మూక పంచశతి – కటాక్ష శతకం 21-30 శ్లోకాలు
మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.
కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.
పీయూషవర్షవశిశిరా స్ఫుటదుత్పలశ్రీ-
మైత్రీ నిసర్గమధురా కృతతారకాప్తిః ।
కామాక్షి సంశ్రితవతీ వపురష్టమూర్తేః
జ్యోత్స్నాయతే భగవతి త్వదపాంగమాలా ॥21॥
మాతా! భగవతీ! చల్లని నీ క్రీగంటి చూపులు అనే మాల ఈశ్వరుని గళములో హారమై ప్రకాశిస్తున్నది. ఆ హారము చంద్రబింబ కాంతివలె, అమృతధారవలె, నల్ల కలువలవలె చల్లగా ఉన్నది. ఆ నేత్రములకు నక్షత్రములవలె ఉన్న కనుపాపలు మమ్ములను రక్షించుగాక.
అంబ స్మరప్రతిభటస్య వపుర్మనోజ్ఞం
అంభోజకాననమివ చితకంటకాభమ్ ।
భృంగీవ చుంబతి సదైవ సపక్షపాతా
కామాక్షి కోమలరుచిస్త్వదపాంగమాలా ॥22॥
అమ్మా! కామాక్షీ! నీవు భ్రామరీ దేవివి. తుమ్మెద వంటి నీవు నీ రెక్కలను విప్పి కామదేవుని జయించిన ఈశ్వరుని పులకాంకురములు అనే పుష్పములపై వాలుతూ ఆయనకు నిరంతరమైన ఆనందమును కలుగచేస్తున్నావు.
కేశప్రభాపటలనీలవితానజాలే
కామాక్షి కుండలమణిచ్ఛవిదీపశోభే ।
శంకే కటాక్షరుచిరంగతలే కృపాఖ్యా
శైలూషికా నటతి శంకరవల్లభే తే ॥23॥
ఇంద్రనీలములు కూర్చిన పందిరికింద నీ కటాక్షము అనే రంగస్థలముపై, నల్లని సుందర కేశపాశములతో, మణికుండలములనే దీపముల కాంతులతో, శైలూషికా నృత్యము చేస్తున్న జగన్మాత నన్ను కరుణించుగాక.
అత్యంతశీతలమతంద్రయతు క్షణార్ధం
అస్తోకవిభ్రమమనంగవిలాసకందమ్ ।
అల్పస్మితాదృతమపారకృపాప్రవాహం
అక్షిప్రరోహమచిరాన్మయి కామకోటి ॥24॥
కామకోటి పీఠములో స్థితురాలైన ఓ మాతా! నీవు అత్యంత చల్లనై, విలాసము కలదానవై, మన్మథునికి ఉపాసనా దేవతవై, మనోహరమైన చిరునవ్వుతో దయా ప్రవాహమును ప్రసరింపచేస్తున్నావు. అమ్మా! నీ కటాక్షమును నాపై కూడా ప్రసరింప చేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.
మందాక్షరాగతరలీకృతిపారతంత్ర్యాత్
కామాక్షి మంథరతరాం త్వదపాంగడోలామ్ ।
ఆరుహ్య మందమతికౌతుకశాలి చక్షుః
ఆనందమేతి ముహురర్ధశశాంకమౌలేః ॥25॥
మాతా! కామాక్షీ! నీ దయ, కటాక్షము ఒక ఊయల కాగా, నీలోని ప్రేమ, లజ్జ ఆ ఊయలకు ఇరువైపులా ఉండి, ఆ ఊయలను ఊపుతుండగా, ఈశ్వరుడు ఆ ఊయలపై అర్థనిమీలిత నేత్రములతో ఆసీనుడై ఎంతో ఆనందిస్తున్నాడు.
త్రైయంబకం త్రిపురసుందరి హర్మ్యభూమిః-
అంగం విహారసరసీ కరుణాప్రవాహః ।
దాసాశ్చ వాసవముఖాః పరిపాలనీయం
కామాక్షి విశ్వమపి వీక్షణభూభృతస్తే ॥26॥
అమ్మా! ఒక మహారాణిగా, నీ చూపులతో సమస్త విశ్వమును పరిపాలించుచున్న నీవు ఈశ్వరుని శరీరమును ఒక భవనముగాను, దయ అనే ప్రవాహముతో నిండిన నీటి కొలనులో ఇంద్రాదులు మొదలైనవారు నిరంతరము నిన్ను సేవిస్తుండగా, క్రీడిస్తుంటావు.
వాగీశ్వరీ సహచరీ నియమేన లక్ష్మీః
భ్రూవల్లరీవశకరీ భువనాని గేహమ్ ।
రూపం త్రిలోకనయనామృతమంబ తేషాం
కామాక్షి యేషు తవ వీక్షణపారతంత్రీ ॥27॥
జగన్మాతా! నీ కరుణారసపూరితమైన చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో, వారు ఈ లోకమునే గృహముగా చేసుకొని అందులో సరస్వతీ దేవి స్నేహితురాలు గాను, లక్ష్మీదేవి వారికి వశమై, తమ శరీర ఛాయ మూడులోకములపై ప్రసరింపచేస్తూ నివసిస్తారు.
మాహేశ్వరం ఝటితి మానసమీనమంబ
కామాక్షి ధైర్యజలధౌ నితరాం నిమగ్నమ్ ।
జాలేన శృంఖలయతి త్వదపాంగనామ్నా
విస్తారితేన విషమాయుధదాశకోఽసౌ ॥28॥
జగన్మాతా! ఈశ్వరుడు అనే చేప సముద్రములో లోతుగా మునిగి ఉండి, నాకు అందకుండా ఉన్నది. మన్మథుడనే జాలరినైన నేను ఆ చేపను పట్టుకోడానికి, నీ క్రీగంటి చూపులనే వలను ఉపయోగిస్తే, ఆ చేప నాకు దొరకకుండా ఉంటుందా!
ఉన్మథ్య బోధకమలాకరమంబ జాడ్య-
స్తంబేరమం మమ మనోవిపినే భ్రమంతమ్ ।
కుంఠీకురుష్వ తరసా కుటిలాగ్రసీమ్నా
కామాక్షి తావకకటాక్షమహాంకుశేన ॥29॥
తల్లీ కామాక్షీ! నా మనసు ఒక కీకారణ్యము. అజ్ఞానము అనే ఒక మద గజము ఆ అడవిలో తిరుగుతూ, జ్ఞానము అనే సరస్సును కల్లోలపరుస్తున్నది. అమ్మా నీ దయ అనే అంకుశముతో ఆ మదగజమును నియంత్రించి నాకు మనశ్శాంతిని కలుగచేయుము.
ఉద్వేల్లితస్తబకితైః లలితైర్విలాసైః
ఉత్థాయ దేవి తవ గాఢకటాక్షకుంజాత్ ।
దూరం పలాయయతు మోహమృగీకులం మే
కామాక్షి సత్వరమనుగ్రహకేసరీంద్రః ॥30॥
అమ్మా! నీ అనుగ్రహము అనే మృగరాజు (సింహము), నీ విలాసములనే తీగలు, నీ క్రీగంటి చూపులనే పొదరింటిలో ఉన్నది. నన్ను మోహమునకు గురి చేయుచున్న జింకలను ఆ మృగరాజు దూరముగా తరిమి వేయుగాక!
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




