స్తోత్రాలకు తెలుగులో అర్థం » మూక పంచశతి – కటాక్ష శతకం 91-100 శ్లోకాలు
మూక పంచశతి కటాక్ష శతకం 91-100 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం 91-100 శ్లోకాలు

మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.

కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.

జాగర్తి దేవి కరుణాశుకసుందరీ తే
తాటంకరత్నరుచిదాడిమఖండశోణే ।
కామాక్షి నిర్భరకటాక్షమరీచిపుంజ-
మాహేంద్రనీలమణిపంజరమధ్యభాగే ॥91॥

మాతా! కామాక్షీ! నీ కరుణారసపూరితములైన చూపులు అనే మణులచే చేయబడిన పంజరములో, నీ కర్ణాభరణముల ఎర్రని వర్ణముకల రత్నములైన దానిమ్మ గింజలను ఆరగిస్తూ, నీ దయ అనే చిలుక ఆ పంజరమధ్య భాగములో ఉన్నది.

కామాక్షి సత్కువలయస్య సగోత్రభావాత్
ఆక్రామతి శ్రుతిమసౌ తవ దృష్టిపాతః ।
కించ స్ఫుటం కుటిలతాం ప్రకటీకరోతి
భ్రూవల్లరీపరిచితస్య ఫలం కిమేతత్ ॥92॥

అమ్మా! నీ చూపులు కలువపూల కంటే గొప్పవి కావటం చేత, ఆ కలువ పూవుల కాంతులు నీ తీరైన కనుబొమల తీగలవలే నీ చెవి వరకు విస్తరించి ఉన్నవి. నీ చూపులకు, కనుబొమలకు గల స్నేహము అసామాన్యమైనదమ్మా!

ఏషా తవాక్షిసుషమా విషమాయుధస్య
నారాచవర్షలహరీ నగరాజకన్యే ।
శంకే కరోతి శతధా హృది ధైర్యముద్రాం
శ్రీకామకోటి యదసౌ శిశిరాంశుమౌలేః ॥93॥

జగదీశ్వరీ! మన్మథునివద్ద ఉన్న పూల బాణములు నీవు ప్రసాదించినవే కదా. నీవు ప్రసాదించిన బాణములతోనే మన్మథుడు ఈశ్వరుని మనసును చంచలపరచి నీవైపు ఆకర్షిస్తున్నాడు.

బాణేన పుష్పధనుషః పరికల్ప్యమాన-
త్రాణేన భక్తమనసాం కరుణాకరేణ ।
కోణేన కోమలదృశస్తవ కామకోటి
శోణేన శోషయ శివే మమ శోకసింధుమ్ ॥94॥

మాతా! కామాక్షీ! మన్మథునికి నీవు ప్రసాదించిన అయిదు పుష్పబాణములలో ఒకటైన శోషణ బాణము దయాపూరితమై, నీ భక్తులను కాపాడుతున్నది. నీ క్రీగంటి చూపుల ఎర్రని బాణములో బాధతో కూడిన నా దుఃఖసాగరమును శోషింపచేయుము.

మారద్రుహా ముకుటసీమని లాల్యమానే
మందాకినీపయసి తే కుటిలం చరిష్ణుః ।
కామాక్షి కోపరభసాత్ వలమానమీన-
సందేహమంకురయతి క్షణమక్షిపాతః ॥95॥

కామాక్షీ! మన్మథుని జయించి ఈశ్వరుడు తన శిరసులో ఉన్న గంగను బుజ్జగిస్తునాడు. అది గమనించిన నీవు కోపముతో పైకి లేస్తున్న చేప వలే కనిపిస్తున్నావు.

కామాక్షి సంవలితమౌక్తికకుండలాంశు
చంచత్సితశ్రవణచామరచాతురీకః ।
స్తంభే నిరంతరం అపాంగమయే భవత్యా
బద్ధశ్చకాస్తి మకరధ్వజమత్తహస్తీ ॥96॥

మాతా! కామాక్షీ! నీ క్రీగంటి చూపు ఒక బలమైన స్తంభము. ఆ స్తంభమునకు మన్మథుడు అనే మద గజము బంధించబడి ఉన్నది. నీ కుండలముల కాంతి, నీ చిరునవ్వుల కాంతి ఆ మదగజము యొక్క రెండు చెవులను పట్టి ఆడించుచున్నట్లు ఉన్నది.

యావత్కటాక్షరజనీ సమయాగమస్తే
కామాక్షి తావదచిరాన్నమతాం నరాణామ్ ।
ఆవిర్భవత్యమృతదీధితిబింబమంబ
సంవిన్మయం హృదయపూర్వగిరీంద్రశృంగే ॥97॥

అమ్మా! కామాక్షీ! నీ దయ అనే పౌర్ణమి రాత్రి ఎప్పుడు ఆరంభమవుతుందో, అప్పుడు వారి మనసులలో జ్ఞానము అనే పున్నమి చంద్రుడు ఆవిర్భవించి, తన చల్లని అమృత కిరణాలను ప్రసరింపచేస్తాడు.

కామాక్షి కల్పవిటపీవ భవత్కటాక్షో
దిత్సుః సమస్తవిభవం నమతాం నరాణామ్ ।
భృంగస్య నీలనలినస్య చ కాంతిసంపత్
సర్వస్వమేవ హరతీతి పరం విచిత్రమ్ ॥98॥

జగన్మాతా! నేను ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించాను. నీ దయా దృష్టి ఒక వైపు నీకు శరణన్నవారికి అభయప్రదానము చేస్తుంటే, మరొకవైపు అవే చూపులు కలువపూల, తుమ్మెదల యొక్క కాంతిని దోచుకుంటున్నాయి. ఇది ఎంత విచిత్రమమ్మా!

అత్యంతశీతలం అనర్గల కర్మపాక-
కాకోలహారి సులభం సుమనోభిరేతత్ ।
పీయూషమేవ తవ వీక్షణమంబ కింతు
కామాక్షి నీలమిదమిత్యయమేవ భేదః ॥99॥

అమ్మా! కామాక్షీ! నీ దృష్టి ఎంతో చల్లనైనది. కర్మఫలములు అనే విషమును అది తొలగిస్తుంది. జ్ఞానులు, మంచి హృదయము కలవారు నీ కటాక్షమును అధికముగా పొందుతారు. అమ్మా! నీ చూపు చల్లనైన అమృతము.

అజ్ఞాతభక్తిరసమప్రసరద్వివేకం
అత్యంతగర్వమనధీతసమస్తశాస్త్రమ్ ।
అప్రాప్తసత్యమసమీపగతం చ ముక్తేః
కామాక్షి నైవ తవ కాంక్షతి దృష్టిపాతః ॥100॥

జగన్మాతా! కామకోటి నిలయా! భక్తిలోని మాధుర్యమును అనుభవించలేనివారికి, గర్విష్టులకు, శాస్త్ర అధ్యయనము లేనివారికి, సత్యమును గ్రహించలేనివారికి, ముక్తిపై గురిలేనివారికి సమీపించడానికి కూడా ఇష్టపడవు.


పాతేన లోచనరుచేస్తవ కామకోటి
పోతేన పతకపయోధిభయాతురాణామ్ ।
పూతేన తేన నవకాంచన కుండలాంశు-
వీతేన శీతలయ భూధరకన్యకే మామ్ ॥101॥

ఓ పర్వతపుత్రీ! పాపములు అనే సాగరమును దాటుటకు భీతిల్లుతున్న వారికి నౌకవై, సువర్ణకాంతులతో ప్రకాశించు నీ కంటి చూపులతో నన్ను అనుగ్రహించుము మాతా!

మూకపంచశతిలోని నాలుగవదైన కటాక్ష శతకం సంపూర్ణమ్‌
॥ ఇతి కటాక్షశతకం సంపూర్ణమ్ ॥

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top