google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

The Mahalaxmi temple located in Ratlam, Madhya Pradesh

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?

బంగారం ప్రసాదంగా ఇచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?

మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల నిర్వహణ వెనుక భిన్నమైన పద్ధతులు, నమ్మకాలు ఉంటాయి. సాధారణంగా భక్తులు గుడికి వెళ్లి మొక్కుబడులు తీర్చుకుని, తర్వాత ప్రసాదంగా లడ్డూ, పులిహోర, చక్రపొంగలి వంటి పదార్థాలను స్వీకరిస్తారు. అయితే ఒక ప్రత్యేక ఆలయంలో మాత్రం బంగారం, వెండి ప్రసాదంగా ఇస్తారు. అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్నం జిల్లాలో ఉన్న మహాలక్ష్మి ఆలయం.

మాల్వా ప్రాంతంలోని ఈ మహాలక్ష్మి ఆలయం అత్యంత సంపన్నమైనదిగా ప్రసిద్ధి చెందింది. వందల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలో అప్పట్లో రాజులు తమ సంపాదించిన ధనాన్ని అమ్మవారికి సమర్పించేవారని చెబుతారు. అలా చేయడం వల్ల ఆ ధనం రెట్టింపు అవుతుందని వారు నమ్మేవారు.

ఇక్కడ భక్తులు పాయసం, పులిహోర వంటి నైవేద్యాలకు బదులుగా బంగారం, వెండి, నగదు సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం భారీగా విరాళాలు వస్తాయి. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతుంది. మహాలక్ష్మి అమ్మవారి పాదాల వద్ద కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు సమర్పించబడతాయి.

దీపావళి పండుగకు ముందు భక్తులు ఆభరణాలు, నగదు సమర్పిస్తారు. దేశంలోనే బంగారం, వెండిని ప్రసాదంగా ఇచ్చే ఏకైక ఆలయం ఇదే అని చెబుతారు. కొందరు నోట్ల కట్టలు, మరికొందరు బంగారం, వెండి ఆభరణాలు సమర్పిస్తారు. ఈ ఆలయం “కుబేరుని నిధి”గా కూడా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలోని అమ్మవారిని వందల కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు.

భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను ఆలయ ట్రస్ట్ వారు నమోదు చేసి, వివరాలు రాసి, దాతల చేత సంతకం తీసుకుని టోకెన్ ఇస్తారు. ప్రత్యేక కార్యక్రమాలు పూర్తయ్యాక టోకెన్ ఆధారంగా వాటిని తిరిగి అందజేస్తారు. కొంత భాగాన్ని బంగారం, వెండి రూపంలో ప్రసాదంగా కూడా ఇస్తారు.

దీపావళి సందర్భంగా ధనత్రయోదశి నుండి ఐదు రోజులపాటు దీపోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించిన ఆభరణాలు, నగదుతో అలంకరిస్తారు. మహిళా భక్తులు కుబేరుడికి తమ మొక్కుబడులు చెల్లిస్తారు. వచ్చిన భక్తులందరికీ లేదనకుండా కొంత బంగారం లేదా వెండి నాణేలను ప్రసాదంగా ఇస్తారు.

పూజారులు ప్రసాదంగా ఇచ్చిన బంగారం, వెండి నాణేలను భక్తులు విక్రయించకుండా పూజాగదిలో లేదా లాకర్లో భద్రపరుస్తారు. అలా ఉంచితే మహాలక్ష్మి తమ ఇంట్లోనే కొలువై ఉంటుందని విశ్వాసం.

దీపావళి సమయంలో భక్తులు తమ విలువైన ఆభరణాలను గర్భగుడిలో మూడు రోజులపాటు ఉంచుతారు. ధనత్రయోదశి నుండి దీపావళి వరకు వాటిని భద్రంగా ఉంచి, తరువాత తిరిగి అందజేస్తారు. ఇలా చేయడం వల్ల సంవత్సరం పొడవునా సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. ఈ సమయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.

ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వంద కోట్లకు పైగా విరాళాలు వస్తాయి. దీపావళి సందర్భంగా అమ్మవారికి బంగారం, నగదు సమర్పించిన భక్తులు, అక్కడికి వచ్చిన ఇతర భక్తులకు బంగారం, వెండి నాణేలను ప్రసాదంగా పంచుతారు. ఇలా చేస్తే తామూ సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారు నాణేలు గ్రాముకు తక్కువ బరువుల్లో వివిధ పరిమాణాల్లో లభిస్తాయి. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు కొనుగోలు చేసి, అమ్మవారికి సమర్పించి తరువాత ఇతరులకు పంచుతారు.

రత్నం జిల్లా ప్రధాన కేంద్రం కావడంతో వసతి సదుపాయాలు చక్కగా ఉన్నాయి. రెండు స్టార్, మూడు స్టార్ హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్ హౌస్‌లు అందుబాటులో ఉంటాయి.

విమాన మార్గంలో వెళ్లాలనుకునేవారు ఇండోర్ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుండి సుమారు 102 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నం వరకు బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు. ఉదయపూర్ విమానాశ్రయం సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు మార్గంలో వెళ్లాలనుకునేవారు ఉజ్జయిని లేదా రత్నం రైల్వే స్టేషన్లలో దిగవచ్చు. హైదరాబాద్, ముంబై, ఇండోర్, ఉదయపూర్, కోల్‌కతా వంటి నగరాల నుండి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం ద్వారా అంతర్రాష్ట్ర బస్సులు, టాక్సీలు, క్యాబ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.

మీకు వీలైనప్పుడు మహాలక్ష్మి దేవాలయాన్ని దర్శించి అమ్మవారి ప్రసాదమైన బంగారం, వెండి నాణేలను స్వీకరించండి. ఎవరైనా వెళ్లి ఉంటే మీకు ప్రసాదంగా ఏమిచ్చారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దయచేసి మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఈ సమాచారాన్ని పంచుకోండి.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top