శివానందలహరి 51-60 శ్లోకాలు
శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.
శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.
సంస్కృత శ్లోకము -51
భృంగీచ్ఛా నటనోత్కటః కర మద గ్రాహీ స్ఫురన్మాధవా-
ఆహ్లాదో నాద యుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః ।
సత్పక్షః సుమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో-
-రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ॥ 51 ॥
తాత్పర్యము
శ్రీశెలవాసీ! భ్రమరాంబాధిపతీ! నీవు భ్రమరాధిపతివి, అనగా తుమ్మెదరేడు. కావున నా మనఃపద్మమున సంచరింపుము. నీవు – భక్తుడు భృంగీశ్వరుని ఇచ్చానుగుణముగా వర్తింపజూతువు. తుమ్మెదరేడు – భృంగియనగా, తుమ్మెదల జాతి దాని అపేక్షననుసరించి నడచును. నీవు గజాసురుని గర్వము నిగ్రహించితివి. అది ఏనుగుల మదోదకమును నిగ్రహించును. నీకు మోహినీరూపము ధరించిన మాధవునియందు ఆహ్లాదము. దానికి మాధవ అనగా వసంతమునందు ఆహ్లాదము. నీకు ప్రణవనాదము. దానికి ఝంకారనాదము. మన్మథుడు నిన్ను పుష్పబాణముతో నాదరించెను. నీకు దేవతల రక్షణమందు అభిమానము. దానికి పూలతోటయందు అభిమానము. కాబట్టి, నా మనఃపద్మమందు విహరింపుము.
సంస్కృత శ్లోకము – 52
కారుణ్యామృత వర్షిణం ఘన విపద్ గ్రీష్మచ్ఛిదా కర్మఠం
విద్యా సస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిమ్ ।
నృత్యద్భక్త మయూరమద్రి నిలయం చంచజ్జటా మండలం
శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః ॥ 52 ॥
తాత్పర్యము
నీలకంధరా ! నా మనస్సను చాతకము నీలమేఘము వలె వాంఛితసిద్ధికై నిన్ను దర్శింపవేచియున్నది. మేఘము జలము వర్షించును. నీవు దయామృతము కురిపింతువు. అది గ్రీష్మతాపమును పోగొట్టును. నీవు సంతాపములను పోగొట్టెదవు. అది సస్యములను పండించును. నీవు విద్యాసస్యమును పండించి, బ్రహ్మానంద అనుభవమును ఫలముగా ఇచ్చెదవు. దేవతలు, పండితులు నిన్ను భజింతురు. కర్షకులు మేఘుని భజింతురు. మయూరములు నల్లని మేఘుమును చూచి నాట్యము చేయును. నీవు కైలాసపర్వతమున ఉందువు. మేఘుడు పర్వతమున ఉండును. కామరూపము, జటావల్లి (శివునికి జతలు, మేఘునికి మెరుపులు) ఇరువురకు కలవు.
సంస్కృత శ్లోకము – 53
ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రా కలాపీ నతా
అనుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యో గీయతే ।
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే ॥ 53 ॥
తాత్పర్యము
నీలకంఠుడు, వ్యోమకేశుడు, నాగయజ్ఞోపవీతుడు, ప్రణవోపదేశముచేత భక్తులను అనుగ్రహించువాడు, పార్వతీ వల్లభుడు, వేదాంతవేద్యుడు అగు నీలకంఠుని భజించెదను.
సంస్కృత శ్లోకము – 54
సంధ్యా ఘర్మదినాత్యయో హరి కరాఘాత ప్రభూతానక-
-ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్ఛటా చంచలా ।
భక్తానాం పరితోష బాష్ప వితతిర్వృష్టిర్ మయూరీ శివా
యస్మిన్ ఉజ్జ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే ॥ 54 ॥
తాత్పర్యము
ప్రదోషకాలమను వర్షాకాలమున విష్ణువు వాయించు మద్దెల చప్పుడు ఉరుముగా, ఆకాశమందుండి చూచు దేవతల చూపులు మెరుపులుగా, భక్తుల సంతోష ప్రవాహము వర్షాధారలుగా ప్రకాశింపగా – మయూరీ మయూరములుగా తాండవనృత్య క్రీడాసక్తులైన పార్వతీపరమేశ్వరులను భజింతును.
సంస్కృత శ్లోకము – 55
ఆద్యాయామిత తేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే
విద్యానంద మయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ।
ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైర్గేయాయ మాయావినే
సమ్యక్తాండవసంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే ॥ 55 ॥
తాత్పర్యము
ఆదిదేవుడు, తేజస్వంతుడు, వేదవేద్యుడు, భక్తసులభుడు, చిదానందుడు, జగద్రక్షకుడు, ధ్యానగమ్యుడు, సురకీర్తనుడు, చిచ్చక్తియుతుడు, తాండవ నృత్య తత్పరుడు, జటాధారి, సుఖకరుడు – అయిన శివునికి నమస్కారము.
సంస్కృత శ్లోకము – 56
నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే
సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే ।
మాయా సృష్టజగత్త్రయాయ సకలామ్నాయాంత సంచారిణే
సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం నతిః శంభవే ॥ 56 ॥
తాత్పర్యము
నిత్యుడు, త్రిగుణశరీరుడు, త్రిపురాసురులను జయించినవాడు, పార్వతీ మనోహరుడు, మునుల మనస్సులకు గోచరించువాడు, చిద్రూపుడు, వేదాంతవేద్యుడు, మాయవలన ముల్లోకములను కల్పించువాడు, తాండవనృత్యమందు ఆసక్తి గలవాడు అగు శివునకు నమస్కారము.
సంస్కృత శ్లోకము – 57
నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో ।
మజ్జన్మాంతర పుణ్య పాకబలతస్త్వం శర్వ సర్వాంతరః
తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోఽస్మ్యహమ్ ॥ 57 ॥
తాత్పర్యము
శివా! పొట్టపోసుకొనుటకు ధనాశతో ఎందరినో ఆశ్రయించితిని. కాని నిన్ను సేవించుట ఎరుగను. పూర్వజన్మమున ఏ కొంచెమో పుణ్యము చేశాను. కనుకనే నా అంతరంగమున ఉన్నావు. నన్ను రక్షించు భారము నీపై ఉన్నది.
సంస్కృత శ్లోకము – 58
ఏకో వారిజ బాంధవః క్షితి నభో వ్యాప్తం తమోమండలం
భిత్త్వా లోచన గోచరోఽపి భవతి త్వం కోటిసూర్యప్రభః ।
వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృన్భవేన్ మత్తమః
తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ॥ 58 ॥
తాత్పర్యము
దేవా! ఒక్క సూర్యుడే భూమ్యాకాశముల నిండిన చీకటిని పోగొట్టుచూ కన్నులకు కనిపించుచున్నాడు. కోటి సూర్యుల వెలుగొందుచున్న నీవేల ప్రత్యక్షముగావు? నా అజ్ఞానాంధకారము తొలగించుట నీకొక లెక్కయా? నాకు సాక్షాత్మరించి అనుగ్రహింపుము.
సంస్కృత శ్లోకము – 59
హంసః పద్మవనం సమిచ్ఛతి యథా నీలాంబుదం చాతకః
కోకః కోక నదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా ।
చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గ మృగ్యం విభో
గౌరీనాథ భవత్పదాబ్జ యుగళం కైవల్యసౌఖ్యప్రదమ్ ॥ 59 ॥
తాత్పర్యము
గౌరీశా! హంస – పద్మములను, వానకోయిల – వర్షాకాలమేఘమును, చక్రవాకము – సూర్యుని, వెన్నెలపురుగు – చంద్రుని కోరినట్లు, నీ పాదపద్మములను – నా చిత్తమెల్లప్పుడు కోరుచున్నది.
సంస్కృత శ్లోకము – 60
రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ఛాయాం తరోర్వృష్టితః
భీతః స్వస్థగృహం గృహస్థం అతిథిర్దీనః ప్రభుం ధార్మికమ్ ।
దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతః సర్వ భయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్ ॥ 60 ॥
తాత్పర్యము
ప్రవాహమున కొట్టుకొనిపోవువాడు ఒడ్డును, బాటసారి చెట్టునీడను, వర్షమున తడిసేవాడు మంచి ఇంటిని, దీనుడు ధర్మాత్ముడిని, చీకటిలో పడ్డవాడు దీపమును, చలిచే పీడితుడు అగ్నిని ఆశ్రయించినట్లు “ఓ మనసా! నీవు ఈశ్వరుని పాదములు ఆశ్రయింపుము. అవి సమస్త భయములను పోగొట్టును.
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



