మూక పంచశతి – కటాక్ష శతకం 1-10 శ్లోకాలు
మూక పంచశతి – కటాక్ష శతకం అనేది భక్తి సాహిత్యంలో అపూర్వమైన కృతి. దీనిని మూక కవి రచించారు. ఈ శతకం ప్రధానంగా శ్రీ కామాక్షి అమ్మవారు దివ్య కటాక్షాన్ని వర్ణిస్తుంది. కామాక్షి దేవి అనుగ్రహంతో మూగుడైన కవి వాక్కు పొందినదే ఈ కృతి యొక్క విశిష్టత. ఈ శ్లోకాలు భక్తి, శరణాగతి, దైవానుగ్రహాన్ని తెలియజేస్తూ మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి.
కటాక్ష శతకం పారాయణం చేయడం వల్ల జ్ఞానం, వాక్పటుత్వం, మనోశాంతి లభిస్తాయని నమ్మకం. ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా దేవి కటాక్షం ద్వారా జీవితంలో విజయాలు, అడ్డంకుల నివారణ కలుగుతాయని విశ్వాసం ఉంది. భక్తులకు ఇది ఆధ్యాత్మిక బలం, సానుకూల శక్తి ప్రసాదించే పవిత్ర గ్రంథంగా భావించబడుతుంది.
మోహాంధకారనివహం వినిహంతుమీడే
మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ ।
శ్రీకాంచిదేశశిశిరీకృతిజాగరూకాన్
ఏకామ్రనాథతరుణీకరుణావలోకాన్ ॥1॥
తన చల్లని చూపులతో కాంచీపురమును తిలకించునది, పుట్టు మూగవారిని కూడా మహా కవులుగా అనుగ్రహించునది,ఏకామ్రనాధేశ్వరుని దేవేరి అయిన కామాక్షీ దేవి దయాపూరిత దృష్టి నాలోని అంధకారమును తొలగించుగాక.
మాతర్జయంతి మమతాగ్రహమోక్షణాని
మాహేంద్రనీలరుచిశిక్షణదక్షిణాని ।
కామాక్షి కల్పితజగత్త్రయరక్షణాని
త్వద్వీక్షణాని వరదానవిచక్షణాని ॥2॥
అమ్మా! నీ చూపులు ఇంద్రనీలమణుల కాంతులకంటే ప్రకాశవంతమైనవి. అవి మమ్ములను మమకారము అనే గ్రహపీడ నుండి విముక్తిని కలిగించి, మూడు లోకములను రక్షిస్తాయి. నీ చూపులు వరప్రదాయకములు, తల్లీ!
ఆనంగతంత్రవిధిదర్శితకౌశలానాం
ఆనందమందపరిఘూర్ణితమంథరాణామ్ ।
తారల్యమంబ తవ తాడితకర్ణసీమ్నాం
కామాక్షి ఖేలతి కటాక్షనిరీక్షణానామ్ ॥3॥
అమ్మా! నీ చూపుల శక్తి ఎంత గొప్పదంటే, అవి శ్రీవిద్యా సాధనలో నిపుణతను ప్రసాదించి, మమ్ములను ఆనందకరమైన స్థితిలో నీ వద్దకు చేరుస్తాయి. చెవులవరకు విస్తరించిన నీ దృష్టి చంచలముగా అన్ని వైపులకు విస్తరించుచున్నది.
కల్లోలితేన కరుణారసవేల్లితేన
కల్మాషితేన కమనీయమృదుస్మితేన ।
మామంచితేన తవ కించన కుంచితేన
కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన ॥4॥
అమ్మా! కామాక్షీ! కరుణారసముతో నిండిన నీ చూపులు, ఉజ్వలముగా ప్రకాశించే కాటుకతో కలసి ఎంతో సుందరముగా ఉన్నాయి. దానికి నీ చిరునవ్వు మరింత అందము చేకూరుస్తుంది. నీ కరుణారస దృష్టి నన్ను చల్లబరచుగాక.
సాహాయ్యకం గతవతీ ముహురర్జునస్య
మందస్మితస్య పరితోషితభీమచేతాః ।
కామాక్షి పాండవచమూరివ తావకీనా
కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీః ॥5॥
అమ్మా! పాండవులు నీ దయారస దృష్టి అనుగ్రహమును పొందగలిగారు. అవి పాండవమధ్యముడైన అర్జునుని, భీముని అనుగ్రహించి, కర్ణునివంటి వారిని జయించి, సేనావాహినిలాగా కౌరవ సేనను ఆక్రమించాయి.
అస్తం క్షణాన్నయతు మే పరితాపసూర్యం
ఆనందచంద్రమసం ఆనయతాం ప్రకాశమ్ ।
కాలాంధకారసుషమాం కలయందిగంతే
కామాక్షి కోమలకటాక్షనిశాగమస్తే ॥6॥
అమ్మా! జగన్మాతా! నాలో భగభగ మండుతున్న మనస్తాపము అనే సూర్యుణ్ణి నీ చూపులతో అస్తమింపచేసి, నీ కన్నుల నల్లని కాంతి అనే రాత్రి వేళలో నాలో సంతోషమనే చంద్రకాంతిని ఉదయింపచేస్తూ, నాకు ఆహ్లాదమును కలిగించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
తాటంకమౌక్తికరుచాంకుర దంతకాంతిః
కారుణ్యహస్తిపశిఖామణినాధిరూఢః ।
ఉన్మూలయత్వశుభపాదపమస్మదీయం
కామాక్షి తావకకటాక్షమతంగజేంద్రః ॥7॥
జగన్మాతా! నీ చల్లని చూపులు ఒక ఏనుగు అయితే, నీ కర్ణములకు అలంకరించబడిన ముత్యములు ఆ ఏనుగు దంతములు; ఆ ఏనుగును నియంత్రిస్తూ నడిపేది నీ దయ అనే మావటివాడు. అమ్మా! ఆ ఏనుగు వంటి నీ చూపులు, నాలో కరుడుకట్టిన మాలిన్యము అనే మహావృక్షమును కూకటి వేళ్లతో పెకలించివేయుగాక.
ఛాయాభరేణ జగతాం పరితాపహారీ
తాటంకరత్నమణితల్లజపల్లవశ్రీః ।
కారుణ్యనామ వికిరన్మకరందజాలం
కామాక్షి రాజతి కటాక్షసురద్రుమస్తే ॥8॥
మాతా! పరితాపముతో బాధపడుతున్న నా మనసుకు కల్పవృక్షము వంటి నీ చూపులు సాంత్వన కలిగిస్తున్నాయి. నీ కర్ణములకు ఉన్న ఎర్రని ఆభరణముల కాంతి ఆ కల్పవృక్షమునకు లేలేత చిగురులు గానూ, దయ ఆ వృక్ష పుష్పములలోని మకరందముగానూ ఉన్నది. అట్టి చూపులతో నన్ను కరుణించు తల్లీ!
సూర్యాశ్రయప్రణయినీ మణికుండలాంశు-
లౌహిత్యకోకనద కాననమాననీయా ।
యాంతీ తవ స్మరహరాననకాంతిసింధుం
కామాక్షి రాజతి కటాక్షకలిందకన్యా ॥9॥
అమ్మా! నీ కరుణారస దృష్టి యమునా నదీ ప్రవాహము. ఎంతోమంది ఋషులకు, జ్ఞానులకు ఆశ్రయమును కల్పించు ఆ నదీ ప్రవాహము నెమ్మదిగా ప్రవహిస్తూ, ఈశ్వరుడు అనే సముద్రములో ఐక్యమవుతుంది.
ప్రాప్నోతి యం సుకృతినం తవ పక్షపాతాత్
కామాక్షి వీక్షణవిలాసకలాపురంధ్రీ ।
సద్యస్తమేవ కిల ముక్తివధూర్వృణీతే
తస్మాన్నితాంతమనయోరిదమైకమత్యమ్ ॥10॥
అమ్మా! నీవు జగత్కుటుంబినివి. నీ కడగంటి చూపులు అనే ముక్తికాంత ఏ పుణ్యపురుషుని అనుగ్రహిస్తుందో, అతని జన్మము ధన్యమే కదా. ఈ అత్యంత అద్భుతమైన అనుగ్రహము నాకు ఎప్పుడు కలుగుతుందో కదా!
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.




