లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9
మన హిందూ సనాతన ధర్మంలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు ఆ హయగ్రీవుడు అగస్త్య మహామునికి ఉపదేశించిన మహా మంత్రం ఇది.
అమ్మవారి అనుగ్రహం పొందడానికి, జీవితంలో సకల శుభాలు, ప్రశాంతత కలగడానికి ప్రతిరోజూ ఎంతోమంది భక్తులు ఈ సహస్రనామాన్ని పఠిస్తుంటారు అయితే, ఏదైనా స్తోత్రాన్ని కేవలం చదవడం కన్నా అందులోని ప్రతి నామానికి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని, భావయుక్తంగా పఠిస్తే ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాత తత్వం మనసుకు మరింత దగ్గరవుతుంది. లలితా పరమేశ్వరి వైభవాన్ని తెలుసుకునే ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.
కార్యకారణనిర్ముక్తా,కామకేళితరంగితా।
కనత్-కనకతాటంకా,లీలావిగ్రహధారిణీ॥161॥
కార్యకారణనిర్ముక్తా-కార్యము,కారణము అనే బంధాల నుండి విముక్తురాలు
కామకేళితరంగితా-కామేశ్వరునితో కూడిన క్రీడలనే అలలతో విలసిల్లేది
కనత్-కనకతాటంకా-ప్రకాశించే బంగారు చెవి కమ్మలు ధరించినది
లీలావిగ్రహధారిణీ-కేవలం వినోదం కోసం లేదా భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ రూపాలను ధరించేది
అజాక్షయవినిర్ముక్తా,ముగ్ధాక్షిప్రప్రసాదినీ।
అంతర్ముఖసమారాధ్యా,బహిర్ముఖసుదుర్లభా॥162॥
అజాక్షయవినిర్ముక్తా-పుట్టుక,మరణం లేనిది
ముగ్ధా-అత్యంత సుందరమైనది
క్షిప్రప్రసాదినీ-భక్తుల ప్రార్థనలకు అతి త్వరగా స్పందించి అనుగ్రహించేది
అంతర్ముఖసమారాధ్యా-అంతర్దృష్టితో,ధ్యానంతో తనను పూజించే వారికి లభించేది
బహిర్ముఖసుదుర్లభా-బాహ్య విషయాలపై దృష్టి పెట్టే వారికి లభించనిది
త్రయీ,త్రివర్గనిలయా,త్రిస్థా,త్రిపురమాలినీ।
నిరామయా,నిరాలంబా,స్వాత్మారామా,సుధాసృతిః॥163॥
త్రయీ-మూడు వేదాల (ఋక్,యజుర్,సామ) స్వరూపమైనది
త్రివర్గనిలయా-ధర్మ,అర్థ,కామములు అనే మూడు పురుషార్థాలకు నిలయమైనది
త్రిస్థా-మూడు స్థితులు (జాగ్రత్,స్వప్న,సుషుప్తి) లేదా మూడు లోకాల్లో నివసించేది
త్రిపురమాలినీ-శ్రీచక్రంలోని అంతర్దశార చక్ర అధిష్ఠాన దేవత
నిరామయా-ఎటువంటి వ్యాధులు లేదా దోషాలు లేనిది
నిరాలంబా-ఏ ఆధారము అవసరం లేనిది
స్వాత్మారామా-తన ఆత్మలోనే తాను రమించే ఆనంద స్వరూపిణి
సుధాసృతిః-అమృతము ప్రవహిస్తున్నట్లుగా ఉండేది
సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా।
యజ్ఞప్రియా,యజ్ఞకర్త్రీ,యజమానస్వరూపిణీ॥164॥
సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా-సంసారమనే బురదలో మునిగిపోయిన వారిని బయటకు తీసి రక్షించడంలో గొప్ప నేర్పు కలది
యజ్ఞప్రియా-యజ్ఞాల యందు ప్రీతి కలది
యజ్ఞకర్త్రీ-యజ్ఞాలను చేయించేది
యజమానస్వరూపిణీ-యజ్ఞాన్ని సంకల్పించే యజమాని రూపంలో ఉన్నది
ధర్మాధారా,ధనాధ్యక్షా,ధనధాన్యవివర్ధినీ।
విప్రప్రియా,విప్రరూపా,విశ్వభ్రమణకారిణీ॥165॥
ధర్మాధారా-ధర్మానికి మూలమైన ఆధారం
ధనాధ్యక్షా-సకల సంపదలకు అధిపతి
ధనధాన్యవివర్ధినీ-ధనాన్ని,ధాన్యాన్ని వృద్ధి చేసేది
విప్రప్రియా-వేదవిదులైన వారి యందు ప్రీతి కలది
విప్రరూపా-జ్ఞానులైన వారి రూపంలో ఉన్నది
విశ్వభ్రమణకారిణీ-ఈ విశ్వమంతా తిరిగేలా చేసే మహాశక్తి
విశ్వగ్రాసా,విద్రుమాభా,వైష్ణవీ,విష్ణురూపిణీ।
అయోనిః,యోనినిలయా,కూటస్థా,కులరూపిణీ॥166॥
విశ్వగ్రాసా-ప్రళయ కాలంలో ఈ సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకునేది
విద్రుమాభా-ఎర్రని పగడం వంటి కాంతి కలది
వైష్ణవీ-విష్ణువు యొక్క శక్తి స్వరూపిణి
విష్ణురూపిణీ-విష్ణువు తానే అయిన రూపము కలది
అయోనిః-తాను ఎవరి గర్భం నుండి పుట్టనిది
యోనినిలయా-సమస్త జీవుల ఉత్పత్తికి కారణమైన మూల స్థానము
కూటస్థా-మార్పు లేనిది
కులరూపిణీ-కుల మార్గ స్వరూపిణి
వీరగోష్ఠీప్రియా,వీరా,నైష్కర్మ్యా,నాదరూపిణీ।
విజ్ఞానకలనా,కల్యా,విదగ్ధా,బైందవాసనా॥167॥
వీరగోష్ఠీప్రియా-జ్ఞాన వీరుల మధ్య చర్చలంటే ఇష్టపడేది
వీరా-అజేయమైన పరాక్రమము కలది
నైష్కర్మ్యా-కర్మలకు అంటని స్థితి కలది
నాదరూపిణీ-ఓంకార నాదమే తన రూపము
విజ్ఞానకలనా-జ్ఞానమును ప్రసాదించేది
కల్యా-నైపుణ్యము కలది
విదగ్ధా-చతురత కలది
బైందవాసనా-శ్రీచక్ర బిందువులో ఆసీనురాలు
తత్త్వాధికా,తత్త్వమయీ,తత్త్వమర్థస్వరూపిణీ।
సామగానప్రియా,సౌమ్యా,సదాశివకుటుంబినీ॥168॥
తత్త్వాధికా-తత్త్వాలకు అతీతమైనది
తత్త్వమయీ-తత్త్వములే స్వరూపము
తత్త్వమర్థస్వరూపిణీ-తత్త్వమసి మహావాక్య సారము
సామగానప్రియా-సామవేద గానం ఇష్టపడేది
సౌమ్యా-శాంత స్వభావము కలది
సదాశివకుటుంబినీ-సదాశివుని శక్తి
సవ్యాపసవ్యమార్గస్థా,సర్వాపద్వినివారిణీ।
స్వస్థా,స్వభావమధురా,ధీరా,ధీరసమర్చితా॥169॥
సవ్యాపసవ్యమార్గస్థా-దక్షిణ వామ మార్గాలలో ఉన్నది
సర్వాపద్వినివారిణీ-అన్ని ఆపదలను తొలగించేది
స్వస్థా-స్థిరంగా ఉన్నది
స్వభావమధురా-మధుర స్వభావం కలది
ధీరా-ధైర్యముగలది
ధీరసమర్చితా-ధీరులచే పూజింపబడేది
చైతన్యార్ఘ్యసమారాధ్యా,చైతన్యకుసుమప్రియా।
సదోదితా,సదాతుష్టా,తరుణాదిత్యపాటలా॥170॥
చైతన్యార్ఘ్యసమారాధ్యా-చైతన్యంతో పూజింపబడేది
చైతన్యకుసుమప్రియా-జ్ఞాన పుష్పాలు ఇష్టపడేది
సదోదితా-ఎల్లప్పుడూ ప్రకాశించేది
సదాతుష్టా-ఎల్లప్పుడూ సంతుష్టి కలది
తరుణాదిత్యపాటలా-ఉదయ సూర్యుని వంటి కాంతి కలది
దక్షిణా,దక్షిణారాధ్యా,దరస్మేరముఖాంబుజా।
కౌళినీకేవలా,అనర్ఘ్యా,కైవల్యపదదాయినీ॥171॥
దక్షిణా-కార్యదక్షత కలది లేదా దక్షిణామూర్తి రూపము
దక్షిణారాధ్యా-దక్షిణామూర్తిచే ఆరాధించబడేది
దరస్మేరముఖాంబుజా-చిరునవ్వుతో వెలిగే తామరముఖము కలది
కౌళినీకేవలా-కౌళ మార్గ స్వరూపిణి
అనర్ఘ్యా-వెలకట్టలేనిది
కైవల్యపదదాయినీ-మోక్షాన్ని ప్రసాదించేది
స్తోత్రప్రియా,స్తుతిమతీ,శ్రుతిసంస్తుతవైభవా।
మనస్వినీ,మానవతీ,మహేశీ,మంగళాకృతిః॥172॥
స్తోత్రప్రియా-స్తోత్రాలను ఇష్టపడేది
స్తుతిమతీ-స్తుతించదగిన గుణాలు కలది
శ్రుతిసంస్తుతవైభవా-వేదములచే కొనియాడబడినది
మనస్వినీ-మనస్సును జయించినది
మానవతీ-గౌరవ స్వరూపిణి
మహేశీ-మహేశ్వరుని శక్తి
మంగళాకృతిః-మంగళకరమైన రూపము కలది
విశ్వమాతా,జగద్ధాత్రీ,విశాలాక్షీ,విరాగిణీ।
ప్రగల్భా,పరమోదారా,పరామోదా,మనోమయీ॥173॥
విశ్వమాతా-సమస్త విశ్వానికి తల్లి
జగద్ధాత్రీ-జగత్తును ధరిస్తూ పోషించేది
విశాలాక్షీ-విశాలమైన కన్నులు కలది
విరాగిణీ-రాగద్వేషాలకు అతీతమైనది
ప్రగల్భా-ప్రబలమైన శక్తి కలది
పరమోదారా-అత్యంత ఉదార స్వభావము
పరామోదా-పరమానంద స్వరూపిణి
మనోమయీ-మనస్సు స్వరూపిణి
వ్యోమకేశీ,విమానస్థా,వజ్రిణీ,వామకేశ్వరీ।
పంచయజ్ఞప్రియా,పంచప్రేతమంచాధిశాయినీ॥174॥
వ్యోమకేశీ-ఆకాశమే జుట్టుగా కలది
విమానస్థా-దివ్య వాహనాలలో ఉన్నది
వజ్రిణీ-వజ్రాయుధధారిణి స్వరూపిణి
వామకేశ్వరీ-వామకేశ్వర తంత్ర దేవత
పంచయజ్ఞప్రియా-ఐదు యజ్ఞాలు ఇష్టపడేది
పంచప్రేతమంచాధిశాయినీ-పంచబ్రహ్మాల ఆసనంపై ఆసీనురాలు
పంచమీ,పంచభూతేశీ,పంచసంఖ్యోపచారిణీ।
శాశ్వతీ,శాశ్వతైశ్వర్యా,శర్మదా,శంభుమోహినీ॥175॥
పంచమీ-పంచమ శక్తి స్వరూపిణి
పంచభూతేశీ-పంచభూతాల అధిపతి
పంచసంఖ్యోపచారిణీ-ఐదు ఉపచారాలతో పూజింపబడేది
శాశ్వతీ-శాశ్వతమైనది
శాశ్వతైశ్వర్యా-శాశ్వత ఐశ్వర్యమును కలది
శర్మదా-సుఖాన్ని ఇచ్చేది
శంభుమోహినీ-శివుని మోహింపజేసినది
ధరా,ధరసుతా,ధన్యా,ధర్మిణీ,ధర్మవర్ధినీ।
లోకాతీతా,గుణాతీతా,సర్వాతీతా,శమాత్మికా॥176॥
ధరా-భూమి స్వరూపిణి
ధరసుతా-పార్వతి దేవి
ధన్యా-ధన్యమైనది
ధర్మిణీ-ధర్మాన్ని ఆచరించేది
ధర్మవర్ధినీ-ధర్మాన్ని పెంచేది
లోకాతీతా-లోకాలకు అతీతమైనది
గుణాతీతా-త్రిగుణాలకు అతీతమైనది
సర్వాతీతా-సర్వానికి అతీతమైనది
శమాత్మికా-శాంత స్వరూపిణి
బంధూకకుసుమప్రఖ్యా,బాలా,లీలావినోదినీ।
సుమంగళీ,సుఖకరీ,సువేషాడ్యా,సువాసినీ॥177॥
బంధూకకుసుమప్రఖ్యా-ఎర్రని పుష్పంలా కాంతి కలది
బాలా-నిత్య యవ్వన రూపిణి
లీలావినోదినీ-లీలలతో సృష్టిని నడిపించేది
సుమంగళీ-సర్వమంగళ స్వరూపిణి
సుఖకరీ-సుఖాన్ని ఇచ్చేది
సువేషాడ్యా-దివ్య వస్త్రాలతో అలంకరించబడినది
సువాసినీ-సువాసినుల రూపంలో ఉండేది
సువాసిన్యర్చనప్రీతా,శోభనా,శుద్ధమానసా।
బిందుతర్పణసంతుష్టా,పూర్వజా,త్రిపురాంబికా॥178॥
సువాసిన్యర్చనప్రీతా-సువాసినుల పూజను ఇష్టపడేది
శోభనా-శోభాయమానమైనది
శుద్ధమానసా-శుద్ధ మనస్సు కలది
బిందుతర్పణసంతుష్టా-బిందు తర్పణంతో సంతుష్టి చెందేది
పూర్వజా-అనాది స్వరూపిణి
త్రిపురాంబికా-త్రిపురసుందరి తల్లి
దశముద్రాసమారాధ్యా,త్రిపురాశ్రీవశంకరీ।
జ్ఞానముద్రా,జ్ఞానగమ్యా,జ్ఞానజ్ఞేయస్వరూపిణీ॥179॥
దశముద్రాసమారాధ్యా-పది ముద్రలచే పూజింపబడేది
త్రిపురాశ్రీవశంకరీ-శ్రీవిద్యలో వశం కలిగించేది
జ్ఞానముద్రా-జ్ఞాన సూచక ముద్ర
జ్ఞానగమ్యా-జ్ఞానంతో చేరదగినది
జ్ఞానజ్ఞేయస్వరూపిణీ-జ్ఞానమూ జ్ఞేయమూ తానే అయినది
యోనిముద్రా,త్రిఖండేశీ,త్రిగుణాంబా,త్రికోణగా।
అనఘాద్భుతచారిత్రా,వాంఛితార్థప్రదాయినీ॥180॥
యోనిముద్రా-యోనిముద్ర స్వరూపిణి
త్రిఖండేశీ-మూడు ఖండాల అధిపతి
త్రిగుణాంబా-త్రిగుణాల తల్లి
త్రికోణగా-త్రికోణంలో నివసించేది
అనఘాద్భుతచారిత్రా-పాపరహిత అద్భుత చరిత్ర కలది
వాంఛితార్థప్రదాయినీ-కోరికలు తీర్చేది
అభ్యాసాతిశయజ్ఞాతా,షడధ్వాతీతరూపిణీ।
అవ్యాజకరుణామూర్తిః,అజ్ఞానధ్వాంతదీపికా॥181॥
అభ్యాసాతిశయజ్ఞాతా-తీవ్ర సాధనతో మాత్రమే తెలిసేది
షడధ్వాతీతరూపిణీ-ఆరు మార్గాలకు అతీతమైనది
అవ్యాజకరుణామూర్తిః-కారణం లేకుండా కరుణ చూపేది
అజ్ఞానధ్వాంతదీపికా-అజ్ఞాన చీకటిని తొలగించే దీపం
ఆబాలగోపవిదితా,సర్వానుల్లంఘ్యశాసనా।
శ్రీచక్రరాజనిలయా,శ్రీమత్త్రిపురసుందరీ॥182॥
ఆబాలగోపవిదితా-అందరికీ తెలిసినది
సర్వానుల్లంఘ్యశాసనా-ఆమె ఆజ్ఞను ఎవరూ అతిక్రమించలేరు
శ్రీచక్రరాజనిలయా-శ్రీచక్రంలో నివసించేది
శ్రీమత్త్రిపురసుందరీ-ఐశ్వర్యవంతమైన త్రిపురసుందరి
శ్రీశివా,శివశక్త్యైక్యరూపిణీ,లలితాంబికా।
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం॥183॥
శ్రీశివా-మంగళరూపిణి
శివశక్త్యైక్యరూపిణీ-శివశక్తి ఏకత్వ స్వరూపిణి
లలితాంబికా-లాలించే తల్లి లలిత
ఇతి శ్రీలలితా సహస్రనామ ముగింపు శ్లోకం
ఈ విధంగా శ్రీ లలితాదేవి యొక్క పవిత్రమైన వెయ్యి నామాలను (సహస్రనామ స్తోత్రాన్ని) హయగ్రీవుల వారు అగస్త్య మహర్షికి ఉపదేశించారు.
॥ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీ లలితా రహస్యనామ శ్రీ లలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః॥
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.





సింధూరారుణ విగ్రహాం త్రిణయనాం మాణిక్య మౌళిస్ఫుర-
త్తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహామ్ ।
పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్పరామంబికామ్ ॥
పై శ్లోకానికి అర్థం తెలుపగలరు
సింధూరం వంటి అరుణవర్ణం కలిగిన విగ్రహాన్ని, మూడు కన్నులతో ప్రకాశించే దేవిని, మాణిక్యములతో అలంకరించబడిన మకుటాన్ని ధరించిన మాతను, తారకాపతి చంద్రుని తమ శిరస్సుపై ఉంచుకున్నవారిని, చిరునవ్వుతో కాంతివంతమైన ముఖాన్ని, ఘనమైన వక్షస్థలం కలిగిన అమ్మను, తమ రెండు చేతులలో అమృతంతో నిండిన రత్నపు పాత్రను మరియు ఎర్రని కమలాన్ని ధరించిన తల్లిని, సౌమ్య స్వభావంతో ప్రకాశించేమాతను, రత్న ఘటంలో ప్రతిబింబించిన రక్తవర్ణ పాదములను కలిగినదేవిని ధ్యానం చేస్తున్నాను. ఈ శ్లోకంలోని “పరామంబికా” అనగా పరాశక్తిని సూచిస్తోంది. ఇది త్రిపురసుందరీ దేవి ధ్యాన శ్లోకం. ఇంకేమైనా సందేహాలు, సూచనలు ఉంటే దయచేసి తెలియజేయండి. ధన్యవాదములు.
లలిత సులువుగా అర్థం కావడానికి మీరు చేసిన ఈ ప్రయత్నం మిక్కిలి అభినందనీయం. మీకు మా మనస్పూర్తి ధన్యవాదములు