మూక పంచశతి పాదారవిందశతకం 81-90 శ్లోకాలు
మూక పంచశతి పాదారవింద శతకం శ్లోకాలు అనేది మూక కవి రచించిన ప్రసిద్ధ భక్తి స్తోత్రంలో ఒక పవిత్ర భాగం. ఇందులో కామాక్షి దేవి పాదారవిందాల మహిమను అద్భుతంగా వర్ణించారు. ఈ శతకం భక్తి, సమర్పణ భావాన్ని పెంచుతూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది.
ఈ శతకాన్ని భక్తితో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, జ్ఞానం, ఐశ్వర్యం మరియు దైవ అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. మూక కవి దైవ కృపతో మౌనస్థితి నుండి కవిత్వాన్ని పొందిన నేపథ్యం ఈ స్తోత్రానికి ప్రత్యేకతను ఇస్తుంది. పాదారవింద ధ్యానం ద్వారా భక్తుడు సంపూర్ణ సమర్పణ భావాన్ని పొందుతూ మోక్ష మార్గంలో ముందుకు సాగుతాడు.
సమస్తైః సంసేవ్యః సతతమపి కామాక్షి విబుధైః
స్తుతో గంధర్వస్త్రీసులలిత విపంచీకలరవైః ।
భవత్యా భిందానో భవగిరికులం జృంభితతమో-
బలద్రోహీ మాతశ్చరణపురుహూతో విజయతే ॥81॥
అమ్మా! కామాక్షీ! నిరంతరము దేవతల స్తుతులనందుకుంటూ, దేవతా స్త్రీల మనోహర గానముతో, వారి నాదముల ధ్వనులతో నీ పదములు సేవింపబడుతుంటాయి. ఒక వేళ దేవేంద్రుడే నీ పాదముగా అమరలేదుకదా! ఎందుకంటే, సంసారము అనే ఈ పర్వతమును దేవేంద్రుడు మాత్రమే వజ్రాయుధముతో పిండి చేయగలడుకదా!
వసంతం భక్తానామపి మనసి నిత్యం పరిలసద్-
ఘనచ్ఛాయాపూర్ణం శుచిమపి నృణాం తాపశమనమ్ ।
నఖేందుజ్యోత్స్నాభిః శిశిరమపి పద్మోదయకరం
నమామః కామాక్ష్యాః చరణమధికాశ్చర్యకరణమ్ ॥82॥
అమ్మా! నీ పాదపద్మములు వసంత కాలంలో భక్తుల మనసులో కొలువై, వర్ష ఋతువులో నీలిమేఘఛాయతో ఉండి, గ్రీష్మ ఋతువులో తాపమును హరిస్తూ, శిశిర ఋతువులో చల్లని వెన్నెల కాంతిని చిందిస్తూ, శరత్ కాలములో పద్మములను వికసింపచేస్తూ, ఋతువులు వేరైనా, నీ ధర్మం భక్తరక్షణమే.
కవీంద్రాణాం నానాభణితిగుణచిత్రీకృతవచః-
ప్రపంచవ్యాపారప్రకటనకలాకౌశలనిధిః ।
అధఃకుర్వన్నబ్జం సనకభృగుముఖ్యైర్మునిజనైః
నమస్యః కామాక్ష్యాః చరణపరమేష్ఠీ విజయతే ॥83॥
జగదంబా! పద్మాసనాసీనుడైన బ్రహ్మదేవుడు అనేక రకములుగా, అనేక గుణములతో సృష్టి రచన చేయటం, చతుర్ముఖములతో వేద పఠనం చేయటం, పద్మాసనాసీనములైన నీ పాదముల కరుణా కటాక్షము చేతనే కదా!
భవత్యాః కామాక్షి స్ఫురితపదపంకేరుహభువాం
పరాగాణాం పూరైః పరిహృతకలంకవ్యతికరైః ।
నతానామామృష్టే హృదయముకురే నిర్మలరుచి
ప్రసన్నే నిశ్శేషం ప్రతిఫలతి విశ్వం గిరిసుతే ॥84॥
మాతా! నగరాజ సుతా! భక్తులు నీ చరణములకు నమస్కరించినపుడు, వారి హృదయమనే దర్పణంపై ఉన్న ధూళిని, నీ పాద రజముచేత శుద్ధిపరుస్తావు. అప్పుడు నీ పవిత్ర రూపము వారి హృదయమనే అద్దములో ఎంతో స్పష్టముగా ద్యోతక మవుతుంది.
తవ త్రస్తం పాదాత్కిసలయమరణ్యాంతరమగాత్
పరం రేఖారూపం కమలమముమేవాశ్రితమభూత్ ।
జితానాం కామాక్షి ద్వితయమపి యుక్తం పరిభవే
విదేశే వాసో వా శరణగమనం వా నిజరిపోః ॥85॥
మాతా! లేత చిగురుటాకులు, సుందర పద్మములు, నీ పాదముల ధాటికి తట్టుకొనలేక, చిగురుటాకేమో తాను వెళ్ళిపోయి, అరణ్యములో దాక్కున్నది. కానీ, పద్మమేమో, తనను నీ పాదమునకు ఛాయగా భావించి, నీ పాదమును తన శిరసుపై ఉంచుకున్నది.
గృహీత్వా యాథార్థ్యం నిగమవచసాం దేశికకృపా-
కటాక్షర్కజ్యోతిః శమితమమతాబంధతమసః ।
యతంతే కామాక్షి ప్రతిదివసమంతర్ద్రఢయితుం
త్వదీయం పాదాబ్జం సుకృతపరిపాకేన సుజనాః ॥86॥
మాతా! గురువు యొక్క ప్రకాశమైన కాంతి, శిష్యుని అజ్ఞానము అనే చీకటిని పటాపంచలు చేస్తుంది. ఆ జ్ఞానులైన గురువులు మాత్రం నీ పాదములనే, తమ గురువులుగా భావించి, వదలక తమ హృదయములో నిలుపుకుంటారు.
జడానామప్యంబ స్మరణసమయే తవచ్చరణయోః
భ్రమన్మంథక్ష్మాభృద్ ధుముఘుమితసింధుప్రతిభటాః ।
ప్రసన్నాః కామాక్షి ప్రసభమధరస్పందనకరా
భవంతి స్వచ్ఛందం ప్రకృతిపరిపక్కా భణితయః ॥87॥
అమ్మా! చదువుసంధ్యలు లేని మందమతులైనా, నీ పాదములను ఆశ్రయించినంత మాత్రమున, అనంతమైన కావ్య పటిమను పొందగలుగుతారు. ఆ కావ్య సంపద ఎటువంటిదంటే, క్షీర సముద్ర మధన సమయములో ఆవిర్భవించిన అమృతమంత తీయనిది.
వహన్నప్యశ్రాంతం మధురనినదం హంసకమసౌ
తమేవాధః కర్తుం కిమివ యతతే కేలిగమనే ।
భవస్యైవానందం విదధదపి కామాక్షి చరణూ
భవత్యాస్తద్ద్రోహం భగవతి కిమేవం వితనుతే ॥88॥
అమ్మా! నీ చరణముల అందెలు తమ సవ్వడితో నీకు ఆనందాన్ని కలుగ చేస్తుంటే, అదే అందెల సవ్వడి హంసనడకలను తిరస్కరిస్తున్నది. నీ అవే పాదములు శివునకు మోదమును కలిగిస్తుంటే, మరొకప్రక్క అవి సంసారబాధలను తొలగింపచేస్తున్నాయి.
యదత్యంతం తామ్యత్యలసగతివార్తాస్వపి శివే
తదేతత్కామాక్షి ప్రకృతిమృదులం తే పదయుగమ్ ।
కిరీటైః సంఘట్టం కథమివ సురౌఘస్య సహతే
మునీంద్రాణామాస్తే మనసి చ కథం సూచినిశితే ॥89॥
అమ్మా! ఒక విషయం నాకు అర్ధం కావడం లేదు. సున్నితమైన, మృదువైన నీ పాదములు, నీకు పాద నమస్కారములు చేసేటపుడు, దేవతల కిరీటముల మణులు అనే రాళ్ళ ఒరిపిడిని ఎలా భరించాయమ్మా! ఆ ఒరిపిడిని భరిస్తూ కూడా, వారి హృదయములలో సంచరించడం మాత్రం నీకే తగును.
మనోరంగే మత్కే విబుధజనసంమోదజననీ
సరాగవ్యాసంగం సరసమృదుసంచారసుభగా ।
మనోజ్ఞా కామాక్షి ప్రకటయతు లాస్యప్రకరణం
రణన్మంజీరా తే చరణయుగలీనర్తకవధూః ॥90॥
అమ్మా! నీ పాద యుగళి, ఒక అద్భుతమైన నాట్యగత్తె. ఆ పాదములజంట, నా మనసును ఒక రంగస్థలముగా చేసుకుని, దేవతా సమూహమునకు, జ్ఞానులకు సంతోషప్రదమై, మనోహరమైన నీ అందెల సవ్వడి ప్రతిధ్వనిస్తుండగా, ఒక అద్భుతమైన నాట్యమును ఆవిష్కరించాలి.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.
🕉️ మూక పంచశతి పాదారవిందశతకం తెలుగులో అర్థం
మూక పంచశతి పాదారవిందశతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 11-20 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 21-30 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 31-40 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 41-50 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 51-60 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 61-70 శ్లోకాలు
మూక పంచశతి పాదారవిందశతకం 71-80 శ్లోకాలు




