
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురంలో సర్వజ్ఞపీఠం స్థాపించారు,అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం ‘మూక శంకరులు’ అని అంటాము.
మూక శంకరులు పుట్టుకతోనే మూగ-చెవుడు ఉన్నవారు. అందుచేతనే వీరిని మూక కవి అనేవారు. కానీ అమ్మవారి కటాక్షం ఉంటే, పుట్టుకతో మాటలు రాని వాడు మాట్లాడతాడు అనడానికి మూక శంకరుల జీవితమే నిదర్శనం. ఒక రోజు మూక శంకరులు కామాక్షీ అమ్మ వారి ఆలయంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు.
కామాక్షీ అమ్మ వీరిని అనుగ్రహించదలిచి, కర చరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది. అలా వచ్చిన అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ, అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద(పిడచ) కొంచెం తీసి మూక శంకరుల ప్రక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది.
ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక, మామూలు ఒక స్త్రీ అనుకుని, ఎంగిలి అనే భావముతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించ లేదు.
కామాక్షీ అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూక శంకరుల చేతికి ఇచ్చింది. మహా ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మూక శంకరులు.
అంతే! తక్షణమే కామాక్షీ అమ్మవారి అనుగ్రహముతో మూక శంకరులకి మాట వచ్చింది. మాట రాగానే, ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది. వెంటనే కామాక్షీ అమ్మ వారిని చూస్తూ ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు మూక శంకరులు. ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి ‘మూక పంచశతి’ అంటారు.
కామాక్షీ అమ్మ అనుగ్రహముతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పారవశ్యంతో చేసిన స్తోత్ర రత్న మాలయే “మూక పంచ శతి”. ఇవి ఐదు శతకాలుగా ఉంటాయి.
1. ఆర్యా శతకం
2. స్తుతి శతకం
3. కటాక్ష శతకం
4. మందస్మిత శతకం
5. పాదారవింద శతకం
అమ్మ అనుగ్రహముతో మాటలు వచ్చి, ఐదు శతకములతో అమ్మని స్తోత్రం చేసిన తరువాత కామాక్షీ అమ్మ ఏమి వరం కావాలి అని అడిగింది. అప్పుడు మూక శంకరులు “అమ్మా, నోరు లేనివాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు, ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగానో, ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా, కాబట్టి నన్ను మళ్ళీ మూగ వాడిని చెయ్యి” అని వేడుకుంటారు.
అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూక శంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది.
ఈ విధంగా కామాక్షీ అమ్మ వారి సేవలో తరించిన మూక శంకరులు శ్రీ ధాతు నామ సంవత్సరములో శ్రావణ పౌర్ణమి నాడు, మన గోదావరీ నదీ తీరంలోనే ముక్తిని పొంది, కామాక్షి-ఏకాంబరేశ్వరులలో ఐక్యం అయ్యారు.✍
ఇప్పుడు మనం ఆ శ్లోకాలకు తెలుగులో అర్థం తెలుసుకుందాం.