google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం

పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ వైభోగం

భవిష్యోత్తర పురాణం 11 వ అధ్యాయంలో చెప్పబడిన, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు -పద్మావతీ దేవిల వివాహం ఎంత వైభవంగా జరిగిందో, దేవతలందరూ పెళ్లి పెద్దలుగా మారి, వారి వివాహం ఎలా జరిపించారో చూద్దాం. ముందుగా ఈ కళ్యాణానికి కాస్త ముందు జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం.

ద్వాపర యుగాంతంలో శ్రీ కృష్ణావతారం తరువాత, ప్రముఖ ఋషులు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి యజ్ఞ ఫలాన్ని ఎవరికి సమర్పిస్తున్నారు అని అడిగారు. అప్పుడు ఋషులందరూ నారద మహర్షి సలహా మేరకు, యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి సమర్ధులైన వారెవరో పరీక్షించమని భృగు మహర్షిని కోరతారు. ఈ ప్రక్రియలో భృగు మహర్షి బ్రహ్మ లోకాన్ని, కైలాసాన్ని సందర్శించి వారు రజో, తమో గుణాలను కలిగి ఉన్నందున వారిని తిరస్కరించి వైకుంటం చేరుకుంటాడు. తన రాకను గమనించని విష్ణువు మీద కూడా కోపగించి, లక్ష్మి నివాస స్థానమైన విష్ణువు ఛాతీ మీద కాలితో తన్నగా విష్ణువు అతని అహంకారాన్ని పోగొడతాడు.

తన రాకను గమనించనందుకు క్షమాపనలను చెప్తాడు. కానీ తన స్థానమైన విష్ణువు ఛాతీ మీద తన్నడంతో శ్రీలక్ష్మి అలిగి వైకుంటాన్ని విడిచిపెట్టి భూలోకంలోని కొల్హాపురం చేరుకుంటుంది.  వెంకటేశ్వరుడు కలత చెంది లక్ష్మిని వెతుక్కుంటూ భూమి మీదకొచ్చి వకుళ మాత సంరక్షణలో శ్రీనివాసుని పేరుతో నివసిస్తాడు. ఆకాశరాజు నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని తొందమండలం అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. ఆయన తమ్ముడు తొండమానుడు. ఒకరోజు శ్రీనివాసుడు విహారయాత్రలో ఆకాశరాజు కూతురైన పద్మావతి దేవిని చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తరువాత ఇరు పెద్దలూ అంగీకరించి దైవ గురువు బృహస్పతితో సంప్రదించి వివాహ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. శుక మహర్షికి వివాహా ఆహ్వాన లేఖను ఇచ్చి శ్రీనివాసునికి అందజేయమని చెప్తాడు. శుక మహర్షి ద్వారా లేఖను అందుకున్న శ్రీనివాసుడు తన వివాహ ఏర్పాట్లు చేయమని బ్రహ్మాది దేవతలను పిలుస్తాడు.

బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటి దేవతలు కదిలి వస్తారు. గరుడుని వార్తతో యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా బయలుదేరతారు. పురాణం ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బ్రహ్మ పరివారమంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు. వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో, ఆయా లోకాలవారు కూడా వీరిని కలుస్తారు. అందరూ దివ్యతేజోమూర్తులు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట గుంపుగా చేరితే ఎలా ఉంటుందో, అలా ఉంది సన్నివేశం. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానంచేస్తున్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది.

ఇదిలా ఉంటే- ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతోంది. అందరూ బయలుదేరారో లేదో, సమయానికి వస్తారో లేదో అని అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. ఇంతలో గరుత్మంతులవారు, ఆదిశేషులవారు బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తుంటారు.

దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబుర తీర్ధం చేరి అక్కడ స్నానం చేసి, అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు, ఎదురు వెళ్ళి బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుంటాడు. శివుడి తలపై నిమురుతాడు. కొందరికి కరచాలనం చేస్తాడు, కొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తాడు. వాయుదేవుడిని ఆలింగనం చేసుకుంటాడు.

వేంకటాచలం అంతా అతిధులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పండగ వాతావరణం, కోలాహలం, ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు, దీవెనలు తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళి కళ వచ్చేసింది వేంకటాచలంలో. ఇంతమంది అతిధులు రావడం ఒక ఎత్తైతే, ఇంతమందికి వసతి ,భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు.

అందుకే శ్రీనివాసుడు ఇంద్రునితో ఇంత మంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినపుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా, అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు. విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంత మంది అతిధులతో మనం నారాయణ వనం వెళితే, అక్కడ విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారికి ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి, మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని ఇంద్రునితో అంటాడు శ్రీనివాసుడు. అలా నారాయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది.

ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి, మర్యాదలు, పిలుపులు బాధ్యత షణ్ముఖుడికి, వంటావార్పు అగ్నిహోత్రునికీ, నీటి సదుపాయం వరుణునికి, ఆకులు, దొన్నెలు తయారీ నవగ్రహాలకు, పాత్రల శుద్ధి వసువులకు, పౌరోహిత్యం వశిష్టునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరునికి, వెలుగును చంద్రునికి అప్పగించారు. బయటకు ఇంతమంది దేవతలు పెళ్ళి పనుల్లో మునిగిపోయినట్టు కనిపించినా, అంత ఒకటే తత్వం. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే, ఒకే భగవంతుడు, అనేక రూపాల్లో, అనేక కార్యాలు చేస్తున్న అద్భుత దృశ్యం ఇది.

వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా డీలాపడిపోయీ మహాలక్ష్మి లేనిదే నాకు ఏ వేడుకా జరగదు. సూర్యుణ్ణి పిలిచి ఆమెను తీసుకురమ్మంటాడు.

సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కొల్హాపూర్ వెళతాడు. మొదట ప్రణయకలహం గుర్తుకొచ్చి రానన్నా, తరువాత పతిని విడిచి ఇక ఉండలేక బయలుదేరి లక్ష్మీదేవి కూడా వేంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్ళిపెత్తనమంతా లక్ష్మీదేవిది, వకుళాదేవిది అయ్యింది. పెళ్ళిపనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళస్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువలంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో, శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించి, నలుగు పెట్టి హారతి ఇచ్చారు. తరువాత అభ్యంగనస్నానం చేయించి, మళ్ళీ హారతులిచ్చారు. అసలే జగన్మోహనాకారుడు, పెళ్ళి కళతో మరింత మెరిసిపోతున్నాడు. దానికితోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా, సమ్మోహనంగా కనిపిస్తున్నాడో మాటల్లో చెప్పలేం. అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళస్నాన ఘట్టం ముగిసింది.

తరువాతి కార్యక్రమం పుణ్యావచహనం, అటు తరువాత కులదేవత స్థాపనం, కులదేవతను పూజించడం. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహం. దానికి సమాధానం స్వామియే చెప్తారు. ‘శమీవృక్షమే మా కులదైవం’ అని చెప్పిన స్వామి, కుమారధారలో ఉన్న శమీవృక్షానికి కులదేవత పూజ చేస్తారు. మరి ప్రతిష్ట ఎక్కడ చేయాలని అడుగుగా, వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దాం అంటారు. అప్పుడు వరాహస్వామికి ఆహ్వానపత్రిక ఇవ్వలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకువస్తుంది.

స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తాడు. వరాహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్ళికి హాజరు కాలేనని చెప్పి, తన తరుపున వకుళమాత వస్తుందని చెప్తారు. “మీరు అందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రండి, నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడు ఉంటుంది” అంటారు. తరువాత కులదేవత స్థాపన, పూజ ముగుస్తాయి.

ఇక అందరం పెళ్ళికి బయలుదేరుదాం అంటాడు స్వామి. ఇంతలో బ్రహ్మదేవుడు కలుగజేసుకుని ఆక్షేపిస్తాడు. “కులదేవతను ఆహ్వానించి పూజించిన తరువాత అన్నసంతర్పణ చేయకుండా ఎలా వెళతాం? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ప్రయాణం చేసి అలసిపోయారు. అందరికి కడుపునిండా తృప్తిగా భోజనాలు పెట్టాక, అప్పుడు బయలుదేరితే బాగుంటుంది” అంటారు.

సమంజసమే కానీ, ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి డబ్బేది? అని శ్రీనివాసుడు ఆలోచిస్తూ ఉండగా అలకాపురి అధిపతి అయిన కుబేరుణ్ణి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల రావి చెట్టు వద్దకు పిలిపిస్తారు.

శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి అక్కడికి వెళ్ళి, నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతారు. “స్వామి, మీరిలా నన్ను అడగడమేమిటి? ఇదంతా మీ ఐశ్వర్యమే. మీ తరుపునే నేనీ ధనాన్ని రక్షిస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి” అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పత్రం రాసి, చక్రవడ్డీ కట్టాలనీ, ఇదే కలియుగంలో కనిపిస్తుందని, కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు.

“అప్పు ఇస్తాను సరే, నీవు తిరిగి ఇస్తానన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగం, కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా సాక్షులు కావాలి అంటాడు కుబేరుడు శ్రీనివాసుడితో, పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు.

బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక, పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నదని, అప్పు చెల్లించకుండా శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి, ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు కుబేరుడు. శివుడు సంతకం పెడతానంటాడు. నీవు ఎప్పుడు కైలాసపర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు. నీకు కోపం ఎక్కువంటారు. కోపంతో మూడవకన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం, కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు.

అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు. సరే అయితే, నేను సాక్షి సంతకం పెడతా అంటుంది ఆ రావి చెట్టు. ముగ్గురు సాక్షులూ వచ్చారు కనుక, అప్పు పత్రం రాసుకుందాం అంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు. అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు. అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో, వైశాఖమాస శుక్లపక్ష సప్తమినాడు పదునాలుగు లక్షల రామముద్ర గల సువర్ణ నాణేలు వడ్డీనిచ్చే షరతుతో ఇవ్వబడినవి. వడ్డితో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం.

అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు. ‘భవిషత్తులో నా భక్తులు చాలా కానుకలు నా హుండీలో వేస్తారు. ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను’ అంటాడు. అందరికి అన్నీ ప్రసాదించగలవాడు, కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు, అడగడం ఒక దివ్యలీల, డబ్బు మీ దగ్గరే ఉంచి, ఖర్చు చెయ్యమని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు.

ఇక- చేయాల్సిన పెళ్ళి పనులను, అందరు దేవతలకు వారివారి శక్తినిబట్టి, యోగ్యతను బట్టి అప్పగిస్తారు. వంటపని అంతా అగ్నిదేవుడికి, మర్యాదలు, పిలుపులు కుమారస్వామికి, వచ్చినవారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు, వీటన్నిటికి డబ్బులు సర్దడం కుబేరునికి అప్పగించారు. ఇలా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.

వంటల విషయం వచ్చేసరికి వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వండండి అంటాడు శ్రీనివాసుడు. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి? పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. ఒక్కో తీర్ధంలో ఒక్కో వంటకం వండుతారు.

స్వామి పుష్కరిణిలో అన్నం, ఆకాశగంగలో నెయ్యి వేసి చేసిన పరమాన్నం, కూరలకు, నెయ్యి కాచడానికి దేవతర్ధం, తుబురతీర్ధంలో పులిహోర, కుమార తీర్ధంలో వివిధ రకాలైన భక్ష్యాలు, పాండుతీర్ధంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు.

దేవతలందరూ చక్కగా ఆటపాటలతో, కబుర్లతో, భక్తిపారవశ్యతంతో, తమ ఇచ్ఛాశక్తి చేత పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం సిద్ధం చేశారు. వంటకాలు గుమగుమలు బ్రహ్మండమంతా వ్యాపిస్తున్నాయి. ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. అంతా సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.

“నైవేద్యం పెట్టిన తరువాతే అధిదలందరికి వడ్డన. నువ్వే భగవంతుడివి, యజ్ఞభోక్తవి, కనుక ముందు నువ్వు భోజనం చేయి” అని శ్రీనివాసునితో బ్రహ్మదేవుడంటాడు. “నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు” అంటాడు స్వామి. నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.

“నేను ఇంకో రూపంలో శేషాచలం మీద, అహోబిలంలో నరసింహునిగా వెలసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరికి నైవేద్యం వడ్డించండి” అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేస్తారు.  పాండు తీర్ధం నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను పరిచి, వారివారి పెద్దతనాన్ని అనుసరించి, ఆశీస్సులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు. వడ్డించడంలో కూడా శాస్త్రం కొన్ని నియమాలను విధించింది. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఎలా వడ్డించాలన్నది చెప్పింది. ఇవన్నీ ఎంతో శాస్త్రీయమైనవి. 

దాన్ని అనుసరించి వేంకటాచలంలో కూడా వడ్డన జరిగింది. ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, శాస్త్రం ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారు. భోజన ప్రారంభానికి ముందు శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీరు తీసుకుని, అతిధులందరికి నమస్కరించి, మీ వంటి జ్ఞానపూర్ణులైనవారికి ఈ కొద్దిపాటి అన్నమూ, నీరుతో ఏ మాత్రము తృప్తి కలుగదు. అయినా మీరు కరుణ కలిగినవారు కనుక నే పెట్టిన ఈ కాస్త ఆహారమునూ, అధికంగా, ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్ధుడిని చేయండి” అన్నాడు. చివరగా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ అంటూ ముగించారు.

అందరి భోజనాలు ముగిశాకా, అందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చారు. అది కూడా వారివారి పాండిత్యాన్ని, యోగ్యతను అనుసరించే. శ్రేష్టులైన ద్విజులకు ఒక రామటెంక అంటే బంగారు నాణెము, వేదాంతులకు అందులో సగము, బ్రహ్మచారులకు వేదాంతుల దక్షిణలో సగమూ ఇచ్చారు.  అందరి భోజనాలు మిగిశాకా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భోజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయింది. .

అలా అందరి భోజనాలు పూర్తయ్యాక, ఆ రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాలు, కబుర్ల మధ్య మగపెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. సంబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం పద్మ సరోవరం చేరుకుంది. ఇక్కడే శ్రీ శుకాచార్యులవారి ఆశ్రమం ఉంది. పద్మసరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసుని చేరి, తన ఆశ్రమానికి విచ్చేసి, ఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరగా వారి ఆతిథ్యం స్వీకరించి ఆ రాత్రికి అక్కడే గడిపి, నవమినాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు.

దశమినాటి ఉదయం శ్రీనివాసుడు మంగళస్నానం చేశాడు. పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతిని తెలుపుతూ “ఈనాటి రాత్రియే వివాహమూహుర్తం కనుక మనం ఐదుగురం, నేను, లక్ష్మీదేవి, వకుళాదేవి, బ్రహ్మ, మీరు భోజనం చేయకూడదు. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి పెండ్లికూతురు, వారి పురోహితుడు భోజనం చేయకూడదు” అని చెప్పి, కుబేరునితో “కుబేరా! బ్రాహ్మణభోజనానికి ఆకాశరాజును తగిన ఏర్పాట్లు చేయమని చెప్పు, ముహూర్తం రాత్రి 13 నాడులకు, ఆ తరువాత బ్రాహ్మణులు భోజనం చేయడం నిషేధం” అని చెప్తాడు. శ్రీనివాసుని తీసుకువెళ్ళడం కోసం ఇంద్రుడి ఐరావతం తీసుకొని ధరణీదేవితో కలిసి వస్తాడు ఆకాశరాజు. ఐరాతవతంపై శ్రీనివాసుని కూర్చొబెట్టి, లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు ఇలా అందరి సమేతంగా తీసుకివెళతాడు ఆకాశరాజు.

శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడి పాదాలు కడగటానికి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలను ఆకాశరాజు, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమనీ, ఎందరో తపస్సులు చేస్తున్నారో, ఏవరి పాదదూళి సోకితే పరమదరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకం రాజ్యమంతా ప్రోక్షణ చేయించాడు. ముహూర్తం సమీపించగా, కోటి సువర్ణనాణెములతో పాటు 100 తులాల బంగారు కీరీటం, అంతే బరువుగల నడుముపట్టీ, భుజకీర్తులు, నూపురములు, 2 నాగ భుజ భూషణములు, భుజాల వరకు వేళాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు, 32 తులాల బరువు గలిగిన నవరత్న ఖచిత కంకణాలు, నాగభూషణాలు రెండు, 111 తులాల బరువు కలిగిన, వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజనపాత్ర, చెంబు, పంచపాత్రలు, పంచపాత్రలు, 64 పట్టువస్త్రాలు, ఇలా ఆకాశరాజు.శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు అని భావిశ్యోత్తర పురాణం చెబుతోంది.

వధూవరుల ప్రవరలు చెప్పించి, బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. “అత్రిగోత్రమున జన్మించిన సువీరుని మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాకు పుత్రిక అయిన పద్మావతీదేవిని -యయాతి మునిమనుమడు, శూరశేనుని మనుమడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రములో పుట్టిన వేంకటేశ్వరునకిచ్చి వివాహం చేయదలిచారని చెప్తూ, కన్యాదానం పూర్తి చేశారు. మంగళసూత్రధారణ చేసిన తరువాత నవరత్నాలను అక్షింతలుగా వేసి, ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తరువాత వచ్చిన అతిధులందరికీ దక్షిణతాంబులాలు ఇచ్చాడు ఆకాశరాజు. కోటిసహస్ర గోవులను బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు ఆకాశరాజు. అంతా ముగిశాక కొత్త దంపతులతో కలిసి అందరూ భూరిభోజనాలు చేశారు.

మొత్తం 5 రోజుల పెళ్ళి జరిగిందని పురాణం చెప్తోంది. ఐదవరోజు అపగింతల్లో  ఆకాశరాజు, ధరణిదేవి పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారు. పద్మావతీదేవి శ్రీనివాసునితి వెళ్ళిపోతోందన్న బాధతో భోరున ఏడ్చారు ఆకాశరాజు – దంపతులు, పద్మావతీదేవి సోదరుడు వసుద, ఆమె పినతండ్రి తొండమానుడు. అప్పటివరకు ఉత్సాహంతో, కోలాహలంతో నిండిన పెళ్ళిమండపం, ఒక్కసారిగా దుఃఖంలో మునిగిపోయింది. తన విడిచికి పద్మావతీదేవిని తీసుకువెళ్ళి శ్రీనివాసుడు గృహప్రవేశం చేశాడు. తరువాత గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని, తన నివాసానికి తీసుకువెళతాడు శ్రీనివాసుడు.

ఇలా పంపుతూ, ఆకాశరాజు పద్మావతీదేవికి మూదువందల పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లం, అధికంగా చింతపండు, వెయికడవల పాలు, నూరుకుండల పెరుగు, పదిహేను వందల చర్మ పాత్రల నిండా నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండా నూనె, రెండువందల కుండల నిండా పంచదార, దోసపండ్లు, మామిడిపండ్లు, అరటిగెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, రెండువందల కుండల నిండుగా తేనె, లెక్కలేనన్ని అరటికాయలు, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసిన మంచం, పరుపులు, దిండ్లను సారెగా ఇచ్చాడు.

వాటిని 10,000 గుర్రాలు, 1,000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనం, 300 దాసజనం తీసుకెళ్లారు. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుజ్యమోక్షాన్ని ఇచ్చాడని పురాణం. ఈ కళ్యాణం జరిగిన ప్రదేశం ప్రస్తుతం నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం. ఇది తిరుపతి నుండి చెన్నై వెళ్ళే మార్గంలో పుత్తూరు సమీపంలో 33 కిలో మీటర్ల దూరంలో ఉంది. పద్మావతీ దేవి వివాహానికి నిదర్శనంగా ఈ ఆలయంలో వారి కళ్యాణం సమయంలో ఉపయోగించినట్టు చెప్పబడే తిరగలి ఇప్పటికీ మనం చూడొచ్చు.

కళ్యాణం అయిన తరువాత పద్మావతీ శ్రీనివాసులు అగస్త్య మహర్షి సలహా మేరకు వారి ఆశ్రమంలో ఆరు నెలలు ఉన్నారు. ఆ ప్రదేశాన్ని ప్రస్తుతం శ్రీనివాస మంగాపురం అని పిలుస్తారు. ఇది తిరుపతికి 15 కిలోమేటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వెంకటేశ్వరుని ఆలయం ఉంది. ఇక్కడ కూడా స్వామిని కళ్యాణ వేంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. శ్రీనివాస కళ్యాణ ఘట్టాన్ని విన్నా, చదివినా వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలూ కలుగుతాయి.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top