మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు
మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.
ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.
ఉపాదిక్షద్దాక్ష్యం తవ చరణనామా గురురసౌ
మరాలానాం శంకే మసృణగతిలాలిత్యసరణౌ ।
అతస్తే నిస్తంద్రం నియతమమునా సఖ్యపదవీం
ప్రపన్నం పాథోజం ప్రతి దధతి కామాక్షి కుతుకమ్ ॥71॥
అమ్మా! కామాక్షీ! తమ నడకలు ఎలా ఉండాలో తెలియక సంచరిస్తున్న హంసలకు- ఎంతో సులభమైన పద్ధతిలో, ఎంతో సుకుమారంగా, వయ్యారముగా, వాటికి నడకలు నేర్పినవి నీ పాదములు. అందుకనే హంసలు నీ పాద పద్మములతో చెలిమికి తహతహలాడుతున్నాయి.
దధానైః సంసర్గం ప్రకృతిమలినైః షట్పదకులైః
ద్విజాధీశశ్లాఘావిధిషు విదధద్భిర్ముకులతామ్ ।
రజోమిశ్రైః పద్మైర్నియతమపి కామాక్షి పదయోః
విరోధస్తే యుక్తో విషమశరవైరిప్రియతమే ॥72॥
జగన్మాతా! సహజముగా, తుమ్మెదలు నల్లని రంగులో ఉండే చంచలమైనవి. ఆ తుమ్మెదలను ఆకర్షించేవి పద్మములు. పైగా చంద్రుని చూడగానే అవి ముఖం ముడుచుకుంటాయి. కానీ, ఈ స్వభావములు కేవలము సృష్టి ధర్మమే కానీ వాటికి స్వాభావికం కాదు. కాబట్టి వానితో నీ పాదాలకు వైరమెందుకమ్మా!
కవిత్వశ్రీమిశ్రీకరణ నిపుణౌ రక్షణచణౌ
విపన్నానాం శ్రీమన్నలినమసృణౌ శోణకిరణౌ ।
మునీంద్రాణామంతఃకరణశరణౌ మందసరణౌ
మనోజ్ఞౌ కామాక్ష్యా దురితహరణౌ నౌమి చరణౌ ॥73॥
కవిత్వ పటిమను వృద్ధిపరచి, దుఃఖపీడితులైనవారిని దయచూచి, ఎరుపురంగు ప్రకాశముతో, యోగీశ్వరుల అంతరంగములలో విహరిస్తూ, పాపక్షయము చేస్తూ, నెమ్మదిగా సంచరించే అమ్మ పాదములకు నమస్కరిస్తున్నాను.
పరస్మాత్సర్వస్మాదపి చ పరయోర్ముక్తికరయోః
నఖశ్రీభిర్జ్యోత్స్నాకలిత తులయోస్తామ్రతలయోః ।
నిలీయే కామాక్ష్యా నిగమనుతయోర్నాకినతయోః
నిరస్తప్రోన్మీలన్నలిన మదయోరేవ పదయోః ॥74॥
అమ్మా! ముక్తిదాయకములు, వెన్నెల కాంతిని మించిన నఖ కాంతులు కలవి, వేదములచేత, దేవతలచేత కీర్తించబడేవి, కమలముల కాంతిని మించిన కాంతికలవి అయిన పాదములలో నేను ఐక్యమవుతాను.
స్వభావాదన్యోన్యం కిసలయమపీదం తవ పదం
మ్రదిమ్నా శోణిమ్నా భగవతి దధాతే సదృశతామ్ ।
వనే పూర్వస్యేచ్ఛా సతతమవనే కిం తు జగతాం
పరస్యేత్థం భేదః స్ఫురతి హృది కామాక్షి సుధియామ్ ॥75॥
అమ్మా! నీ చరణములు, లేత చిగురుటాకులు రెండింటికి సామ్యం ఉంది. రెండూ కూడా ఎరుపు వర్ణముతో, సున్నితంగా ఉంటాయి. అయితే ఆలోచించగా, చిగురుటాకు అడవిలో ఉంటే, నీ పాదములు మాత్రం సంసారమనే ఆ అడవిని ఎల్లప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి.
కథం వాచాలోఽపి ప్రకటమణిమంజీరనినదైః
సదైవానందార్ద్రాన్ విరచయతి వాచంయమజనాన్ ।
ప్రకృత్యా తే శోణచ్ఛవిరపి చ కామాక్షి చరణూ
మనీషానైర్మల్యం కథమివ నృణాం మాంసలయతే ॥76॥
మాతా! కామాక్షీ! నీ పాదములకు ఉన్న అందియలు ఎప్పుడూ శబ్దంచేస్తూ మాట్లాడుతుంటాయి. కానీ అవి మౌన మునీంద్రులచే ఆరాధించబడుతుంటాయి. రజోగుణ వర్ణమైన ఎర్రని పాదములు మానవులకు సత్వగుణమైన పవిత్ర జ్ఞానమును ప్రసాదిస్తాయి. పరస్పర విరుద్ధమైన భావములు కలవి నీ పాదములు.
చలత్తృష్ణావీచీపరిచలనపర్యాకులతయా
ముహుర్భ్రాంతస్తాంతః పరమశివవామాక్షి పరవాన్ ।
తితీర్షుః కామాక్షి ప్రచురతరకర్మాంబుధిమముం
కదాహం లప్స్యే తే చరణమణిసేతుం గిరిసుతే ॥77॥
అమ్మా! ఈ సంసారము ఆశలను రేపెట్టుతూ కలతలను కలిగిస్తుంది. ఈ సంసారమునకు, నీ సమ్ముఖమునకు వారధి నీ పాద పద్మములు. సంసారము అనే సాగరమును దాటడానికి నేను నీ పాదపద్మములనే వారధిని ఎప్పుడు దాటగలనో కదా!
విశుష్యంత్యాం ప్రజ్ఞాసరితి దురితగ్రీష్మసమయ-
ప్రభావేణ క్షీణే సతి మమ మనఃకేకిని శుచా ।
త్వదీయః కామాక్షి స్ఫురితచరణాంభోదమహిమా
నభోమాసాటోపం నగపతిసుతే కిం న కురుతే ॥78॥
అమ్మా! పర్వతరాజపుత్రీ! పాపములు అనే ప్రచండమైన ఎండ వేడిమికి నాలోని కొద్దిపాటి జ్ఞానము ఆవిరైపోతున్నది. నా మనసు అనే మయూరము ఎంతో అలమటిస్తున్నది. కేవలము నీ పాదమనే శ్రావణ మాసపు మేఘములే నా మనసనే మయూరమునకు ఆహ్లాదమును కలిగించగలవు.
వినమ్రాణాం చేతోభవనవలభీసీమ్ని చరణ-
ప్రదీపే ప్రాకాశ్యం దధతి తవ నిర్ధూతతమసి ।
అసీమా కామాక్షి స్వయమలఘుదుష్కర్మలహరీ
విఘూర్ణంతీ శాంతిం శలభపరిపాటీవ భజతే ॥79॥
అమ్మా! నీ పాదములకు నమస్కరించే వారి భవనములోని అంధకారమును తొలగిస్తూ, నీ పాదములనే మణిదీపములను ప్రకాశింపచేస్తున్నావు. మా పాపకర్మలనే మిడతలదండు, వాటంతట అవి, నీ పాద శిఖలనే జ్వాలలో పడి భస్మమై పోవుచున్నవి.
విరాజంతీ శుక్తిర్నఖకిరణముక్తామణితతేః
విపత్పాథోరాశౌ తరిరపి నరాణాం ప్రణమతామ్ ।
త్వదీయః కామాక్షి ధ్రువమలఘువహ్నిర్భవవనే
మునీనాం జ్ఞానాగ్నేః అరణిరయమంఘిర్విజయతే ॥80॥
అమ్మా! నీ చరణములు ముత్యపుచిప్పలైతే, నీ నఖములకాంతులు ఆ చిప్పలలో జనించిన ముత్యములు. నిన్ను శరణన్నవారిని – సంసారమనే సముద్రమును దాటించే నావ, సంసార అరణ్యమునకు దావాగ్ని, మునులలో జ్ఞానాగ్ని అయిన నీ పాదములకు నమస్కరించుచున్నాను.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.
🕉️ మూక పంచశతి పాదారవిందశతకం తెలుగులో అర్థం
మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు




