సమస్త బ్రహ్మాండమంతా గాలించినా, వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు, వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కలియుగ వైకుంఠం- తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామి వారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు చూడాలని కోరుకుంటారు. శరన్నవరాత్రుల సమయంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను కనులారా దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే ఈ బ్రహ్మోత్సవాలు ఎలా మొదలయ్యాయి, వాటి విశిష్టత ఏంటి? స్వామివారు ఏ రోజున ఏ వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారో, ఆ వాహనాల విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ కలియుగ దైవంగా భావించే దేవుడు శ్రీ వేంకటేశ్వరుడు. అందుకే ఏడాది పొడవునా తిరుమల గిరులు గోవింద నామాలతో మారుమోగుతూ ఉంటాయి. ఇక బ్రహ్మోత్సవాల వేళ, అన్ని దారులూ తిరుమల వైపే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలో ఉండే మానవుల శ్రేయస్సు కోరుతూ, శ్రీవారి దివ్యమైన అనుగ్రహం భక్తులందరికీ దక్కాలని సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఘనంగా నిర్వహిస్తుంది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు, వేదపండితుల వేదగోష్ఠితో, గోవిందనామస్మరణతో, జీయర్ స్వాములతో, వైఖానస ఆగమోక్తమంగా- గజరాజులు, ఆశ్వాలు, సాంస్కృతిక విన్యాసాలతో వేదాలకు ప్రతీకలుగా నాలుగు మాడవీధులలో జరిగే ఊరేగింపు- నయన మనోహరంగా సాగి భక్తులకు కనువిందు చేస్తుంది. ఎంతో కన్నులపండువగా సాగే ఈ ఉత్సవాలలో కోలాటాలు, చెక్కభజనలు, నృత్యాలు, విన్యాసాలు, విశేష అవతారాలతో, డప్పు వాయిద్యాలతో ఎందరో కళాకారులు ప్రదర్శించే కళారూపాలు, విచిత్ర వేషధారణలు, దేవతా వేషధారణలు ఎంతో నయనానందకరంగా ఉంటాయి.
భవిష్యోత్తర పురాణం ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయంలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి- బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది, అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. చారిత్రాత్మకంగా 10 వ శతాబ్దంలో, తిరుమల ఆలయంలో వేసిన ఒక తమిళ శాసనంలో, మొదటిసారిగా వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఉంది. అంటే సుమారు వేయ్యేళ్ల క్రితం నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆచరించే ముఖ్య క్రతువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస శుక్ల పక్షం శ్రవణా నక్షత్రం నాడు అవబృథం అంటే చక్ర స్నానం సంకల్పించి, తొమ్మిది రోజులకు ముందుగా ధ్వజారోహణం చేస్తారు.
ఆ ముందు రోజు అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ‘అంకురార్పణ’తో ప్రారంభమవుతాయి. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. బ్రహ్మోత్సవాల ఆరంభదినానికి తొమ్మిదిరోజుల ముందు అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై, స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించి, ఆలయంలో నైరుతిదిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఆ ప్రదేశంలో, భూదేవి ఆకారాన్ని లిఖించి, ఆ ఆకారంలో లలాటం, బాహు, స్తన ప్రదేశాలనుంచి మట్టిని తీసి, స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో, ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో- శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి, పూజలు చేస్తారు. చంద్రుడిని ప్రార్థిస్తూ పాలికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది.
పాలికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, మొదలైన దేవతలను ఆహ్వానిస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇదే ‘అంకురార్పణ’ అయింది.
మొదటి రోజు
ధ్వజారోహణం, పెద్దశేషవాహన సేవ
బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక కొత్త వస్త్రంమీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని ‘గరుడధ్వజపటం’ అంటారు. గరుడధ్వజపటాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి, ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో- గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే- సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రం.
అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకూ ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ, రాక్షసగణాలకు, వారివారి నిర్ణీత స్థలాలను కేటాయించి, పద్ధతి ప్రకారం, వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే.
ధ్వజారోహణం తర్వాత ఆ రాత్రి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామిని పుష్పమాలలతో అలంకరించి, వాహన మంటపంలో ఉన్న ఏడు తలల పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. శేషుని అధిష్టించిన స్వామి, మానవుల్లోని విషతుల్యమైన పాపాలను తొలగించి పరిరక్షిస్తాడు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. అందుకే ఏడు తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు.
రెండో రోజు
చిన్న శేష వాహనం, హంస వాహనం
రెండోరోజు ఉదయం, ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే, చిన్న శేషవాహనాన్ని ‘వాసుకి’కి ప్రతీకగా పరిగణిస్తారు. ఈ చిన్న శేష వాహనంపై స్వామి మాత్రమే ఊరేగుతారు. ఈ వాహనం నాగదోషాలు తొలగించి, సంతానాన్ని కటాక్షించే దివ్య స్వరూపంగా భావిస్తారు. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
రెండవ రోజున రాత్రి శ్రీ వేంకటాచలపతి హంస వాహనంపై- సరస్వతి మూర్తిగా ఎంతో మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చి, విజ్ఞాన సంపదను లోకానికి కటాక్షిస్తారు. చదువుల తల్లి రూపంలో- అక్షరమైన, అమృతమయమైన విద్యా సంపదను అనుగ్రహిస్తారు. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా, భక్తులలో అహంభావాన్ని తొలగించి దాసోహభావాన్ని(శరణాగతి) కలిగిస్తారు.
మూడో రోజు
సింహవాహనం,ముత్యాలపందిరి
మూడోరోజు ఉదయం శ్రీవారికి సింహ వాహనసేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమయి ఉంటారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతిమనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలనే ప్రతీకగా, ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు.
ఆరోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. చల్లదనాన్నిచ్చే చంద్రునికి ప్రతీక అయిన తెల్లని ముత్యాలు, ఆ పందిరి కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం- తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది.
నాలుగవ రోజు
కల్పవృక్ష వాహనం,సర్వభూపాల వాహనం
నాలుగోరోజు ఉదయం, స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనం ఇస్తారు. కామితార్థ ప్రదాయినిగా క్షీర సాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్ప వృక్ష వాహనంపై ఉన్న స్వామిని సేవించే జ్ఞానులకు జ్ఞానం, ధనాన్ని కోరేవారికి అపారధనం లభిస్తుంది. పుత్రులను కోరేవారికి పుత్రులు, రాజ్యాన్ని కోరేవారికి రాజ్యం లభిస్తుంది. పశుసంపద, ఆహార సంపద ఒనగూరుతాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికి, సకల దిక్పాలకులకు రాజు. అష్టదిక్పాలకులు స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.
ఐదవ రోజు
మోహినీ అవతారం, గరుడ వాహనం
బ్రహ్మోత్సవాలలో నడిమిదైన అయిదోరోజున, స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. పక్కనే దంతపు పల్లకిపై వెన్న ముద్ద కృష్ణుడు ముగ్ధ మనోహరంగా ఊరేగుతాడు. ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహనసేవలూ స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహినీ అవతార ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి, తన కుడిచేతితో చిలుకను పట్టుకొని ఉంటారు. ఈ హారాన్నీ, చిలుకనూ స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాళ్ (గోదాదేవి) దగ్గర నుంచి తెచ్చినట్లుగా చెప్తారు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైనవారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు స్వామి.
బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో జగన్నాటక సూత్రధారియైన శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. మానవులు- జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని, స్వామివారు భక్తకోటికి తెలియచేస్తున్నారు. గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు.
ఆరవ రోజు
హనుమద్వాహనసేవ, గజవాహనం
ఆరోరోజు ఉదయం, హనుమద్వాహనసేవ జరుగుతుంది. హనుమంతుడు, శ్రీరాముని నమ్మినబంటు. నవవిధ శరణాగతి భక్తి మార్గాలలో, శ్రీరామునికి హనుమంతుడు సేవా భక్తికి ఆరాధనీయుడు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ, ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది. తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే మధుర సన్నివేశమది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు, భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.
ఏడవ రోజు
సూర్యప్రభ వాహనం,చంద్రప్రభ వాహనం
ఏడోరోజు ఉదయం- మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆరోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. లోకాన్ని చైతన్యంతో పరిరక్షించే శ్రీమన్నారాయణుడు సూర్య నారాయణుని తేజస్సును మించి వెలుగొందుతాడు. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి.
అదేరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావటంతో, దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి, చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించటం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. చంద్రప్రభ వాహన సేవలో ఆశ్రయించిన వారికి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలను దూరంచేసి సన్మంగళాలను ప్రసాదిస్తారు.
ఎనిమిదవ రోజు
రథోత్సవం, అశ్వ వాహనం
ఎనిమిదోరోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరేరోజునా కానరారు. భక్తులు ప్రత్యక్షంగా పాలుపంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే. శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే వివేకం కలుగుతుంది. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపజేస్తారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. ఉపనిషత్తులు- ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ, ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ, భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నారు.
తొమ్మిదవ రోజు
చక్రస్నానం, ధ్వజావరోహణ
బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన తొమ్మిదోనాడు, స్వామివారికి చక్రత్తాళ్వార్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా మలయప్ప స్వామికి, శ్రీవారికి ఎడమపక్కన నిలిచి ఉన్న సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. ఆ తర్వాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. ఇదే ‘చక్రస్నాన ఉత్సవం’. చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.
ధ్వజావరోహణ
చక్రస్నానాలు అయిన తర్వాత ఆరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం (దించడం) చేస్తారు. గరుడపటాన్ని అవనతం చేసి, ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకలదేవతలకూ వీడ్కోలు పలుకుతారు. దీనితో బ్రహ్మోత్సవాలు మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు భావిస్తారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనేవారు పాప ముక్తులై, సంపదలతో తులతూగుతారని పురాణాలు చెప్తున్నాయి.
ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని, ఆసాంతం వీక్షించి, ఆరాధించి, తరించిన భక్తులు ఇహపర శాశ్వత ఫలాలను తప్పక పొందుతారు.