తండ్రి కడుపున పుట్టిన మహావీరుడు – రాజా మాంధాత
మాంధాత
మాంధాత సూర్యవంశంలోని ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. ఆయన శ్రీరామునికి పూర్వకాలానికి చెందినవాడని హిందూ విశ్వాసం. ఋగ్వేదంలోని ఒక సూక్తం ప్రకారం, ఈయన సమస్త భూమండలాన్ని జయించిన చక్రవర్తి. సాధారణంగా మనుషులు తల్లి గర్భంలో జన్మిస్తారు. కానీ మాంధాత మహారాజు మాత్రం తండ్రి గర్భంలో నుంచే జన్మించాడు. అది ఎలా సాధ్యమైంది? మాంధాత తండ్రి యువనాశ్వుడు ఎలా గర్భం దాల్చాడు? మాంధాత జననం తరువాత ఏమి జరిగింది? వంటి ఆసక్తికర విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.
మహాభారతంలోని అరణ్య పర్వంలో, భాగవతంలోని నవమ స్కంధంలో మాంధాత ప్రస్తావన ఉంది.
మాంధాత అత్యంత ప్రాచీన కాలానికి చెందిన రాజు. అందుకే పాతకాలపు విషయాలను సూచించేటప్పుడు “మాంధాత కాలం నాటి” అని అంటారు. ఆయన పుట్టుక చాలా విచిత్రమైనది. ఇక్ష్వాకు వంశానికి చెందిన యువనాశ్వుడు ఆయన తండ్రి. యువనాశ్వునికి నూరు మంది భార్యలు ఉన్నారు. అయినప్పటికీ సంతానం లేక బాధపడుతూ, రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్లి సలహా కోరాడు. మహర్షులు కరుణించి ఇంద్రుని ప్రసన్నం చేయడానికి పుత్రకామేష్ఠి యాగం నిర్వహించారు.
యాగంలో మంత్రించిన జలాన్ని రాణి తాగాలని ఒక కలశంలో ఉంచారు. కానీ ఆ రాత్రి యువనాశ్వునికి తీవ్రమైన దాహం వేసి, తెలియక ఆ మంత్రజలాన్ని తాగేశాడు. ఉదయం ఋషులు ఆ విషయం తెలుసుకుని విచారించగా, యువనాశ్వుడు జరిగినది వివరించాడు. అప్పుడు భృగుమహర్షి ఇలా అన్నాడు: “రాజా! ఈ జలాన్ని నీ భార్య తాగాలని ఉద్దేశించాను. అయితే దానిని ఎవరు తాగితే వారి గర్భంలో కుమారుడు జన్మించడం ఖాయం. కాబట్టి నీవే గర్భం దాలుస్తావు. ఇంద్రునితో సమానమైన పుత్రుడు జన్మిస్తాడు. దైవ నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరు.”
దాంతో యువనాశ్వుడు గర్భవంతుడయ్యాడు. వంద సంవత్సరాల తరువాత ఆయన ఎడమ పక్కను చీల్చుకుని సూర్యుని వంటి తేజస్సుతో ఒక కుమారుడు జన్మించాడు.
తల్లి లేకపోవడంతో శిశువు ఆకలితో ఏడుస్తుండగా, ఇంద్రుడు ప్రత్యక్షమై తన చూపుడు వేలను శిశువు నోటిలో పెట్టాడు. ఆ వేలు ద్వారా అమృతాన్ని పానంచేసి బాలుడు పెరిగాడు. ఇంద్రుడు అతనికి “మాంధాత” అని పేరు పెట్టాడు. ఈ విధంగా మాంధాత దేవేంద్రుని చేత పోషించబడ్డాడు.
యువనాశ్వుడు భగవంతుని దయతో, బ్రాహ్మణుల కృపతో ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత కొంతకాలం తపస్సు చేసి సిద్ధి పొందాడు.
మాంధాత శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్థమానుడై, నిండు యౌవనాన్ని పొందాడు. చిన్నతనం నుంచే సాహసాలలో, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు. పన్నెండేళ్లకే రాజ్యాభిషేకం పొందాడు. దేవేంద్రుడు స్వయంగా పట్టాభిషేకం చేసి, ఆజగవం అనే విల్లును ఇచ్చాడు. మాంధాత ఒకే రోజులో సమస్త భూమండలాన్ని జయించాడు. భూలోకమే కాక పాతాళం, స్వర్గంలో సగభాగం వరకు తన ఆధిపత్యం చాటాడు. ఇంద్రునితో యుద్ధం చేసి, తన రాజ్యంలో సకాలంలో వర్షాలు కురిసేలా చేశాడు.
మాంధాత అనేక అశ్వమేధ, రాజసూయ యాగాలు నిర్వహించాడు. పరమశివ భక్తుడై అనేక మందిరాలు నిర్మించాడు. యాగకాలంలో బ్రాహ్మణులకు పదివేల పద్మాలు, అనేక గోవులు దానం చేశాడు.
ఘోర తపస్సుతో వరాలు పొందిన రావణాసురుడు, మాంధాతను ఓడించాలనే ఉద్దేశంతో యుద్ధానికి వచ్చాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది. మాంధాత రావణుని సైన్యంలోని అకంపనుడు, మహోదరుడు, విరూపాక్షుడు వంటి యోధులను సంహరించాడు. రావణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా, మాంధాత పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ముల్లోకాలకు హాని కలగకుండా పులస్త్యుడు, గాలవ్యుడు మధ్యవర్తిత్వం చేసి యుద్ధాన్ని నిలిపివేశారు. రావణుడు భవిష్యత్తులో మాంధాత వంశంలో జన్మించే శ్రీరాముని చేతిలో మరణించాల్సి ఉందని తెలియజేశారు.
తరువాత మాంధాత చంద్రవంశానికి చెందిన శశబిందుని కుమార్తె బిందుమతిని వివాహం చేసుకున్నాడు. పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే ముగ్గురు కుమారులు, యాభై కుమార్తెలు కలిగారు. ఆ యాభై మంది కన్యలను సౌభరి మహర్షి వివాహం చేసుకున్నాడు.
వయస్సు పెరిగేకొద్దీ మాంధాతలో అహంకారం పెరిగింది. స్వర్గాన్ని పూర్తిగా జయించాలని భావించాడు. ఇంద్రుడు “భూమిని పూర్తిగా జయించలేదు; లవణాసురుడు నీకు లోబడలేదు” అని హెచ్చరించాడు. లవణాసురుడు రాక్షసరాజు మధు కుమారుడు. శివుడు మధుకు ఇచ్చిన త్రిశూలం లవణాసురుని వద్ద ఉండేది. ఆ త్రిశూలం చేత మాంధాత యుద్ధంలో సంహరింపబడ్డాడు.
తరువాత లవణాసురుడు శ్రీరాముని తమ్ముడు శతృఘ్నునిచే వధించబడ్డాడు. రావణుని ఓడించిన మహావీరుడు మాంధాత, చివరకు లవణాసురునిచే సంహరింపబడ్డాడు. అయినప్పటికీ పురాణాలలో మహా చక్రవర్తిగా చిరస్మరణీయుడయ్యాడు.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


