహం లభిస్తుంది తెలుసుకుందాం.
లోకాల పాలనకు, ధర్మసంస్థాపనకు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో దశావతారాలు ముఖ్యమైనవి. అయితే దశావతారాలు కాకుండా తన భక్తుల కోసం విష్ణుమూర్తి ఎత్తిన మరో అవతారమే హయగ్రీవ అవతారం.
హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు ఆదిపరాశక్తిని తపస్సు చేసి తనకు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అయితే దేవి అది సాధ్యం కాదని చెప్పినప్పుడు తన ఆకారంతో ఉన్నవారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం పొందాడు. మనిషి శరీరానికి గుర్రపు తల ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడు నమ్మాడు.
హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. విష్ణుమూర్తితో యుద్ధం నిరంతరం కొనసాగింది. దీంతో దేవతలు ఆదిదంపతులను శరణు వేడగా, యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును మేలుకొలిపి ఆయనే హయగ్రీవుని సంహరిస్తారని పార్వతీదేవి చెప్పింది.
శ్రీమహావిష్ణువు తన విల్లు చివర భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. మేలుకొలిపేందుకు శివుడు చెదపురుగుగా మారి విల్లుతాడును కొరికాడు. తాడు తెగిపోవడంతో విల్లు పైకి ఎగిరి విష్ణుమూర్తి తలను వేరు చేసింది. దానికోసం అన్నిచోట్ల వెతికినా ఫలితం లేక దేవతలు ఆదిపరాశక్తిని స్తుతించారు. ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అమర్చమని ఆజ్ఞాపించింది. దేవతలు అలాగే చేసి గుర్రపు తలను అమర్చారు. గుర్రం తల అతికిన విష్ణుమూర్తిలో మళ్లీ జీవం వచ్చి లేచాడు. ఆ రోజు శ్రావణ పౌర్ణమి.
ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. అనంతరం స్వామివారిని లక్ష్మీదేవి శాంతింపజేసింది. అమ్మవారితో సహా దేవతలంతా తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తల గల శ్రీమహావిష్ణువులో నింపారు. అందువల్లే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞానప్రదాతగా పూజించబడుతున్నాడు అని పురాణాలు చెబుతాయి.
హయగ్రీవుడు గా అవతరించిన శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీసమేత హయగ్రీవుని ఆరాధిస్తారో వారికి జ్ఞానసిద్ధి కలిగి అన్ని విద్యలలో రాణిస్తారని, విజయంతో పాటు సంపదలను పొందుతారని సాక్షాత్తు జగజ్జనని పార్వతీదేవి వరమిచ్చింది.
స్వామి తెల్లని మానవ శరీరం, గుర్రం తల, నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. పై రెండు చేతుల్లో శంఖం, చక్రం ఉంటాయి. కింది కుడిచేతిలో జ్ఞానముద్ర, అక్షమాల ఉంటాయి. ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది.
దేవీ పురాణం, స్కాందపురాణం, శ్రీమద్భాగవతం తో పాటు ఆగమ శాస్త్రాలలో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేస్తారు. విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు. అందుకే ఆ రోజు ఆయనను ఆరాధించిన వారికి సకల విద్యలు అబ్బుతాయని, అన్ని ఆటంకాలు తొలగిపోతాయని చెబుతారు.
లక్ష్మీపతి కాబట్టి ఆయన ఆరాధన వల్ల సిరిసంపదలకు కూడా లోటు ఉండదు. జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి. దేవునికి ఏలకులు ప్రీతికరమైనవి. ఏలకుల మాలను ధరింపజేసి, సెనగలు, గుగ్గిళ్లు తయారు చేసి నివేదించాలి. పూలతో పూజించాలి. శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. ఆరోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి.
సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని పొందారని చెబుతారు. హయగ్రీవుని ఆరాధన ఎంత విశిష్టమైనదో కనుకనే కొందరు ప్రత్యేకంగా హయగ్రీవుని ఉపాసిస్తారు. ఇంత నిష్ఠతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు. కాబట్టి హయగ్రీవ జయంతి రోజున అయినా ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజాగదిలో ఉంచి హయగ్రీవ స్తోత్రం లేదా హయగ్రీవ అష్టోత్తర శతనామావళి పారాయణం చేయాలి.
“జ్ఞానన౦ద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవముపాస్మహే” అని చదవాలి. అంటే జ్ఞానం, ఆనందం మూర్తీభవించిన దైవస్వరూపుడు హయగ్రీవుడు; నిర్మల స్ఫటికాకారుడు; సర్వవిద్యలకు ఆధారభూతుడైన విద్యాదేవత హయగ్రీవునికి నమస్కారం అని అర్థం.
విద్యార్థులు హయగ్రీవ స్తోత్రం చదివితే చదువులో ఎంతటి మందబుద్ధి ఉన్న పిల్లలకైనా అద్భుతమైన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుల్లో దూసుకెళ్తారు. విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలు కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యచంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. కాబట్టి ఆయనను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది.
హయగ్రీవుని పూజించిన భక్తులకు విద్య మాత్రమే కాదు, అన్యాయం జరిగిన వారికి న్యాయం జరుగుతుంది. వారి సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. హయగ్రీవ నామం దివ్యశక్తి సంబంధమైనది. ఆ నామాన్ని స్మరించిన వాడు శివస్వరూపుడవుతాడు, పలికిన వాడు విష్ణుస్వరూపుడవుతాడు, వినిన వాడు బ్రహ్మస్వరూపుడవుతాడని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడని పురాణాలు తెలియజేస్తున్నాయి.
అత్యంత మహిమాన్వితమైన హయగ్రీవ స్వామి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం’,హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సమీపంలో వంగపల్లి అనే గ్రామం దగ్గర శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతినెలా శ్రవణ నక్షత్రం రోజున విద్య కోసం పిల్లలకు తేనెతో నాలుకపై బీజాక్షరాలు వేస్తారు. ఆరోజు విశేష పూజలు జరుగుతాయి. దర్శనం ఎవరైనా చేసుకోవచ్చు. అయితే మగవారు పంచె కట్టుకోవాలి. మహిళలు తప్పనిసరిగా చీర కట్టుకుని వెళ్లాలి.
మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో, అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో బస్టాండ్‌కు సమీపంలో కూడా శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయాలు ఉన్నాయి.
వచ్చే శ్రావణ పౌర్ణమి, అంటే రాఖీ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ పిల్లల చేత శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి పూజ చేయించి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివించండి. తప్పకుండా ఎంత మందబుద్ధి కలిగిన పిల్లలైనా చదువులో రాణిస్తారు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


