మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.
ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.
ప్రచండార్తిక్షోభప్రమథనకృతే ప్రాతిభసరి-
త్ప్రవాహ ప్రోద్దండీకరణజలదాయ ప్రణమతామ్ ।
ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ-
ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోఽయం జనని తే ॥41॥
జగన్మాతా! ప్రచండమైన ఆపదలలో చిక్కుకుని, వాటిని తొలగించుకొనుటకు నీ శరణు కోరినవారికి, జ్ఞానము అనే నది ప్రవహించుటకు మేఘములైనవి, సంసారము అనే తిమిరాంధకారములో దీపములైనవి అయిన నీ పాదముల దయ మాపై ప్రసరించుగాక.
మరుద్భిః సంసేవ్యా సతతమపి చాంచల్యరహితా
సదారుణ్యం యాంతీ పరిణతిదరిద్రాణసుషమా ।
గుణోత్కర్షాన్మాంజీరక కలకలైః తర్జనపటుః
ప్రవాలం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ ॥42॥
అమ్మా! లేత చిగురుటాకులు కొన్నాళ్ళకి పండి రాలిపోతాయి. నీ పాదములు ఎప్పటికీ నవనవోన్మేషములు. చిగురుటాకులవలె కాక, నీ పాదములు ఎప్పుడూ ఎరుపు వర్ణముతో ఉండి మమ్ములను అనుగ్రహిస్తాయి.
జగద్రక్షాదక్షా జలజరుచిశిక్షాపటుతరా
సమైర్నమ్యా రమ్యా సతతమభిగమ్యా బుధజనైః ।
ద్వయీ లీలాలోలా శ్రుతిషు సురపాలాదిముకుటీ-
తటీ సీమాధామా తవ జనని కామాక్షి పదయోః ॥43॥
జగన్మాతా! సకల జగత్తులను రక్షించగలవి, పద్మముల కాంతిని తిరస్కరించునవి, దేవతలచే నమస్కరించబడునవి, జ్ఞానులచే ఎల్లప్పుడు కోరబడునవి, వేదములచే స్తుతించబడునవి, దేవతల కిరీటములు పాద పీఠములుగా కలవి అయిన నీ పాదములకు జయజయధ్వానములు పలుకుతున్నాను.
గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృతజగత్
పరిత్రాణౌ శోణౌ మునిహృదయలీలైకనిపుణౌ ।
నఖైః స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండితభవ-
గ్రహోన్మాదౌ పాదౌ తవ జనని కామాక్షి కలయే ॥44॥
అమ్మా! నీ పాదములను వర్ణించడం ఆదిశేషునకైనా తరమా! అజ్ఞానమును పారద్రోలేవీ, జగద్రక్షణములు, యోగుల హృదయములలో నివసించేవి, సమస్త వేదసారములైనవి, సాంసారిక బాధలను తొలగించేవి అయిన నీ దివ్య పాదములను నిరంతరము ధ్యానిస్తున్నాను.
అవిశ్రాంతం పంకం యదపి కలయన్యావకమయం
నిరస్యన్కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలమ్ ।
తులాకోటిద్వందం దధదపి చ గచ్ఛన్నతులతాం
గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే ॥45॥
మాతా! నీ పాదములపై నిత్యము అలంకరింపబడే లత్తుక నిన్ను శరణన్న మా పాపపంకిలమును తొలగిస్తుంది. అందియములను ధరించిన సాటిలేని నీ పదములు, ఈ జగత్తులో ఎవరికీ లొంగక అన్నిటికీ అతీతముగా ఉంటాయి.
ప్రవాలం సవ్రీలం విపినవివరే వేపయతి యా
స్ఫురల్లీలం బాలాతపమధికబాలం వదతి యా ।
రుచిం సాంధ్యాం వంధ్యాం విరచయతి యా వర్ధయతు సా
శివం మే కామాక్ష్యాః పదనలినపాటల్యలహరీ ॥46॥
అమ్మా! నీ పాదములు లేలేత చిగురుటాకులను అడవిలో తలదాచుకొమ్మనీ, సూర్యకాంతిని తిరస్కరిస్తూ, సంధ్యాకాంతులను త్రోసి రాజంటున్నాయి. అట్టి కాంతివంతమైన నీ పాదములు ఎల్లప్పుడు మాకు శుభమును ప్రసాదించుగాక.
కిరంజ్యోత్స్నారీతిం నఖముఖరుచా హంసమనసాం
వితన్వానః ప్రీతిం వికచతరుణాంభోరుహరుచిః ।
ప్రకాశః శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే
శరత్కాలప్రౌఢిం శశిశకలచూడప్రియతమే ॥47॥
అమ్మా! శివ ప్రియా! కామాక్షీ! వెన్నెల ప్రకాశమును నీ పాదనఖములచే త్రోసివేస్తూ, యోగుల మనసులకు రాచహంసలవలే ఆనందాన్ని కలుగచేస్తూ, శరత్కాలములో విస్తరిస్తున్న పద్మములవలే, నీ పాదములు మాకు ఆనందమును కలుగజేయుగాక.
నఖాంకూరస్మేరద్యుతివిమల గంగాంభసి సుఖం
కృతస్నానం జ్ఞానామృతం అమలం ఆస్వాద్య నియతమ్ ।
ఉదంచన్మంజీరస్ఫురణమణిదీపే మమ మనో
మనోజ్ఞే కామాక్ష్యాః చరణమణిహర్మ్యే విహరతామ్ ॥48॥
అమ్మా! చిరునవ్వుతో కూడిన మొగ్గలవంటి నీ పాద నఖముల కాంతులు, మణిదీపములవలే ప్రకాశిస్తున్న నీ కాలి అందియలతో కూడిన నీ పాదములు, నా హృదయములో నిత్యము వసించుగాక.
భవాంభోధౌ నౌకాం జడిమవిపినే పావకశిఖాం
అమర్త్యేంద్రాదీనాం అధిముకుటముత్తంసకలికామ్ ।
జగత్తాపే జ్యోత్స్నామకృతకవచఃపంజరపుటే
శుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీమ్ ॥49॥
తల్లీ! ఈ సంసారము ఒక మహా సాగరమైతే, దానిని దాటించే నౌక నీ పాదములు. మా బుద్ధిహీనతను తొలగించే, ఔషధము నీ పాదములు. దేవతల కిరీటమునకు అలంకారములు, నీ పాదములు. వేదములనే పంజరములోని ఆడ చిలుక నీ పాదములు. అలాంటి పాద యుగళమును ధ్యానిస్తాను.
పరాత్మప్రాకాశ్య ప్రతిఫలనచుంచుః ప్రణమతాం
మనోజ్ఞస్త్వత్పాదో మణిముకురముద్రాం కలయతే ।
యదీయాం కామాక్షి ప్రకృతిమసృణాః శోధకదశాం
విధాతుం చేష్ఠంతే బలరిపువధూటీకచభరాః ॥50॥
అమ్మా కామాక్షీ! నిను శరణన్న వారికి నీ పాదములు ఒక దర్పణమువంటివి. వారి రూపము నీ పాదములలో ప్రతిబింబిస్తుంది. ఇంద్రపత్ని శచీదేవి, తన కురులను అలంకరించుకోడానికి నీ పాదములనే దర్పణముగా చేసుకుంటున్నది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.
🕉️ మూక పంచశతి పాదారవిందశతకం తెలుగులో అర్థం
మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు




