నరసింహ అవతారం,రాక్షసుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు ఎలా అయ్యాడు?
శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాలుగోది నరసింహ అవతారం, ప్రహ్లాద భక్తి & హిరణ్యకశిపుని సంహారం .ఈ అవతారం ఎంతో విశిష్టమైనది. భాగవతంలోని ఏడవ స్కంధంలో నరసింహావతారం వర్ణించబడింది. నరసింహ అవతారం ఎవరి కొరకు ఉద్భవించింది? హిరణ్యకశిపుడు విష్ణువుకు శత్రువుగా ఎందుకు మారాడు? రాక్షస వంశంలో పుట్టిన ప్రహ్లాదుడికి అంత హరి భక్తి ఎలా కలిగింది?
జయ–విజయుల శాపవృత్తాంతం
జయ, విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవలో తత్పరులు. ఒకసారి బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందనాది మునులు నారాయణుని దర్శనం కోసం వైకుంఠానికి రాగా, అది సరైన సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. దాంతో మునులు కోపించి, విష్ణులోకానికి దూరమై భూలోకంలో జన్మిస్తారని శపించారు.
అప్పుడు వారు శ్రీమహావిష్ణువును శరణు వేడగా, మహర్షుల శాపానికి తిరుగులేదని, అయితే మీరు నా భక్తులైనందున కొంత శాపవిమోచనం కలిగిస్తానని చెప్పారు. మీరు నా భక్తులుగా ఏడు జన్మలు గానీ, విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో జన్మించి, తరువాత మళ్లీ వైకుంఠానికి వస్తారని వరమిచ్చాడు. అప్పుడు వారు “మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేము. విరోధులుగా మూడు జన్మలు ఎత్తుతాము” అని కోరారు.
ఆ జయవిజయులే కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగా; త్రేతాయుగంలో రావణుడు, కుంభకర్ణులుగా; ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవక్త్రులుగా జన్మించారు. ప్రతి జన్మలోను విష్ణువు అవతారంతో సంహరింపబడి శాపవిముక్తులయ్యారు.
హిరణ్యాక్షుడు – హిరణ్యకశిపుడు జననం
సప్త ఋషులలో ఒకరైన కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే ఇద్దరు మహావీరులు జన్మించారు. వీరిలో హిరణ్యాక్షుడు పరాక్రమవంతుడు. ఒకసారి భూమిని పాతాళానికి తీసుకెళ్తుండగా, విష్ణువు వరాహావతారం ధరించి అతన్ని సంహరించాడు.
సోదరుడి మరణంతో హిరణ్యకశిపుడు తీవ్రంగా దుఃఖించాడు. కొంతకాలం తర్వాత రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి మందరగిరికి వెళ్లి ఘోర తపస్సు ప్రారంభించాడు. అతని తపస్సు ప్రభావంతో లోకాలు కంపించాయి. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరమన్నాడు.
హిరణ్యకశిపుడు ఇలా వరం కోరాడు: “గాలిలో గాని, ఆకాశంలో గాని, భూమిపై గాని, నీటిలో గాని, అగ్నిలో గాని; దేవతల వల్ల గాని, రాక్షసుల వల్ల గాని, మృగాల వల్ల గాని; పగలు గాని, రాత్రి గాని; ప్రాణమున్న వాని చేత గాని, ప్రాణంలేని వాని చేత గాని; ఆయుధంతో గాని; ఇంట్లో గాని, బయట గాని నాకు మరణం సంభవించకూడదు.” బ్రహ్మ ఆ వరం అనుగ్రహించాడు.
దాంతో అతనిలో గర్వం పెరిగి దేవతలను జయించి, సర్వలోకాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. విష్ణువు భక్తులను హింసించసాగాడు.
ప్రహ్లాదుడు
హిరణ్యకశిపుడు తపస్సు చేస్తుండగా దేవతలు అతని రాజ్యంపై దాడి చేశారు. గర్భవతియైన అతని భార్య లీలావతిని ఇంద్రుడు చెరపట్టగా, నారదుడు వచ్చి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. అక్కడ నారదుడు నారాయణుని మహిమను బోధించాడు. ఆ బోధ గర్భస్థ శిశువైన ప్రహ్లాదునికి గ్రహించబడింది.
ప్రహ్లాదుడు జన్మతః హరిభక్తుడు. వినయం, సత్యనిష్ఠ కలవాడు. గురుకులంలో చండ, అమర్కుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఒక రోజు హిరణ్యకశిపుడు “ఏం నేర్చుకున్నావు?” అని అడగగా, ప్రహ్లాదుడు “శ్రీహరిని స్మరించడం మించిన విద్య లేదు” అని చెప్పాడు.
దాంతో కోపించిన హిరణ్యకశిపుడు అతన్ని అనేక విధాలుగా హింసించాడు—శూలాలతో పొడిచించాడు, ఏనుగులతో తొక్కించాడు, అగ్నిలో వేయించాడు. అయినా ప్రహ్లాదుడికి ఏ హానీ కలగలేదు.
నరసింహావతారం
ఒక రోజు హిరణ్యకశిపుడు “నీ హరి ఎక్కడున్నాడు?” అని అడగగా, ప్రహ్లాదుడు “అన్నిటిలోనూ ఉన్నాడు” అని చెప్పాడు. “ఈ స్తంభంలో ఉన్నాడా?” అని అడిగిన రాజు, కోపంతో స్తంభాన్ని కొట్టగా, ఘోర నాదంతో స్తంభం చీలి, నరసింహ స్వరూపంలో విష్ణువు అవతరించాడు.
మనిషీ కాదు, మృగమూ కాదు. పగలూ కాదు, రాత్రీ కాదు—సంధ్యాకాలం. ఇంట్లో కాదు, బయట కాదు—గుమ్మంలో. భూమిపైనా కాదు, ఆకాశంలో కాదు—తన తొడలపై. ఆయుధంతో కాదు—పదునైన గోళ్ళతో. ఈ విధంగా బ్రహ్మవరం భంగం కాకుండా హిరణ్యకశిపుని సంహరించాడు.
నరసింహుడి ఉగ్రరూపం చూసి దేవతలు భయపడ్డారు. చివరకు ప్రహ్లాదుడు వెళ్లి స్తుతించగా, స్వామి శాంతించి అతన్ని ఆశీర్వదించాడు. “నీ తండ్రికి మోక్షం కలిగింది” అని వరమిచ్చాడు. ప్రహ్లాదుడు రాజ్యాన్ని పాలించాడు.
భగవంతుడు సృష్టిలో అణువణువునా నిండి ఉన్నాడనే సత్యాన్ని నరసింహావతారం తెలియజేస్తుంది. హిరణ్యకశిపుడిది వైరభక్తి; ప్రహ్లాదుడిది మధురభక్తి. మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే—దైవసాక్షాత్కారం.
శ్రీ నరసింహ స్వామి ఆవిర్భావం, హిరణ్యకశిపుని సంహారం, ప్రహ్లాదుని భక్తి—ఇవి భక్తితో విన్నవారికి పుణ్యఫలం కలుగుతుంది.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


