google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

తెలంగాణ రాష్ట్రంలోని కాసింపేట గ్రామంలో ఉన్న శ్రీ మానసాదేవి ఆలయం స్వయంభు విగ్రహం

శ్రీ మానసాదేవి ఆలయం

ఈ భూమండలంలోని సర్పాలన్నింటికీ అధిదేవతగా శ్రీ మానసాదేవిని భావిస్తారు. సర్పదోషాలను తొలగించి శుభఫలితాలను ప్రసాదించే దేవిగా ఆమెను భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మానసాదేవి ఆలయం, దక్షిణ భారతదేశంలో రెండవదిగా ప్రసిద్ధి చెందిన ఈ మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం.

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం వెలసి ఉంది. ఆలయ మహాద్వారం పైభాగంలో వినాయకుడు, సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి, అపూర్వ లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు దర్శనమిస్తారు. తలపై ఏడు పాములతో స్వయంభువుగా వెలసిన మానసాదేవిని భక్తితో పూజిస్తే కాలసర్ప దోషాలు నివృత్తి అవుతాయని, సంతానప్రాప్తి కలుగుతుందని విశ్వాసం.

పురాణ కథనం ప్రకారం, కశ్యప మహాముని మనసులో నుండి ఉద్భవించినందున ఆమెకు “మానసాదేవి” అనే నామం వచ్చింది. క్షీరసాగర మథన సమయంలో వాసుకి అనే సర్పానికి ఆమెను సోదరిగా భావిస్తారు. జగత్కారువు మహాముని భార్యగా, అస్తిక మహర్షి తల్లిగా ఆమె ప్రాశస్త్యం పురాణాలలో వివరించబడింది.

ప్రధాన ఆలయానికి ఒక వైపున లక్ష్మణ ఆంజనేయసమేత సీతారాములు కొలువై ఉంటారు. శ్రీరామనవమి వంటి పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. మరో వైపున మానసాదేవి సమేతంగా స్వయంభువుగా వెలసిన అపూర్వ లక్ష్మీదేవి దర్శనమిస్తారు. ఆమె ఆశీస్సులు లాభం, జయం, శుభఫలితాలను ప్రసాదిస్తాయని భక్తులు నమ్ముతారు.

ఈ స్థలంలో పూర్వం వీరభద్రస్వామి ఉండేవారని చెబుతారు. శిథిలావస్థలో ఉన్న విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేందుకు తవ్వకాలు చేపట్టినప్పుడు మానసాదేవి మరియు అపూర్వ లక్ష్మీదేవి విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం వీరభద్రస్వామిని క్షేత్రపాలకునిగా నియమించి, దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. శారదా పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి అనుగ్రహంతో, కీర్తిశేషులు రాజశేఖర శర్మగారి ఆధ్వర్యంలో 2018 ఏప్రిల్ 28న నృసింహ జయంతి సందర్భంగా ఆలయ ప్రతిష్ఠాపన జరిగింది. విశేషమేమిటంటే, ప్రతిష్ఠాపన అనంతరం కచ్చితంగా తొమ్మిది నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తయింది.

ఈ క్షేత్రంలో అభిషేకాలు, వాహన పూజలు, నవగ్రహ పూజలు, హోమాలు, శివలింగ నాగప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున ధర్మగుండం దర్శనమిస్తుంది. ఇందులో పరమశివుని విగ్రహంతో పాటు 108 జంట నాగుల విగ్రహాలు, 108 శివలింగాలు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులు స్వయంగా అభిషేకం చేసి పూజలు నిర్వహించవచ్చు.

మరో వైపున 12 అడుగుల ఎత్తైన ఏకశిలా రాతి హనుమంతుని విగ్రహం ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో నవగ్రహాలకూ ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో అరుదుగా కనిపించే విధంగా ఇక్కడ నవగ్రహ కల్యాణం నిర్వహించడం విశేషం. ప్రతి గ్రహానికి ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి, వారి దేవేరులతో సహా కల్యాణోత్సవం నిర్వహిస్తారు. దీని ద్వారా గ్రహదోషాలు నివృత్తి అవుతాయని అర్చకులు చెబుతున్నారు.

ఆలయ ఆవరణలో హోమక్రతువుల కోసం విశాలమైన యాగశాల, గోశాల, పాకశాల నిర్మించబడ్డాయి. గణపతి ఉపాలయం కూడా ఉంది. గర్భాలయం వెలుపల మహాదేవుని దర్శనం లభిస్తుంది. క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు.

కాలసర్ప దోషం, వివాహం మరియు సంతానాభివృద్ధి సంబంధిత సమస్యలు తొలగించేందుకు భక్తులు ప్రతి మంగళవారం ధ్వజస్తంభానికి ముడుపులు కడతారు. ఆలయ గోడలపై నాగుల ప్రతిమలు మానసాదేవి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి.

ప్రతి నెల మంగళవారం రోజున అమ్మవారికి విశేష అలంకరణ జరుగుతుంది. పంచమి రోజున ఉదయం 10:30 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.

ఆలయం కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి సిద్దిపేట మార్గంలో సుమారు 40 కిలోమీటర్ల దూరం. కరీంనగర్ హైవే నుండి 10 కిలోమీటర్లు, గన్నేరువరం మండల కేంద్రం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణా సౌకర్యాలు సులభంగా లభిస్తాయి.

తెలంగాణ రాష్ట్రంలో తొలి మానసాదేవి మహాక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్రస్థలాన్ని మీరు కూడా దర్శించి తల్లి కరుణాకటాక్షాలను పొందాలని ఆకాంక్షిస్తూ…

ఓం శ్రీ మానసాదేవ్యై నమః 🙏

ఈ సమాచారాన్ని video రూపంలో ఇక్కడ చూడండి. 👇👇👇

Bottom of Form

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top