శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం 51-60 శ్లోకాలు
శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం అనేది సిరిసంపదలు, అదృష్టం మరియు శుభాలకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్తుతిస్తూ పఠించే అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన హిందూ స్తోత్రం. అమ్మవారి విశిష్ట గుణాలను, తత్వాన్ని మరియు విశ్వరూపాన్ని వర్ణించే వెయ్యి నామాలతో కూడిన ఈ పురాతన స్తోత్రం కేవలం భౌతిక సంపదల కోసం చేసే ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక సాధన. ఈ దివ్య నామాలను స్వచ్ఛమైన భక్తితో పఠించడం లేదా వినడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి, జీవితంలోని ఆటంకాలు పటాపంచలై, ఇంట శాంతి, శ్రేయస్సు మరియు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇది భక్తులను నేరుగా ఆ చల్లని తల్లి అనుగ్రహానికి అనుసంధానించే ఒక ఆధ్యాత్మిక వారధిలా పనిచేస్తుంది.
సంస్కృత పఠనం ద్వారా విశేష ఫలితం ఉన్నప్పటికీ, లక్ష్మీ సహస్రనామాలకు మాతృభాషలో అర్థం తెలుసుకుని చదవడం వల్ల ఆధ్యాత్మిక శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. తెలుగులో అర్థం తెలుసుకోవడం ద్వారా పఠనం యాంత్రికంగా కాకుండా, అమ్మవారితో చేసే హృదయపూర్వక సంభాషణగా మారి ఏకాగ్రత, భక్తి ద్విగుణీకృతం అవుతాయి. మనకు అలవాటైన భాషలో ఉండటం వల్ల పిల్లలు, యువతకు కూడా ఈ దైవిక తత్వం సులభంగా అర్థమై, భావితరాలకు చేరువవుతుంది. అంతేకాకుండా, అష్టలక్ష్ముల విశిష్టతను తెలుసుకుని, మనకు అత్యంత అవసరమైన అమ్మవారి రూపంపై మనసును లగ్నం చేసి కోరిన వరాలను పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
సత్తాజాతిః ప్రమాఽమేయాఽప్రమితిః ప్రాణదా గతిః |
అవర్ణా పంచవర్ణా చ సర్వదా భువనేశ్వరీ || 51 ||
సత్తా – పరబ్రహ్మ స్వరూపము
జాతిః – భిన్నమైన వస్తువులయందు ఉండునది
ప్రమా – యదార్ధ జ్ఞానము కలిగించునది.
అమేయా – హద్దులు లేనిది
అప్రమితి – వేదాలు, సిద్ధాంతాల ద్వారా అనుభూతియందు మాత్రమే తెలియదగినది,
ప్రాణదా – జీవితాన్ని ఇచ్చేది
గతిః – భక్తులకు గమ్యం. సద్గతిని ప్రసాదించునది
అవర్ణా – వర్ణములు అనగా అక్షరములతో కూడిన మాటల చేత వర్ణించుటకు వీలు లేనిది
పంచవర్ణా – ఐదు రంగులు కలిగిన ముఖములు కలిగినది, గాయత్రి దేవి
సర్వదా – సర్వులకు సర్వమును ప్రసాదించునది
భువనేశ్వరీ – విశ్వానికి దేవత
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా |
హిరణ్యవర్ణా హరిణీ సర్వోపద్రవనాశినీ || 52 ||
త్రైలోక్యమోహిని – మూడు లోకాలను మంత్రముగ్ధులను చేయునది
విద్యా – జ్ఞాన స్వరూపిణి
సర్వ భర్త్రీ – సమస్తమును భరించునది
క్షరా – నశింపచేయునది
అక్షరా – నాశనము లేనిది
హిరణ్యవర్ణా – బంగారు రంగులో ఉండునది
హరిణీ – దు:ఖములను నశింపజేయునది
సర్వోపద్రవ నాశినీ – అన్ని సమస్యలను నాశనం చేయునది
కైవల్యపదవీరేఖా సూర్యమండలసంస్థితా |
సోమమండలమధ్యస్థా వహ్నిమండలసంస్థితా || 53 ||
కైవల్య పదవీ రేఖా – మోక్షానికి మార్గము అయినది
సూర్యమండల సంస్థితా – సౌరమండలంలో ఉండునది
సోమమండల మధ్యస్థా – చంద్ర మండలము మధ్యలో ఉండునది
వహ్నిమండల సంస్థితా – మూలాధార చక్రమునందు ఉండునది
వాయుమండలమధ్యస్థా వ్యోమమండలసంస్థితా |
చక్రికా చక్రమధ్యస్థా చక్రమార్గప్రవర్తినీ || 54 ||
వాయుమండల మధ్యస్థా – వాయు మండలము మధ్యలో ఉండునది
వ్యోమమండల సంస్థితా – ఆకాశంలో నిలిచి ఉండునది
చక్రికా – దివ్య చక్రము కలిగినది
చక్రమధ్యస్థా – శ్రీచక్రం మధ్యలో ఉండునది
చక్రమార్గ ప్రవర్తినీ – శరీర చక్రాల మార్గంలో ప్రయాణించేది
కోకిలాకులచక్రేశా పక్షతిః పంక్తిపావనా |
సర్వసిద్ధాంతమార్గస్థా షడ్వర్ణావరవర్జితా || 55 ||
కోకిలా – శోభిల్లునది
పక్షతిః – చంద్రుని దశల ప్రారంభం, పాడ్యమి తిథి
పంక్తి పావనా – తన భక్తుల పాపములను పోగొట్టి శుద్ధి చేయునది
సర్వసిద్ధాంత మార్గస్థా – సమస్త జ్ఞానానికి మార్గం అయినది
షడ్వర్ణా – ఆరు వర్ణములు కల ముఖములు కలది
అవరవర్జితా – పాపాత్ముల చేత విడువబడినది
శతరుద్ర హరా హంత్రీ సర్వసంహారకారిణీ |
పురుషా పౌరుషీ తుష్టిః సర్వతంత్రప్రసూతికా || 56 ||
శతరుద్ర హరా – రుద్ర రూపిణి
హంత్రీ – దుష్టులైన రాక్షసులను సంహరించునది
సర్వసంహారకారిణీ – ప్రళయకాలమునందు సమస్తమును లయము చేయునది
పురుషా – ఈశ్వర స్వరూపిణి
పౌరుషీ – పురుషశక్తి స్వరూపిణి
తుష్టి – అందరికీ సంతృప్తి కలిగించునది
సర్వతంత్ర ప్రసూతికా – సర్వ తంత్రములకు మూలమైనది
అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యాప్రదాయినీ |
భార్గవీ యాజుషీవిద్యా సర్వోపనిషదాస్థితా || 57 ||
అర్ధనారీశ్వరీ దేవి – అర్ధనారీ స్వరూపము
సర్వవిద్యాప్రదాయినీ – సమస్త విద్యలనూ ప్రసాదించునది
భార్గవీ – భృగు మహర్షి కుమార్తె
యాజూషీవిద్యా – యజుర్వేద విద్యా స్వరూపిణి
సర్వోపనిషదాస్థితా – సర్వ ఉపనిషత్తులలో ఉన్నది
వ్యోమకేశాఽఖిలప్రాణా పంచకోశవిలక్షణా |
పంచకోశాత్మికా ప్రత్యక్పంచబ్రహ్మాత్మికా శివా || 58 ||
వ్యోమకేశాఖిల ప్రాణా – వ్యోమకేశుడైన శివుని యొక్క అఖిల ప్రాణములు జగదంబే
పంచకోశ విలక్షణా – అన్నమయ కోశము వంటి పంచకోశాలతో కప్పబడి ఉండే ఆత్మ
పంచకోశాత్మికా – పంచకోశముల లోపలి భాగమునందున్న తల్లి
ప్రత్యక్ – పంచకోశములకు వేరైన ఆత్మయే అమ్మ
పంచ బ్రహ్మాత్మికా – పంచ బ్రహ్మల, పంచ ప్రాణముల స్వరూపం
శివా – శివుని భార్య
జగజ్జరాజనిత్రీ చ పంచకర్మప్రసూతికా |
వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితాస్థితిః || 59||
జగజ్జరాజనిత్రీ – లయకారిణి
పంచకర్మ ప్రసూతికా – ఆమె సృష్టి, నిర్వహణ, విలీనం, అదృశ్యం మరియు అనుగ్రహం అనే ఐదు రకాల కర్మలకు కారణమైనది.
వాగ్దేవ్యాభరణాకారా – వాక్కు ఆభరణముగా కలది
సర్వకామ్య స్థితా – సర్వ పుణ్యకార్యములలో ఉన్నది
స్థితిః – స్థిరంగా ఉన్నది
అష్టాదశచతుష్షష్టిపీఠికా విద్యయాయుతా |
కాలికాకర్షణ శ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ || 60 ||
అష్టాదశ చతుఃషష్టి పీఠికా – అష్టాదశ పీఠములు, చతుఃషష్టి పీఠములు నివాసములుగా గల తల్లి
విద్యయాయుతా – శ్రీవిద్యతో కూడినది
కాళికాకర్షణ శ్యామా – ఆకర్షణీయమైన నల్లని వర్ణము గల శ్యామలాదేవి
యక్షిణి – యక్ష స్త్రీ
కిన్నరేశ్వరి – మానవ శరీరం, గుర్రపు తల కలిగిన కిన్నెర జాతికి చెందినది
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




