సంకష్టహర చతుర్థి అంటే ఏంటి..? పూజా విధానం ఎలా ఉంటుంది?
మనం ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు మన పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని కోరుతూ వినాయకుడిని పూజిస్తాం. ఎవరైతే తమ జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారో, అలాంటి వారందరూ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే, అష్టకష్టాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల, వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని, తాము కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని నమ్మకం. సంకష్టహర చతుర్థి వ్రతం చేయడానికి సరైన ముహూర్త సమయం ఏది? పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. ఈ చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్నివరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణ పక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయానికి అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు వుంటుందో, ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే ఎప్పుడైనా రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉన్నట్లయితే, రెండవ రోజున సంకటహర చవితిగా భావించాలి.
సంకష్టహర చతుర్థి వ్రత విశిష్టత, వ్రత విధానం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి, ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. “స్వామీ కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి, తతృలితముగా ఋణబాధలు, సంతానలేమి, గృహ వసతి లేకపోవుట, దీర్ఘకాలికవ్యాధులు, విద్య, వ్యాపారం. వృత్తిలో రాణించలేకపోవుట, ఆర్థిక ఇబ్బందులు, శతృపీడ, పనులలో ఆటంకాలూ, అభివృద్ధి లేకపోవుట, పాడిపంటల సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజ దండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి, కష్టములు తీర్చు వ్రతమేదైనా సెలవీయండి” అని స్కందుని అడిగారు.
అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై “వ్రతాలలోకెల్లా అత్యంత శక్తిమంతమైన సంకష్టహరచతుర్ది వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి, శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి, ఎంతకూ ఫలితమందక బాధపడుతూ, తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు, ఆ గణపతి ప్రసన్నుడై, తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి, ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందింది.
ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి. “ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా, బహుళ చతుర్ధి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్ధి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిధి ఉన్న రోజు చూసుకొని , ఆ రోజు సూర్యోదయానికీ ముందే నిద్ర మేల్కొని, కాల కృత్యాలు తీర్చుకొని, నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధ్యావందనం మొదలైన కార్యాలు పూర్తి చేసుకొని, సంకష్టహర చతుర్ధి వ్రతం చేస్తానని మొక్కుకొని, ఎరుపు రవికెల బట్టను గణపతి ముందుంచి, దానిలో ఒక చిటికెడు పసుపూ కుంకుమ వేసి , మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి, ఎండుఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో వున్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా వుండాలి. మనసులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి.
సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి, శ్రీ సంకష్ట హర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, 11 కుడుములూ చేసి స్వామికి నివేదించాలి. వ్రతము పూర్తయినాక, చంద్రునికి అర్ఘ్యము సమర్పించిన తరువాత అతిథులని గణేశ స్వరూపంగా భావించి, ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజూ, ఆ రోజూ బ్రహ్మ చర్యాన్ని పాటించి, దైవ నామ స్మరణతో, లౌకిక విషయాలమీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి. 12 సార్లు ఛేసే ఈ వ్రతానికి వ్రత సిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం” అని పలికాడు. సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి.
వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. వ్రతం చేసే వారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాధారణంగా పూజలన్నీ ఉదయాన్నే జరుగుతాయి. కానీ సంకష్టహర చతుర్థి పూజ మాత్రం సాయంకాలం వేళలో జరుపుకోవాలి. వినాయక విగ్రహానికి లేదా ఫొటోకు తాజా పువ్వులతో అలంకరించి, పిండి వంటలు, ప్రసాదం, మోదకాన్ని బొజ్జ గణపయ్యకు సమర్పించాలి.
పూజా సమయంలో ముందుగా దీపారాధన, ఆచమనం, కలశ స్థాపన చేసి, గణపతి పూజ చేయాలి. తరువాత కలశారాధన చేసి, ఏకవింశతి పుష్ప పూజ, ఏకవింశతి పత్ర పూజ చేయాలి. వినాయక అష్తోత్తర శతనామావళి, సంకట నాశన గణేశ స్తోత్రం చదువుకోవాలి. తరువాత గౌరీపూజ చేసి ధూప, దీప, నైవేద్యాలు, తాంబూల, నీరాజనాలు సమర్పించి, దూర్వాయుగ్మ పూజ చేయాలి. సంకట హర చతుర్థి వ్రత కథలను భక్తి శ్రద్ధలతో చదువుకోవాలి.
భృశుండి మహర్షి వృత్తాంతం
ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తూన్న నారద మహర్షికి, కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా? అని చూసాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు, వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూన్న మహర్షి వద్దకు వెళ్ళి
“ఓ మహర్షీ! పూర్వాశ్రమంలో నీ భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చేయి” అని చెప్పి వెళ్లిపోయాడు.
నారదుడి మాటలు విన్న భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. “వారి సహకారం వల్లే నేను ఈనాడు తపస్వినయ్యాను, ఎలాగైనా వారి బాధల్ని రూపు మాపాలని” సంకల్పించాడు. తన ఇష్ట దైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తనవారికి ధారపోయాలని అనుకొని, “ఓ గణనాధా! నేనే గనుక నీ దివ్యచతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి వుంటే, నా పితరులు, వారితోపాటు నా భార్య, కుమార్తే నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురు గాక! అని నీళ్ళు విడిచి పెట్టాడు. గజాననుడి అనుగ్రహంతో అయన చేసిన వ్రతాల్లో, ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే, ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి, దివ్యవిమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు. ఇక ప్రతీ మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా?
ఈ వ్రత మహత్యం గురించి మరొక కథ. ఒకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా, అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి, ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ అద్భుతమైన ఇంద్ర విమానం వెలుగుకి, ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు, గబగబా బయటికి వచ్చి, ఆ అద్భుతాన్ని అచ్చెరువుచెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. అక్కడ విమానం ఎందుకు ఆపేరో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు, “ఓ రాజా! మీ రాజ్యంలో ఎవరో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి దృష్టి సోకి, విమానం మార్గమధ్యలో అర్థాంతరంగా ఆగింది” అని చెప్పాడు. అపుడు ఆ రాజు “మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది” అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు “ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున సాయంత్రం వరకూ ఎవరైతే ఉపవాసం చేసి సంకష్ట హర గణేశ వ్రతం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే, నా విమానం తిరిగి బయలుదేరుతుంది”అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ, ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం, వ్రతంచేసిన వారు కనబడకపోదురా? అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెను, ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, “ఈమె నిన్నంతా ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసినా తెలియకచేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే, వారు మరణానంతరం గణేశ లోకం అంటే స్వనంద లోకానికి చేరుకోటం తథ్యం అని చెప్పాడు.
అపుడు సైనికులు, ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేశుని దూతని ఎంతో బ్రతిమాలారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈ లోపు ఆమె దేహం మించి వీచిన గాలి, ఆ విమానం ఆగిపోయిన చోట వీచి, ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలీక చేసినా ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతం ఇది.
కృతవీర్యుని కధ
పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహా పతివ్రత, సుగుణవతి, ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్యదంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్రసంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా, ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు, ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి, భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి, కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ, తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది.
ఒకనాడు ఆకాశమార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలి పడి, పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిసాడు. పుత్ర సంతానం కోసం ఆతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధ పడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ” ప్రభూ! నా కుమారుడు సకల సద్గుణ వంతుడు, దానశీలి, ధర్మప్రభువు. ఎన్నో యజ్ఞాల్ని, వ్రతాల్ని చేసినవాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్రసంతానము కలగకపోవడానికి కారణము ఏమిటి? అతడు ఏ పాపం చేసాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతానప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి ” అని దీనంగా ప్రార్ధించాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు. “నీ కుమారుడు పూర్వ జన్మలో సాముడు అనే పేరుగలవాడు . పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి, బ్రహ్మవేత్తలూ సాత్వికులూ అయిన పన్నెండుమంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదనీ ఆహారాన్నీ దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆరోజు మాఘ బహుళచతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు, తన కుమారుణ్ణి “గణేశా” అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కల్సి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమపాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితినాడు ఏమీ తినక పోవటం, సంధ్యాసమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశా అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది.
కొంతకాలము గడిచాక, భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ, గతజన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల, ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది” అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ “పితామహా! నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్ట మైనదైనా సరే!” అని ప్రాధేయపడ్డాడు.
అప్పుడు బ్రహ్మ, “నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనదీ, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీగణేశ “సంకష్ట హర చతుర్టీ” వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు.
అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే, ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు. కరడుకట్టిన ప్రారబ్ధాన్ని సైతం, కర్పూరంలా కరగించివేసే మహిమాన్వితమైన వ్రతం ఇది.
ఈ కధలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియచేస్తున్నాయి . వినాయకుని భక్తు లందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారనీ, నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరనీ దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు.
వ్రతం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి, 21 కుడుములు చేసి స్వామికి నివేదించాలి. అరటి పండ్లు, కొబ్బరికాయ నివేదించాలి. బెల్లంతో నైవేద్యం సమర్పించాలి. చివరగా వినాయకుడికి హారతి ఇవ్వాలి.
ఈ వ్రతంలో చంద్రుడి ఆరాధనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున, భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. వినాయకుని ప్రార్థనలతో ముందుగా చంద్రుని దర్శనం తర్వాత రాత్రి ఉపవాసం విరమిస్తారు. ఉపవాసం రోజున ఎవరిపైనా అసూయ, ద్వేషం, కోపం మొదలైనవాటిని కలిగి ఉండకూడదు. ఉపవాసం రోజున, గరిష్టంగా మౌనంగా ఉండి, గణేశుడికి సంబంధించిన మంత్రాన్ని జపించడం ఉత్తమం. ఉపవాసం రోజున నల్ల బట్టలు ధరించవద్దు. ఉపవాస సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. సులభంగా జీర్ణమయ్యే పండ్లను తినాలి. ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం వంటి వాటి జోలికి వెళ్లొద్దు. చతుర్థి పర్వదినాన పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లను తీసుకోవచ్చు.
ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు. శాస్త్రాల ప్రకారం చంద్రుడిని ఔషధాలకి అధిపతిగా భావిస్తారు. మంచి మనసుకి కారకంగా సూచిస్తారు. చంద్ర దేవుడిని ఆరాధించే సమయంలో స్త్రీలు భర్త, సంతానం, కుటుంబ దీర్ఘాయువు, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది. ఒక వెండి పాత్ర తీసుకుని నీటిలో కొద్దిగా పాలు కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలు, తొలగిపోయి, ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. చంద్రుడికి నైవేద్యంగా గంధం, నీరు, బియ్యం, పువ్వులు సమర్పించాలి.
గణపతిని ఈ రోజున పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వినాయకుడు అన్ని అడ్డంకులను తొలగించేవాడు, తెలివితేటలకు అధిపతి వినాయకుడు. సంకష్ఠి చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకట హర చతుర్థి అంటేనే సంకటాల(కష్టాలు, అడ్డంకులు)ను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

