అష్టాదశ పురాణాలు
పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే..‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడు కుమారుడైన సూతమహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగంలో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.