google.com, pub-2532166691306495, DIRECT, f08c47fec0942fa0

సత్యనారాయణ స్వామి వ్రతకథల అంతరార్థం

సత్యనారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం

“Satyanarayana Swamy Vratham puja with kalasham, Lord Vishnu photo, fruits, flowers, and prasadam offerings”

మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము.  మహిమ గల శ్రీ సత్యనారాయణ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో పంపానది వొడ్డున ఉన్న రత్నగిరి కొండపై సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో వెలిశాడు.

శ్రీ మహావిష్ణువును రామావతారంలో ప్రసన్నం చేసుకోవటానికి పూర్వం రత్నాకరుడు అనే భక్తుడు తపస్సు చేయగా, స్వామి ప్రత్యక్షమై వరం ఇవ్వగా తన శిరస్సుపై స్వామిని మోసే భాగ్యం కల్పించమని కోరాడు.

దీనికి ఫలితంగా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కలియుగంలో భక్తులను ఆదరించుటకు క్రీ.శ. 1891 లో కరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ నాడు రత్నగిరి కొండపై వెలిశాడు. ఈ క్షేత్రంలో నిత్యం సత్యనారాయణునికి వ్రతాలు జరుగుతూ ఉంటాయి.

కష్ట సమయములలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది, విచారములు తొలగిపోతాయి. ధన ధాన్యములు వృద్ధి చెందును, అన్ని కార్యాలలో మంచి జరుగుతుంది. నూతన కార్యములు చేపట్టే వారికి విజయం కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీలకు సంతానం, సౌభాగ్యం కలుగుతుంది.

అడిగిన వెంటనే వరాలనిచ్చే దేవుడు శ్రీ సత్యదేవుడు. 7 లోకాలకు అధిపతి అయిన ఈ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కోరికలు తీరుతాయని, కష్టాలు తొలగిపోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం, కాబట్టి నూతన దంపతులు మరియు శుభకార్యాలు తలపెట్టేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని, వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి, ఉచితాసనాలతో సత్కరించి, వారి ఆశీస్సులను స్వీకరించి, మంత్రపుష్పం సమర్పించి, అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.

ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి ఉంది. ఇక్కడ 5 కధలు మనకు ఎన్నో విశేషాలను తెలుపుతాయి.

1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి, కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి, వాటికి తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు.

ఈ కథ, మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ, వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో మనకు తెలుస్తుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో, నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.

2. రెండవ కథలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ధర్మాన్ని నమ్ముకున్న వారికి, వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే, కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని, ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి, కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుపుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా, వారికి మరుజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.

౩. మూడవ కథలో ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడిందో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన, ఎలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.

ఒకరికి ఒక మాట ఇచ్చామంటే, దానికి కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించే మనస్తత్వం ఉన్నవాడు కాదు దేవుడు. వైశ్యుడికి పూజ గురించి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వారమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవరూ అడగరు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని బాధ పడతాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు, తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే, అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.

4. నాల్గవ కథలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది.
పెద్దలను గౌరవించమని మన సంస్కృతి చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇంతకు ముందు చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, అక్కడ దేవుడు ఒక లీల చూపించి వారితోనే వుండి, వారికి జ్ఞానోదయం అయ్యాక, మరల వారివి వారికే ఇచ్చేస్తాడు. కేవలం మనల్ని పరీక్షించి మనకి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచకూడదని మనకు చెప్పే కథ ఇది. అంతే తప్ప ఆయనమనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు.

5. ఐదవ కథలో తుంగధ్వజుడనే రాజు, కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి, ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి, తప్పు తెలుసుకుని, తిరిగి ప్రసాద స్వీకారం చేసి, ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింపచేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు. కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం.

ఈ ఐదు అధ్యాయాలలో, చాతుర్వర్ణాల వారు ఎలా ఈ వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమే పరిమితం అని చేసే విషప్రచారానికి ముగింపు.

ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను, ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని, ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి.

మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.

దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది.

చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మనకి మంచి జరుగుతుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె అర్థం చేసుకుంటాం. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో తరుణోపాయాలను ఈ వ్రత కధలు చెబుతాయి. ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ సత్య నారాయణ స్వామి వ్రతం.. ఈ సారి సత్య నారాయణ స్వామి వ్రతం చేసుకొనేటప్పుడు, ఈ విషయాలను గుర్తుపెట్టుకొని భక్తితో, నమ్మకంతో వ్రతం చేసుకోండి. స్వామిని పూర్తిగా నమ్మి, శరణాగతి చేసి, మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది, ఉన్నతస్థితిని, ఇహపరసౌఖ్యాలను పొందుదాం.

ఈ‌ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ క్రింది video చూడండి. 

 
 
 

ఇవి కూడా చూడండి 👇👇👇👇

 
 
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top