శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 131-140 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.
సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
పీతాంబరమయీ చంచత్కౌస్తుభా హరికామినీ |
నిత్యా తథ్యా రమా రామా రమణీ మృత్యుభంజనీ || 131 ||
పీతాంబర మయీ – పసుపురంగు పట్టు వస్త్రాలను ధరించింది
చంచత్కౌస్తుభా – ప్రకాశిస్తున్న కౌస్తుభ రత్నాన్ని ధరించినది
హరికామినీ – మహా విష్ణువు భార్య
నిత్యా – ఎన్నటికీ నాశనము లేనిది, స్థిరమైనది
తథ్యా – సత్య స్వరూపిణి
రమా – లక్ష్మి దేవి
రామా – సకల స్త్రీ స్వరూపిణి
రమణి – సౌందర్యవతి
మృత్యుభంజనీ – జనన మరణ రూపమైన సంసారమును తొలగించి,
ముక్తినిచ్చునది
జ్యేష్ఠా కాష్ఠా ధనిష్ఠాంతా శరాంగీ నిర్గుణప్రియా |
మైత్రేయా మిత్రవిందా చ శేష్యశేషకలాశయా || 132 ||
జ్యేష్ఠా – పెద్దది, జ్యేష్ఠా నక్షత్ర స్వరూపిణి
కాష్ఠా – ఉన్నతమైనది, కాల స్వరూపిణి
ధనిష్ఠాంతా – ధనమును, సిరిని ఇచ్చు నక్షత్రము ధనిష్టా
శరాంగీ – విల్లు వంటి శరీరాన్ని కలిగినది
నిర్గుణ ప్రియా – మూడు గుణాలకు అతీతమైన వ్యక్తులను ఇష్టపడునది
మైత్రేయా – స్నేహశీలి
మిత్రవింద – కృష్ణుని భార్య మిత్రవింద, లక్ష్మి స్వరూపిణి
శేష్యశేష కలాశయా – భగవంతుని పొందుటకు అనుగ్రహమును కలిగించునది
వారాణసీవాసలభ్యాచార్యావర్తజనస్తుతా |
జగదుత్పత్తిసంస్థానసంహారత్రయకారణమ్ || 133 ||
వారాణసీ వాసలభ్యా – కాశీలో నివసించే ప్రజలు పొందదగినది
ఆర్యావర్త జనస్తుతా – ఆర్యావర్తులచే స్తుతింపబడునది
జగదుత్పత్తి సంస్థాన సంహారత్రయకారణా
– విశ్వం యొక్క సృష్టి, నిర్వహణ మరియు నాశనానికి కారణమైనది
త్వమంబ విష్ణుసర్వస్వం నమస్తేఽస్తు మహేశ్వరి |
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే || 134 ||
త్వమంబ విష్ణుసర్వస్వం – విష్ణువునకు సర్వస్వమూ అమ్మే
మహేశ్వరీ – మహేశ్వరుని భార్య
సర్వ లోకానాం జనని – అన్ని లోకములకు తల్లి
పుణ్యమూర్తి – పుణ్య స్వరూపిణి
సిద్ధలక్ష్మీర్మహాకాళి మహాలక్ష్మి నమోఽస్తు తే |
సద్యోజాతాదిపంచాగ్నిరూపా పంచకపంచికా || 135 ||
సిద్ధలక్ష్మీ – కార్య సిద్ధిని, ప్రయోజన సిద్ధిని ప్రసాదించు లక్ష్మి
మహాకాళీ – ఉజ్జయినిలోని మహా కాళేశ్వరుని భార్య
మహాలక్ష్మి – మహాలక్ష్మి స్వరూపిణి
సద్యోజాతాది పంచాగ్నిరూపా – శివుని ఐదు ముఖాలు, ఐదు అగ్నుల స్వరూపము
పంచకపంచికా – పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణములు అన్నీ అమ్మ రూపములే
యంత్రలక్ష్మీర్భవత్యాదిరాద్యాద్యే తే నమో నమః |
సృష్ట్యాదికారణాకారవితతే దోషవర్జితే || 136 ||
యంత్రలక్ష్మీ – సర్వ యంత్ర స్వరూపిణి
భవతీ – సర్వ కాలములయందు ఉండునది
ఆది – సృష్టికి ముందు కూడా ఉన్నటువంటిది
ఆద్యాద్యా – మొదటి నుండి ఉన్నది, ఎప్పటికీ ఉండునది
సృష్ట్యాది కారణాకార వితతా – సృష్టికి ఆదికారణము, సృష్టి యొక్క విస్తర రూపము
దోష వర్జితా – ఎటువంటి దోషములు లేనిది
జగల్లక్ష్మీర్జగన్మాతర్విష్ణుపత్ని నమోఽస్తు తే |
నవకోటిమహాశక్తిసముపాస్యపదాంబుజే || 137 ||
జగల్లక్ష్మి – జగత్తునంతటికీ శోభనిచ్చు లక్ష్మి
జగన్మాతా – లోకములకు తల్లి
విష్ణు పత్నీ – శ్రీ మహావిష్ణువు భార్య
నమోస్తుతే – నీకు నమస్కారములు
నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజా
– తొమ్మిది కోట్ల మహా శక్తులచే సేవించబడుతున్న పాద పద్మములు గల తల్లి
కనత్సౌవర్ణరత్నాఢ్యే సర్వాభరణభూషితే |
అనంతనిత్యమహిషీ ప్రపంచేశ్వరనాయకి || 138 ||
కనత్సౌవర్ణ రత్నాఢ్య సర్వాభరణ భూషితా
– ప్రకాశించుచున్న రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలను ధరించినది
అనంత నిత్య మహిషీ – అనంతునికి శాశ్వతమైన పట్టపు రాణి
ప్రపంచేశ్వర నాయకి – ప్రపంచంలోని దేవతలందరికీ నాయకురాలు
అత్యుచ్ఛ్రితపదాంతస్థే పరమవ్యోమనాయకి |
నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోకవిలాసిని || 139||
అత్యుచ్ఛ్రిత పదాంతస్థా – మిక్కిలి ఉన్నతమైన నామములతో విలసిల్లునది
పరమవ్యోమ నాయకీ – నక్షత్రములతో కూడినది
నాకపృష్ఠ గతారాధ్యా – శుభమును కలిగించు యజ్ఞ సంబంధ మంత్రములందు ఆరాధింపబడు తల్లి
విష్ణులోక విలాసిని – విష్ణు లోకాన్ని ప్రకాశింపజేసేది
వైకుంఠరాజమహిషి శ్రీరంగనగరాశ్రితే |
రంగనాయకి భూపుత్రి కృష్ణే వరదవల్లభే || 140 ||
వైకుంఠ రాజమహిషి – వైకుంఠమునకు రాణి
శ్రీరంగ నగరాశ్రిత – శ్రీరంగ పట్టణంలో నివసించునది
రంగనాయకీ – శ్రీరంగనాధ స్వామి భార్య
భూపుత్రీ – భూమాత పుత్రికయగు సీతాదేవి స్వరూపిణి
కృష్ణా – అందరినీ ఆకర్షించునది, ద్రౌపదీ స్వరూపిణి
వరద వల్లభా – కంచి వరదరాజస్వామికి భార్య
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




