శమంతకమణి కథ
ప్రతి సంవత్సరం మనం జరుపుకునే వినాయక చవితి సందర్భంగా శమంతకమణి కథను తెలుసుకుందాం. ప్రసేనుడు మణిని ధరించి వేటకు వెళ్తే సింహం అతన్ని చంపి మణిని తీసుకెళ్లడం, అక్కడి నుంచి జాంబవంతుని చేతుల మీదుగా శ్రీకృష్ణుడి వద్దకు చేరడం, ఆ తరువాత సత్రాజిత్తుకు ఇచ్చి నీలాపనిందల నుండి విముక్తి పొందడం వరకు చాలామందికి తెలుసు. కానీ అసలు శమంతకమణి తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
విష్ణు పురాణంలో మరియు శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని ఉత్తర భాగంలో ఈ కథ ప్రస్తావించబడింది. పరీక్షిత్ మహారాజు శుక మహర్షిని శమంతకమణి గురించి వివరించమని అడుగుతాడు. శుక మహర్షి ఇలా కథ చెబుతాడు.
చేది వంశానికి చెందిన సత్రాజిత్తుకు ప్రసేనుడు అనే తమ్ముడు ఉండేవాడు. సత్రాజిత్తు సూర్యభగవానుని నిశ్చల భక్తితో ఆరాధించాడు. సూర్యుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దివ్య తేజస్సును చూడలేక సత్రాజిత్తు కళ్లను మూసుకుని, “నీ ప్రచండ తేజస్సును చూడలేకపోతున్నాను. దయచేసి సౌమ్యరూపంలో దర్శనం ఇవ్వు” అని ప్రార్థించాడు. సూర్యుడు కరుణించి “నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో” అన్నాడు. అప్పుడు సత్రాజిత్తు ఆయన కంఠంలో ఉన్న దివ్య రత్నమైన శమంతకమణిని ప్రసాదించమని కోరాడు. సూర్యుడు మణిని ఇచ్చి అదృశ్యమయ్యాడు.
ఆ మణి ప్రతిరోజూ ఎనిమిది భారాల బంగారాన్ని ప్రసాదించేది. అది ఉన్న దేశంలో రోగాలు, అరిష్టాలు, కరువు కాటకాలు ఉండవు. సూర్యునిలా ప్రకాశిస్తూ సత్రాజిత్తు ద్వారకానగరానికి రాగా, ప్రజలు అతన్ని సూర్యుడేనని భావించారు. శ్రీకృష్ణుడు అది శమంతకమణి ప్రభావమని తెలిపాడు. సత్రాజిత్తు ఆ మణిని తన ఇంటి దేవాలయంలో ప్రతిష్ఠించాడు. ఆ మణి ప్రసాదించే ధనాన్ని అతిథులు, యాచకులు మొదలైన వారికి వినియోగిస్తూ కీర్తి సంపాదించాడు. ఆ మణి ప్రభావంతో దేశం సుఖసంతోషాలతో విరాజిల్లింది.
శ్రీకృష్ణుడు ఆ మణి రాజు ఉగ్రసేనుని వద్ద ఉండితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పి అడిగాడు. కానీ సత్రాజిత్తు నిరాకరించాడు. ప్రసేనుడు శమంతకమణిని ధరించి వేటకు వెళ్లగా సింహం అతన్ని చంపి మణిని తీసుకెళ్లింది. ఆ సింహాన్ని జాంబవంతుడు సంహరించి మణిని తన గుహలోకి తీసుకెళ్లి తన కుమారుడికి ఆటవస్తువుగా ఇచ్చాడు.
ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు శ్రీకృష్ణుడిపై అనుమానం పెట్టి నిందించాడు. ఆ నిందను తొలగించుకోవడానికి కృష్ణుడు అరణ్యానికి వెళ్లి ప్రసేనుని మృతదేహం, సింహం శవం చూసి చివరకు జాంబవంతుని గుహకు చేరాడు. అక్కడ బాలుడు ఆటవస్తువుగా ఉంచిన మణిని తీసుకోబోతే జాంబవంతుడు వచ్చి యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య 28 రోజుల పాటు యుద్ధం జరిగింది. చివరకు జాంబవంతుడు ఆయన శ్రీరాముడేనని గ్రహించి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని సమర్పించాడు.
సత్యం తెలుసుకున్న సత్రాజిత్తు కృష్ణుడిని క్షమాపణ కోరుతూ శమంతకమణితో పాటు తన కుమార్తె సత్యభామను వివాహం చేశాడు. సూర్యభగవానుడు ప్రసాదించిన మణి తిరిగి సత్రాజిత్తు వద్దే ఉంచబడింది.
ఇంతవరకు మనకు తెలిసిన కథ. ఇప్పుడు తరువాత శమంతకమణి ఏమైందో తెలుసుకుందాం. కొంతకాలానికి కృతవర్మ, శతధన్వులు కలిసి సత్రాజిత్తుపై ద్వేషం పెంచుకున్నారు. ఒక రాత్రి శతధన్వుడు సత్రాజిత్తును హతమార్చి శమంతకమణిని తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసి శ్రీకృష్ణుడు శతధన్వుని సంహరించడానికి సిద్ధపడ్డాడు. ప్రాణభయంతో శతధన్వుడు కృతవర్మ వద్దకు వెళ్లగా అతను సహాయం చేయలేనని చెప్పాడు. తరువాత అక్రూరుని వద్దకు వెళ్లి సహాయం కోరాడు.
అప్పుడు వాసుదేవునికి ఎప్పుడూ నమస్కరించే వారమే గాని శత్రువులమయ్యే ధైర్యం లేదని అంటాడు. శతధన్వుడు ఆ మణిని అక్రూరునికి ఇచ్చి దీనిని నీవే దాచి ఉంచు లేదా నీదిగా కాపాడుకో అని చెప్పి భయంతో గుర్రం ఎక్కి పారిపోతాడు. కృష్ణుడు],బలరాముడు రథంపై శతధన్వుని వెంబడిస్తూ వెళ్తాడు. గుర్రం వాయువేగంతో పరిగెత్తి ఒక తోటలో ప్రవేశించి అక్కడే మరణించింది. అప్పుడు కృష్ణుడు బలరాముడిని రథంపై ఉండమని చెప్పి తన ఒక్కడే శతధన్వుని వెంబడించి చక్రంతో అతన్ని సంహరిస్తాడు.
కృష్ణుడు శమంతకమణి కోసం వెతికినా అది కనిపించలేదు. బలరామునికి చెప్పగా, “ఆ మణిని నాకు ఇవ్వవలసి వస్తుంది కాబట్టి దాన్ని దాచేశావు” అని అనుమానించి పరుషమైన మాటలు మాట్లాడి కోపంతో మిథిలానగరానికి వెళ్లిపోయాడు. శ్రీకృష్ణుడు సత్యభామకు జరిగిన విషయాలన్నీ చెప్పి సత్రాజిత్తుకు పరలోక క్రియలు జరిపించాడు.
ఇంతలో అక్రూరుడు ఆ మణిని భద్రంగా దాచుకుని, అది ప్రసాదించే బంగారంతో యజ్ఞయాగాలు, దానధర్మాలు చేస్తూ ఉండేవాడు. అనేక సంవత్సరాలు ఆ దేశంలో ఎలాంటి అరిష్టాలు లేక ధనధాన్య సమృద్ధితో వర్ధిల్లింది. తర్వాత భోజవంశస్థులు ఇతర రాజులతో యుద్ధాలు చేయడంతో అక్రూరుడు భయపడి ద్వారకను విడిచి కాశీకి వెళ్లిపోయాడు. అతను నగరంలో లేకపోవడంతో ద్వారకలో కరువు, కాటకాలు, అనారోగ్యాలు సంభవించాయి.
నగర పెద్దలు భయపడి శ్రీకృష్ణుడితో ఇలా చెప్పారు: “అక్రూరుడు కాశీకి వెళ్లినప్పటి నుంచి ఈ వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. అతను తిరిగి వస్తే ఉపద్రవాలు తొలగిపోతాయి.” కృష్ణుడు అక్రూరుణ్ని తిరిగి ద్వారకకు రప్పించాడు. అతను వచ్చిన తర్వాత మళ్లీ వానలు కురిశాయి, దేశం సుభిక్షమైంది.
శ్రీకృష్ణుడు ఇది అంతా శమంతకమణి ప్రభావమే అని గ్రహించాడు. “నాపై అపనింద తొలగాలంటే ఆ మణిని అందరికీ చూపించాలి” అని అక్రూరునితో చెప్పాడు. అక్రూరుడు రెండు పట్టువస్త్రాలలో దాచిన శమంతకమణిని తీసుకువచ్చి అందరికీ చూపించాడు. అందరూ శ్రీకృష్ణుడికి జయజయధ్వానాలు చేశారు.
ఆ మణి బ్రహ్మచర్యాన్ని కట్టుదిట్టంగా పాటించే వాడి వద్ద ఉండాలని, అక్రూరుడు పరమభాగవతుడైనందున అతనే ధరించాలని కృష్ణుడు అనుమతించాడు. అక్రూరుడు దానిని ధరించి తన నివాసానికి వెళ్లిపోయాడు. అతను చేసే పుణ్యకార్యాలు, దానధర్మాలతో రాజ్యం సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా నిలిచింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తనపై వచ్చిన నిందను తొలగించుకున్నాడు.
శ్రీకృష్ణ నిర్యాణ సమయానికి శమంతకమణి తిరిగి సూర్యమండలానికి చేరిందని పెద్దలు చెబుతారు. ఈ కథను వినేవారికి పాపాలు నశించి పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


