బిల్వాష్టకమ్
బిల్వాష్టకం అనేది శివుడిని స్తుతిస్తూ భక్తులు పఠించే పవిత్రమైన స్తోత్రాలలో ఒకటి. ఇందులో బిల్వదళం (బిల్వపత్రం) యొక్క పవిత్రతను మరియు శివారాధనలో దాని ప్రాముఖ్యతను వివరించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో బిల్వాష్టకాన్ని పఠిస్తూ శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే పాపాలు నివృత్తి అవుతాయని, శివకృప లభిస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. ముఖ్యంగా మహా శివరాత్రి సందర్భంగా ఈ స్తోత్రాన్ని పఠించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.
పురాణాల ప్రకారం బిల్వ వృక్షం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది మరియు శివపూజలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. బిల్వాష్టకాన్ని నిత్యం పఠించడం వల్ల మనసుకు శాంతి, భక్తి, మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని విశ్వాసం ఉంది. ఈ స్తోత్రం ద్వారా భక్తులు శివుని అనుగ్రహాన్ని పొందుతూ జీవితం లో శుభఫలాలు, సౌఖ్యం, మరియు ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తారని భక్తుల నమ్మకం.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం |
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 1 ॥
మూడు దళాలు త్రిగుణముల ఆకారముగా- మూడు నేత్రములు కలవాడు, త్రిశూలము ఆయుధముగా కలవాడు, మూడు జన్మములలోని పాపములను హరించువాడు ఐన శివునికి మూడు ఆకులు గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను.
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః |
తవ పూజ్యాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ॥ 2 ॥
ఓ మహాదేవా! చీలికలులేని కోమలమైన, శుభప్రదమైన మూడు శాఖలుగల బిల్వపత్రముతో నిన్ను పూజించుచున్నాను.
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః |
కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం ॥ 3 ॥
కోటి కన్యాదానములు, కోటి తిలపర్వతములను, బంగారు కొండను దానమిచ్చిన ఎంతటి ఫలము లభించునో, అంతటి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను.
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం |
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ॥ 4 ॥
కాశీక్షేత్రమునందు నివాసముగల కాలభైరవుని దర్శనము, ప్రయాగ క్షేత్రమున మాధవుని దర్శనము వల్ల ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను.
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః |
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం ॥ 5 ॥
ప్రతి సోమవారం ఉపవాస వ్రతమాచరించి, రాత్రి హోమము చేసిన ఎట్టి ఫలితము కలుగునో, అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను.
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా |
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 6 ॥
రామునిచే ప్రతిష్టించబడ్డ శివ లింగము, వివాహము నిర్వహించుట, ఎన్నో తాటాకములు (బావి) త్రవ్వించుట, పుత్రసంతతి కలిగియుండుట వలన ఎట్టి పుణ్యము కలుగునో- అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం |
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ॥ 7 ॥
శివ సహస్రనామ పఠనముతో శివుని అర్చించడం వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ |
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 8 ॥
పార్వతీ సమేతుడు, నందివాహనుడు, భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి బిల్వదళమును సమర్పించుచున్నాను.
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః |
యజ్ఞకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం ॥ 9 ॥
బ్రాహ్మణులకు సాలగ్రామములు దానము చేయుట, పదికోట్ల తటాకములు త్రవ్వించుట, వేలకోట్ల యజ్ఞములు చేయుట వలన ఎట్టి పుణ్యము కలుగునో- అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ |
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ॥ 10 ॥
అశ్వమేధముతో పాటు నూరు యజ్ఞములు చేసి, వేల కోట్ల ఏనుగులను దానమిచ్చుట, కోటి మంది కన్యలను దానము చేయట వలన ఎట్టి పుణ్యము కలుగునో- అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను.
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం |
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం ॥ 11 ॥
బిల్వదళము యొక్క దర్శనం పుణ్యం, దానిని తాకితే ఘోర పాపములను నశింపజేయునట్టి బిల్వ దళమును శివునికి అర్పించుచున్నాను
సహస్రవేద పాఠేషు బ్రహ్మస్తాపన ముచ్యతే |
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం ॥ 12 ॥
బ్రహ్మతత్వము స్థాపితమైన వేదపాఠములను వేలసార్లు పఠించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను
అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తధా |
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం ॥ 13 ॥
వేలాది మందికి అన్నదానము, వేయి ఉపనయనములు చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను, గనుక నేను అనేక జన్మలలో చేసిన పాపము నశించును.
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం ॥ 14 ॥
అచంచలమైన భక్తితో శివుని సన్నిధిలో ఈ బిల్వస్తోత్రమును పఠించినవారికి శివలోకము ప్రాప్తించును.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



