మూక పంచశతి – కటాక్ష శతకం 71-80 శ్లోకాలు
మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.
కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.
కాలాంబువాహనివహైః కలహాయతే తే
కామాక్షి కాలిమమదేన సదా కటాక్షః ।
చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా
సోత్కంఠ ఏవ రమతే కిల నీలకంఠః ॥71॥
అమ్మా! కామాక్షీ! నీ కరుణారస చూపులు నల్లని వర్ణపు కాంతి కలిగి, ఎప్పుడూ వర్షాకాలములోని నీటి మేఘముతో తలపడుతుంటాయి. దీనిని తిలకిస్తున్న నీలకంఠుడైన ఈశ్వరుడు నీకు, మేఘమునకు గల స్పర్థను చూసి నెమలివలే ఆనందిస్తున్నాడు.
కామాక్షి మన్మథరిపుం ప్రతి మారతాప
మోహాంధకారజలదాగమనేన నృత్యన్ ।
దుష్కర్మకంచుకికులం కబలీకరోతు
వ్యామిశ్రమేచకరుచిస్త్వదపాంగకేకీ ॥72॥
అమ్మా! కామాక్షీ! నీ చూపులు ఒక ఆడ నెమలి వంటివి. పరమేశ్వరుని కంఠములోని నలుపు వర్ణమును మేఘముగా భ్రమించి నీవు నృత్యము చేస్తుంటావు. ఇంకొకవైపు మా పాపములనే సర్పములను నీ నల్లని చూపులు అనే నెమలి మింగివేసి, మమ్ములను రక్షించుగాక.
కామాక్షి మన్మథరిపోరవలోకనేషు
కాంతం పయోజమివ తావకమక్షిపాతమ్ ।
ప్రేమాగమో దివసవద్వికచీకరోతి
లజ్జాభరో రజనివన్ముకులీకరోతి ॥73॥
మాతా! ఏ విధముగా పద్మము యొక్క కాంతి పగటి పూట వికసిస్తుందో, అదే విధముగా ఈశ్వరుని చూపులతో కలసిన నీ చూపులు ప్రేమతో ఉన్నాయి. నీ చూపులు పగటిపూట వికసించి రాత్రి వేళలలో సిగ్గుల మొగ్గలౌతున్నాయి.
మూకో విరించతి పరం పురుషః కురూపః
కందర్పతి త్రిదశరాజతి కింపచానః ।
కామాక్షి కేవలముపక్రమకాల ఏవ
లీలాతరంగితకటాక్షరుచః క్షణం తే ॥74॥
జగన్మాతా! ఎప్పుడైతే నీవు నీ క్రీగంటి చూపులనుండి దయను వర్షిస్తావో, అప్పుడే ఆ వర్షపాతం మూగవానిని వేదాలు వల్లించే బ్రహ్మగా మారుస్తుంది. కురూపియైన వానిని మన్మథునిగా చేస్తుంది. దరిద్రుని దేవేంద్రునిగా మారుస్తుంది.
నీలాలకా మధుకరంతి మనోజ్ఞనాసా-
ముక్తారుచః ప్రకటకంద బిసాంకురంతి ।
కారుణ్యమంబ మకరందతి కామకోటి
మన్యే తతః కమలమేవ విలోచనం తే ॥75॥
మాతా! కామకోటి కామాక్షీ! నల్లని నీ కేశపాశములు తుమ్మెదలు గానూ, నీ నాసికకు ఉన్న ముక్కెర కాంతి నీటిలోని తామర దుంపనుండి పైకి వచ్చిన తామర తూడులుగానూ, నీ దయ మకరందము గానూ తోచుచున్నది. ఈ విధముగా నీ చూపులు కమలములవలే కనపడుచున్నవి.
ఆకాంక్ష్యమాణఫలదానవిచక్షణాయాః ।
కామాక్షి తావకకటాక్షకకామధేనోః ।
సంపర్క ఏవ కథమంబ విముక్తపాశ-
బంధాః స్ఫుటం తనుభృతః పశుతాం త్యజంతి ॥76॥
మాతా! నీ దయ కోరికలను తీర్చే కామధేనువు వంటిది. కానీ అమ్మా! ఆ కామధేనువును మచ్చిక చేసుకుని, ఈ పశుపాశములనుండి బయటపడే మార్గం ఏమిటో నీవే తెలుపవలసి ఉంటుంది.
సంసారఘర్మపరితాపజుషాం నరాణాం
కామాక్షి శీతలతరాణి తవేక్షితాని ।
చంద్రాతపంతి ఘనచందనకర్దమంతి
ముక్తాగుణంతి హిమవారినిషేచనంతి ॥77॥
అమ్మా! జీవులందరూ, సంసారము అనే గ్రీష్మతాపపు బాధతో అలమటిస్తున్నారు. నీ చల్లని అమృతతుల్యమైన చూపులు వారికి ఆ బాధను తొలగించే గంధపు పూతలుగా, పన్నీటి అభిషేకములుగా ప్రసరించుగాక.
ప్రేమాంబురాశిసతతస్నపితాని చిత్రం
కామాక్షి తావకకటాక్షనిరీక్షణాని ।
సంధుక్షయంతి ముహురింధనరాశిరీత్యా
మారద్రుహో మనసి మన్మథచిత్రభానుమ్ ॥78॥
జగదీశ్వరీ! నీ దయారస దృక్కులు సముద్రపు నీటి అంత చల్లనివి. కానీ అవే చూపులు కామదేవుని శత్రువైన ఈశ్వరుని హృదయములో మన్మథుడు అనే తాపాగ్నిని సృష్టించి కలవరపరుస్తున్నాయి కదా మాతా!
కాలాంజనప్రతిభటం కమనీయకాంత్యా
కందర్పతంత్రకలయా కలితానుభావమ్ ।
కాంచీవిహారరసికే కలుషార్తిచోరం
కల్లోలయస్వ మయి తే కరుణాకటాక్షమ్ ॥79॥
అమ్మా! చల్లని నీ కరుణారసమైన చూపులు అంజనముతో కలిసి నల్లగా ఉన్నాయి. ఈశ్వరునిలో మన్మథాగ్నిని రగుల్చుటలో వాటికవే సాటి. భక్తులలోని దోషములను నివారించుటలో నీ చూపులకు మించినవి ఏమున్నాయి తల్లీ. అటువంటి చూపులను నా మనసులో నిక్షిప్తము చేయుము.
క్రాంతేన మన్మథమదేన విమోహ్యమాన
స్వాంతేన చూతతరుమూలగతస్య పుంసః ।
కాంతేన కించిదవలోకయ లోచనస్య
ప్రాంతేన మాం జనని కాంచిపురీవిభూషే ॥80॥
అమ్మా! నీ క్రీగంటి చూపులచే మన్మథుడు అపారమైన దయను పొందగలిగాడు. అవే చూపులతో ఆమ్ర వృక్షపు మూలములో తపస్సు చేస్తున్న ఈశ్వరుని నీవు మోహితుని చేశావు. అటువంటి కరుణారస దృష్టి నాపై వర్షపు ధారల వలె కురియుగాక.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




