స్తోత్రాలకు తెలుగులో అర్థం » శివ స్తోత్రాలు » శివానందలహరి తెలుగులో అర్థం 61-70 శ్లోకాలు
శివానందలహరి 61-70 శ్లోకాల తెలుగులో అర్థం మరియు శివతత్వ వివరణ

శివానందలహరి తెలుగులో అర్థం  61-70 శ్లోకాలు

శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.

శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.

అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధుః సరిద్వల్లభమ్ ।
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవింద ద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే ॥ 61 ॥

ఊడుగుగింజలు చెట్టును వాటి అంతట అవే అంటుకొనునట్లు, సూది – సూదంటురాయి (అయస్కాంతం) దగ్గరకు పరుగెత్తునట్లు, పతివ్రత – పతిని విడిచి ఉండలేనట్లు, తీగ – చెట్టును పెనవేసికొనునట్లు, నదులు – సముద్రమును పొందునట్లు, “మనోవృత్తి శివుని పాదపద్మములను పొంది ఉండుటయే భక్తి” అని పెద్దలు చెప్పుదురు.

ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్ఛాదనం
వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా-
-పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ॥ 62 ॥

తల్లి బిడ్డను చేరదీసి పులకితుని చేయునట్లు, భక్తిరసము భక్తుని పరవశుని చేయును. తల్లి బిడ్డకు ఈగలు మొదలగు బాధను తొలగించుటకు బట్టకప్పునట్లు, భక్తి నిర్మలభావమును ఆవరింపచేయును. తల్లి పాలను త్రాగించునట్లు, భక్తి వేదాదివాక్యముగా నీ చరితామృతమును తనివితీర త్రాగించును. రుద్రాక్షలను ధరింపజేసి, విభూతి పెట్టించి రక్షించును. తల్లి బిడ్డను మంచముపై పరుండబెట్టి కాపాడునట్లు, భక్తి మనస్సునందు ఈశ్వరధారణ అను మంచమున ప్రవేశపెట్టి పరిపాలించును.

మార్గా వర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే
గండూషాంబు నిషేచనం పుర రిపోర్ దివ్యాభిషేకాయతే ।
కించిద్ ద్భక్షితమాంస శేష కబళం నవ్యోపహారాయతే
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ॥ 63 ॥

తిన్నడు (భక్త కన్నప్ప) అను భక్తుని కాలిచెప్పు శివుని శరీరముపై చీపురయ్యెను. పుక్కిట పట్టిన నీరు అభిషేక జలమయ్యెను. ఎంగిలి మాంసపు ముక్కలు నివేదన అయ్యేను. కిరాతుడగు తిన్నడు భక్తాగ్రగణ్యుడయ్యెను. ఆహా భక్తికి సాధ్యము కానిది ఏమున్నది?

వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మార సంమర్దనం
భూ భృత్ పర్యటనం నమత్సురశిరః కోటీర సంఘర్షణమ్ ।
కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య కిం వోచితం
మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు ॥ 64 ॥

ఉమానాథా! నీవు యముని రొమ్ము తన్నవలెను. అజ్ఞానమును అణగదొక్కవలెను. కొండమీద తిరుగవలెను. నమస్కరింప వచ్చిన దేవతాదుల కిరీటముల రాపిడికి ఓర్వవలెను. ఇదంతా కఠిన కృత్యము. నీ పాదములు అతి కోమలములు. నా మనస్సు అను మణిపాదుకలను తొడుగుకొనుటకు దయచేసి అంగీకరింపుము.

వక్షస్తాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః
కోటీరోజ్జ్వల రత్నదీప కలికా నీరాజనం కుర్వతే ।
దృష్ట్వా ముక్తి వధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే
యచ్చేతస్తవ పాదపద్మ భజనం తస్యేహ కిం దుర్లభమ్ ॥ 65 ॥

ఉమానాథా! నీవు మునుపటివలె తన రొమ్మున తన్నుదువేమో అని భయపడి నీ భక్తుని చూచిన యముడు పారిపోవును. దేవతలు ఆ భక్తునికి తమ కిరీటమాణిక్య దీపములతో నీరాజనములిత్తురు. ముక్తికాంత తనంత తానుగా వచ్చి ఆలింగన మొసంగును. ఇంక నీ భక్తునకేది దుర్లభము?

క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః
యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ ।
శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం
తస్మాన్మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా ॥ 66 ॥

శివా! నీవీ ప్రపంచమంతయు సృజించుట విలాసార్థముగదా! ఈ ప్రజలందరు నీ వినోదార్ధకమైన జంతువులు. వారివారి పెంపుడు జంతువుల నడవడులు వారికి ప్రేమాస్పదములేకదా! కావున నేను చేయు సత్కర్మములుగాని, దుష్కర్మములుగాని నీకు తృప్తికరములగును. కనుక నీవే నన్ను రక్షింపవలసినవాడవు అగుచున్నావు.

బహువిధ పరితోష బాష్పపూర-
-స్ఫుటపులకాంకిత చారు భోగ భూమిమ్ ।
చిర పద ఫల కాంక్షి సేవ్యమానాం
పరమ సదాశివ భావనాం ప్రపద్యే ॥ 67 ॥

అనేక విధములైన ఆనందభాష్పముల సమృద్ధి కలిగినది, ప్రస్ఫుటమైన గగుర్పాటు చిహ్నముగా గల గొప్ప సుఖమునకు స్థానమైనది, శాశ్వతపదవి అనే ఫలమును ఆపేక్షించువారిచే సేవింపబడునది, సర్వోత్మృష్టము అగు పరమేశ్వర భావనను శరణుజొచ్చుచున్నాను.

అమిత ముదమృతం ముహుర్దుహంతీం
విమల భవత్పదగోష్ఠమావసంతీమ్ ।
సదయ పశుపతే సుపుణ్యపాకాం
మమ పరిపాలయ భక్తిధేనుమేకామ్ ॥ 68 ॥

భూతనాథా! నీవు అపార దయగలవాడవు. నా పుణ్యవశమున నాకీ భక్తి అను గోవు లభించినది. ఇది ఆనందరూపమైన పాలు పదేపదే ఇచ్చును. నీ పాదరూపమైన పశువులచావడిలో కట్టుకొననిచ్చి, ఈ ఆవునొక్క దానిని కాపాడుము.

జడతా పశుతా కళంకితా
కుటిల చరత్వం చ నాస్తి మయి దేవ ।
అస్తి యది రాజమౌళే
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్ ॥ 69 ॥

దేవా! నాకు జడత్వ, పశుత్వ, కళంకితా, కుటిల సంచారము లేదు. చంద్రునకు అవి ఉన్నవి. అట్టి చంద్రుని శిరస్సున పెట్టుకొంటివి. అట్టి గుణములున్నచో నేను కూడా నీకు ఆభరణమయ్యే వాడినేమో!

అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా
వరి వసితుం సులభః ప్రసన్నమూర్తిః ।
అగణిత ఫలదాయకః ప్రభుర్మే
జగదధికో హృది రాజశేఖరోఽస్తి ॥ 70 ॥

సుముఖుడై, సులభుడై అన్ని కోరికలు తీర్చుచూ, సర్వసమర్థుడైన చంద్రశేఖరుడు నా హృదయమందే ఉన్నవాడు గనుక ఏకాంతముగా, బహిరంగముగా కూడా స్వతంత్రముగా పూజింపవచ్చును.

🙏 శివానందలహరితెలుగులో అర్థం

శివానందలహరి 1-10 శ్లోకాలు

శివానందలహరి 11-20 శ్లోకాలు

శివానందలహరి 21-30 శ్లోకాలు

శివానందలహరి 31-40 శ్లోకాలు

శివానందలహరి 41-50 శ్లోకాలు

శివానందలహరి 51-60 శ్లోకాలు

శివానందలహరి 61-70 శ్లోకాలు

శివానందలహరి 71-80 శ్లోకాలు

శివానందలహరి 81-90 శ్లోకాలు

శివానందలహరి 91-100 శ్లోకాలు

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మనభారతీయ సంస్కృతిYouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top