స్తోత్రాలకు తెలుగులో అర్థం » శివానందలహరి 11-20 శ్లోకాలు

శివానందలహరి 11-20 శ్లోకాలు

శివానందలహరి అనేది ఆది శంకరాచార్యులు రచించిన భక్తి ప్రధాన స్తోత్రం, ఇందులో పరమశివుడుపై ఉన్న ఆత్మీయ భక్తి, తత్త్వజ్ఞానం అద్భుతంగా ప్రతిఫలిస్తుంది. ఈ స్తోత్రం 100 శ్లోకాలతో కూడి, భక్తుడు మరియు శివుని మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని వివరంగా తెలియజేస్తుంది. శైవ సంప్రదాయంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన గ్రంథంగా భావించబడుతుంది.

శివానందలహరి పఠించడం వల్ల మనస్సుకు శాంతి, ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. భక్తితో జపించడం ద్వారా పాపాలు తొలగి, శివుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇది భక్తి మార్గంలో నడిపిస్తూ జీవితం సార్థకం చేయడంలో సహాయపడుతుంది.

సంస్కృత శ్లోకము – 11

వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి ।
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి ॥ 11 ॥

తాత్పర్యము

శివా! ఏయే వర్ణములయందున్నా, ఏ ఆశ్రమమందున్నా, ఎన్నెన్ని జడలు పెంచుకొన్నా, ఎంతవాడైనా సరే ఈశ్వరభక్తి లేనిదే లాభమిసుమంతయు లేదు. హృదయపద్మమునందు నిన్ను ధ్యానించుచూ, మనస్సు నీయందర్పించి భజించు వారికి సంబంధివై, వాని భారమంతయు నీపై వేసికొని కాపాడుదువు.

సంస్కృత శ్లోకము – 12

గుహాయాం గేహే వా బహిరపి వనే వాఽద్రిశిఖరే
జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలమ్ ।
సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే
స్థితం చేద్యోగోఽసౌ స చ పరమయోగీ స చ సుఖీ ॥ 12 ॥

తాత్పర్యము

పర్వతగుహలు, అరణ్యములు మొదలగు వానియందు నివాసమున్నంత మాత్రాన విలవేమిలేదు. అంతరఃకరణమును కూడా ఈశ్వరధ్యానమునందు నిలిపి, తదేక నిష్టాగరిష్టుడై ఉన్నచో, శివయోగియై పరమానందము పొందును.

సంస్కృత శ్లోకము – 13

అసారే సంసారే నిజభజనదూరే జడధియా
భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్ ।
మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణః
-త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే ॥ 13 ॥

తాత్పర్యము

మహాదేవా! ముల్లోకములందు దీనరక్షాపరుడవు నీవొక్కడవే కలవు. నేను సంసార తాపములను సహింపలేక దీనుడనై, నీవే దిక్కుగా నీ పాలబడి ఉన్నాను. నావంటి దీనులెవరూ లేరు. కనుక దయచూపి ఆత్మజ్ఞానమొసగి, ఈ దీనుని సంసారతాపములనుండి రక్షింపుము.

సంస్కృత శ్లోకము – 14

ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే
ప్రముఖ్యోఽహం తేషామపి కిముత బంధుత్వమనయోః ।
త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః
ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః ॥ 14 ॥

తాత్పర్యము

ఓ పరమేశ్వరా! నీవు దీనబంధుడవు. నేను దీనుడను. ఇక మనకు బాంధవ్యము కలదని వేరుగా చెప్పనక్కరలేదుగదా! కనుక నా తప్పులన్నీ మన్నించి, తప్పక నన్ను నీవే కరుణించి, రక్షింపవలసి ఉన్నది. ఇదేకదా బంధువుల పద్ధతి.

సంస్కృత శ్లోకము – 15

ఉపేక్షా నో చేత్కిం న హరసి భవద్ధ్యాన విముఖాం
దురాశా భూయిష్ఠాం విధిలిపి మశక్తో యది భవాన్ ।
శిరస్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే
కథం వా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితమ్ ॥ 15 ॥

తాత్పర్యము

సాంబశివా! దుష్టమైన ఆలోచనలతో నిన్ను ధ్యానించుటయందు ఆసక్తి లేని- బ్రహ్మ రాసిన నా నుదుటిరాతను ఉపేక్షింపక తుడిచివేయుము. నా చేతగాదని నీవు తప్పించుకొనుటకు వీలులేదు. ఆ బ్రహ్మదేవుని ఐదవ తలను నీ కొనగోటితోనే త్రుంచితివి కదా!

సంస్కృత శ్లోకము – 16

విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః
-చతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఖితవాన్ ।
విచారః కో వా మాం విశద కృపయా పాతి శివ తే
కటాక్షవ్యాపారః స్వయమపి చ దీనావనపరః ॥ 16 ॥

తాత్పర్యము

శివా! బ్రహ్మ మా ముఖమందు దైన్యము వ్రాయుచున్నాడు. అది మాకు ఉపకారముగానే ఉన్నది కానీ విచారకరము కాదు. అందువలనే కదా దీనపోషకమగు మీ కటాక్షమునకు పాత్రులమగుచున్నాము. అయినదేమో అయిపోయినది. పోనిమ్ము. ఇంక అతని నాల్గుతలలు మాత్రము భేదింపకుము. ఆ బ్రహ్మ దీర్ఘాయుష్మంతుడగుగాక!

సంస్కృత శ్లోకము – 17

ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో
ప్రసన్నేఽపి స్వామిన్ భవదమల పాదాబ్జ యుగళమ్ ।
కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం
నిలింపానాం శ్రేణిర్నిజకనక మాణిక్య మకుటైః ॥ 17 ॥

తాత్పర్యము

ఓ జగత్ప్రభూ! నా పుణ్యము వలననో, నా మీద నీ దయ చేతనో ప్రసన్నుడవైన నీ పాదారవింద సందర్శనము ఎలా కలుగును? దేవతలందరూ గుంపులుగుంపులుగా కూడి “నేను, నేన”ని నమస్కరించుటకు సంతోషముతో తొందరపడుతూ, వారి రత్నాల కిరీటములను మీ పాదములయందు మోపుతూ నాకు అడ్డమగుచున్నారు.

సంస్కృత శ్లోకము – 18

త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం
వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః ।
కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాశా చ కియతీ
కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా ॥ 18 ॥

తాత్పర్యము

ఆనందస్వరూపుడవైన ఓ దేవా! మోక్షమిచ్చు మహానుభావుడవు నీవొక్కడవే. విష్ణ్వాదులు నీ దయచేతనే వైకుంఠవాసులైరి. అయినా తనివి తీరక నీ వలన ఉన్నతపదవులను కోరుతూనే ఉంటారు. ఆహా! భక్తులమీద నీకెంత దయ! నా ఆశ ఎంతని చెప్పను? సంపూర్ణ కటాక్షముతో నా అహంభావమును పోగొట్టి రక్షింపుము.

సంస్కృత శ్లోకము – 19

దురాశాభూయిష్ఠే దురధిప గృహ ద్వార ఘటకే
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే ।
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ ॥ 19 ॥

తాత్పర్యము

శివా! దురాశలచేత దుష్టప్రభువుల గృహద్వారములయందు పడి కొట్టుకొనుచు, పలు దుఃఖముల పాలు కావలసిన, తుది లేని సంసారమందలి నా శ్రమను ఏల నశింపజేయవు? నీ భక్తుడుగా ఉన్న బ్రహ్మదేవుని మీది వాత్సల్యము చేత, అతని రాతలు పోగొట్టుటకు ఇష్టపడకున్నావు కాబోలు. నీవు భక్తవత్సలుడవయినప్పుడు నీ భక్తులమైన మాకేమి లోపము? నిన్ను భజించి మేము కృతార్థులమగుదుము గదా!

సంస్కృత శ్లోకము – 20

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్య ఆశా శాఖాస్వటతి ఝటితి స్వైరమభితః ।
కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ॥ 20 ॥

తాత్పర్యము

శివా! ఆదిభిక్షుకా! నా మనస్సను కోతి- సంసార అరణ్యమునందు చంచలముగా, స్వైరవిహారము గావించుచున్నది. యువతుల స్తనగిరులందు ఆటలాడుచున్నది. ఆశలనే కొమ్మలను పట్టి దుముకుచున్నది. అన్ని మార్గములలో తిరుగాడుచున్నది. ఇంక లాభములేదు. దృఢమైన భక్తి అనే గట్టి త్రాటితో బంధించి నీ అధీనములో నీవే పెట్టుకొనుము.

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top