లక్ష్మి దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ పనులు అస్సలు చేయకండి
సర్వసంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మీ కరుణాకటాక్ష వీక్షణల కోసం ఎదురు చూడని వారు ఎవరూ ఉండరు. చాలా మందిని ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి. డబ్బు నిలవడం లేదని, సంపాదించినంతా ఖర్చైపోతుందని కొందరు బాధపడుతుంటారు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా రాణింపు, గుర్తింపు తక్కువగా ఉందని అనుకుంటారు.
లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే ఆ ఇంట్లో సంపద నిలుస్తుంది. సంపద అనగానే చాలా మంది ధనం మాత్రమే అనుకుంటారు. కానీ కనీస అవసరాలకు లోటు లేకుండా ఉండడమే నిజమైన సంపద. మనకు నిరంతరాయంగా సంపదను ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి. అందుకే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు.
ఆమె కృప కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటాం. కానీ లక్ష్మీదేవి నివాసస్థానాలు ఏమిటి? ఆమె కరుణ పొందేందుకు చేయాల్సిన పనులు ఏమిటి? చేయకూడని పనులు ఏమిటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చాలా మంది చేయరు.
పూజలు, వ్రతాలతో పాటు మన జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఇప్పుడు లక్ష్మీదేవి నివాసస్థానాలు, ఆమెకు ప్రీతికరమైన విషయాలు, ఆమె నివసించని స్థానాలు ఏమిటో తెలుసుకుందాం.
భారతీయ సంస్కృతి ఛానల్‌ను సపోర్ట్ చేయాలనుకుంటే ఐదు సెకండ్లు కేటాయించి వీడియోను లైక్ చేసి, చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
లక్ష్మీదేవి నివాసస్థానాలు
తామర పువ్వు లక్ష్మీదేవి ప్రీతిపాత్రమైనది. తామరపువ్వుతో పూజిస్తే విశేష ఫలితం లభిస్తుంది.
వివాహిత స్త్రీలు ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం అని భావిస్తారు. ప్రతి వివాహిత స్త్రీ తన నుదుటి పై కుంకుమ ధరించాలి. దానివల్ల దేవి అనుగ్రహం లభించి కుటుంబానికి ఐశ్వర్యం కలుగుతుంది.
పసుపు, కుంకుమ, మాంగల్యం, గాజులు, దీపం వంటి పవిత్ర వస్తువులలో లక్ష్మీ నివసిస్తుందని పెద్దలు పేర్కొన్నారు.
ఏనుగు కుంభస్థలం లక్ష్మీ స్థానం అని భావిస్తారు. గజముఖుడైన వినాయకుని చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి పూజించడం కూడా శుభప్రదం.
గోవు వెనుక భాగం లక్ష్మీ ఆవాసంగా భావిస్తారు. అందుకే గృహప్రవేశం, గోదానం వంటి కార్యక్రమాలలో గోవును పూజిస్తారు.
బిల్వ వృక్షం కూడా పవిత్రమైనది. బిల్వ వృక్షం సమీపంలో పూజ చేయడం శుభఫలితాన్ని ఇస్తుంది.
లక్ష్మీదేవి నివసించని స్థానాలు
శంఖధ్వని వినిపించని చోట, తులసి పూజ చేయని ఇంట్లో, శుభ్రత లేకుండా ఉండే గృహంలో లక్ష్మీదేవి నివసించదు.
ఇల్లాలు అపరిశుభ్రంగా ఉండే చోట, చిరిగిన దుస్తులు ధరించి, ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండే ఇంట్లో లక్ష్మీ ఉండదు.
విష్ణువును ఆరాధించని వారు, ఏకాదశి వంటి పవిత్ర దినాల్లో నియమాలు పాటించని వారి ఇళ్లలో లక్ష్మీ నిలవదు.
ఇతరులను హింసించే వారు, సద్గుణుల్ని నిందించే వారు, భగవత్ భక్తులను అవమానించే వారి గృహంలో లక్ష్మీదేవి ఉండదు.
అత్యాశ, అబద్ధాలు, సోమరితనం, అపరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి దూరమవుతుంది.
పొద్దుపోయే వరకు నిద్రించడం, సాయంత్ర సమయంలో నిద్రించడం శుభప్రదం కాదు.
ఇంట్లో ఎల్లప్పుడూ కలహాలు జరిగే చోట లక్ష్మీదేవి ప్రవేశించదు. భర్త–భార్యలు నిరంతరం గొడవపడే ఇంట్లో ఐశ్వర్యం నిలవదు.
అన్నాన్ని, ధనాన్ని, పూలను నిర్లక్ష్యం చేసే వారు ఆమె అనుగ్రహం పొందలేరు.
మహిళలను అవమానించే, మూగజీవులను హింసించే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదు.
రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలను శుభ్రం చేయకుండా ఉంచకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంచాలి.
విరిగిన అద్దాలు, చెడిపోయిన గడియారాలు, పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంచకూడదు. ఇవి దరిద్రానికి కారణమవుతాయని పెద్దలు చెబుతారు.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చేయాల్సినవి
ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమతో అలంకారం చేయాలి. ప్రధాన ద్వారం పై స్వస్తిక్ చిహ్నం వేయడం శుభప్రదం.
ప్రతి ఉదయం ఇంటి వాకిలిని ఊడ్చి ముగ్గు వేయాలి. తులసి పూజ చేయాలి. ఇరుసంధ్యలలో దీపారాధన చేయాలి.
సాయంత్ర వేళలో సాంబ్రాణి ధూపం వేయడం శుభప్రదం.
శుక్రవారం తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి లక్ష్మీ పూజ చేయాలి.
అతిథులను గౌరవంగా ఆహ్వానించి, ఖాళీ కడుపుతో పంపకూడదు. అతిథి సేవ లక్ష్మీప్రాప్తికి మార్గం.
మన స్తోమతకు తగ్గట్టు దానధర్మాలు చేయాలి. దానగుణం ఉన్నవారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
ఎక్కడైతే శుభ్రత, పవిత్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
మనమందరం ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి కృపకు పాత్రులమై, పిల్లాపాపలతో సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని లక్ష్మీనారాయణులను ప్రార్థిద్దాం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


