సంవత్సరం లోపు పసిపిల్లలకు చేసే ముఖ్యమైన వేడుకలు
“ఒక చిన్నారి ఇంట్లోకి అడుగుపెట్టగానే…
ఆ తల్లిదండ్రుల జీవితం మొత్తం మారిపోతుంది
ఆ బిడ్డ నవ్వు, పాకుడు, మొదటి అడుగు—
ప్రతి క్షణాన్నీ మనం జ్ఞాపకంలా దాచుకుంటాం ”
ప్రత్యేకించి మన తెలుగు వారి కుటుంబాల్లో ఇవన్నీ ఎంతో వేడుకగా జరుపుకుంటాం. మరి ఏ ఏ సందర్భాల్లో ఏ వేడుక చేస్తారో తెలుసా? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం.
కుటుంబంలోకి చిన్నారి రాక ఆ ఇంటి వారందరికీ ఎంతో ఆనందం కలిగిస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకూ అందరూ ఆ చిన్నిబిడ్డ చుట్టూనే చేరతారు. పుట్టినప్పటి నుండి ఎదిగే వరకూ ప్రతి దశనూ వేడుకగా జరుపుకుంటారు. ప్రత్యేకించి మన తెలుగు వారి కుటుంబాల్లో బిడ్డ నడవడం, పాకడం, బోర్లా పడడం వంటి ఎదుగుదలకు సంబంధించిన విషయాలను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఆయా సందర్భాలను బట్టి రకరకాల పిండివంటలు తయారు చేసి బంధుమిత్రులందరినీ పిలిచి పేరంటం చేస్తారు. ఏ సందర్భాల్లో ఏమేం తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
గుప్పెలు విప్పినప్పుడు లడ్డూలు,
నవ్వులకు నువ్వులుండలు,
ఊ కొడితే ఉగ్గు గిన్నెలు,
బోర్లా పడితే బొబ్బట్లు,
కేరింతలు కొడితే కాజాలు,
పాకితే పాకుండలు లేదా పల్లీలుండలు,
అల్లరికి చిల్లర,
గడప దాటితే గారెలు,
కూర్చుంటే కుడుములు,
అడుగులకు అరిసెలు,
పలుకులకు చిలకలు,
పరుగులకు పాలకోవా,
మాటలకు మణుగుబూరెలు.
ఈ వేడుకలు ఆయా కుటుంబాలను బట్టి, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ సందర్భాలను కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఆ రోజున చిన్నారులకు తలంటు పోసి, కొత్త బట్టలు తొడిగి అందర్నీ పిలిచి పేరంటం చేస్తారు. తమ మనవరాలు లేదా మనవడి అల్లరి చేష్టలను అందరికీ తెలియజేస్తూ తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు ఎంతో మురిసిపోతారు.
తల్లి, అమ్మమ్మ లేదా నానమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుని చిన్నారికి బొట్టు పెట్టి, గంధం పూసి, పన్నీరు చల్లి హారతిచ్చి పాటలు పాడతారు. అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమాల్లో మేనమామ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కార్యక్రమం రోజున మేనమామను పిలిచి బట్టలు పెడతారు. వారు కూడా తమ స్తోమతను బట్టి చిన్నారికి బట్టలు, బొమ్మలు, కానుకలు తీసుకొస్తారు. అరిసెలపై అడుగులు వేయించే సమయంలో మేనమామే చేతులు పట్టుకుని నడిపిస్తారు. మిగిలిన కార్యక్రమాలు కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి.
సందర్భానుసారంగా తయారుచేసిన పిండివంటలను, వస్తువులను అరటిపండుతో పాటు తాంబూలంతో వచ్చిన ముత్తైదువలకు పంచిపెడతారు. తల్లిదండ్రులు, బంధుమిత్రులు పిల్లల వయసుకు తగ్గట్టు రకరకాల వస్తువులను బహుమతిగా ఇస్తారు. స్తోమతను బట్టి బంధువులకు విందు భోజనం ఏర్పాటు చేస్తారు. పేరంటం అయిపోయాక ఇంట్లోని పెద్దవారు చిన్నారికి ఉప్పు, మిరపకాయలతో దిష్టి తీస్తారు.
ఇవన్నీ పిల్లలు పుట్టినప్పటి నుండి 12 నెలల లోపు చేసే వేడుకలు. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండేవారు. వారికి సంబంధించిన ఏదో ఒక వేడుకతో ఇళ్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేవి. ఈ కాలంలో ఈ అందమైన ముచ్చట్లు, సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి. వీలును బట్టి మన చిన్నారులకు కూడా ఈ అచ్చమైన ముచ్చట్లు జరిపిద్దాం. వాళ్లు మాత్రం ఇవన్నీ ఎందుకు మిస్ అవ్వాలి? వాళ్లతో పాటు మనకూ సంబరమే కదా!
ఈ సంప్రదాయాలన్నీ కేవలం వేడుక కోసమే కాకుండా అందులో ఎన్నో ఆరోగ్య, సామాజిక అంశాలు దాగి ఉన్నాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల వారి వయసుకు తగినట్లుగా ఉందో లేదో గమనించేందుకు కూడా ఈ వేడుకలు ఒక సందర్భం అవుతాయి. మన సంతోషాన్ని అందరితో పంచుకోవడం మన సంప్రదాయం కదా.
మరి మీ పిల్లలకు ఏ ఏ వేడుకలు చేశారో, లేదా త్వరలో చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, చిట్టి చిట్టి బుజ్జాయిలు ఉన్నవారికి కూడా షేర్ చేయండి. మర్చిపోయిన మన సంప్రదాయాలను, వేడుకలను మళ్లీ గుర్తుచేసుకుందాం. మీ చిన్న పాపకు లేదా బాబుకు మంచి పేరు కోసం వెతుకుతున్నట్లయితే మన చానల్‌లో ఉన్న వీడియోలు చూడండి. అన్ని అక్షరాలతో మన దేవీదేవతల పేర్లు, ఎంతో అందమైన పేర్లు ఉన్నాయి.
ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన భారతీయ సంస్కృతి చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ను ఆక్టివేట్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్లీ కలుసుకుందాం.
నమస్కారం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


