మోతా మారుతి ఆలయం
శ్రీరామ భక్తుడైన హనుమంతునికి గ్రామానికో గుడి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. భారీ సంఖ్యలో భక్తులు ఆయనను నమ్మి కొలుస్తూ, పలికే దైవంగా భావిస్తారు. హనుమంతుని ఆలయాల్లో ఒక్కో ఆలయం ఒక్కో విశిష్టతను కలిగి ఉంటుంది. అటువంటి ప్రత్యేకత గల దేవాలయాల్లో ఒకటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో, లోనార్ సరస్సు సమీపంలో ఉన్న మోత మారుతి దేవాలయం. దీనిని మోట మారుతి దేవాలయం అని కూడా అంటారు. “మోత” అంటే అయస్కాంతం. ఈ ఆంజనేయ విగ్రహం అత్యంత ఆకర్షణ శక్తి గల శిలతో నిర్మించబడినందున దీనికి మోత మారుతి ఆలయం అనే పేరు వచ్చింది.
ఈ ఆంజనేయ విగ్రహం శయన భంగిమలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ తరహా ఆంజనేయ విగ్రహాల్లో ఇది అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు. అయస్కాంత శిలతో చెక్కబడిన ఈ విగ్రహం పొడవు 9 అడుగులు 3 అంగుళాలు. సుమారు 4 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఆంజనేయుని కుడి పాదం భూమిపై ఉండగా, ఎడమ పాదం శనిదేవుని తలపై మోపి ఉంటుంది. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం ఉల్కాపాతం వల్ల ఏర్పడిన శిలతో చెక్కబడినదని చెబుతారు.
1841లో శ్రీరామ భక్తులకు ఈ విగ్రహం సమీపంలోని అడవిలో లభించింది. వారు ఆంజనేయునికి ఆలయం నిర్మించి, ఒక కుటుంబానికి ఆ ఆలయాన్ని జాగీరుగా ఇచ్చారు. అప్పటి నుండి ఆంజనేయ విగ్రహం సింధూరంతో అలంకరించబడుతూ వచ్చింది. మూల విగ్రహం పూర్తిగా సింధూరంతో కప్పబడి ఉండేది. 2013 డిసెంబరులో ఆలయ పెద్దలు భక్తుల కోరిక మేరకు ఆ సింధూరాన్ని తొలగించారు. తొలగించగా దాదాపు 2500 కిలోల సింధూరం బయటపడిందని చెబుతారు. అప్పటివరకు కనిపించని సుందరమైన హనుమాన్ విగ్రహం వెలుగులోకి వచ్చింది.
ఈ మోత మారుతి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. ఆలయం సమీపంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లోనార్ సరస్సు ఉంది. సుమారు 52 వేల సంవత్సరాల క్రితం ఆకాశం నుండి పడిన ఒక పెద్ద ఉల్క వల్ల ఈ గొయ్యి ఏర్పడి, కాలక్రమేణా అది సరస్సుగా మారింది. ఉల్కాపాతం వల్ల ఏర్పడిన అరుదైన సరస్సుల్లో ఇది ఒకటి. ఈ సరస్సు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. భారత ప్రభుత్వం దీనిని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది. 2020 సంవత్సరంలో ఈ సరస్సు నీరు పింక్ రంగులోకి మారడం విశేషం. ఇందులోని ఖనిజాల ప్రభావంతో నీటి రంగు మారిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఔరంగాబాద్ నగరానికి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ ద్వారా లోనార్ చేరుకోవచ్చు. రైలుమార్గం ద్వారా రావాలనుకుంటే ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుండి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ఔరంగాబాద్‌కు నడుస్తుంటాయి. అక్కడి నుండి లోనార్‌కు సులభంగా చేరుకోవచ్చు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




