మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.
ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.
మహిమ్నః పంథానం మదనపరిపంథిప్రణయిని
ప్రభుర్నిర్ణేతుం తే భవతి యతమానోఽపి కతమః ।
తథాపి శ్రీకాంచీవిహృతిరసికే కోఽపి మనసూ
విపాకస్త్వత్పాదస్తుతివిధిషు జల్పాకయతి మామ్ ॥1॥
కామదేవుడైన మన్మథుని జయించిన ఈశ్వరుని దేవేరివై, కాంచీపురము నందు విహరించు ఓ జగన్మాతా! నీ మహిమను వర్ణించడం ఎటువంటి వారికైనా సాధ్యం కాదు. నా భాగ్యమేమో కానీ, నీ పాదములను స్తుతించాలని నా మనసు పరిపరి విధముల తహతహలాడుతున్నది.
గలగ్రాహీ పౌరందరపురవనీ పల్లవరుచాం
ధృతపాథమ్యానామరుణమహసాం ఆదిమగురుః ।
సమింధే బంధూకస్తబకసహయుధ్వా దిశి దిశి
ప్రసర్పన్కామాక్ష్యాః చరణకిరణానామరుణిమా ॥2॥
అమ్మా! నీ పాదములనుండి వెలువడే ఎర్రని కాంతి సమూహము, దేవేంద్రుని ఉద్యానవనములోని కల్పవృక్షముయొక్క లేత ఆకుల వర్ణమును, అప్పుడే ఉదయిస్తున్న భానుని ఎరుపు కాంతిని, మంకెన పుష్పముల రక్తవర్ణమును త్రోసిరాజని, అత్యంత ప్రకాశవంతముగా ఉన్నది.
మరాలీనాం యానాభ్యసనకలనామూలగురవే
దరిద్రాణాం త్రాణవ్యతికరసురోద్యానతరవే ।
తమస్కాండప్రౌఢిప్రకటనతిరస్కారపటవే
జనోఽయం కామాక్ష్యాః చరణనలినాయ స్పృహయతే ॥3॥
జగన్మాతా! నీ పాదములు ఆడు నెమళ్లకు నడకలు నేర్పిన గురువులు. దీనులకు కల్పతరువులు నీ పాదములు. తిమిరాంధకారమును తరిమివేయగలవి నీ పాదములు. ఆ పాద పద్మములను గూర్చి నాకు ఎరుక పరచవా తల్లీ!
వహంతీ సైందూరీం సరణిమవనమ్రామరపుఱీ-
పురంధ్రీసీమంతే కవికమలబాలార్కసుషమా ।
త్రయీసీమంతిన్యాః స్తనతటనిచోలారుణపటీ
విభాంతీ కామాక్ష్యాః పదనలినకాంతిర్విజయతే ॥4॥
అమ్మా! దేవతా స్త్రీలందరూ వంగి నీ పాదాలకు ప్రణమిల్లుతుంటే, వారి సింధూర కాంతి ప్రకాశము నీ పాదములలో మిళితమయింది. కవులలో కవిత్వ భావనలు వికసించడానికి నీ పాదములు బాలభానుని కిరణములైనాయి. వేదములు అనే పుణ్య స్త్రీల హృదయ కాంతి సారమే నీ పాదములు.
ప్రణమ్రీభూతస్య ప్రణయకలహత్రస్తమనసః
స్మరారాతేశ్చూడావియతి గృహమేధీ హిమకరః ।
యయోః సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిశ్చరణయోః
తయోర్మే కామాక్ష్యా హృదయమపతంద్రం విహరతామ్ ॥5॥
పార్వతీ దేవితో ప్రణయ కలహములో ఈశ్వరుడు జగదాంబ పాదములపై వాలాడు. అప్పుడు ఈశ్వరుని సిగలో ఉన్న చంద్రుడు, అమ్మ పాదముల కాంతులను అంది పుచ్చుకుని, అలౌకిక కాంతితో ప్రకాశించాడు. అటువంటి అమ్మ దివ్య పాదములు, నా మానసిక అంతరంగములో తిరుగాడుగాక.
యయోః పీఠాయంతే విబుధముకుటీనాం పటలికా
యయోః సౌధాయంతే స్వయముదయభాజో భణితయః ।
యయోః దాసాయంతే సరసిజభవాద్యాశ్చరణయోః
తయోర్మే కామాక్ష్యా దినమను వరీవర్తు హృదయమ్ ॥6॥
సకల దేవతల కిరీటములు అమ్మకు పాదపీఠముగా ఏర్పడినాయి. చతుర్వేదముల సారమే అమ్మ పాదములు. కమలములోనుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు అమ్మకు దాసానుదాసులు. అట్టి అమ్మ పాదయుగళమందు నా హృదయము నిత్యనివాసముండుగాక!
నయంతీ సంకోచం సరసిజరుచం దిక్పరిసరే
సృజంతీ లౌహిత్యం నఖకిరణచంద్రార్ధఖచితా ।
కవీంద్రాణాం హృత్కైరవ వికసనోద్యోగజననీ
స్ఫురంతీ కామాక్ష్యాః చరణరుచిసంధ్యా విజయతే ॥7॥
పద్మముల యొక్క కాంతిని తిరస్కరిస్తూ, కేవలము తన పాదనఖములనుండి అరుణారుణ కాంతులను ప్రసరింపచేస్తూ, కవుల మానస సరోవరములో కలువలను పూయిస్తూ, కామాక్షీ దేవి పాదముల కాంతులు ప్రకాశిస్తున్నాయి.
విరావైర్మాంజీరైః కిమపి కథయంతీవ మధురం
పురస్తాదానమ్రే పురవిజయిని స్మేరవదనే ।
వయస్యేవ ప్రౌఢా శిథిలయతి యా ప్రేమకలహ-
ప్రరోహం కామాక్ష్యాః చరణయుగలీ సా విజయతే ॥8॥
ఈ వింతను తిలకించండి. జగన్మాత అలక తీర్చడానికి ఈశ్వరుడు మోకరిల్లాడు. అప్పుడు అమ్మ పాదముల అందెలు చేసిన శబ్దంతో- ఆమె మాట్లాడిందని భ్రాంతి కలిగి, చిరునవ్వు చిందించాడు శివుడు. వారిద్దరి మధ్య ప్రణయ కలహాన్ని తీర్చుటలో మధ్యవర్తులైన పాదములు నాలో నిత్యము వసించుగాక.
సుపర్వస్త్రీలోలాలకపరిచితం షట్పదకులైః
స్ఫురల్లాక్షారాగం తరుణతరణిజ్యోతిరరుణైః ।
భృతం కాంత్యంభోభిః విసృమరమరందైః సరసిజైః
విధత్తే కామాక్ష్యాః చరణయుగలం బంధుపదవీమ్ ॥9॥
దేవతా స్త్రీలు అమ్మ పాదములకు ప్రణమిల్లుతుంటే, వారి కేశములు తుమ్మెదలవలె తిరుగాడుతున్నాయి. ఆమె పాదములపై ఉన్న లత్తుకతో పద్మములు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి. ఆ తల్లి పాదములనే పద్మములు అమృత రసాన్ని చిలకరిస్తున్నాయి.
రజఃసంసర్గేఽపి స్థితమరజసామేవ హృదయే
పరం రక్తత్వేన స్థితమపి విరక్తైకశరణమ్ ।
అలభ్యం మందానాం దధదపి సదా మందగతితాం
విధత్తే కామాక్ష్యాః చరణయుగమాశ్చర్యలహరీమ్ ॥10॥
జగన్మాత పాద పద్మములలో ఉన్న రజస్సు, రజోగుణరహితుల హృదయములో వసించి, ఆ పాదములలో ఉన్న రక్తి కేవలము విరక్తుల హృదయములో స్థితమై, అమ్మ పాదముల మందగతి, మంద బుద్ధి కలవారికి, భక్తి లేనివారికి లభ్యం కాకుండా ఉంటాయి.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



