
గోవిందా నామాలు – తెలుగులో అర్థం
గోవిందాహరి గోవిందా-
మానవుని పంచేంద్రియాలకు (కన్ను, ముక్కు చెవి, నోరు, చర్మము) ఆనందం కల్గించేవాడు.
గోకుల నందనగోవిందా-
ద్వాపరయుగంలో గోకులంలో పుట్టి గో,గోపాలకులందరికీ నయనానందం కలిగించినవాడు.
శ్రీశ్రీనివాసా గోవిందా-
‘శ్రీ” అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు.
శ్రీవేంకటేశా గోవిందా-
“వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు.
భక్తవత్సల గోవిందా-
తనను నమ్ముకున్నవారిపై ఆప్యాయత, అనురాగం కురిపించేవాడు.
భాగవత ప్రియ గోవిందా-
నిత్యమూ భగవంతుణ్ణే త్రికరణశుద్ధిగా కొలిచే భక్తుల ఆరాధ్య దైవమైనవాడు.
నిత్యనిర్మల గోవిందా-
ఎప్పుడు చూసినా నిర్మలమైన మోముతో కనబడుతూ, భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు.
నీలమేఘశ్యామా గోవిందా-
నీలవర్ణపు శరీర ఛాయతో భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు.
పురాణపురుషా గోవిందా-
పురాణాలన్నింట్లోనూ అవతారమూర్తియైనవాడు.
పుండరీకాక్షగోవిందా-
తామరలవంటి కన్నులతో భక్తులపై అపార కృపాకరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరించేవాడు.
నందనందన గోవిందా-
రేపల్లెలో నందమహారాజు ఇంట గారాలపట్టిగా పెరిగి, అందరినీ తన ఆటపాటలతో అలరించినవాడు.
నవనీతచోరా గోవిందా-
బాల్యంలో వెన్నను దొంగిలించినవాడు
పశుపాలకశ్రీ గోవిందా-
సంపదకు ఆలవాలమైన గోగణసమూహాన్ని పాలించినవాడు.
పాపవిమోచన గోవిందా-
గోవింద నామ శబ్దంతోనే పాపాలనుండి విముక్తి కల్పించేవాడు.
దుష్టసంహార గోవిందా-
దుర్మార్గులను శిక్షించి, లోక కల్యాణం చేసేవాడు.
దురితనివారణ గోవిందా-
మానవుల జీవితాల్లో ఎదురయ్యే కష్టనష్టాలను నివారించేవాడు.
ఇది కూడా చూడండి
శ్రీ లలితా సహస్రనామాలకు తెలుగులో అర్థం
https://bharatiyasamskruthi.net/lalitha-sahasranamam-meaning-in-telugu/
శిష్టపాలకగోవిందా-
సజ్జనులను కష్టాల బారినుండి కాపాడేవాడు.
కష్ట నివారణ గోవిందా-
కష్టాలను తొలగించేవాడు
వజ్రమకుటధర గోవిందా-
వజ్రకిరీటాన్ని ధరించినవాడు
వరాహమూర్తిగోవిందా-
వరాహస్వామి శ్రీనివాసుడు కొండపై నివసించడానికి వేంకటాద్రిపై స్థలాన్నిచ్చినవాడు కాబట్టి ఆ దాతపేరునే తన పేరుగా పిలిపించుకున్నవాడు.
గోపీజనలోల గోవిందా-
నిరంతర భగవన్నామస్మరణ చేసే గోపికలకు ఇష్టమైనవాడు
గోవర్ధనోద్ధారగోవిందా-
గోవులను, గోపాలకులను రాళ్లవర్షం బారి నుండి కాపాడడానికి గోవర్ధన పర్వతాన్నెత్తినవాడు
దశరథనందన గోవిందా-
దశరథమహారాజుకు కుమారుడిగా ఆవిర్భవించినవాడు.
దశముఖమర్దన గోవిందా-
పదిముఖాలు కలిగిన రావణుణ్ణి సంహరించినవాడు.
పక్షివాహనా గోవిందా-
గరుత్మంతుడనే పక్షిని వాహనంగా కలిగినవాడు.
పాండవప్రియ గోవిందా-
ధర్మవర్తనులైన పాండవులపై అమితప్రేమను చూపించినవాడు.
మత్స్యకూర్మ గోవిందా-
సోమకాసురుడనే రాక్షసుణ్ణి వధించి వేదాలను రక్షించడం కోసం మత్స్యావతారాన్ని, క్షీరసాగరమథన సమయంలో అమృతం పొందడం కోసం కూర్మావతారాన్ని ధరించినవాడు.
మధుసూదన హరి గోవిందా-
‘మధు’ అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు.
వరాహనృసింహ గోవిందా-
హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహావతారము, భూమిని రక్షించడానికి వరాహ అవతారము ధరించినవాడు
వామనభృగురామ గోవిందా-
బలిచక్రవర్తిని మూడడుగుల నేలను దానమడిగి పాతాళానికి పంపినవాడు.
బలరామానుజ గోవిందా-
బలరామునికి సోదరుడైనవాడు.
బౌద్ధకల్కిధర గోవిందా-
కలికాలంలో ధర్మాన్ని కాపాడేందుకు బుద్ధుని అవతారమెత్తి, ధర్మబోధలను గావించినవాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకై కల్కి అవతారంలో అవతరించినవాడు.
వేణుగాన ప్రియ గోవిందా-
వేణుగానంపై ప్రీతి కలవాడు. తన వేణుగానంతో అందరినీ అలరించినవాడు
వేంకటరమణా గోవిందా-
వేంకటాచలంపై అర్చామూర్తిగా నిలిచి ఉన్నవాడు.
సీతానాయక గోవిందా-
శివధనుస్సును విరిచి, జనకమహారాజు కుమార్తె సీతను పెళ్లాడి, అమెకు నాయకుడైనవాడు.
శ్రితపరిపాలక గోవిందా-
తనను అశ్రయించినవారిని అనుగ్రహించేవాడు.
దరిద్రజనపోషక గోవిందా-
తనను నమ్మినవారి అవసరాలకు కావలసిన సంపదలిచ్చి దరిద్రాన్ని తీర్చేవాడు.
ధర్మసంస్థాపక గోవిందా-
ధర్మం నశించినపుడు ఆ ధర్మాన్ని ఉద్ధరించటానికి అనేక రూపాల్లో భూమిపై అవతరించి ధర్మాన్ని సంస్థాపించినవాడు.
అనాథరక్షక గోవిందా-
ఏ దిక్కూలేనివారికి దిక్కుగా నిలిచి రక్షగా ఉండేవాడు.
ఆపద్బాంధవ గోవిందా-
ఆపదలు సంభవించినపుడు బంధువులాగా ఆదుకునేవాడు.
శరణాగతవత్సల గోవిందా-
తనను శరణన్నవారిని రక్షించువాడు
కరుణాసాగర గోవిందా-
భాగవతులపై సముద్రమంత కరుణాకటాక్షాలను ప్రసాదించేవాడు.
కమలదళాక్షగోవిందా-
తామరపూలరేకుల వంటి కన్నులతో చల్లని చూపులను ప్రసరింపజేసి కష్టాలను, బాధలను పోగొట్టేవాడు
కామితఫలదా గోవిందా-
మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చేవాడు.
పాపవినాశక గోవిందా-
పాపాలను, పాపాలు చేయాలనే దుష్ట ఆలోచనను పోగొట్టేవాడు.
పాహిమురారే గోవిందా-
మురాసురుడనే రాక్షసుణ్ణి సంహరించినవాడు.
శ్రీముద్రాంకిత గోవిందా-
శ్రీ ని అంటే లక్ష్మిని తన వక్షస్థలంపై ధరించినవాడు.
శ్రీవత్సాంకిత గోవిందా-
త్రికోణాకారంలో, తేనెరంగులో ‘శ్రీవత్సం’ అనే పుట్టుమచ్చ తన కుడివక్షస్థలంపై ఉన్నవాడు.
ధరణీనాయక గోవిందా-
శ్రీనివాసుడు వరాహరూపంలో భూమిని కాపాడినవాడు.
దినకరతేజా గోవిందా-
సూర్యుని వలె మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగించేవాడు.
పద్మావతీ ప్రియ గోవిందా-
పద్మావతీదేవికి ప్రియమైనవాడు
ప్రనన్నమూర్తీ గోవిందా-
ఎప్పుడు చూసినా ప్రశాంతంగా, మందస్మితవదనంతో ఉండేవాడు.
అభయహస్త గోవిందా-
అభయహస్తంతో ధైర్యాన్ని ప్రసాదించి భయాలను తొలగించేవాడు.
మత్స్యావతార గోవిందా-
మత్స్యావతారంలో- వేదాలను దొంగలించిన సోమకాసురుణ్ణి చంపి, వాటిని తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చినవాడు.
శంఖచక్రధర గోవిందా-
పాంచజన్యమనే శంఖమును, సుదర్శనమనే చక్రాన్ని ధరించినవాడు.
శార్ఙ్గగదాధర గోవిందా –
శారంగం అనే విల్లును, కౌమోదకి అనే గదను ధరించినవాడు.
విరజాతీర్థస్థ గోవిందా-
విరజాతీర్థప్రదేశం ఉన్న స్వామిపుష్కరిణి తీరాన కొలువై ఉన్నవాడు.
విరోధిమర్దన గోవిందా-
ధర్మానికి విరుద్ధంగా, సజ్జనులను బాధించేవారైన విరోధులను సంహరించేవాడు.
సాలగ్రామధరగోవిందా-.
సాలగ్రామ శిలారూపంలో ఏడుకొండలపై శ్రీనివాసుడిగా కొలువైఉన్నవాడు.
సహస్రనామా గోవిందా-
సహస్ర అంటే అనేక నామములను కలిగినవాడు
లక్ష్మీవల్లభ గోవిందా-
శ్రీమహాలక్ష్మికి భర్త
లక్ష్మణాగ్రజ గోవిందా-
రామావతారంలో లక్ష్మణుడికి అగ్రజుడిగా ఆవిర్భవించినవాడు.
కస్తూరితిలక గోవిందా-
కస్తూరి తిలకం నుదుట ధరించేవాడు.
కాంచనాంబరధర గోవిందా-
బంగారువస్త్రాలను ధరించినవాడు.
గరుడవాహన గోవిందా-
పక్షిరాజు గరుత్మంతుణ్ణి తన వాహనంగా చేసుకున్నవాడు.
గజరాజరక్షక గోవిందా-
మొసలిపట్టు బారినుండి కాపాడమంటూ, ఎలుగెత్తి దీనాలాపన చేసిన గజరాజును రక్షించి, మోక్షప్రాప్తి కలిగించినవాడు.
వానరసేవిత గోవిందా-
రావణసంహారంలో రామునికి అండగా సహాయ సహకారాలందించిన వానరులతో కొలువబడినవాడు.
వారధిబంధనగోవిందా-
సీతమ్మను రక్షించడం కోసం లంకకు వెళ్లడానికి వానర సహాయంతో వారధిని నిర్మించినవాడు.
ఏడుకొండలవాడా గోవిందా-
ఏడుకొండలపై శ్రీనివాసుడిగా వెలసినవాడు.
ఏకస్వరూపా గోవిందా-
ఏకస్వరూపమూర్తి, సచ్చిదానందస్వరూపుడు.
శ్రీరామకృష్ణా గోవిందా-
శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా అవతరించినవాడు.
రఘుకులనందన గోవిందా –
రఘువంశంలో శ్రీరాముడిగా అవతరించినవాడు.
ప్రత్యక్షదేవా గోవిందా –
భక్తులు ఏ రూపంలో ఎలా కోరుకుంటే, ఆ రీతిగా కనిపించి అభయమిచ్చేవాడు.
పరమదయాకర గోవిందా-
భక్తుల పట్ల మిక్కిలి దయగలవాడు.
వజ్రకవచధర గోవిందా-
ఏ ఆయుధంతోనూ ఢీకొట్టలేని అభేద్యమైన వజ్రకవచం ధరించినవాడు.
వైజయంతిమాల గోవిందా-
వైజయంతిమాలను హారంగా ధరించేవాడు.
వడ్డికాసులవాడా గోవిందా-
పద్మావతీదేవిని వివాహం చేసుకోవటానికి కుబేరుని వద్ద తీసుకున్న అప్పుకు వడ్డీగా, కలియుగంలో భక్తులు సమర్పించే కానుకలన్నీ కుబేరునికి వడ్డీ రూపంలో చెల్లిస్తున్నవాడు.
వసుదేవతనయా గోవిందా-
దేవకీవసుదేవులకు కుమారుడిగా జన్మించినవాడు.
బిల్వపత్రార్చిత గోవిందా –
శ్రీమహాలక్ష్మి స్వరూపమైన బిల్వపత్రాలతో అర్చింపబడేవాడు.
భిక్షుకసంస్తుత గోవిందా-
భిక్షుక వృత్తి అంటే పూర్వకాలంలో మునులు, గురుకులంలో విద్యనభ్యసించే శిష్యులు, గ్రామంలోకి వెళ్ళి భిక్షను యాచించగా వచ్చిన ధాన్యంతోనే ఆహారాన్ని తయారు చేసుకొని జీవించేవారు. భిక్షుక సంస్తుత అంటే- లోకకల్యాణార్థం యజ్ఞయాగాదులు నిర్వహించి, నిరంతరం స్వామినామ జపం చేస్తూ గడిపే ఇటువంటి వారిచే సేవింపబడేవాడు
స్త్రీపుంరూపా గోవిందా-
క్షీరసాగరమథనం సమయంలో మోహినీ అవతారాన్నెత్తి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టినవాడు.
శివకేశవమూర్తి గోవిందా-
శంకరుడు, శ్రీ మహావిష్ణువు స్వరూపం తానైనవాడు
బ్రహ్మాండరూపా గోవిందా-
పరమాణువు మొదలుకొని ప్రతి వస్తువులోనూ నిండి ఉన్నవాడు.
భక్తరక్షకా గోవిందా-
భక్తితో ప్రార్ధించే భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడు.
నిత్యకల్యాణ గోవిందా-
లోకకల్యాణం కోసం నిత్యకల్యాణాలను స్వీకరిస్తూ, భక్తులను అనుగ్రహించి సకల శుభాలను కలిగించేవాడు.
నీరజనాభ గోవిందా-
స్వామి నాభి నుండి తామరపువ్వు ఉద్భవించింది. కనుక, నీరజనాభుడు, కమలనాభుడు, పద్మనాభుడు అని పిలువబడుతున్నాడు.
హథీరామప్రియ గోవిందా-
హథీరాంబావాజీ అనే భక్తుడికి ప్రియ గోవిందుడు.
హరిసర్వోత్తమ గోవిందా-
హరినామస్మరణం, హరికథాశ్రవణం ద్వారా తరింపజేసేవాడు.
జనార్దనమూర్తి గోవిందా-
కేశవనామాల్లో జనార్దన నామధేయంతో కొలువబడినవాడు.
జగత్సాక్షిరూప గోవిందా-
సృష్టిలోని ప్రతి ఒక్కరిలోనూ, భూత, వర్తమాన, భవిష్యత్‌కాలాల్లోనూ ఉండి జగత్తుకే సాక్షిగా నిలిచినవాడు.
అభిషేకప్రియ గోవిందా-
అవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్లు, గంధం మొదలైన పరిమళద్రవ్యాలతో అభిషేకం చేయించుకుని, ప్రీతిని పొందేవాడు.
ఆపన్నివారణ గోవిందా-
తననే నిత్యమూ, సత్యమూ అని నమ్మిన భక్తులకు ఏ ఆపదలు వాటిల్లకుండా కాపాడేవాడు.
రత్నకిరీటా గోవిందా-
నవరత్నాలతో తయారుచేసిన కిరీటాన్ని ధరించేవాడు.
రామానుజనుత గోవిందా-
విశిష్టాద్వైత మతోద్ధారకుడు రామానుజుడు. ఈయన లక్ష్మణుని అంశ అని అంటారు. రామునికి అనుజుడైన లక్ష్మణునిచే సేవించబడినవాడు, పూజింపబడినవాడు.
స్వయంప్రకాశా గోవిందా-
స్వామి తనంత తానుగా నిత్యమూ ప్రకాశవంతమైన కాంతి వెలుగుల వలె ప్రకాశించేవాడు.
ఆశ్రితపక్షగోవిందా-
తననే నమ్మి, తనను ఆశ్రయించినవారి పక్షాన ఉండి కాపాడేవాడు.
నిత్యశుభప్రద గోవిందా-
ఎప్పుడూ తోడుగా ఉండి విజయాలను, అన్ని రకాల శుభాలను ప్రసాదించేవాడు.
నిఖిలలోకేశ గోవిందా-
అన్ని లోకాలకు సర్వాంతర్యామి అయినవాడు.
ఆనందరూపా గోవిందా-
నిత్యమూ మందస్మిత సుందర వదనారవిందంతో, నవ్వు మోముతో కనిపించేవాడు.
ఆద్యంతరహితా గోవిందా-
ఆది, అంతం లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండేవాడు.
ఇహపరదాయక గోవిందా-
ఇహ అంటే భూలోకం. పర అంటే దేవలోకం. ఈ రెండు లోకాలకూ అధినాయకుడైనవాడు.
ఇభరాజరక్షక గోవిందా-
ఇభం అంటే మదపుటేనుగు. ఆ గజరాజును ఆపదనుండి రక్షించినవాడు.
పరమదయాళో గోవిందా-
సృష్టిలోని అన్నిజీవరాశులపై మిక్కిలి దయ కలిగినవాడు.
పద్మనాభహరి గోవిందా-
పద్మాన్ని నాభియందు కలిగినవాడు.
తిరుమలవాసా గోవిందా-
తిరుమలక్షేత్రంలో శ్రీనివాసుడనే పేరుతో కొలువైఉన్నవాడు.
తులసీవనమాల గోవిందా-
తులసీదళాలచే అల్లబడిన దండల అలంకరణపై మహాప్రీతి కలిగినవాడు.
శేషసాయినే గోవిందా-
ఆదిశేషునిపై పవళించేవాడు.
శేషాద్రినిలయా గోవిందా-
శేషాద్రి అనే ఏడవకొండపై అర్చామూర్తిగా నిలిచియున్నవాడు.
శ్రీశ్రీనివాసా గోవిందా-
‘శ్రీ” అంటే లక్ష్మి, లక్ష్మిని తన వక్షస్థలమునందు నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు.
శ్రీవేంకటేశా గోవిందా-
“వేం” అంటే పాపాలు. “కట” అంటే దహింపజేయడం. పాపాలను దహింపజేసేవాడు.
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా
ఈ 108 గోవిందనామాలను నిత్యమూ భజించి ఆ గోవిందుని కృపాకటాక్ష వీక్షణాలను పొందుదాం. మీ అమూల్యమైన అభిప్రాయాలను comment రూపంలో నాకు తెలియజేయండి. నమస్కారాలు.
ఈ నామాలను వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. 👇👇👇👇