GARBHARAKSHAMBIKA TEMPLE, TAMILNADU (గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు)

garbharakshambika temple tamilnadu

దేవుడు అన్ని చోట్లా సర్వవ్యాప్తి అయి ఉన్నా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాలలో విశేషించి ఆయన అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అని అంటారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కో క్షేత్రం ఒక్కో కారణానికి ప్రసిద్ధి చెందాయి.  అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి గర్భరక్షాంబికా ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భసంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించే తల్లిగా వెలిసింది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాత గర్భరక్షాంబిక  అమ్మవారిగా భూమిపై అవతరించినట్లు స్థల పురాణం. ఈ అమ్మవారిని మొక్కుకుంటే సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకం వేల ఏళ్ల నుంచి కొనసాగుతుంది. సంతానం లేక బాధపడే స్త్రీలతో పాటు గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు ఈ అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి ఆశీస్సుల వల్ల పిల్లలకు సంబంధించిన ఏ సమస్యలైనా తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. మరి ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ చరిత్ర, విశిష్టతలు, అమ్మవారిని ఎలా పూజించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లా పాపనాశనం తాలూకాలో తిరుకరుకవూర్లో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉండి, కంచిపట్టు చీర ధరించి సర్వాలంకార భూషిత అయి మెరిసిపోతూ  ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ కోరిన వారికి కొంగు బంగారమై సంతాన ప్రాప్తిని అనుగ్రహించడానికి అభయం ఇస్తున్నట్లుగా కనబడుతుంది. ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు శ్రీ ముల్లైవనాథర్ గా స్వయంభువుగా వెలిసాడు. తమిళంలో ముల్లై అంటే మల్లెలు. మల్లెల వనంలో శివలింగం లభ్యం కావడంతో స్వామివారిని ముల్లైవనాధర్ గా పిలుస్తారు. ఈ స్వామి వారిని పూజిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. శంకరుడు స్వయంభువుగా వెలసిన 64 క్షేత్రాలలో ఇదొకటి. ఇక్కడ శివలింగం పుట్టమన్నతో చేసింది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో కాకుండా కేవలం మల్లెల నూనెతో అభిషేకం చేస్తారు.
అలాగే ఈ క్షేత్రానికి మాధవి క్షేత్రం అని కూడా పేరు. మాధవి అంటే సంస్కృతంలో మల్లెలు అని అర్థం. ప్రతి ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు శివలింగం మీద చంద్ర కిరణాలు నేరుగా పడతాయి. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఇక్కడ కర్పగ వినాయకర్, నందీశ్వరుడు కూడా స్వయంభువుగా వెలిసారు. ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ స్వామి వారి సన్నిధి కూడా ఉంది. ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో చోళుల కాలంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలో చోళరాజుల హయాంలో చెక్కిన శిలా ఫలకాలు ఉన్నాయి. రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుళోత్తుంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. పంచ అరణ్య స్థలాలుగా ప్రసిద్ధి చెందిన ముల్లైవనాధర్, సాక్షి నాధర్, పాతాళేశ్వర్ ఆపత్సహాయేశ్వర్, విల్వనేశ్వర్ ఆలయాల్లో ఇదొకటి. ఈ ఐదు ఆలయాలను ఒకే రోజులో దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
garbharakshambika stotram in telugu
garbharakshambika stotram in telugu
 పూర్వం ఇక్కడ నిదృవ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ శివుణ్ణి పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఇద్దరూ ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం కలగకపోవడం. సంతానం కోసం వీరిద్దరూ పార్వతీపరమేశ్వరులను విశేషంగా ఆరాధించారు. ఒక మంచిరోజున వేదిక గర్భం దాల్చింది. కొద్దిరోజులలో ప్రసవం జరగాల్సి ఉండగా ఒక రోజు నిదృవ మహర్షి బయటకు వెళ్ళిన సమయంలో, ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికే ఇంటి పనితో అలసిపోయి విశ్రాంతి తీసుకున్న వేదికై (వేదిక) ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు. దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువు కూడా ఆ వ్యాధికి గురవుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది. అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండాన్ని ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడిగా జన్మిస్తాడు. అతనికి నైద్రువన్ అని పేరు పెడతారు.
అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువు పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిదృవ మహర్షి విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి, శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించేవారికి గర్భరక్ష కలుగజేయమని ప్రార్థిస్తారు. మహర్షి చేసిన ప్రార్థనకు సంతసించిన అమ్మవారు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక, ముల్లైవనాథరుగా కొలువై ఉన్నారు. ఇప్పటికీ అమ్మఅనుగ్రహంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా సుఖప్రసవం అయ్యి మంచి పిల్లలు పుడతారు. ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవిస్తే ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేని వారు కూడా గర్భం దాల్చుతారు. గర్భం దాల్చిన వారికి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచివ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు అవుతారు.
ఈ క్షేత్రంలో ఇంకా పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవ్వరికీ సంతానం లేకపోవడం లేదా గర్భస్రావాలు వంటి సమస్యలు లేవు. ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాలనుండి కూడా భక్తులు వస్తుంటారు. ఆలయంలో ఆరు నిత్య ఆచారాలు, మూడు సంవత్సరాది ఉత్సవాలు జరుగుతాయి. తమిళ కార్తీక మాసంలో, ఆదివారాల్లో శివునికి 1008 శంఖాలను ఉపయోగించి అభిషేకం నిర్వహిస్తారు. గర్భం, ప్రసవం కోసం ఇక్కడికి వచ్చే స్త్రీలు పువ్వులు సమర్పించి అమ్మవారికి అర్చన చేస్తారు. 11 దీపాలు వెలిగించి సుఖప్రసవం కోసం ప్రార్థిస్తారు. గర్భరక్షాంబిక హోమం చేయడం వల్ల సంతానం లేని దంపతులు సంతానం పొందుతారు. గర్భిణీస్త్రీలకు సుఖప్రసవం జరుగుతుంది. చాలాకాలంగా తగిన వరుడు దొరకని స్త్రీలు ఈ గర్భరక్షాంబిక ఆలయంలో కొంచెం నెయ్యితో మెట్లను కడిగి, కోలం రాసి అమ్మవారికి అర్చన చేస్తారు. పిల్లలు లేని వారికి శివపార్వతుల దగ్గర ఉంచి వారి గోత్ర నామాలు, నక్షత్రం ప్రకారం అర్చన చేసిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు. ఆ నెయ్యిని దంపతులు ఇద్దరు 48 రోజులు నిద్రించే ముందు సేవిస్తే గర్భంలోని దోషాలు తొలగిపోయి, తొందరగా గర్భం దాల్చుతారు. గర్భిణి స్త్రీలు గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయంలో ఇచ్చేఆముదం ప్రసాదాన్ని ఆరవ నెల నుండి ప్రతిరోజు, ఇంకా నొప్పులు ప్రారంభం అవ్వగానే పొత్తి కడుపుపై రాయడం వలన సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారని భక్తుల నమ్మకం. నయం కాని రోగాలు ఉన్నవారు పునుగు సట్టం నైవేద్యంగా పెట్టి, దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే త్వరగా ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల విశ్వాసం. అమ్మవారి ప్రసాదం కానీ నెయ్యి కానీ తీసుకునేటప్పుడు రోజు గర్భరక్షాంబిక అమ్మవారి స్తోత్రం చదువుకోవాలి.
గర్భరక్షాంబిక అమ్మవారి స్తోత్రం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గర్భిణీగా ఉన్న  /స్త్రీలు ఆ సమయంలో ఈ క్షేత్రానికి వెళ్ళలేకపోయినా వారి భర్త గాని, ఎవరైనా బంధువులు కానీ ఆ క్షేత్రం దర్శించి, ఆమె పేరు, నక్షత్రం మీద సంకల్పం చేయించి, ఈ నూనెను తెచ్చుకోవచ్చు. అంతేకాక సంతానం కావలసిన స్త్రీల యొక్క జన్మ నక్షత్రం రోజున ప్రతి నెల అర్చన కూడా చేయించుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి ₹500 తీసుకుంటారు. ఇంటికి అమ్మవారి కుంకుమ మరియు స్వామి వారి విభూతి ప్రసాదంగా పంపిస్తారు. అయితే ఇలా అమ్మఅనుగ్రహంతో ప్రసవం అయిన తర్వాత వీలుచూసుకొని ఆ దంపతులు పుట్టిన పిల్లవాడిని తీసుకువెళ్లి అమ్మవారి ఎదురుగా ఒక వెండి ఉయ్యాల ఉంటుంది. అందులో పిల్లాడిని పడుకోబెట్టి అమ్మవారి దర్శనం చేసుకోవాలి.
 అలా చేస్తే ఆ పిల్లలపై కూడా అమ్మవారి అనుగ్రహం ప్రసరించి దీర్ఘాయుష్మంతులై ప్రయోజకులు అవుతారని భక్తుల విశ్వాసం.
Garbharakshambika temple, Tamilnadu
Garbharakshambika temple, Tamilnadu
గర్భరక్షాంబికా ఆలయం వెబ్సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గర్భరక్షాంబికా అమ్మవారిని ఉదయం 5:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 8:00 నుండి 8:30 వరకు అమ్మవారి అభిషేకం నిర్వహిస్తారు. తంజావూరు- కుంభకోణం వెళ్లేమార్గంలో, కుంభకోణం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. గర్భరక్షాంబికాదేవి ఆలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా తంజావూరు లేదా కుంభకోణం రైలు మార్గంలో చేరుకొని అక్కడి నుండి బస్సు మార్గంలో తిరుకరుకవూర్ లోని ఆలయాన్ని చేరుకుంటారు. రైల్లో చేరుకోవాలంటే పాపనాశనం స్టేషన్ లో దిగాలి. ఇక్కడి నుంచి ఆలయం 6 కిలోమీటర్ల దూరంలోఉంటుంది. సమీప విమానాశ్రయం తిరుచిలో ఉంది. మీ అమూల్యమైన సలహాలను, సూచనలను comment section లో తెలియజేయండి. నమస్కారం.
ఈ సమాచారాన్ని వీడియో రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top