శివానందలహరి 1-10 శ్లోకాలు
శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.
శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.
సంస్కృత శ్లోకము – 1
కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః-
-ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్-
భవాభ్యాం ఆమానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ ॥ 1 ॥
తాత్పర్యము
సకలవిద్యా స్వరూపులు, సిగలచే అలంకరింపబడిన చంద్రరేఖలు గలవారు, తమతమ తఫః ఫలములుగా ఒకరికొకరు పొందబడినవారు, భక్తులకు కర్మఫలాదులను ప్రసాదింపజేయువారు, ముల్లోకములకు అత్యంత శుభదాయకులుగా ఉండువారు, తలచినంతనే హృదయమందు మరల మరల ప్రసన్నులగువారు, ఆనందముతోపాటు స్వరూప సాక్షాత్కారానుభవమును గూడా కలుగజేయువారు అగు – ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ఇదే నా నమస్కారము.
సంస్కృత శ్లోకము – 2
గళంతీ శంభో త్వచ్చరితసరితః కిల్బిషరజో
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్ ।
దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం
వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరీ ॥ 2 ॥
తాత్పర్యము
శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివా! నీ చరిత్రమనెడి నదినుండి స్రవించి ప్రవహించుచు, పాపములనెడు ధూళిని అణచుచున్న ఈ శివానందలహరి – బుద్ది అను పిల్లకాలువగుండావచ్చి, సంసారతాపమును చల్లార్చుచూ, నా హృదయము అను మడుగులో పడినది. ఈ ఆనంద ప్రవాహము ఇక ఈ మడుగును వదలి పోకుండా స్థిరముగా ఉండునట్లు అనుగ్రహింపుము.
సంస్కృత శ్లోకము – 3
త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగ హారం మృగధరమ్ ।
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే ॥ 3 ॥
తాత్పర్యము
మూడువేదములలో తెలియబడువాడు, హృదయమునందు స్ఫురించువాడు, స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను నియంత్రించి నిర్మూలించువాడు, సృష్టికి ముందే ఉండువాడు, మూడు కన్నులు గలవాడు, జటాజూట సర్పహారములు గలవాడు, చేతిలో వేడిని ధరించినవాడు, ప్రకాశానందములు తన రూపముగా వెలుగొందువాడు, నాయందు దయగలవాడు, స్వస్వరూప జ్ఞానమునకు ముఖ్య సాధనమైన వాడు, సకలలోక పాలకుడు, సమయావసరములను బట్టి ప్రవర్తించువాడు, పార్వతీ సమ్మోహనుడు అగు-పరమేశ్వరుని హృదయములో సేవించుచున్నాను.
సంస్కృత శ్లోకము – 4
సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా
న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్ ।
హరిబ్రహ్మాదీనామపి నికట భాజామసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనమ్ ॥ 4 ॥
తాత్పర్యము
కొంచెం కొంచెం ఫలమిచ్చు దేవతలెందరో కలరు. వారిసేవ, వారిచ్చు ఫలములు కావాలి అనే కోరిక నాకు కలనైనా లేదు. శివా! ఎల్లప్పుడు సమీపవర్తులైన బ్రహ్మాదులకు కూడా దొరకని నీ పాదసేవయే దయచేయుమని నిన్ను ఎల్లవేళలా వేడుకొనుచున్నాను.
సంస్కృత శ్లోకము – 5
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః ।
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోఽహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో ॥ 5 ॥
తాత్పర్యము
సర్వజ్ఞుడవైన ఈశ్వరా! శాస్త్రపాండిత్యము లేదు. వైద్యము చేతగాదు. కవిత్వము చెప్పలేను. సంగీతము రాదు. పురాణము చెప్పలేను. మంత్రములెరుగను. ఆటపాటలందు నేర్పులేదు. హాస్యము చెప్పలేను. ఇట్టి నాయెడ రాజులకెట్లు దయ కలుగుతుంది. వారిచ్చు ఫలములు నాకేల ? సర్వజ్ఞా ! నన్ను నేనే ఎరుగని పశువును. నీవు పశుపతివి గదా! నన్ను నీవే దయతో రక్షింపుము.
సంస్కృత శ్లోకము – 6
ఘటో వా మృత్పిండో అప్యణురపి చ ధూమోఽగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ ।
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః ॥ 6 ॥
తాత్పర్యము
కుండలు చేయుటకు మట్టి సాధనము. దానికి పరమాణువులు కారణము. కొండమీద పొగ కనపడుతుంది. కాబట్టి నిప్పక్కడ ఉంటుంది. బట్టలు దారముల వలన కలుగుతాయి మొదలైన ఈ తర్క శాస్త్ర వాక్యములలో ఒక్కటిగూడ మృత్యువునకు అడ్దుపడునదికాదు. ఓ మంచి బుద్ధీ! ఇవి వల్లించి కంఠక్షోభ ఏల కలిగించుకుంటావు? వద్దు. శివభజనచేసి మోక్షమును పొందుము.
సంస్కృత శ్లోకము – 7
మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ
కరౌ చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన విధౌ ।
తవ ధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తివిభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః ॥ 7 ॥
తాత్పర్యము
మనస్సు, వాక్కు, హస్తము, శ్రవణము, బుద్ధి, నేత్రము, అను ఆరు ఇంద్రియములు సర్వకాల సర్వావస్థలయందు నీ కైంకర్యములందే మునిగియున్నచో గ్రంథాంతర ప్రసక్తి కలుగదు గదా! (కనుక శివా ! అట్లనుగ్రహింపుమని భావము.)
సంస్కృత శ్లోకము – 8
యథా బుద్ధిః శుక్తౌ రజతమితి కాచాశ్మని మణి-
-ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ ।
తథా దేవ భ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే ॥ 8 ॥
తాత్పర్యము
మహాదేవా! ముత్యపుచిప్పలను వెండియని, గాజురాళ్ళను మణులని, పిండినీళ్ళను పాలని, ఎండమావులను నీళ్ళని భ్రమించునట్లుగా, నిన్ను తెలియని మానవుడు ఇతరుని దేవునిగా భ్రమించి సేవించుచున్నాడు.
సంస్కృత శ్లోకము – 9
గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః ।
సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో ॥ 9 ॥
తాత్పర్యము
ఆహా! మానవులెంత వెర్రి వారు! పుష్పములకొరకు అడవులలోను, కొండలలోను తిరుగుతూ, లోతైన చెరువులలో ఈదుతూ చిక్కులు పడుచున్నారు. తమతమ మనస్సను పద్మమును, పరమేశ్వరుని పాదారవిందములయందు సమర్పించిచో ఎంత సుఖముగా ఉండును?
సంస్కృత శ్లోకము – 10
నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ ।
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ
విహారాసక్తం చేద్ హృదయమిహ కిం తేన వపుషా ॥ 10 ॥
తాత్పర్యము
ఎవరి మనస్సు పరమేశ్వర స్మరణము గలదై శివానందలహరి యందు ఓలలాడుచున్నచో వానికి దేవ, నర, కీటకాది జన్మలలో ఏ జన్మమెత్తిన కొదువలేదని తాత్పర్యము.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



