మహిషాసుర మర్దినీ స్తోత్రం
అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||
ఓ దివ్యమాతా, నీకు నా నమస్కారములు, పర్వతరాజు కుమార్తె అయిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నీ ఉనికి వలన ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ లోకాన్నంతా ఒక దివ్యమైన నాటకంలా నడిపించే నీవు శివుని వాహనమైన నందిచే స్తుతింపబడేదానివి. పర్వతాలలో అత్యుత్తమమైన వింధ్య శిఖరంపై నివనించే ఓ దేవీ, శ్రీమహా విష్ణువుకు అతని సోదరిగా ఆనందాన్ని కలిగిస్తూ ఇంద్రుడి చేత స్తుతించబడే నిన్ను నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. ఓ భగవతీ, శివుని భార్యవై ఈ ప్రపంచంలో అనేక సంబంధాలను కలిగి ఉండి సృష్టిలో సమృద్ధిని ప్రసాదించేదానివి. అందమైన శిరోజాలతో ప్రకాశిస్తూ రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించిన ఓ పర్వతరాజ తనయా నీకు జయము జయము.
సురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే |
దనుజనిరోషిణి దుర్మదశోషిణి దుఃఖానివారిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 ||
ఓ దేవీ, నీవు దేవతలకే వరాలు ఇచ్చేదానివి, దుర్దర, దుర్ముఖ అనే రాక్షసులను జయించి, వాళ్ళను వధించి ఆనందాన్ని పొందావు. మూడు లోకాలను పోషించేదానివి. యుద్ధం చేసి పాపపు రాక్షసులను తొలగించడం ద్వారా శంకరుడిని సంతోష పరిచావు. ఓ సముద్ర పుత్రీ, నీవు దానవుల కోపాన్ని అణచివేశావు, దైత్యులను కోపంతో చెదరగొట్టావు. రాక్షసుల మూర్ఖపు గర్వాన్ని అణగదొక్కిన నీకు జయము.
అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణితుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే |
మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 ||
ఓ దివ్యమాతా! నీకు నమస్కారములు. కదంబ వృక్షాల అడవిలో సంతోషంగా, ఉల్లాసంగా నివసించే నీవు నాకూ, ఈ విశ్వానికే తల్లివి. రత్నాల వలె మెరిసే ఎత్తైన హిమాలయాల శిఖరాల మీద నివసించే నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. తేనె వలె తియ్యనైన నీవు యుద్ధంలో కోలాహలంగా మధు కైటభ అనే రాక్షసుల అహంకారాన్ని అణచివేసిన నీకు జయము.
అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే |
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే [చండ]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 ||
ఓ దివ్యమాతా! నీవు శత్రువుల ఏనుగులను జయిస్తావు. నీ వాహనమైన సింహం శత్రువుల శక్తివంతమైన ఏనుగుల ముఖాలపై దాడిచేసి చీల్చి చెండాడింది. చండ, ముండ అనే రాక్షసుల తలలను నీ చేతుల్లోని ఆయుధాలతో పడగొట్టి, శత్రువుల సైన్యాన్ని జయించిన నీకు జయము.
అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే |
దురితదురీహ దురాశయదుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 ||
ఓ దివ్యమాతా! వరాల వలన అణచివేయలేని, నాశనం చేయలేని శక్తిని కలిగి, యుద్ధం మత్తులో ఉన్న దురహంకార రాక్షసులను నాశనం చేశావు. అలాంటి రాక్షసులకు అధిపతైన, విశిష్టమైన పరమశివుణ్ణి దూతగా చేసుకున్నావు. శుంభ అనే రాక్షసుడు దుష్టబుద్ధితో నిన్ను పొందాలని, సుగ్రీవుడు అనే రాక్షసుడిని దూతగా పంపిస్తే, అతని ప్రతిపాదనను తిరస్కరించి, తత్ఫలితంగా జరిగిన యుద్ధంలో రాక్షసులను అంతం చేసిన నీకు జయము.
అయి శరణాగతవైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువన మస్తక శూలవిరోధి శిరోధికృతామల శూలకరే |
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 ||
శత్రువుల యొక్క భార్యలు నీ ఆశ్రయం పొందినప్పుడు ఆ వీరోచిత సైనికులను రక్షించిన నీకు నమస్కారములు. ముల్లకాలలో నీ ఆజ్ఞను ఎదిరించిన పాలకుల తలలను నీ చేతిలోని పవిత్రమైన త్రిశూలానికి అలంకరణ చేశావు. నీ విజయ ధుందుభి డోలు ధిమి ధిమి శబ్దాన్ని మోగించడం ద్వారా అన్ని దిశలలో వ్యాపించింది. రాక్షసులపై ఎప్పుడూ విజయాన్నిసాధించే దేవీ నీకు జయము.
అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే |
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 ||
కేవలం నీ హుంకార శబ్దంతో ధూమ్రలోచన అనే రాక్షసుడిని బూడిదగా చేశావు. యుద్ధ సమయంలో, రక్తబీజ రాక్షసుడిని, అతని రక్తపు బొట్టునే విత్తనంగా చేసుకొని పుట్టిన వందలాది రక్తబీజ రాక్షసుల బలాన్ని నిర్మూలించావు. యజ్ఞాన్ని పోలిన తపస్సు చేసి వరాలను పొందిన శుభ నిశుంభ రాక్షసులను సంహరించి రక్త తర్పణం ద్వారా భూతపిశాచ సమూహాన్ని తృప్తిపరచిన దేవీ నీకు జయము.
ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగ పృషత్కనిషంగ రసద్భట శృంగ హతావటుకే |
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 ||
యుద్దం సమయంలో నీ విల్లు యొక్క కదలికలను అనుసరించి నీ చేతులను అలంకరించిన కంకణాలు నృత్యం చేస్తున్నట్లుగా కదులుతున్నాయి. నీవు వేసిన బంగారు బాణాలు, తెలివిహీనులైన శత్రువుల రక్తంతో ఎర్రగా మారి వారి హాహాకారాల మధ్య నీవు దూసుకెళుతున్నావు. తెలివితక్కువగా కేకలు వేస్తూ తమ వ్యర్థమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ, వివిధ రంగుల తలలతో అన్ని వైపుల నుండి చతురంగ (రథాలు, ఏనుగులు, గుర్రాలు మరియు కాల్పుల సైన్యం) బలగాలతో ముట్లడించిన వారి మధ్య నుండి భీకరంగా బాణంలా దూసుకువెళుతూ, వారిని మట్టుపెట్టిన దేవీ నీకు జయము.
సురలలనా తతథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే
కృత కుకుథః కుకుథో గడదాదికతాల కుతూహల గానరతే |
ధుధుకుట ధుక్కుట ధింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 ||
దేవ నర్తకీమణులు నీవు చేసే యుద్ధ వృత్తాంతాన్ని తతథేయి తథేయి అనే లయను అనుసరించి నాటకీయంగా వ్యక్తపరుస్తూ నృత్యం చేస్తున్నారు. దేవ సంగీతకారులు కూడా ఈ యుద్ధ వృత్తాంతాన్ని కుకుథః కుకుథో గడదాదిక తాళాలతో యుద్దంలో ఉండే ఉద్విగ్నమైన ఆత్రుతను వివరిస్తున్నారు. మృదంగం కళాకారులు యుద్ధం యొక్క ఉధృతిని ధు-ధు-కుట, ధు-క్కు- ట ధిం-ధిమిత లాంటి ధ్వనిని స్థిరంగా వాయిస్తుంటే అలాంటి యుద్ధాన్ని సమర్థవంతంగా చేస్తున్న ఓ దేవీ నీకు జయము.
జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే | [ఝ-, ఝిం-]
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 ||
యుధ్ధానికి ముందు విజయ ప్రార్థనలు, యుద్ధం తర్వాత విజయ ధ్వానాలు, ఆ తర్వాత నీ స్తోత్రాలతో సమస్త జగత్తుచే పూజింపబడిన నీవు, యుద్దం చేస్తున్నప్పుడు, నీ కాలి గజ్జెల నుండి భూతపిశాచాలకు ప్రభువైన పరమశివుడికి ఇష్టమైన ఝణ ఝణ ఝింఝింమి శబ్దంతో యుద్ధభూమి దద్దరిల్లుతోంది. నృత్యకారులు, శివుని శరీరంలో సగభాగంగా నీవు ఎలా ఇమిడిపోయావో అలాంటి వేషధారణతో నాదధ్వనికి అనుగుణంగా నాట్యం చేస్తూ నీ విజయగాధను గానం చేస్తున్నారు, అలాంటి ప్రత్యేకతలు కలిగిన ఓ దేవీ నీకు జయము.
అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్త్రవృతే |
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 ||
నీ అందమైన మనసు, మనోహరమైన రూపంతో ఏకమై, నీ అందమైన ముఖం రాత్రై చంద్రుని వెన్నెల కాంతిని సైతం లొంగదీసుకునేలా ఉంది. నీ అందమైన కళ్ళు తేనెటీగల అందాన్ని జయిస్తున్నట్టు ఉండే ఓ దేవీ నీకు జయము.
సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గ వృతే |
సితకృత ఫుల్లసముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 ||
నీవు చేస్తున్న గొప్ప యుద్ధంలో, శత్రువులకు చెందిన బలమైన మల్లయోధులు, మల్లెపువ్వులా మృదువుగా కనిపించే అమ్మాయిల (పార్వతీ దేవి పరివారం) సైన్యంతో రకరకాల యుద్ధ పద్ధతులతో తలపడుతున్నారు. నీ సైన్యం అమ్మాయిలు తేనెటీగల గుంపుల వలె సందడి చేస్తున్నారు, వాళ్ళు చూడడానికి మల్లెపూల లతలా లేతగా మృదువుగా ఉన్నారు. వారి ముఖాలు తెల్లవారుజామున అప్పుడప్పుడే మొగ్గల నుండి పువ్వులా వికసిస్తున్న అందమైన చిరునవ్వుతో వికసిస్తున్నాయి. ఆనందంగా యుద్ధంలో భాగస్వామ్యాన్ని తీసుకుంటున్న అలాంటి సైన్యాన్ని కలిగిన ఓ దేవీ నీకు జయము.
అవిరలగండ గలన్మదమేదుర మత్తమతంగజ రాజపతే
త్రిభువనభూషణ భూతకలానిధి రూపపయోనిధి రాజసుతే |
అయి సుదతీజన లాలసమానస మోహనమన్మథ రాజసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 ||
చెంపల నుండి మదం నిరంతరంగా స్రవిస్తూ గర్వంగా ఉన్న ఏనుగుల సైన్యానికి అధిపతివి, మూడు లోకాలకు ఆభరణాలైన కళలు, సౌందర్యం, శక్తి యొక్క సంపదలు కలిగిన రాజ కుమార్తెవైన నీవు, అందమైన చిరునవ్వుతో, స్త్రీల మనస్సులో కోరికలను, వ్యామోహాన్ని పెంచే మన్మథుని కుమార్తెలా మెరిసిపోతున్న నీకు జయము.
కమలదలామల కోమలకాంతి కలాకలితామల భాలలతే
సకలవిలాసకలానిలయ క్రమకేలిచలత్కల హంసకులే |
అలికుల సంకుల కువలయ మండల మౌలిమిలద్భకులాలి కులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 ||
మచ్చలేని నీ మెరిసే నుదురు కళాత్మకంగా కల్మషం లేని లేత తామరపువ్వంత అందంగా ఉంది, నీ నడక హంసల గుంపు ఉల్లాసభరితంగా, ఆనందంగా ఎలా నడుస్తుందో అలా కళలన్ని కలిసికట్టుగా నడుస్తున్నట్టుగా ఉంది, నీ జుట్టుపై తేనెటీగల సమూహాన్ని ఆకర్షించేలా నీలిరంగు కలువలు, పొగడ పువ్వులను చక్కగా అలంకరించిన కేశాలు కలిగిన నీకు జయము.
కరమురలీరవ వీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే
మిలిత పులింద మనోహర గుంజిత రంజితశైల నికుంజగతే |
నిజగుణభూత మహాశబరీగణ సద్గుణసంభృత కేలితలే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 ||
నీ స్వరం- నీ చేతిలో ఉన్న వేణువు నుండి వచ్చే ధ్వని, కోకిల చేసే ధ్వని కూడా చిన్నబోయేంత మాధుర్యంగా ఉంటుంది, పులింద తెగ అమ్మాయిలతో కలిసి హృదయాన్ని దోచుకునే పాటలను పాడుతూ వికసించిన పూలతో అందంగా ప్రకాశిస్తున్న పర్వతాల మధ్యలో నడుస్తూ, మంచి సుగుణాలతో నిండిన ఆ మహిళల గుంపు(శబరీగణములు) తో ఆడుతూ విహరిస్తున్న నీకు జయము.
కటితటపీత దుకూలవిచిత్ర మయూఖతిరస్కృత చంద్రరుచే
ప్రణతసురాసుర మౌలిమణిస్ఫురదంశులసన్నఖ చంద్రరుచే |
జితకనకాచల మౌలిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 ||
నీ నడుము చుట్టూ కట్టి ఉన్న వివిధ రంగుల పట్టు బట్టల నుండి వచ్చే కాంతి, చంద్రుని ప్రకాశాన్ని కూడా తలదన్నేలా ఉంది. దేవతలు, అసురుల చేత నమస్కరించబడే ఓ మాతా! నీ కాలి గోళ్ళపై అలంకరించబడిన వజ్రాలు, రత్నాల తేజస్సు చంద్రుడి ప్రకాశం కంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నాయి. ఎత్తుగా నిండుగా ఉన్న బంగారు పర్వతాలు సైతం తలొంచే పుష్కలమైన వక్షస్థల సౌష్టవం కలిగిన నీకు జయము.
విజిత సహస్రకరైక సహస్రకరైక సహస్రకరైకనుతే
కృత సురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే |
సురథసమాధి సమానసమాధి సమాధిసమాధి సుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 ||
నీ వేల చేతులతో, నీతో పోరాడే కొన్ని వేల మంది శత్రువులను జయించడం వలన, ఇంకొన్ని వేల భక్తుల చేతులు నిన్ను అనుదినం స్తుతిస్తున్నాయి. దేవతలకు సవాలుగా నిలిచిన తారకాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేయడానికి నీ కుమారుడైన కార్తికేయుడిని పంపించావు, రాజ్యాన్ని కోల్పోయిన సురథ రాజు మరియు వ్యాపారంలో నష్టపోయిన వ్యాపారైన సమాధి నిన్ను భక్తి శ్రద్దలతో పూజించినప్పుడు వారి భక్తికి మెచ్చి, నష్టాలలో నుండి బయటపడడానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చిన నీకు జయము.
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం స శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరంపదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 ||
కరుణకు నిలయమైన అత్యంత పవిత్రమైన నీ కమలముల వంటి పాదాలను ప్రతిరోజూ ఎవరు సేవిస్తారో, ఆ పాదాలు సాక్షాత్తు కమల నివాసిని అయిన శ్రీ మహాలక్ష్మివే, అలాంటి పాదాలను సేవించిన వారు ఆ లక్షీదేవి సాక్షాత్కారం పాందినవారవుతారు, నీ పాదాలు సర్వోన్నతమైన పాదాలు. అవే మాకు ఆశ్రయం, ఓ శుభప్రదమైన తల్లి! అలాంటి నీ పట్ల భక్తి లేకుండా ఎలా ఉండగలము.
కనకలసత్కల సింధుజలైరనుసించినుతే గుణరంగభువం
భజతి స కిం న శచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవమ్ |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 ||
నీవు నివసించే (దేవాలయం) ప్రదేశాన్ని నీ భక్తులు బంగారంలా మెరుస్తూ మెల్లిగా ప్రవహించే నదిలోని నీటితో కడిగి శుభ్రం చేస్తారు, అలా చేయడం వలన నీ భక్తులు నీ విశాల హృదయంలో స్థానం సంపాదించి నీ దయను పొందుతారు కదా? కాబట్టి ఓ సరస్వతీ దేవీ! నీ పాదాల వద్ద శరణు వేడుకుంటున్నాను. పవిత్రమైన, శాశ్వతమైన ఓ మహాసరస్వతి! నీకు జయము.
తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత పురీందుముఖీ సుముఖీభిరసౌ విముఖీక్రియతే |
మమ తు మతం శివనామధనే భవతీ కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 ||
నీ చంద్రుని వంటి ముఖం- మచ్చలేని స్వచ్ఛతకు నిలయం, అది అన్ని చెడు గుణాలను అణచివేస్తుంది. అలా కాకుంటే, ఇంద్రుడి సభలో ఉన్నటువంటి చంద్రుని లాంటి ముఖం గల అందమైన స్త్రీల నుండి నా మనస్సు ఎందుకు దూరంగా ఉంది? నీ అనుగ్రహం లేకుండా మనలో ఉన్న శివ నామ నిధిని వెలికితీయడం సాధ్యం కాదు కదా? (అందుకే నేను నీ కృపను కోరుతూనే ఉంటాను).
అయి మయి దీనదయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాఽనుభితాసిరతే |
యదుచితమత్ర భవత్యురరి కురుతా దురుతా పమపా కురు తే [మే]
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 21 ||
దుఃఖంలో ఉన్నవారి పట్ల కరుణ చూపే ఓ తల్లి, ఉమా, నీ కృపకు నన్ను పాత్రుడిని చేయి. ఓ విశ్వమాతా! నీ భక్తులపై అనుగ్రహం ఏ విధంగానైతే కురుస్తుందో, అదే విధంగా నీ బాణాలు శత్రువులపై కురిసి, వారి అహంకారాన్ని నాశనం చేస్తున్నాయి. ఓ పూజ్యమాతా! ఈ లోకంలో భరించడానికి కష్టంగా ఉన్న దుఃఖాలను, బాధలను తొలగించడానికి ఏది సరైనదని నీకు అనిపిస్తుందో అదే చెయ్యి ఓ జగజ్జననీ. అందమైన శిరోజాలతో ప్రకాశిస్తూ, రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించిన ఓ పర్వత రాజతనయా! నీకు జయము జయము.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



