శివానందలహరి 21-30 శ్లోకాలు
శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.
శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.
సంస్కృత శ్లోకము – 21
ధృతి స్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితామ్ ।
స్మరారే మచ్చేతః స్ఫుట పట కుటీం ప్రాప్య విశదాం
జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః సేవిత విభో ॥ 21 ॥
తాత్పర్యము
కామజయము కలిగి, సర్వస్వతంత్రుడవును, సర్వవ్యాపకుడవు, పరమానంద స్వరూపుడవు అగు ఓ పార్వతీవల్లభా! నా చిత్తం ఒక గుడారముగా ఉన్నది. నా మనస్సు విషయమనెడు స్తంభం పైన నిలిచియున్నది. గుడారము తాళ్ళతో కట్టబడి నిలుపబడునట్లు, చిత్తము త్రిగుణములవలన జనించిన దేహాదులతో నిలుపబడి ఉన్నది. గుడారము ఎక్కడికి కావలసినా అక్కడికి కొనిపోబడునట్లు ఈ చిత్తం అక్కడక్కకు కొనిపోబడును. గుడారము పలురంగులతో, పద్మములవంటి చిత్రములతో ఉండునట్లు నా చిత్తము బహువిధములైన చిత్రవిచిత్రములగు జన్మాంతర వాసనలతో కూడి, సంపదను కోరుతున్నది. బ్రహ్మ విచారమునందు కూర్చబడి ఉన్నది. ఇట్టి నా చిత్త కుటీరమందు శక్తితో కూడి నివసించియుండుము.
సంస్కృత శ్లోకము – 22
ప్రలోభాద్యైర్ అర్థాహరణ పరతంత్రో ధనిగృహే
ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ।
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ ॥ 22 ॥
తాత్పర్యము
కల్లబొల్లి మాటలుచెప్పి, ధనికుల చిత్తమును వశపరుచుకొనుట మొదలగు కొన్ని దుష్టోపాయములు పన్ని, ధనాకర్షణమునకు ధనవంతుల యిండ్లలో దూరుతూ తిరుగుతున్న ఈ మనస్సను దొంగను నేనోర్వలేను. నీ కప్పగించెదను. చోర ప్రభువగు శంకరా! ఆ దొంగను నీవు నీ వశము చేసుకొని, నిరపరాధినగు నన్ను దయతో రక్షింపుము.
సంస్కృత శ్లోకము – 23
కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి ।
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్పక్షి మృగతాం
అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో ॥ 23 ॥
తాత్పర్యము
శంకరా! నిన్నారాధింతును. నాకు పూజాఫలముగా మోక్షానందం ప్రసాదింపుము. కాని బ్రహ్మత్వమో, విష్ణుత్వమో దానికి ఫలమని మాత్రం ఈయవద్దు. అక్కడనుండి హంసగానో, పందిగానో పుట్టి- నీ పాదములను, శిరస్సును కనుగొనుటకు పైలోకాలు, క్రిందిలోకాలు అన్నీ తిరిగి శ్రమపడలేను. ఆ మీద తుదకు నిన్ను కనుగొనలేక క్షుద్ర జన్మవలన అవమానమును సహింపలేను, కాబట్టి బ్రహ్మ, విష్ణు లోకానందములకన్న అధికమైన సాయుజ్యముక్తియను పరమానందమును దయచేయుమని భావము.
సంస్కృత శ్లోకము – 24
కదా వా కైలాసే కనకమణిసౌధే సహ గణైర్
వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుటః ।
విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్
విధాతౄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః ॥ 24 ॥
తాత్పర్యము
కైలాసమునకు చేరి ప్రమథ గణములతో కూడి ఉన్న పరమేశ్వరుని ఎదుట “హేవిభో! హేసాంబ ! హేస్వామి ! హే పరమశివ ! పాహిపాహి” అని పలుకుతూ, సంతోషముతో అనేక బ్రహ్మకల్పములు నిమిషములుగా కాలమెప్పుడు గడపుదునో గదా!
సంస్కృత శ్లోకము – 25
స్తవైర్ బ్రహ్మాదీనాం జయజయ వచోభిర్నియమినాం
గణానాం కేళీభిర్మదకల మహోక్షస్య కకుది ।
స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్ట వపుషం
కదా త్వాం పశ్యేయం కర ధృతమృగం ఖండపరశుమ్ ॥ 25 ॥
తాత్పర్యము
స్తోత్రపాఠములతో బ్రహ్మాదులు, జయజయ ధ్వనులతో మహర్షులు, ఆటపాటలతో ప్రమథగణములు కొలుస్తూ ఉండగా, పార్వతీ సమేతుడవై, వృషభ వాహనముమీద వేంచేసియున్న నీ సందర్శనము చేయు భాగ్యము నాకెన్నడు లభించునోగదా!
సంస్కృత శ్లోకము – 26
కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ ।
సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజ గంధాన్పరిమలాన్
అలాభ్యాం బ్రహ్మాద్యైర్ ముదమను భవిష్యామి హృదయే ॥ 26 ॥
తాత్పర్యము
హే గిరీశా! నిన్ను చూసి, నీ పాదములను చేతులతో పట్టి, శిరస్సునందు, నేత్రములందు రొమ్మునను జేర్చి కౌగిలించుకొని, అందలి పద్మగంధములను ఆఘ్రాణించి, బ్రహ్మాదులకు కూడా దొరకని ఆనందము ఎప్పుడు పొందుదునో.
సంస్కృత శ్లోకము – 27
కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణిగణే ।
శిరఃస్థే శీతాంశౌ చరణ యుగళస్థేఽఖిల శుభే
కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః ॥ 27 ॥
తాత్పర్యము
కైలాసవాసా! బంగారుకొండ (మేరు పర్వతము) నీ చేతిలో ఉన్నది. కుబేరుడు మిత్రుడుగా నీ దగ్గర ఉన్నాడు. కోరికలనిచ్చు కల్పవృక్షము, కామధేనువు, చింతామణులు నీ అధీనములై, నీ ఇంట ఉన్నవి. చంద్రుడు భూషణముగా నీ శిరస్సున ఉన్నాడు. సమస్త శుభములు నీ పాదముల వలన కలుగుతున్నవి. శంకరా! నీకు నేను ఇవ్వదగినది ఒక్కటీ కానరాదు. కనుక నా చిత్తమును అర్పించెదను, స్వీకరింపుము.
సంస్కృత శ్లోకము – 28
సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తి ధుర్యజనతా సాంగత్య సంభాషణే ।
సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోఽస్మ్యహమ్ ॥ 28 ॥
తాత్పర్యము.
జగత్ప్రభూ! నీ పూజయందు సారూప్యము, నీ నామ సంకీర్తనమందు సామీప్యము, నీ భక్తులతోకూడి కథాకాలక్షేపములు చేయుటవలన సాలోక్యము, చరాచరాత్మకమైన నీ మూర్తి ధ్యానమందు సాయుజ్యమును కూడా, నాకు ఈ లోకమందే దయచేయుచుంటివి. కాబట్టి ధన్యుడనైతిని.
సంస్కృత శ్లోకము – 29
త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో ।
వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం
శంభో లోకగురో మదీయమనసః సౌఖ్యోపదేశం కురు ॥ 29 ॥
తాత్పర్యము
పరమేశ్వరా! నీ పాదార్చనము చేయుచూ, ప్రతి దినము నిన్ను తలంచుచు, శరణుపొంది వేడుకొందును. చిరకాలముగా దేవతలచే కోరబడే నీ కరుణాకటాక్షమును నాపై ప్రసరింపజేసి, నాకు బ్రహ్మోపదేశము చేయుము.
సంస్కృత శ్లోకము – 30
వస్త్రోద్ధూతవిధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా
గంధే గంధ వహాత్మతాఽన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా ।
పాత్రే కాంచన గర్భతాస్తి మయి చేద్బాలేందు చూడామణే
శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామింస్త్రిలోకీగురో ॥ 30 ॥
తాత్పర్యము
సర్వవ్యాపకా! నీకు వస్త్రోపచారము చేయుటకు వేయి కరములు కలవాడు కావలెను. పుష్పోపచారము చేయుటకు వ్యాపకుండు కావలెను. గంధోపచారమునకు గంధవహుడు కావలెను. వంటచేసి నీకు హవిస్సు నివేదన చేయుటకు, అగ్నిముఖాధ్యక్షుడు కావలెను. అర్థ్యపాద్యము సమర్పించుటకు ఆగర్భశ్రీమంతుడు కావలెను. అట్టి సూర్యుడు, విష్ణువు, వాయుదేవుడు, దేవేంద్రుడు, హిరణ్యగర్భుడు అయినప్పుడే నీకట్టి ఉపచారములు చేయగలను. లేనిచో నీకు ఉపచారములు చేయ నా తరమా?
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.



