నవ దుర్గల విశిష్టత
నవదుర్గ
హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ఉంది.
హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుల అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని చెబుతారు. ఈ మూడు అవతారాల నుంచి మరిన్ని రూపాలు వెలువడ్డాయి. ఇలా తొమ్మిది స్వరూపాలుగా — నవదుర్గలుగా — దుర్గాదేవిని పూజిస్తారు. వారణాసిలో నవదుర్గలకు వేర్వేరు దేవాలయాలు ఉన్నాయి. వరాహ పురాణం ప్రకారం, దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుని అడిగినప్పుడు ఈ విధంగా వర్ణించారు:
శ్లోకం:
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది.
1.శైలపుత్రి
నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. “శైలం” అంటే కొండ. పర్వతరాజు హిమవంతునికి జన్మించినందున ఈమెకు శైలపుత్రి అని పేరు వచ్చింది. తపస్సు ఆచరించి శివుణ్ణి భర్తగా పొందింది.
ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి. వాహనం వృషభం. సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఈ రూపంలో అవతరించింది.
మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత శైలపుత్రి. ఈమె ఉపాసన మూలాధార చక్రాన్ని జాగృతం చేస్తుందని విశ్వాసం.
ధ్యాన శ్లోకం:
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ |
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ||
2.బ్రహ్మచారిణి
దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. బ్రహ్మచర్యంలో ఉన్నది అనే అర్థం. తెల్లని వస్త్రాలు ధరించి, కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ఉంటుంది.
పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందేందుకు వేల ఏళ్ల పాటు ఘోర తపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా తపస్సు చేసినందున “అపర్ణ” అని ప్రసిద్ధి చెందింది. ఆమెకు కన్యాకుమారి అనే మరో పేరు కూడా ఉంది.
ధ్యాన శ్లోకం:
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
3.చంద్రఘంట
మూడవ అవతారం చంద్రఘంట. అర్ధచంద్రాకారంలో గంటను ధరించినందున ఈ పేరు వచ్చింది. ఎనిమిది చేతులతో ఉంటుంది. త్రిశూలం, గద, ధనుర్బాణాలు, ఖడ్గం, కమండలం మొదలైన ఆయుధాలు ఉంటాయి. వాహనం సింహం లేదా పులి.
రాక్షసులతో యుద్ధంలో ఆమె చేతిలోని ఘంట భీకర నినాదం చేసింది. భక్తులకు మాత్రం ఆ నినాదం శుభప్రదమని నమ్మకం.
ధ్యాన శ్లోకం:
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
4.కూష్మాండ
నాలుగో అవతారం కూష్మాండ. “కు” అంటే చిన్న, “ఊష్మ” అంటే శక్తి, “అండ” అంటే విశ్వం. తన శక్తితో విశ్వాన్ని సృష్టించిందని అర్థం.
ఎనిమిది చేతులతో ఉంటుంది. చక్రం, ఖడ్గం, గద, పాశం, ధనుస్సు, బాణాలు మొదలైనవి ధరించి ఉంటుంది. వాహనం సింహం.
ధ్యాన శ్లోకం:
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||
5.స్కందమాత
ఐదవ రోజు పూజించే అవతారం స్కందమాత. కుమారస్వామి తల్లి కావడంతో ఈ పేరు వచ్చింది. సింహవాహనంపై కూర్చుని, ఒడిలో స్కందుణ్ణి ఉంచుకుని ఉంటుంది.
ఈమెను పూజిస్తే జ్ఞానం, మోక్షం లభిస్తాయని విశ్వాసం.
ధ్యాన శ్లోకం:
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||
6.కాత్యాయని
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట జన్మించినది కాత్యాయని. సింహవాహనగా దర్శనమిస్తుంది. నాలుగు చేతులతో ఉంటుంది. ఖడ్గం, పద్మం ధరించి ఉంటుంది.
ఈమెను పూజిస్తే ధర్మార్థకామమోక్షాలు సిద్ధిస్తాయని చెబుతారు.
ధ్యాన శ్లోకం:
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
7.కాలరాత్రి
ఏడవ రోజు పూజించే అవతారం కాలరాత్రి. నల్లని రూపం, ఉగ్ర స్వరూపం. వాహనం గాడిద. వరముద్ర, అభయముద్రలతో భక్తులను రక్షిస్తుంది.
భయంకరంగా కనిపించినా శుభప్రదాయిని. అందుకే “శుభంకరి” అని పిలుస్తారు.
- మహాగౌరి
ఎనిమిదవ రోజు పూజించే అవతారం మహాగౌరి. తెల్లటి వర్ణంతో, తెల్లని వస్త్రాలతో విరాజిల్లుతుంది. వాహనం వృషభం.
తపస్సుతో నల్లబడిన పార్వతి, శివుడు గంగాజలంతో అభిషేకం చేయగా గౌరవర్ణంగా మారి మహాగౌరిగా ప్రసిద్ధి చెందింది.
ధ్యాన శ్లోకం:
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||
- సిద్ధిదాత్రి
తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి. సర్వసిద్ధులను ప్రసాదించేది. కమలంపై ఆసీనురాలై నాలుగు చేతులతో ఉంటుంది. చక్రం, గద, శంఖం, కమలం ధరించి ఉంటుంది.
ఈమెను ఆరాధిస్తే జ్ఞానం, మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ధ్యాన శ్లోకం:
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
తొమ్మిది రోజులలో అమ్మవారి శక్తి శైలపుత్రిగా ప్రారంభమై బ్రహ్మచారిణిగా, స్కందమాతగా, చివరికి మహిషాసురుని సంహరించిన శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతుంది. మొదటి ఏడు స్వరూపాలు మానవ శరీరంలోని సప్తచక్రాలకు అధిష్ఠాత్రులని చెబుతారు. నవదుర్గలను ఉపాసించడం మోక్షమార్గాన్ని చేరుకోవడమే అన్న భావన ఉంది.
ప్రతి స్త్రీ తనలోని శక్తితత్వాన్ని గుర్తించి ఆత్మజ్ఞానం పొందడమే నవదుర్గల అవతారాల పరమార్థం.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


