Lord Vishnu Vishwaroopam, the divine universal form, showing countless deities and manifestations of creation

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦

మహావిష్ణువు యొక్క విశ్వరూప౦

మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనం మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరించబడింది.పవిత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యాలు మోహరించగా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. అప్పుడు సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. శంఖాలు పూరించబడ్డాయి. పాండవ పక్షంలో కృష్ణుడు, అర్జునుడు తమ దేవదత్త శంఖాలను పూరించారు. దానికి కౌరవుల హృదయాలు దద్దరిల్లాయి.

బాణ ప్రయోగ సమయం ఆసన్నమైంది. కౌరవులను చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో తన రథాన్ని రెండు సేనల మధ్య నిలపమన్నాడు. కృష్ణుడు అలాగే నిలిపాడు. అర్జునుడు ఉభయ సేనలలోని వీరులను చూసాడు. తాతలు, తండ్రులు, సోదరులు, కొడుకులు, బంధుమిత్రులు, ఆచార్యులు కనిపించారు. తనవారిని చూసి అతను అత్యంత విషాదం చెందాడు.

“కృష్ణా! యుద్ధభూమిలో ఈ బంధుజనులను చూస్తూ నాకు రాజ్యం కోసం, సుఖం కోసం వారిని చంపడం పాపంగా అనిపిస్తోంది. నేను ఈ పాపం చేయలేను” అని చెప్పి బాణాలు వదిలి, కన్నీళ్లు కారుస్తూ రథంలో కూర్చున్నాడు.

అప్పుడు కృష్ణుడు, “పరాక్రమం ప్రదర్శించాల్సిన సమయంలో ఈ పిరికితనం వదిలిపెట్టు. ఆత్మకు మరణం లేదు. కాబట్టి ఎవరి కోసం శోకిస్తున్నావు? క్షత్రియునికి యుద్ధం ఉత్తమ ధర్మం. కర్మ చేయడమే నీ కర్తవ్యం; ఫలితం నీ చేతుల్లో లేదు” అని బోధించాడు. ఆత్మతత్వాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాడు.

దాంతో అర్జునుడు, “ఓ యోగేశ్వరా! యోగుల హృదయాలకు మాత్రమే గమ్యమైన, సామాన్యులకు అసాధ్యమైన నీ విశ్వరూపాన్ని చూడాలని నాకు కోరిక ఉంది. నాకు చూపగలిగితే చూపించు” అని వేడుకున్నాడు.

అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, “అనేక రంగులతో, అనేక ఆకారాలతో, వందలకొద్దీ, వేలకొద్దీ ఉన్న నా దివ్యరూపాలను చూడు. ఆదిత్యులను, వసువులను, అశ్వినీ దేవతలను, మరుతులను మరియు ఎన్నడూ చూడని వింతలను వీక్షించు. ఈ నా దేహంలోనే చరాచరాత్మకమైన సకల ప్రపంచాన్ని దర్శించు. అయితే సాధారణ దృష్టితో నన్ను చూడలేవు. నీకు దివ్యదృష్టిని ఇస్తున్నాను. దాంతో నా విశ్వరూపాన్ని చూడు” అన్నాడు.

ఆ రూపం అనేక ముఖాలతో, నేత్రాలతో, అద్భుతాలతో, దివ్యాభరణాలతో, అనేక దివ్యాయుధాలతో, దివ్యవస్త్రాలతో దేదీప్యమానంగా విరాజిల్లింది. ఏకకాలంలో ఆకాశంలో వేల సూర్యులు ఉదయించిన కాంతి కూడా ఆ విశ్వరూప తేజస్సుకు సాటిరాదు.

అర్జునుడు దేవదేవుని దేహంలో ఒకేచోట విభజించబడి ఉన్న సమస్త ప్రపంచాన్ని దర్శించాడు. ఆశ్చర్యచకితుడై, శరీరం పులకరించి, భగవంతునికి తలవంచి నమస్కరించి చేతులు జోడించి ఇలా అన్నాడు:

“దేవా! నీ దేహంలో సమస్త దేవతలను, చరాచర జగత్తును, కమలాసనంలో ఉన్న బ్రహ్మను, సర్వ ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. అనేక భుజాలు, కడుపులు, ముఖాలు, కళ్లతో కూడిన నీ అనంతరూపాన్ని అంతటా చూస్తున్నాను. నీ ఆది, మధ్య, అంతము నాకు కనిపించడం లేదు. కిరీటం, గద, చక్రం ధరించి దశదిశలా కాంతిపుంజంలా వెలుగొందుతూ సూర్యాగ్ని కాంతికి సమానంగా ప్రకాశిస్తున్న నిన్ను అంతటా చూస్తున్నాను.

నీవే పరబ్రహ్మము, సమస్త జగత్తుకు మూలాధారము, నాశనం లేని వాడు, సనాతన ధర్మ సంరక్షకుడు, పురాణపురుషుడు అని నేను భావిస్తున్నాను. నీవు ఆదిమధ్యాంతరహితుడవు, అపరిమిత సామర్థ్యముగలవు, అనేక చేతులు కలవాడు. చంద్రసూర్యులు నీ కన్నులవలె, ప్రజ్వలిత అగ్నిలాంటి ముఖముతో జగత్తును ప్రకాశింపజేస్తున్నావు.”

అయినా నీవు నాకు సాక్షాత్కరించావు. ఆకాశం, భూమి మధ్యనున్న ఈ ప్రదేశమంతా, దశదిశలన్నీ నీతోనే నిండి ఉన్నాయి. అద్భుతమైన, అతి భయంకరమైన నీ విశ్వరూపాన్ని చూసి మూడు లోకాలు గడగడ వణుకుతున్నాయి. ఈ దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొందరు భయంతో చేతులు జోడించి నిన్ను స్తుతిస్తున్నారు. మహర్షులు, సిద్ధుల సమూహాలు మంగళవాక్యాలు పలికి సంపూర్ణ స్తోత్రాలతో నిన్ను పొగుడుతున్నారు.

ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్వినీ దేవతలు, మరుతులు, పితృదేవతలు, యక్షులు, సిద్ధులు, అసురసంఘాలు వీరందరూ నిన్ను విస్మయంతో వీక్షిస్తున్నారు. ఎన్నో ముఖాలు, కళ్ళు, చేతులు, తొడలు, పాదాలు, కడుపులు, దంతాలతో భయంకరంగా ఉన్న నీ రూపాన్ని చూసి లోకమంతా భయపడుతోంది. నేను కూడా భయపడుతున్నాను.

ఆకాశాన్ని తాకేలా అనేక రంగులతో వెలుగొందుతూ, విప్పారిన విశాల నేత్రాలతో ఉన్న నిన్ను చూసి నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. ప్రళయకాల అగ్నిలా భయంకరంగా కనిపిస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. ఓ దేవా, నన్ను అనుగ్రహించు.

ధృతరాష్ట్రుని పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అలాగే మన పక్షానికి చెందిన ప్రముఖ యోధులు కూడా నీ భయంకరమైన దంతాలలో ఇరుక్కుపోయి పొడిగా మారుతున్న తలలతో కనిపిస్తున్నారు. నదులు సముద్రం వైపు పరిగెత్తినట్లే ఈ వీరులందరూ నీ జ్వలిస్తున్న ముఖాలలోకి ప్రవేశిస్తున్నారు. మిడతలు మండుతున్న అగ్నిలోకి దూకినట్లే ఈ ప్రజలందరూ వేగంగా నీ నోళ్లలో ప్రవేశిస్తున్నారు. ఈ సర్వలోకాలను మింగుతూ జగత్తంతటినీ నీ తేజస్సుతో నింపి తీవ్రమైన కాంతితో ప్రకాశిస్తున్నావు.

ఈ ఉగ్రరూపంలో ఉన్న నీవెవరో చెప్పు. నన్ను అనుగ్రహించు. నీ ప్రవృత్తి నాకు అర్థం కావడం లేదు అన్నాడు.

అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు: “ఈ లోక సంహారానికి విజృంభించిన కాలస్వరూపుడను నేను. ప్రస్తుతం ఈ ప్రపంచంలోని ప్రజలను సంహరించడం నా సంకల్పం. నీవు యుద్ధం చేయకపోయినా శత్రుసైన్యంలో ఉన్న వీరులంతా వినాశనం పొందడం ఖాయం. కాబట్టి యుద్ధానికి సిద్ధమై పేరు ప్రఖ్యాతులు పొందు. శత్రువులను జయించి సంపూర్ణ రాజ్యాన్ని అనుభవించు. వీరందరినీ ముందే నేను సంహరించాను. ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు వంటి వీరులను నీవు వధించు. భయపడకు, యుద్ధం చేయి; శత్రువులను జయిస్తావు” అన్నాడు.

మాటలు విని అర్జునుడు వణుకుతూ చేతులు జోడించి గద్గద స్వరంతో ఇలా అన్నాడు: “హృషీకేశా! నీ మహిమను పొగుడుతూ జగత్తంతా ఆనందం, అనురాగం పొందుతోంది. రాక్షసులు భయపడి అన్ని వైపులా పారిపోతున్నారు. సిద్ధుల సమూహాలు నీకు నమస్కరిస్తున్నాయి. నీవు అంతులేని వాడవు. దేవతలకు, జగత్తంతటికీ ఆధారమైన శాశ్వతుడవు. ఈ విశ్వమంతా పరంధాముడైన నీతో నిండి ఉంది. యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు — అందరికీ తండ్రివి నీవే. నీకు అనేక వేల నమస్కారాలు.

నీ మహిమ తెలియక స్నేహబావంతో ‘కృష్ణా’, ‘యాదవా’, ‘సఖా’ అని నిర్లక్ష్యంగా పిలిచినందుకు, కలిసిమెలిసి తిరిగేటప్పుడు, పడుకున్నప్పుడు, ఇతరులతో ఉన్నప్పుడు వేళాకోళంగా నిన్ను సంభోదించినందుకు నా తప్పులన్నింటినీ మన్నించు. ఈ చరాచర ప్రపంచానికి గురువు, ప్రభువు అయిన నీకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. తండ్రి కొడుకును క్షమించినట్లూ, స్నేహితుడు స్నేహితుడిని క్షమించినట్లూ, ప్రియుడు ప్రియురాలిని క్షమించినట్లూ నన్ను క్షమించు.

ఈ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను; అయితే నా మనసు భయంతో కలత చెందుతోంది. దయచేసి నీ పూర్వరూపాన్ని చూపించు. కిరీటం, గద, చక్రం ధరించి నాలుగు భుజాలతో ఉన్న నీ సౌమ్యరూపంలో నాకు సాక్షాత్కరించు” అన్నాడు.

కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: “అర్జునా! నీపై దయచేసి నా యోగమహిమతో ఈ తేజోమయమైన, సర్వోత్తమమైన విశ్వరూపాన్ని చూపించాను. నీవు తప్ప ఈ రూపాన్ని ఎవరూ చూడలేరు. వేదాలు చదవడం వల్లగాని, యజ్ఞాలు, దానాలు, కర్మలు చేయడం వల్లగాని, ఘోర తపస్సులు చేయడం వల్లగాని ఈ విశ్వరూప దర్శనం సాధ్యం కాదు.”

 నా ఈ విశ్వరూపం చూసి భయపడకు, బ్రాంతి చెందకు. నీవు నిర్భయంగా, సంతోషంగా నా పూర్వరూపాన్ని మళ్లీ చూడు అని అర్జునుడితో చెప్పి శ్రీకృష్ణుడు మళ్లీ తన పూర్వరూపాన్ని చూపించాడు. ఆ మహాత్ముడు తన సౌమ్యరూపాన్ని ధరించి భయభీతుడైన అర్జునుడిని ఓదార్చాడు.

అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో, “జనార్ధనా! ప్రశాంతమైన నీ మానవరూపం చూశాక నా మనసు కుదుటపడింది. నాకు స్వస్థత ఏర్పడింది. నిజంగా నిన్ను తెలుసుకోవడం సాటిలేని భక్తితోనే సాధ్యమవుతుంది” అన్నాడు.

అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, “నీవు వీక్షించిన నా విశ్వరూపాన్ని ఇతరులు చూడడం అత్యంత దుర్లభం. దేవతలు కూడా ఈ రూపాన్ని దర్శించాలని నిత్యం కోరుతుంటారు. నేను చూపించిన ఈ విశ్వరూప సందర్శనం వేదాల వల్లగాని, తపస్సుల వల్లగాని, దానాదుల వల్లగాని, యజ్ఞాల వల్లగాని లభించదు. అనన్యభక్తితో, నన్నే పరమగతిగా భావించి, నా మీదే భక్తి కలిగి, ఇతర దేనిమీద ఆసక్తి లేకుండా, సమస్త ప్రాణుల పట్ల శత్రుభావం లేనివాడు నన్ను పొందుతాడు” అని పలికాడు.

అర్జునుడు, “కేశవా! నాకు మోహమనే చీకటి తొలగింది. నీ దివ్యరూపాన్ని దర్శించి భక్తి భావాలు కలిగాయి. నా సందేహాలన్నీ తీరాయి. నీవు బోధించినట్లు ఆచరిస్తాను” అని చెప్పి భక్తిపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి ధృఢచిత్తంతో గాండీవాన్ని చేపట్టి ఎంతో ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొన్నాడు.

శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉన్నారో అక్కడ విజయం, నీతి, సిరిసంపదలు నిత్యమూ నిలిచి ఉంటాయని సంజయుడు పేర్కొన్నాడు.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top