మహాలయ పక్షం
మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద ‘జీవాత్మ’గా అవతరించడానికి… అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ర కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకుని పుట్టిన పుత్రులే అందించాలి. పితృ రుణం తీర్చుకోవడం పుత్రుల ధర్మం. అప్పుడే పెద్దల ఆత్మకు శాంతి, మోక్షం లభిస్తుంది. ఈ రుణం తీర్చుకునేందుకు సూచించినవే పితృపక్షాలు. వీటినే మహాలయ పక్షాలు అని కూడా అంటారు. మరి ఈ మహాలయ పక్షాలు అంటే ఏవి? మహాలయ పక్షాలలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనే విషయాలు ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం.
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజులను “మహాలయ పక్షాలు” అంటారు. వీటినే పితృపక్షాలనీ, అపరపక్షాలనీ కూడా అంటారు. ఈ మహాలయ పక్షాలు- మరణించిన తండ్రి, తాత, ముత్తాతలను, పూర్వీకులను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడినవి. పితృ దేవతలు అంటే మన కుటుంబంలో గతించినటువంటి వారని అర్థం. కేవలం తల్లిదండ్రులకు మాత్రమే కాదు..మృతి చెందిన రక్త సంబంధీకులు అందర్నీ తలుచుకుని తర్పణాలు విడుస్తారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్యోద్దేశ్యము. మహాలయ పక్షములో పెద్దలకు శ్రాద్ధము చేస్తే వారు తృప్తి చెందుతారని స్కాంద పురాణము నాగర ఖండంలో ఉంది.
మహాలయ పక్షం ప్రాశస్త్యంపై మహాభారత కథాంశం..
దానశీలి అయిన కర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళుతుండగా.. మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలుగుతుంది. దీంతో అక్కడ కనిపించిన ఓ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్లి పండు కోసుకొని తినాలనుకున్నాడు. కోసి తిందామని ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. అలా అక్కడ ఏ పండును ముట్టుకున్నా అలాగే జరిగింది. కనీసం దాహమైనా తీర్చుకుందామని ఓ సెలయేరు దగ్గరికి వెళ్లి, నీటిని దోసిళ్లలోకి తీసుకోగా, అదీ బంగారం రంగులోకి మారిపోతుంది. స్వర్గానికి వెళ్లినా అదే పరిస్థితి. దీంతో ఆశ్చర్యానికి గురైన కర్ణుడు.. బాధతో తన తండ్రి సూర్య భగవానుడిని ప్రార్థించాడు. అప్పుడు సూర్యుడు “కర్ణా.. నీ జీవితమంతా బంగారాన్ని దానం చేశావే తప్ప.. ఎప్పుడూ పితృతర్పణాలు, అన్నదానం వంటివి చేయలేదు. అందుకే ఈ రోజు నీకు ఆకలి, దాహం తీర్చుకొనేందుకు ఆహారం, నీరు దొరకడంలేదు’’ అని అసలు కారణం చెప్పాడు. ఆ కారణం విన్న కర్ణుడు సూర్యుడిని ప్రార్థించగా.. ఇంద్రుడి ద్వారా సూర్యభగవానుడు ఓ వరాన్ని ప్రసాదించాడు. భూలోకానికి వెళ్లి అన్నదానం, పితృదేవతలందరికీ తర్పణాలు వదిలి, స్వర్గానికి వచ్చేలా వరమిచ్చాడు. ఇంద్రుడు ఇచ్చిన వరంతో, కర్ణుడు భూమిపైకి వచ్చిన రోజు భాద్రపద బహుళపక్ష పాడ్యమి. అలా వచ్చి 15 రోజుల వరకు అంటే అమావాస్య వరకు, రోజూ పితృదేవతలకు తర్పణాలు వదిలి, గతించిన తల్లిదండ్రులకు పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు చేసి, మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు తిరిగి కర్ణుడు స్వర్గానికి చేరుకొన్నాడు. కర్ణుడు అన్నదానం, పితృతర్పణం చేశాక ఆయన కడుపు నిండి.. ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లిన ఈ కాలమే మహాలయ పక్షం అంటారు.
పితృ దోషం అంటే ఒక శాపం. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం, పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి.
మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృదేవతల ఆశీర్వాదం, వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కలిసి వాయురూపంలో భోజనం స్వీకరిస్తారు. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలి తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ…పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.
ఈ రోజు సమస్త పితృదేవతా విసర్జనం జరుగుతుంది. తమ పితరుల పుణ్య తిథి వివరాలు తెలియనివారు, పితృ పక్షంలో ఆ తిథి నాడు కారణవశాన శ్రాద్ధం పెట్టలేనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం, దానం, తర్పణం చేస్తారు. ఆదర పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం, సమస్తం కలిగిఉండేట్టు ఆశీర్వదిస్తారు. అన్ని దానాలలోను అన్నదానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కాని ఈ మహాలయపక్షంలో చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది.
Also Read శ్రీ లలితా సహస్రనామాలకు తెలుగులో అర్థం
పాడ్యమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధన సంపద లభిస్తుంది
ద్వితీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల రాజయోగం, సంపద లభిస్తుంది
తృతీయనాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల శత్రువులు నశిస్తారు
చతుర్దినాడు శ్రాద్ధ కర్మ చేయటం వల్ల ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది, అంతే కాకుండా శత్రువుల వ్యూహాలు ముందుగా పసిగట్టగలరు
పంచమి నాడు శ్రాద్ధ కర్మ చేయటం వాళ్ళ ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. సంతానం కోరుకునేవారికి సంతానం కలుగుతుంది.
షష్ఠి నాడు శ్రాద్ధ కర్మ వల్ల దేవతలు పితరులు ప్రసన్నులవుతారు, ఆ వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది.
సప్తమి శ్రాద్ధ కర్మ వల్ల యజ్ఞం చేసిన పుణ్య ఫలం లభిస్తుంది.
అష్టమి తిథినాడు శ్రాద్ధ కర్మ వాళ్ళ చేస్తే సంపూర్ణ సమృద్ధి, ధనం, బుద్ధి ప్రాప్తిస్తాయి
నవమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే విస్తారంగా సంపద, అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది
దశమి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే లక్ష్మీ ప్రాప్తి, పశు సంపద వృద్ది చెందుతుంది
ఏకాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే సర్వ శ్రేష్ఠ దాన ఫలం లభిస్తుంది, అన్ని పాపాలు నశిస్తాయి, వేద జ్ఞానం ప్రాప్తిస్తుంది, కుటుంబం వృద్ది చెందుతుంది
ద్వాదశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. శ్రాద్ధ కర్తకు అన్నానికి లోటుండదు, అలాగే పుత్ర, పశు, మెధా బుద్ధి, జయ సంపత్తి కలుగుతుంది
త్రయోదశి నాడు శ్రద్ధ కర్మ చేస్తే ధనం, సంతతి, ఐశ్వర్యం, దీర్ఘాయువు, ఆరోగ్యం, బంధుమిత్రులలో గౌరవం లభిస్తాయి
చతుర్దశి నాడు శ్రాద్ధ కర్మ చేస్తే ఆయుధాల నుండి రక్షణ లభిస్తుంది.
అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేస్తే వ్యక్తికి సమస్త లాభాలు కలుగుతాయి, అన్ని కోరికలు నెరవేరుతాయి.
ఆర్థిక సమస్యల వలన విద్యుక్తంగా శ్రాద్ధ కర్మలు చేయలేక పొతే, పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు. అది కూడా వీలు కాకపొతే గోవుకు గ్రాసం పెట్టవచ్చు, అదీ చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు పైకి ఎత్తి, పితృ దేవతలకు నమస్కరించవచ్చు. శ్రాద్ధ కర్మ చేత పితృ దేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది.
మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?
సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు “మహాలయం” పెట్టడం ఉత్తమం. ఏ కారణంచేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థతిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.
క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి ‘చేత భరణి లేక భరణి పంచమి’ తిథులలో అనగా..మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.
భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ, గాజులు, పూవులు, చీర,రవికెలగుడ్డ పెట్టి సత్కరించి పంపాలి.
చిన్న పిల్లలు- అంటే పది సంవత్సరములు దాటనివారు చనిపోతే.. వారికి పన్నెండవ రోజున ‘మహాలయం’ పెట్టాలి. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే.., ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే ‘మహాలయం’ పెట్టాలి.